Sunday, July 14, 2013

నవ్వవే బంగారు పాపా ॥

నవ్వవే ఓ పాప బంగారు పాపా ....
కల్లకపటము లేని బోసి నవ్వుల మొలక
నీ నవ్వు ఏడేడు లోకాల గెలుపు
ఆనంద లోకాల విహరించు పిలుపు ॥ నవ్వవే ॥

చిదమ బుగ్గలు కారు చిక్కన్ని పాలు
లేలేత పెదవులే ముద్ద  మందారాలు
కలువ వంటీ కనులు చిలుకు వెన్నెలలు
నీలోని అందాలు విరిపారిజాతాలు ॥ నవ్వవే ॥

చిట్టి పొట్టీ నడక వయ్యారితనమొలుక
ముద్దు మాటలు తీపి తేనేల్లు చిలుక
చిన్ని అల్లరితోడ చేయు మురిపాలు
మా యింటి సందళ్ళు ,ఆనంద పరవళ్ళు ॥ నవ్వవే ॥ 

తేట తెల్లని దినుసు ,అద్దమంటీ  మనసు
ఆట,పాటల తీరు ముద్దు ముచ్చట మాకు
హాయినిచ్చే సిరులు పసిపాప పరవళ్ళు
నిన్ను వలచనివారు ఈ జగములో లేరు ॥ నవ్వవే ॥

తొందరెందుకు నీకు ఎదిగి ఏం చెస్తావు
వింత లోకపు తీరు , మర్మమెరుగవు నీవు 
ఆటు పోట్లకు నలిగి విసిగి అలసిన నీవు
ఏ ఏ టి కాయేడు నవ్వు మరచెదవీవు ॥ నవ్వవే ॥

---------------------------------------------------
-రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర ).



--------------------------------------------------
---------------------------------------------------

No comments:

Post a Comment