పాలకులకైనా.....పాలితులకైనా.....
*******************************
గొడ్డు మాంసం కొన్నాడని అఖ్లావ్ ను
గొడ్డును చంపినట్టు చంపినపుడు
ఇంత బాధ లేదు.....!
సంచారజాతి ప్రజల్ని ఊరినుండి వెళ్ళగొట్టడానికి
ఆ జాతి పసిమొగ్గ ఆశల కన్నులైనా ఇంకా విచ్చుకోని
కాశ్మీరీ కుంకుమపూరెమ్మ ఎనిమిదేళ్ల అసిఫాను
గుడిలో బంధించి వారం రోజులు అత్యాచారం చేసి చంపినపుడూ
ఇంత భయం లేదు.....!!
నక్సలైట్లనే నెపం మీద
మనుషుల్ని బూటకపు ఎన్ కౌంటర్ లలో కాల్చి పడేసినపుడు
ఇంత స్పందన లేదు.....!
దేశద్రోహులంటూ సాయిబాబా వరవరరావు మొదలు మేధావుల్ని
గృహనిర్బంధంలో జైలు నిర్బంధంలో శిలువేసినపుడూ
ఇంత సమాలోచన లేదు.....!!
ఢిల్లీలో పంజాబ్ లో విప్లవబావుటాలై గొంతెత్తిన విద్యార్థులను
రాజ్యహంకారం రంకెవేసి కాళ్లు చేతులు తలలు విరగ్గొట్టి పారేసినపుడు
ఇంత ఆందోళన లేదు.....!
షాహిన్ బాగ్ ఉద్యమంలో నక్షత్రాలై నిలిచిన మహిళలను
మగపోలీసులు పొట్టుపొట్టుగా కొట్టినపుడూ ఇంత ఆలోచన లేదు.....!!
ఒకనాడు కారంచేడులో దళితుల్ని సామూహికంగా హత్య చేసినప్పుడు
మరోనాడు గుజరాత్ లో దళిత మహిళపై
బహిరంగంగా అత్యాచారం చేసినప్పుడు
ఇంత వణుకు లేదు.....!
ఈశాన్య రాష్ట్రాలలో మోహరించబడిన కేంద్ర పోలీస్ ఫోర్స్ దాష్టీకాలను
ఇరోం షర్మిల లాంటివాళ్లు దశాబ్దాల పాటు ప్రశ్నించినపుడూ
ఇంత అలర్ట్ లేదు.....!!
దక్షిణాఫ్రికాలో సిరియాలో లక్షలాదిమంది పసికందులు
ఆకలి చావులు చస్తున్నప్పుడు
ఇంత ఆర్ద్రత లేదు.....!
పేదవాళ్లు ఉట్టికి స్వర్గానికి అందలేక వగచుతున్నప్పుడు
తరాలకు తరాలు పీడనలో మ్రగ్గుతున్నప్పుడు
ఆధిపత్యాలు అణచివేతలు వికృత రూపాలు దాల్చుతున్న ప్పుడూ
ఇంత ఆవేదన లేదు.....!!
కార్పొరేట్ కుట్రలు కోట్లాది రూపాయల్ని దోచి దోచి
కోట్లాదిమంది ప్రజల్ని పేదవాళ్లను చేస్తున్నప్పుడు
ఇంత అలజడి లేదు.....!
అవినీతి రాజకీయం ఓటుకు పదివేలు పంచి
అధికారం మరిగి అరాచకం చేస్తున్నప్పుడూ
ఇంత ఆదుర్దా లేదు.....!!
ఎన్ ఆర్ సి మరియు సిఎఎ లతో రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని విస్మరించి
నేతలు మతప్రాతిపదికన దేశ ప్రజల్ని విభజించపూనినపుడు
ఇంత కలవరం లేదు.....!
శ్రమ పొలంలో తమ రెక్కలు ముక్కలు చేసుకుని
దేశానికి అన్నం పెట్టిన రైతులు
తమ బిడ్డలకు అన్నం పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ
ఇంత కనికరం లేదు.....!!
మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారని
నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీలంకేశ్ ల
ఊపిరి తీసినపుడు
ఇంత ఉలుకు లేదు.....!
ఆర్టికల్ 370 రద్దుతో గత 237 రోజులుగా
కాశ్మీర్ ఊపిరిని జైలులో నిర్బంధించి ఉంచినా
ఇంత ఉద్వేగం లేదు.....!!
ఇప్పుడు కరోనా వచ్చింది.....!
మనిషి నుండి మనిషికి శరవేగంగా ప్రాకుతుంది.....
రోజుల్లో ప్రాణాల్ని హరిస్తుంది.....
సామూహికంగా మనుషుల్ని బలిగొంటుంది.....
అంటేనే అందరి ప్రాణం ఝల్లుమంటుంది.....
చావు మనదాకా వస్తోందంటే హృదయం గుర్తొస్తోందొక్కొక్కరికీ.....!!
ఇప్పుడు మానవతా రాగాలు.....
దూర సుదూర మమతా గానాలు.....
అందరూ బాగుండాలనే ఆకాంక్షలు.....
ప్రేమ ఆప్యాయత అన్నీ ఉపరితలం మీదికొచ్చాయి.....!
కాలుష్యం స్ఫురణకొస్తోంది.....
దేవుడికి కాదు సైన్సుకు దండం పెట్టాలని స్మరణకొస్తోంది.....!!
ఇప్పుడు ప్రతి మనిషి తనచుట్టూ తాను కంచె నాటుకున్నా సరే.....
తల్లీబిడ్డలు తాకుకోకున్నా సరే.....
ఎవరి చావుకెవరూ హాజరు కాకున్నా సరే.....
కన్నీటిని కర్తవ్యంగా మ్రింగుకున్నా సరే.....
ప్రాణం మిగిలితే చాలు అనిపిస్తోంది.....!
బ్రతుకంటే ఎంత తీపి... ఉంటే ఉండనీ... తప్పు లేదు.....
కానీ...అమానవీయత అసమానతలే అసలు వ్యాధులని
కనీసం కరోనా భయం పోయాకైనా గుర్తుకొచ్చేనా మరి.....??!!
ఫ్రెంచి విప్లవం చెప్పినా.....
రాబోయే నూతన విప్లవాలు చెప్పినా.....
ప్రకృతి చెప్పినా.....సైన్స్ చెప్పినా.....
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ప్రపంచ విలువలని.....
ప్రైవేటు ఆస్తికి కళ్ళెమే అత్యాశల విరుగుడని.....
గుడిసె పెరిగి మల్టీప్లెక్స్ తరగడమే మార్గమని.....
మనిషిని మనిషి ప్రేమించడమే అంతిమమని.....
తెలిసి వచ్చేనా... ఈ కరోనాతోనైనా...ఇకనైనా.....?????!!!!!
- జి.కళావతి,
28-03-2020.
No comments:
Post a Comment