గడచిపోతున్న కాలంతో పాటు
సమయం ఎలా గడచిపోతున్నాదో
తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయి.
నిద్రపోతున్న నన్ను లేపి , తయారుచేసి ,
ఎత్తుకొని స్కుాలుకు చేర్చి, టాటా చెపుతున్న
అమ్మా, నాన్నల ప్రేమానురాగాల ప్రపంచంలో
నేనెప్పుడు ఎదిగిపోయేనో నాకు తెలియనే లేదు. ,
నన్ను ప్రేమించిన అమ్మా నాన్నలు , నా బాధ్యతను మరికరి చేతుల లో పెట్టి , నన్ను వంటరిని చేసి,
కాల ప్రవాహంలో ఎప్పుడు కలిసిపోయేరో ,
సమయం ఎలాగడిచిపోయిందో తెలియనే లేదు. అంత లోపలే......
నేను అమ్మ నై బాధ్యతల అలలలో
మునిగి -తేలుతుా, గిరికీలు కొడుతుాండగానే...
నా ఒడిలో, పాకుతున్న పిల్లలు ,
నా భుజాలదాకా ఎప్పుడు ఎదిగిపోయేరో, నా మాటలు వినే పిల్లలు , నన్ను ప్రశ్నించేంత పెద్ధగా
ఎలా ఎదిగిపోయేరో , తెలియనే లేదు .
ఎదిగిన పిల్లల బాధ్యత ,పెళ్ళిళ్ళు చేసి తీర్చుకొని ,
కొత్త బంధాలను తనవిగా , అనుకొనే ఆనందం అనుభవించకుండానే....
అత్తగారి పదవికి ఎదిగిన నేను , కోడలు- కొడుకుల
కంటి నలుసుగా ఎప్పుడు మారేనో....
అమమ్మ , నానమ్మ ల పిలుపుకు, ఎప్పుడు చేరువయ్యేనో...నా కో పెద్దరికాన్ని తెచ్చిపెట్టిన
సమయం, నాకు తెలియకుండానే , నన్ను
అవమానాల కొలిమిలోకి ఎప్పుడు నెట్టిందో , నాకు తెలియకుండానే . కాలం గడిచిపోయింది.
అద్దంలో నన్ను నేను చుాసుకొనే సమయం
దొరికే సరికి , నెరసిన నా జుట్టు , నా వయసును
గుర్తుచేస్తుా ఉంటే.., ఒప్పుకోని అంతరంగం ,
ఒడిసి పట్టిన రంగులతో ,వయసును దాచే
ప్రయత్నంలో సమయం ఎలా గడిచిపోయిందో
తెలీకుండానే గడిచిపోయింది.
ముఖంలో ముడతల వికారం
వెక్కిరిస్తుా వెటకారం చేస్తుా ఉంటే ..ఆప్యాయంగా
"అమ్మా " అంటుా పిలిచే పిల్లలు , అసహ్యించుకుంటుా
విసుక్కుంటుా ఉంటే , ఆ అవమానాల , నిస్సహాయతల మధ్య..నా జీవితం ఎలాగడిచిందో.... నాకు తెలియకుండానే సమయం గడిచిపోయింది.
మారుతున్న కాలంతో పాటు , మమతలు మరచిన
నా రక్త మాంసాల రుాపాలు, మరో బంధంతో ముడివడి .....జీవన సంద్రానికి ఎదురీదలేక ,
వ్రుద్దాశ్రమాల చుారుల్లో' నా ఉనికి గుర్తులను
వేలాడదీసిన వైనం , ఆగని కన్నీటి గా మారి
ఆవిరైపోతున్నా...జవసత్వాలుడిగిన శరీరం
ఇంకా చావని ఆశల ఎదురుచుాపులు చుాస్తుా ఉంటే..
సమయం ఎలా గడిచిపోతోందో తెలియనే లేదు.
తన అనుకున్న వారు , పరాయి వారై
తమను మరచి పోయినా....
నిశ్శబ్దంగా గడచిపోతున్న కాలం , .నిరీక్షణ కు నిస్సహాయతను కలిపి...నిదురకు దుారం చేసినా...
మంచం మించి లేవలేని నిస్సహాయత , గడచిన-
మమతల , జ్ఞాపకాలను నెమరువేసుకుంటుా ఉంటే-
సమయం ఎప్పుడు ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు.
బహుశా..
అంతరంగ వేదనలతో, అలసి ,వడలిన శరీరాలను ,చివరి క్షణాలకు తొందరగా...
దగ్గర చేర్చి , స్వాంతన పరచడం కోసమేమొా--
సమయం తెలీకుండానే గడిచిపోతోంది.
మంచిదేకదుా...
--------------------------------------------------
రచన , శ్రీమతి .
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర ).
No comments:
Post a Comment