Thursday, November 5, 2009

పెళ్లిపాటలు .

Kalyanam Paatalu

పెళ్లిపాటలు.
*****
పెండ్లి పిలుపు
*****

కల్యాణము చూతమురారండీ ...
శ్రీ వేంకట రమణుని '' కల్యాణము''

మంటపమున ముత్యాల ముగ్గులివె
మంగళకరమగు వేద మంత్రమిదె
అంబరమున ముక్కోటిదేవతలు
సంబరపడుచూ దీవెనలొసగిన '' కల్యాణ ''

సిరికల్యాణపు బొట్టునుపెట్టీ .....
నుదుటను మణి బాసికమును గట్టీ ....
సోగసౌ బుగ్గను చుక్కను బెట్టీ ...
పెండ్లీ కొడుకై నిలచిన గిరిపతి '' కల్యాణ ''

సిగ్గుల సిరిమెడ సూత్రము గట్టీ...
మంగళకరమౌ మట్టెలు బెట్టీ...
సోయగమున సతి చేతులబట్టీ..
మంగాపతిగా వేలసిన శ్రీ హరి '' కల్యాణ ''

నవరత్నములను తలపైపోసీ...
నవరసముల నళినాక్షిని బట్టీ ..
జవరాలికిసిగ జాజులు జుట్టీ..
శృంగారమునే నెరపిన శ్రీపతి '' కల్యాణ ''

యిరువురు భార్యల నురముననుంచీ ..
మురిపెపు నగవుల ముడుపులదోచీ ...
కరుణతో కరముల నభయమునిచ్చీ..
యిడుముల బాపుట కిలవెలసిన హరి '' కల్యాణ ''








*****
పెండ్లి కొడుకు రాక .
*****
రాగం =హంసద్వ్హని
*****
వచ్చెనదే ఘనుడూ...సిరీ...
మెచ్చిన శ్రీకర శుభద మనోహరుడూ '' వచ్చె ''

రాజసమున రారాజుల పోలీ ..
నిజసతి నేలగ , నిఖిలోత్తముడూ...
ద్విజులకు మ్రొక్కీ, దీవెన లందగ
నిజసతి దోడ్కొన నిలచినవాడూ...'' వచ్చె ''

సతి నెరచూపులా చిక్కినవాడూ
సరస శృంగారమూ నెరపెడువాడూ
చిరునగవుల చెలి , హృదినిలచినవాడూ
సరి సతి నేలినా , సర్వోత్తముడూ.. '' వచ్చె ''

యిలవెలసిన హరి యిందిరా రమణుడూ
వైకుంఠ ధాముడూ నారాయణుడూ....
అల శేషాద్రిపై వెలసిన మాధవుడూ ...
ఆపద మ్రొక్కులూ దీర్చెడివాడూ ..'' వచ్చె ''

*****

రాగం = మిశ్రఖమాస్ .
*****
గౌరీపూజ .
*****

పేరంటాండ్లనడుమా పెండ్లికూతురూ
పాల బుగ్గల్లో సిగ్గులతెర పెండ్లికూతురూ ,
పసుపు పారాణీ పాదాలా పెండ్లికూతురూ ,
మెరపు మేని సొగసు నిండారగ పెండ్లికూతురూ.. '' పేరం ''

పట్టుచీర సింగారపు పెండ్లికూతురూ..
పెట్టె కల్యాణపు బొట్టు నుదుట పెండ్లికూతురూ,
జుట్టె సిరిమల్లెలు జడనిండుగ పెండ్లికూతురూ..
యిట్టె సిగ్గు బుగ్గచుక్క మెరయు పెండ్లికూతురూ.. ''. పేరం ''


కిల,కిల నవ్వుల నడుమా పెండ్లికూతురూ..
కళలు పదునారూ నిండిన సిరి పెండ్లికూతురూ..
తలచి శ్రీ గౌరికి పూజలిడిన పెండ్లికూతురూ..
పసుపు , కుంకములా నోమునోచె పెండ్లికూతురూ '' పేరం ''

బుట్టలోన కూరుచున్న పెండ్లికూతురూ ,
మామ బుట్టనెత్త సిగ్గుపడే పెండ్లికూతురూ..
చలువ సౌభాగ్యము నొడినిపట్టె పెండ్లికూతురూ
మదిని మాంగళ్యపు వరము కోరు పెండ్లికూతురూ '' పేరం ''

మెత్తని మెల్లని అడుగుల పెండ్లికూతురూ ,
ప్రియుని పెండ్లాడగ వచ్చెనదే పెండ్లికూతురూ ,
తలను తలంబ్రాలు , సూత్రపుమెడ పెండ్లికూతురూ
విభుని జట్టిగొనీ చేయిపట్టె పెండ్లికూతురూ..... '' పేరంటాండ్ల ''

*****

మోహనరాగం .
*****
తోటసంబరం.
*****

శ్వాగతమిడగా రారే చెలులూ..
వచ్చెనదే వియ్యాలవారూ.... '' స్వాగత ''

కప్పురపు మాలలూ , వేయరె మెడలో..
జాజులు ,మల్లెలూ ,తురమరె జడలో...
వాడని వీడెమూ , వేడ్కగ నిచ్చీ ...
ఆటల, పాటలా... ఆనందముగా....''..స్వాగత ''

పసుపు , కుంకుమలూ , పలు అత్తరులూ ..
విరిపారాణి , పన్నీటి గంధములూ...
ప్రేమతోనిచ్చీ...భామల తోడ్కొని ,
విడిదికి రమ్మనీ వేగ పిలువరే.... '' స్వాగత ''

తేనెలమాటలా, మన్నన పిలుపులా..
పంచరె తీయనీ పానీయములూ...
మచ్చిక మీరగ , ముచ్చట తీరగా...
అంగన లీయరె హారతులూ ..... '' స్వాగత ''

*****
వియ్యాలవారి కయ్యాలు.
ఆడపెళ్లివారిపాట.
*****

ఏడనుంచి వచ్చిరి , వియ్యాలవారూ...
మేడ,మిద్దెలుగల మావూరికి వేంచేసారూ ..
వల్లెపెట్టి ఏర్చి కూర్చి మంచి మాటలాడేరూ
మా తల్లి చక్కదనపు , మల్లి చేబట్టేరూ...'' ఏడ ''

బియ్యేలా, ఎం. యేలా వంశమన్నారూ..
పెండ్లికొడుకుగారి నత్తిమాట స్ఠైలన్నారూ..
పిల్లమెడలోనా గుళ్లపేరు వేస్తామన్నారూ..
వల్లమాలిన మాటల్లు చెప్పి మోసపుచ్చేరూ ..'' ఏడ ''

నల్లకోటు జాబంటూ నసబెట్టేరూ..
'' నల్లి '' వారి పట్టుబట్ట తప్ప కట్టమన్నారూ..
నలుగు ముతక నేత బట్టలతో విడిదికొచ్చేరూ
నాసి రకపు , సెంటు , సింగారాల్ బడాయి పోయేరూ..'' ఏడ ''

కట్నాల్ , గిట్నాల్ మాకసలే వద్దన్నారూ..
కుర్రవానిపేర '' క్వాలి '' సొకటి చాలన్నారూ
పిల్లపేర కొంత '' భూ '' దానం చేయమన్నారూ
వద్దు, వద్దంటూ గొంతెమ్మల కోర్కెల్ల్కోరేరూ.... '' ఏడ ''

ప్లేటు భోజనాలు తప్ప , చేయమన్నారూ
రేటు నూరైనా స్వీట్లు , హాట్లు కావాలన్నారూ..
చేటు చెప్పుకుంటే , చేతుల్నాకి చిందులేసారూ
చాటు ,మాటునస్వీట్లన్ని దాచి దొరకిపోయేరూ '' ఏడ ''

పిల్లతోడ రండంటూ పట్టుబట్టేరూ ...
పెద్ద యిల్లు మాది చోటుకొరత లేదన్నారూ..
మురికి లోగిల్లో , ముతకబొంత మూలవేసారూ
నల్లికాట్ల రాత్రి , నిద్రలేమి మాకు చేసారూ '' ఏడ ''

పొలము ,పాడి మాకుందని పోరి చెప్పేరూ
పోట్ట నిండనట్టి టిఫిను పెట్టి తుర్రుమన్నారూ
గల్లంతై , గంటెడైన పాలుపోయనట్టి మడ్డి
కాఫీలూ మాకిచ్చీ మాడబెట్టేరూ '' ఏడ ''

*****
మగపెళ్ళివారి పాట .
*****
ఆనందభైరవి రాగం.
*****

ఎంత గదుసువారు ఆపెళ్లివారూ... .
మంచి మాటలతో మమ్ము మోసపుచ్చినారూ...
అంచనాకుమించి ఆశ చూపించినారూ...
ఎంచి ,ఎంచి మంచి వలను మాకు వేసినారూ '' ఎంత ''

పనీ, పాటా వచ్చుననీ , పిల్లమాట చెప్పినారు ,
ఆట ,పాట లందు మేటి , గుణము మంచిదన్నారూ ,
చదువు సంధ్యలందు తెలివితేటలు మెండన్నారూ
అందమందు ఆ రంభకు తీసిపోదన్నారూ '' ఎంత ''

పెళ్ళిచూపులందు చీర చుట్టబెట్టి తెచ్చినారు ,
మొగము నెత్తి చూపమంటె '' సిగ్గు'' పిల్ల కన్నారూ ,
పాట పాడమంటె '' బిడియ '' మొదలలేదన్నారూ,
పెండ్లి కానివ్వమనీ తొందరెంతొ చేసారూ '' ఎంత ''

పనీ, పాట మాటలేదు , సిగ్గు, సరము అసలు లేదు
మాట కరకు, మనిషి దుడుకు ,మంచినెంచు బుద్ధి లేదు
కట్న, కానుకల్లు లేవు , కారునలుపు , నమ్మలేరు ,
చదువు సున్న, తెలివి కన్న, ఒళ్లుబద్ధకము మిన్న '' ఎంత ''

కళ్ళుమెల్ల , బొజ్జపిల్ల , ఎత్తుపళ్ల నోరు మళ్ల ,
పిప్పిపన్ను జతగూడెను , అందానికి తోడుమళ్ల ,
ఫెళ్లుమన్న నవ్వు , పోతురాజు తిండి కాదు కల్ల ,
ఖర్మ| మాకు లేదు దారి, పిల్ల నేలుకొనగ నిల్ల '' ఎంత ''

*****
అప్పగింతలపాట.
*****
ఆనందభైరవిరాగం
*****

''పుల్లాభట్లా'' రింటీ పుత్తడిబొమ్మా...
కల్లా, కపటములెరుగని కోమలివమ్మా..
ఉల్లాసములాతేలెడి అందాలకొమ్మా,
''సరిపిల్లీ ''వారింటా అడుగిడవమ్మా....
మాముద్దులగుమ్మా.....

కొత్త కోర్కెలు మదిలో కలగంటీవమ్మా..
అత్తింటీ మురిపాలూ అందుకోవమ్మా..
అత్త,మామల ముద్దు -మురిపాల పూరెమ్మా,
పుట్టినింటీ పేరూ ,నిలబెట్టవమ్మా...
మాముద్దులగుమ్మా....

''రఘురాముని'' ఏలికలో రతనాల బొమ్మా....
విభునీ చిత్తములెరిగీ మసలుకోవమ్మా...
'' భాస్కర, సుభద్రమ్మ'' ల, ముద్దుల కోడలివమ్మా..
మరపించెదరూ మమ్మూ , భయమేలనమ్మా..
మాముద్దులగుమ్మా '' పుల్లా''

*****
చుట్టాల సందడి .
పెళ్లిభోజనాలు .
*****

వివాహ భోజనమ్ము వింత వంటకమ్మురా..
వియ్యాలవారి యింట భలే రుచులపంటరా '' వివాహా''

ఒహొహ్హొ | నేతి లడ్లు , అహహ్హ రసపు చుట్లు ,
బొబ్బట్లు వహరె బూరల్ తీపి పాయసమ్మురా..
ఇహిహ్హి బాసుందీలూ.. ఇవిగివిగొ కోవా పాలూ,
జిలేబి , జాంగ్రి వరుసదొంతు లరిసె లివేరా ...''. వివాహ ''

మిరపబజ్జీల్ ,పకోడీలు , పప్పు వడలురా..
పులిహోర , దప్పడాలు ,వడలు తినగ రండిరా..
సాంబారు ,రసము వరెవ్వా , పొడికూర అరటిదవ్వ ,
ఈ పనసపొట్టు ఆవ , గుత్తి వంకాయ్ భలేరా .. '' వివాహా''

ఈ దోసఆవకాయా , పులుపూట నిమ్మకాయా..
గోంగూర నేతి పోపు, రుచుల గడ్డపెరుగురా..
ఐస్ క్రీము ఆఖరంటా.. తినపోతె ఒప్పరంటా...
ఇంటింట పెళ్లివంట అదే..మనకు పంటరా... '' వివాహ ''


ఈ వంటకం ముచ్చట్లూ ..తిన,తినగ ఆయాసాలూ..
తీర్చంగ తాంబూలాలు , వక్కపొడులు ఇవిగొరా ..
తిన్నింటివారి యింటా , పెరుగునులే పాడి ,పంటా
దీవెనలు ఇత్తురంతా , '' వర్ధిల్లు కొత్తజంటా ''... '' వివాహ॥



సాగన పు పాట

కంటిపాప నీవమ్మా మా ఇంటికీ...కన్నుల నీరిడకమ్మా  ఏ నాటికీ...
మెట్టినింటి దీపమై..ఏలు..రాణివై..పుట్టినింటి పేరు నిలుపు  
ఏనాటికీ ..నీ..పుట్టినింటి  పేరు నిలుపు ఏనాటికీ..॥
అత్త, మామ లోనె చుాడు 
అమ్మా నాన్ననీ...
ప్రేమతోడ చేయుమమ్మ
వారి సేవనీ....
ఆడబిడ్డ  నీ బిడ్డగ నెంచి సాకుమీ..  ఆమె
నీ దరిని పొందాలి తల్లి ప్రేమనీ....
మసలుకోమ్మ మంచిగాను
ఇరుగు..పొరుగుతో..
మంచి ఇల్లాలిగ పేరుగాంచు
నీ నడత తో..॥ 2 ॥
పుట్టినింటి  జ్ఞాపకాలు 
తీపి గురుతులే....ఇకపై
అత్తింటి గౌరవమే నీకు కీర్తిలే
కలసి మెలసి ఉండుటే శాంతి..సౌఖ్యముా..
కట్టుకున్న వాని వలపదే
నీకు స్వర్గముా..
మెట్టినింటి లక్ష్మిగా
పేరు తెచ్చుకో...
పుట్టినింటి  పేరు  నిలుపు
మంచి దారి నెంచుకో...॥2॥ ॥ కంటిపాప ॥



No comments:

Post a Comment