Monday, April 20, 2020

writer..Sunitha

గది లోపలి దుఃఖం
       ............
నా గది గుమ్మం లోపల
నేను గౌరవం గా నిలబడతాను
ఊహకూ జీవితానికీ మధ్య దూరాన్ని..
నాకు పూసగుచ్చినట్టు 
బోధించిందా గది
నన్నాగదిలో ఒంటరిని చేసి
అతడు వెళ్లిపోయాక..
నా చుట్టూ ఉన్న రాతిగోడలు
పొగడ పువ్వుల్లా నన్ను స్పర్శించాయి
నేలంతా పరుచుకున్న నైరాశ్యం
ముగింపు' కు కొత్త అర్థాన్ని
వెతికి పెట్టింది
అందరూ వున్న బతుకు లో
ఎవరూ లేని గుండె
ఏకాంతంతో సంఘర్షిస్తుంది
ఎక్కడో జారిపోయిన
గుప్పెడు పరిమళాలు
గది బయట గాలిలో ప్రవహిస్తున్నాయి
వేకువ గుచ్చిన ఓ మంచుపూల గుఛ్చం..
లే ఎండలో నిలబడి
సన్నగా ఏడుస్తోంది
నా గది లోపలంతా నిశ్శబ్దంగా వుంది
నేను గోడకు చెవి ఆన్చి
ఇంకా వినబడుతున్న దుఃఖపు వూసులను..
పెదాలు బిగించి వింటున్నాను
          ...........

సునీత గంగవరపు -
            ***

No comments:

Post a Comment