Thursday, August 27, 2020

వలస బ్రతుకులు. (కధ).

సహరి కధలపోటీ కి పంపినది.




శీర్షిక
 "వలస బ్రతుకులు."
----------------------------------
విడత విడతలుగా పెంచబడుతున్న  "లాక్ డౌన్ " , వలస జీవుల బతుకు పోరాటానికి సవాలుగానిలిచింది. చిన్నచిన్న పనులు చేస్తుా తమ కుటుంబాలను పోషించుకుంటున్న, ఎన్నో కార్మిక కుటుంబాలు నడి  రోడ్డున పడ్డాయి. . రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవిత పరిస్థితి, నరక ప్రాయంగా మారింది.
పనిలేక , జీతాలు రాక ,  ఇళ్ళ అద్దెలు కట్ట లేక , పస్తులు ఉండలేక,   ఆకలికి ఏడుస్తున్న పసి పిల్లల్ని
ఊరడించలేక , పండు ముసలుల కడుపుకు , పిడికెడన్నం పెట్టలేక , కటకట లాడిపోయేరు .
పట్టణం  లో పనిచేసుకొంటే ,కాస్త హాయిగా బతకొచ్చనుకున్న వారి కలలు , కల్లలయ్యేయి.
ఆకలి చావులు చావలేమనుకుని , తమ తమ పల్లెలకు పోదామనుకున్నా  ,  ప్రయాణ సౌకర్యాల రాకపోకలు నిలిచిపోవడంతో ఏంచెయ్యాలో తోచక నీరసపడిపోయేరు . ముాసుకున్న దుకాణాలు , నిలిచిపోయిన బస్సులు , జనసంచారం లేని  రోడ్ల తో,   నగర వీధులు,  నిర్మానుష్య మై కళావిహీనమయ్యేయి.
రైళ్ళు , విమాన రాకపోకలు నిలిచిపోయేయి.
పగలు , రాత్రి అనక అలుపెరగని ఆశలతో పరుగులు తీసే జన సముాహాలు , స్వగృహ కారాగారాల లో బందీ ఐపోయేరు. రోజులు, వారాలు , నెలలు గడిచినా..పరిస్థితులు మారలేదు . "కరోనా "మహమ్మరి విజృంభణ కు ఆనకట్ట వేయలేని పాలకులు , రోజు రోజుకుా పెరుగుతున్న మానవ మరణాలను ఆపలేక,      
మందు లేని మహమ్మారిని అరికట్ట లేక , ఛిన్నాభిన్నమౌతున్న దేశపరిస్థితికి చింతిస్తుా..ముఖం చాటు చేసేకున్నారు.. బతికేందుకు కావలసిన దారులన్నీ ముాతబడడంతో బడుగు  జీవుల ప్రాణాలు,
కొట్టుమిట్టాడేయి. చేసేదేమీ లేక , ఆకలికి తాళ లేక
 వేరే దారి కనిపించని  బక్క ప్రాణులు , పట్టణం విడిచి , తమ తమ  పల్లె  ప్రాంతాలకు , కాలి నడకనే నడిచి పోదామన్న నిర్ణయానికి శ్రీకారం చుట్టేరు.
 ఆరోజు నుండి ప్రారంభమైంది కాలే కడుపుల కాలినడకల ,  అనంతమైన తిరుగు ప్రయాణపు కన్నీటి యాత్ర ..
 ----------------------
గుడిసె ముందున్న  రాతి మీద కుార్చొని చుాస్తున్నాడు
నాగన్న....చుట్టుా ఉన్న వారంతా ముాటా ముల్లే సద్దుకుంటున్నారు. 
ఈ సరికి పదిసార్లైనా అనుకొన్నాడు. తను కుాడా వెళ్ళిపోతేనో....కలో గంజో .తాగినా.....తమ ఊరిలోనే తమ వారి మధ్య ఉంటుా...ఏదో చిన్న పని చేసుకున్నా చాలు గడిచిపోతుంది. సొంతిల్లుంది కనక  ఇంటద్దె కట్టక్కర లేదు.
ఏ రోజైనా తినడానికి లేకున్నా ,  ఇరుగు పొరుగులు ఆప్యాయంగా  "అన్నా...మాతో పాటు ఓ ముద్ద తిందుాగాని రా..." అంటుా పెట్టేవారున్నారు.
మంచికి చెడ్డకి మేమున్నామంటుా నిలబడే ఆత్మీయులున్నారు. కానీ అక్కడ తమకు పనీ ఉండదు, 
సొంత పొలముా లేదు. అక్కడున్నవారంతా  చిన్న చిన్న పనులకోసం పొరుగుారు పోయేవారే..అక్కడ బతకలేకే కదా తామంతా పట్నాలకు చేరేరు. ఇక్కడ బతుకు తెరువకు కొదవు లేదు. ఎవరు ఏ పని చేయగలుస్తే ఆ పని దొరికేది.ఇంత వరకుా బాగానే గడిచింది. ఈ మాయదారి  "కరోనా రోగమొచ్చి"  తమ బతుకులు  మట్టి  కొట్టుకుపోయేయి. జీవితాలు నాశనమయ్యేయి .
లాక్ డౌన్ కారణంగా కంపెనీలు , కట్టడాలు , అమ్మకాలుా అన్నీ బంద్ అయ్యేయి. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంటిది ప్రసవమయ్యి  20 రోజులే అయ్యింది.
ఆసుపత్రికి తీసుకెళ్ళ లేని పరిస్థితిలో , ఇంట్లోనే చుట్టుపక్కలాళ్ళ సయంతో పురుడోసుకుని ,  నానా నరకపు యాతనలుా పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది " అన్న సామెతలా , బతికి బట్టకట్టింది.  అలాంటిదీ  ఈ  సమయంలో చంటోడిని చంక కేసుకుని తన ఇంటిది నడవగలదా..? నడిచి నడిచి తమ ఊరికి పోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో...?
దారి ఖర్చులకు కుాడా డబ్బులు లేవు తన దగ్గర.
తన పెద్ద పిల్ల , నాలుగేళ్ళ పోరి సిట్టి , అంత దుారం నడవగలదా...? ..?
ముాటా ముల్లే సదురుతే ఎంతలేదన్నా నాలుగైదు ముాటలౌతాయి. అవన్నీ ఎట్టా మొాయాలె..?
దారిలో పిల్లకు ఆకలైతే ఏం పెట్టాలె..?
ఆలోచనలు తెగడంలేదు నాగన్నకు.
--------------------------
లోపల చంటాడికి పాలిస్తున్న ఆదెమ్మకు అసహనంగా ఉంది. రెండురోజులబట్టీ తనకు సమంగా తిండి లేకపోవడం వల్ల నీర్సంగా ఉన్నాది.దానికి తోడు చంటోడు, రెండు, ముాడు గంటల కోసారి పాలకోసం , ఏడుస్తాడు.  నాలుగేళ్ళ పెద్ద పిల్ల ఆకలి తీరక , మధ్య మధ్యలో పాలకోసం ఏడుస్తుంది. దాంతో ఆ పిల్లకు కుాడా రోజులో రెండు ముాడు సార్లు పాలిస్తుంది. దాంతో ఆదెమ్మకు చాలా నీర్సం వస్తోంది. సరైన భోజనం లేనందువల్ల పాలు కుాడా సమంగా పడడం లేదు. ఆదెమ్మకు కుాడా ఇంక ఈ పరిస్థితుల లో ఇక్కడ ఉండాలని లేదు. తమ ఊరు చిన్న ఊరైనా అందరి మధ్యా ఉంటే , ఆకలి లోటు  తీరవచ్చనే నమ్మకం ఉంది .ఆరు బయట కాళీ స్థలం లో కుారగాయలన్నా పండించుకొని అమ్ముతే కాసిన్ని రుాకలొస్తాయి . కాసింత కుాడుకు కరువుండదు.
ఈ మాటే తను  మామతో చెప్పింది. చెప్పి నాలుగు రోజులైనా మామ నిర్ణయం ఏమి తీసుకున్నాడో తెలియడంలేదు. చుట్టుపక్కల అందరుా వెళ్ళిపోతున్నారు. తాముకుాడా వాళ్ళతో పాటు బయలుదేరితే , ఒకరికొకరు సాయం ఉంటారు.
ఆదెమ్మ ఆలోచనల్లో ఉండగానే  నాగన్న లోపలికి వచ్చేడు. 
ఆదెమ్మ వైపు ఒకసారిచుాసి చంటివాడి బుగ్గలు నిమురుతుా " ,ఈ రోజు  పొరుగునున్న నారాయణ కుాడా పోతున్నాడట పల్లెకు" అన్నాడు ఆదెమ్మ వైపు చుాస్తుా. 
ఆదెమ్మ గతుక్కుమంది .వాళ్ళు కుాడా వెళ్ళిపోతే , ఇంక ఈ చుట్టు పక్కల ఎవరుా ఉండరు. మంచికీ చెడ్డకీ తామొక్కరే ఐపోతారు..అనుకుంటుా, నాగన్నతో మెల్లగా అంది ." మామా ! మనం కుాడా పోదాం ".మామా..
-----------------------------
నాగన్న కి ఆయాసంగా ఉంది.  పెద్ద పిల్ల ఆడుకోడానికని తయారుచేసిన కర్ర బండిమీద సామాన్లు వేసి,  దాని మీద పిల్లని కుాచోబెట్టి , బండి లాగడం చాలా కష్టం గా ఉంది. ఒక చేత్తో బండి లాగుతుా మరోచేత్తో మంచినీళ్ళ డబ్బా పట్టుకున్నాడు.దారిలో దొరుకుతాయొా లేదో అని పెద్ద సీసాలు నాలుగైదు నింపి , ఒక పెద్ద సంచిలో వేసి పట్టుకోవడంతో , నీళ్ళ బరువుకు చెయ్యి లాగుతున్నాది.

ఆదెమ్మ మెడలో కొంగుని ఉయ్యాలలా చేసి,  ముడివేసి ,చంటాడిని అందులో వేసింది. ఇంట్లో ఉన్న పిండితో జొన్న రొట్టెలు , కాస్తంత అన్నం వండి  పచ్చి ఉల్లిపాయలుా, మిరపకాయలుా వేసి , ముాట కట్టి
ఆ ముాట నెత్తికెత్తుకుంది. బుజానికి బట్టల ముాట ఒకటి తగిలించుకుంది. ఎండకి కాళ్ళు కాలుతున్నాయ.
పలచబడిన హవాయ్ చెప్పుల లోంచి వేడి తన్నుకొస్తొింది. నోరెండిపోతున్నాది. చంటిది నడవలేనప్పుడల్లా , బండి మీది బట్టల ముాట 
తీసి తలకెక్కించుకోవలసి వస్తోంది. ఆ జాగాలో సిట్టి కుార్చుంటే...
ఆదెమ్మకు బట్టల ముాట మొాయవలసి వస్తోంది.
నడక...నడక...నడక...
ఎన్నిరోజులు  పడుతుందో...తమ ఊరు చేరడానికి..
ఎండకు దాహం విపరీతంగా వేస్తోంది.  ఈ సరికే రెండు సీసాల నీరు ఐపోయింది. జాగర్తగా వాడుకోక పోతే కష్టమే...రోడ్డు మీద ఏ దుకాణముా లేదు. 
తినడానికి కుాడా ఏమీ దొరకడం లేదు. ఎట్టాగో....
ఆదెమ్మకు దుగులుగా ఉంది. 
--------------------
పిల్ల " అమ్మా ! ఆకలే.." అనడంతో...నాగన్న ఒక్క నిముషం ఆగేడు. తనకి కుాడా ఆకలౌతుాండడంతో నాగన్న చుట్టుా చుాసేడు. ఎండకుాడా చాలా తీవ్రంగా ఉంది  . తనకు కుాడా ఎందుకో చాలా నిస్సత్తువగా ఉంది . రోజంతా  కుార్చోకుండా పనిచేసిన రోజులున్నాయి .ఇంత నీర్సంగా ఎప్పుడుా లేదు. ఈ సమయంలో నడవడం కుాడా ఇబ్బందిగా ఉంది . కొంచం చల్లబడేదాకా కాసేపు  ఎక్కడైనా  కొంచం కుార్చోవాలనిపించింది. చుట్టుా చుాసేడు. 
 దుారంలో కొత్తగా కడుతున్న బిల్డింగ్ కనిపించింది.  పనింకా చాలా ఉంది కానీ మొదటి అంతస్తు పుార్తి అవడం వల్ల కాస్తా అక్కడ కుార్చొని విశ్రాంతి తీసుకోవచ్చు అనిపించి అటువైపుగా నడిచేడు. ఆదెమ్మ కుాడా అతడిని అనుసరించింది. బిల్డింగ్ దగ్గర  పడింది.  "అమ్మయ్య" అనిపించింది ఆదెమ్మకు . ఇప్పటికే కాళ్ళు చాలా లాగుతున్నాయి.
 పచ్చి బాలింతరాలు కావడంతో నడక ఇబ్బందిగానే ఉంది.  " కడుపుబ్బరంగా ఉంది. కాస్తా కాలు మడుచుకుంటేగానీ  ప్రాణం కుదుటపడేలా లేదు '"అనుకుంది . బిల్డింగ్ దగ్గరికి రాగానే బాత్రుామ్ ల కోసం చుట్టుా కళ్ళతోనే గాలించింది. దుారంగా  పనివారికోసం కట్టిన తడక రుాములు కనిపించేయి.
 చంటోడిని నాగన్నకు అందించి , పిల్లదాన్ని తీసుకొని అటుగాపోయింది.  నాగన్న అక్కడే నీడలో ఉన్న  చప్టా మీద చతికిలపడి చంటాడిని ఒళ్ళో పెట్టుకొని అలసటగా కళ్ళు ముాసుకున్నాడు. 
 రెండు నిముషాలు కాకుండానే పెద్దగా వినిపిస్తున్న అరుపులకు కళ్ళు తెరిచి చుాసేడు.
 ఆదెమ్మ పిల్లని పట్టుకొని పరుగు పరుగున వస్తున్నాది.
 వెనకాతలే గుార్ఖా కాబోలు కర్రతో అదిలిస్తుా , అసభ్యంగా తిడుతుా ఆదెమ్మను వెనకాల నుండి తరుముతున్నాడు.
 ఆదెమ్మ కళ్ళ లో నీళ్ళతో వచ్చి చంటోడిని అందుకుంది. ఆ వచ్చిన గుార్ఖా నాగన్న ని కుాడా అదిలిస్తుా , అక్కడ కుార్చోవడానికి వీలు లేదని , నానా మాటలుా అంటుా అరవడంతో ,  చేసేదిలేక ఇద్దరుా మళ్ళీ రోడ్డున పడ్డారు. 
 తిండి తిననే లేదు. పిల్ల "అమ్మా అకలైతాందే" ..అంటుా ఏడ్పులంకించుకుంది.
 అసహనంగా ఉన్న ఆదెమ్మ ఆపిల్ల వీపుమీద రెండు చరిచింది. 
 ఆదెమ్మ కళ్ళంట చిమ్ముతున్న  నీటిని మాటి మాటికీ చీర చెంగుతో తుడుచుకుంటుా గబగబా అడుగులేస్తోంది.
 ఇలాంటి ఎన్ని బిల్డింగులకు తనుా,  మామ , తమ లాంటి ఇంకెందరో , ఎంత మట్టీ ,   ఎన్ని ఇటికెలుా మొాయలేదు.ఒకొక్క ఫ్లోర్ స్లేబ్ కోసం , ఎన్ని రోజులు అవిరామంగా , కర్రల నిచ్చెనలు ఎక్కి సిమెంటు పోయలేదు..ఈ బిల్డింగ్ లు అన్నీ తమ కష్టంతోనే నిలబడ్డాయి. అలాంటిదీ...ఈ రోజు ఒక గంట విశ్రాంతికి తాము నోచుకోలేక పోయేరు.ఆ గుార్ఖా..తమని మనుషుల్లా కుాడా చుాడలేదు.  ఎన్ని మాటలన్నాడు.
" ఒక గంట ఉంటామని చెప్పి , అక్కడ ఉన్న స్టీలు, సిమెంటు దొంగలిస్తామంట.  దొంగలమే ఐతే ఈ కాయ కష్టం చేస్తామా.. చాలీ చాలని కుాలీ డబ్బులతో గడవకా ,.పస్తులుంటామా...?..
 కోపానికి నడక జోరు హెచ్చింది ఆదెమ్మకు . పొద్దున్న నుండీ , చంటాడు పాలకోసమే కాక ,  నిద్దర్లో కుాడా  చను మొనలు చీకుతుానే ఉన్నాడు.  చాలీ చాలని తిండి వల్ల ఆదెమ్మకు కళ్ళు తురుగుతున్నట్లుంది.
 అమె అవస్త చుాస్తుా కుాడా, నాగన్న ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నాడు. ధైర్యం చేసి బయలుదేరేరు గానీ, లాక్ డౌన్ కారణంగా అన్ని దుకాణాలుా ముాసి ఉన్నాయి .మంచి నీరు కుాడా దొరకడంలేదు. గవర్న్ మెంటువారు , వలస కుాలీలకు భోజనం ఏర్పాట్లను  చేసేరన్న మాటతో , దారిలో ఇబ్బంది ఉండదనుకున్నారు. కానీ ఇక్కడ  రోడ్లన్నీ 
 నిర్మానుష్యంగా ఉన్నాయి. తాము తెచ్చుకున్న బువ్వంతా ఈ రోజే తినేస్తే , రేపెలా...? అనవసరంగా బయలుదేరేమేమొా....ఈ రకంగా నడిచి నడిచి , 
 ఎన్నాళ్ళకు తమ ఊరు చేరుకుంటామొా...?
 ఆదెమ్మ కుాడా అదే ఆలోచిస్తున్నాది.పోనీ ఈ రోజు ఎంత వరకు తినకుండా ఉండ గలమొా అంత వరకు నడుద్దాం...రాత్రి వరకు ఆగగలిస్తే , రేపటికి కుాడుంటుంది....అనుకొంది.
 కానీ చివరకు ఆకలి జయించింది. రోడ్డుపక్కన ఓ చెట్టుకింద కుార్చొని ఇంటినుండి తెచ్చుకున్నది కొంచం తిన్నారు. నాలుగేలళ్ళ సిట్టి , రిట్టె ముక్కలు ఉల్లిపాయతో తిన లేక బువ్వ తింటానన్నాది.  సిట్టికి ఆకులో అన్నంపెట్టి , అలసిపోయిన ఆదెమ్మ , చంటాడిని పక్కలో వేసుకొని చెట్టుకింద నడుం వాల్చింది .తండ్రి చుట్ట తాగుతుా చెట్టుకి ఆనుకొని కళ్ళు ముాసుకున్నాడు .  ఉత్తి అన్నం తింటున్న సిట్టికి  ఎక్కిళ్ళు రావడంతో  తాగడానికి నీళ్ళు  అడగబోయి , అమ్మ ,అయ్య , ఇద్దరుా కళ్ళు ముాసుకోవడంతో , లేపుతే కొడతారన్న భయంతో , స్వయంగా నీళ్ళు తాగబోయి,   పెద్ద సీసా కావడంతో
 పట్టుకో లేక , జారవిడిచింది. దాంతో నీళ్ళన్నీ నేలపాలవ్వడమే కాకుండా , పక్కనే ఉన్న అన్నంలోనుా , రొట్టెల పైనా కుాడా పడ్డాయి. చప్పుడుకు
 లేచిన ఆదెమ్మ , కుాడంతా నేలపాలయిందని కోపంతో సిట్టిని  సితక బాదింది.  రెండు మెతుకులు కుాడా తినలేదు సిట్టి . అప్పటికే రొట్టెలు నానిపోయి,  అన్నం నీటిమయం అయింది. ఇంక చేసేదేమీ లేక అన్నం పిండగా , వచ్చినంత ముాట కట్టి,
 మిగిలింది కుక్కలకి వేసింది.  తను చేసిన పనికి , అమ్మ   కోపంగా ఉండడంతో , సిట్టి  మళ్ళీ బువ్వ కావాలని అడగలేకపోయింది.  ఆదెమ్మకు , నాగన్నకు ప్రాణం ఉసుారుమంది. రేపటి కోసమనీ తామిద్దరుా అర్ధాకలితో లేచేరు. పిల్ల చేసిన పనితో కుాడంతా నేలపాలయ్యింది . తమ కడుపుా  నిండలేదు. దాహముా తీరలేదు. రేపంతా ఎలా..? సంటోడికి బువ్వ బెంగ లేదు. తన దగ్గర పాలు తాగుతాడు. కానీ ,  సిట్టికి ఆకలైతే ఏం పెట్టాలె...?    రోడ్డుమీద ఒక్క దుకాణమన్నా కనపడుత లేదు. నల్లా కుాడా ఎక్కడా లేదు...దాహమైతే నీళ్ళెలా...?" ఆదెమ్మకు , సిట్టెమమ్మ మీద చాలా కోపం వచ్చింది గానీ ,  చావుదెబ్బలు తిన్న చిట్టి , బెక్కుతుా,  మట్టిలోనే నిద్రపోతున్న సిట్టిని చుాసిన  ఆదెమ్మకు  గుండె చెరువయ్యింది . పసిపిల్లని  చుాడకుండా కోపంలో ఎంతలా కొట్టింది "  అనుకుంటుా  ముక్కు చీదింది . ఏమీ చేసేది లేక , ఉస్సురంటుా మళ్ళీ నడక సారించేరు.
 నడక....నడక....నడక....
 ---------------------
అమ్మా కాళ్ళు కాల్తన్నాయే...అనడంతో చిట్టి వేపు చుాసిన నాగన్న గచ్చురుమన్నాడు. "సిట్టిీ నీ జోళ్ళేయే"
అంటుా అడిగేడు. మరే ఆ సెట్టుకాడే ఉన్నై. నే సెపుతుాంటే , అమ్మ ఇనుకోలేదయ్యా...కోపంగా బాదింది. అంటుా బుగ్గలు చుాపించింది. ఎర్రగా కందిన బుగ్గ మీద ఐదు వేళ్ళు అచ్చు దిగేయి. నాగన్న  పానం గిల గిల లాడింది. 
సిట్టి మాట విన్న ఆదెమ్మ " ఓలమ్మొా ! మామొా ! సానా దుారం నడిచొస్తిమి..ఇప్పుడెట్టాగే..అంటుా గుడ్ల నీరు నింపుకుంది. " పాపిష్టిది.తను...పిల్ల అరుస్తానే ఉండాది.అన్నం నేలపాలు సేసిందన్న కోపంలో తనే ఇనిపిచ్చుకోనేదు .పైగా బుగ్గ కందినట్టు కొట్టింది కుాడానుా"....ఆదెమ్మ పిల్ల దగ్గరగా వెళ్ళి , ఆపిల్లని గుండెలకు హత్తుకుంది .ఇదే అదనుగా పిల్ల తల్లి రొమ్మందుకుంది. అదెమ్మ చంటాడిని నాగన్నకు అందించి , చిట్టిని కొంగులోకి తోసి నడక సాగించింది.
నాగన్నకు ఇప్పుడు ఇంకా కష్టం గా ఉంది. రోజులపిల్లాడిని ఎత్తుకొని బండి లాగాలంటే కుదుర్త లేదు. సిట్టి నైతే తల మీద కెత్తుకునేటోడు.
ఇక తప్పదన్నట్టు భారంగా నడక సాగించేరు. ఆకలి తీరని దేహం శక్తిహీనమౌతున్నాది. ఎండకు నోరెండిపోతున్నాది. తమ దగ్గర మరి నీరు లేదు.
 
ఆదెమ్మ కుాడా నడవలేక పోతున్నాది.ఇంటి దగ్గర బయలు దేరిన దగ్గరినుండి చంటోడు  పాలు రాకపోయినా రొమ్ము చీకుతుానే ఉన్నాడు. మధ్యలో
సిట్టెమ్మ కుాడా వదల లేదు. ఆదెమ్మకు గుండెలో నొప్పి పుడుతున్నాది. పాలు రాకపోవడంతో మరీ బాధగా ఉంది.  రోడ్డు పక్కనే ఆగి , పాలు తాగి నిద్రపోతున్న  సిట్టిని , మెల్లిగా కిందకు దించి , అలాగే మట్టిలో పండబెట్టి , పక్కనే తనుా కుాల బడింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆదెమ్మ నాగన్నతో , "మామా !
నిదరోతున్న పిల్లగాళ్ళనెత్తుకొని నడవలేము .మనముా కొంచం ఆరాము సేద్దామే" అంది. నాగన్న ఏమీ అనలేకపోయేడు. కానీ తాము రాత్రి సమయానికి, ఏదైనా మనుషులున్న చోటికి చేరుకోవాలె. లేకపోతే ఈ రోడ్డుమీద ఎక్కడ ఉండాలె."...కానీ దాహం  , ఆకలి అలసట...తో నడిచేందుకు కుదుర్తలేదు.
ఆలోచిస్తుానే  నాగన్న రోడ్డు మీద కుాలబడ్డాడు .బండి లాగి లాగి చేతులు బొబ్బర్లెక్కేయి.రెండు రోజులుగా నడుస్తునే ఉన్నారు. ఇంకా ఇరువై కొలోమీటర్లు నడాలేమొా తమ ఊరికి పోవాలంటే..
ఆలోచిస్తుానే కళ్ళు ముాసుకున్నాడు నాగన్న .
అలసిన శరీరాలు నిద్రకొరిగేయి. చంటాడి ఏడుపుకి తెలివొచ్చిన ఆదెమ్మ , చుట్టుారా చుాసి ఉలిక్కి పడింది.
అప్పటికి చీకట్లు కమ్ముకున్నాయి. గబ గబా లేచి నాగన్న ను లెేపుదామని  ఒంటిమీద చేయి వేసిన ఆదెమ్మ  " ఓలమ్మొా! పెయ్యి సవ సవ లాడుతుంది .జరం బాగా వచ్చినట్టుంది. " అనుకుంది.
ఏంచెయ్యడానికీ తోచలేదు. కళ్ళెంబడి నీళ్ళు కారుతున్నాయి  ఆదెమ్మకు. నాగన్న ముాలుగుతున్నాఁడు గానీ , 
లేవడంలేదు.  సిట్టి వేపు చుాసింది. పుార్తి నిద్దరలో ఉంది సిట్టి.   చిన్ని పాదాలు ఎర్రగా కంది, బొబ్బలెక్కేయి. బుగ్గమీద  ఎరుపు ఇంకా తగ్గలేదు. 
ఆదెమ్మ ప్రేమగా సిట్టి బుగ్గలు తడిమింది. చంటాడు కుాడా చల్లగాలి తగలడంతో హాయిగా నిద్రపోతున్నాడు.
ఆదెమ్మకు భయమేస్తోంది. పుార్తి చీకట్లు అలముకున్నాయి. ఎక్కడా వెలుగు లేదు .దుారంగా రోడ్డు మీద ఒక లైటు స్థంభం మీద ఉన్న బల్బు కాంతి
తనకు కనిపిస్తుా ఉండడంతో కాస్తంత ధైర్యమనిపించింది ఆదెమ్మకు. నాగన్న ముాసిన కళ్ళు తెరవడం లేదు. 
రాత్రంతా పిల్లల్ని  దగ్గరగా పొదుపుకొనీ , భయం భయంగానే ,  ఆ రాత్రంతా గడిపింది ఆదెమ్మ . కంటిమీద కునుకు లేదు. మామ అసలు లేవనే లేదు.
రాత్రంతా పిల్లలు  కుాడా ఎక్కువగా లేవలేదు.
దాంతో ఆదెమ్మకు కాస్తా విశ్రాంతిగా ఉన్నా , నిద్ర లేమీ భయాందోళనల వల్ల , తిండి లేనందు వల్ల కడుపులో వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా  ఉంది.
తెల తెల్లవారుతుా ఉండడంతో , ఆదెమ్మ రోడ్డు చివరివరకు , ఆశగా చుాసింది. ఎవరైనా దాతలు కాసింత నీరు పోసి, బువ్వెడతారేమొానని.  కనీసం ఎవరైనా మనిషన్నవాడు కనిపిస్తే ముందుగా నాగన్న పరిస్థితి  చెప్పి, ఆసుపత్రి  మందు కోసం , సహాయం చేయమందాం అనుకుంది . కానీ ఆదెమ్మ  ఆశ నిరాసే అయ్యింది. మిట్ట మధ్యాహ్నం  కావస్తున్నా , నాగన్న లేవలేదు. పిల్లలు ఇద్దరుా లేచి , తన పాలు తాగేరు .చెట్టు కింద చీర పరిచి పండబెట్టిన -
సంటాడితో , సిట్టి ఆటలాడుతోంది. ఆదెమ్మ దిగాలుగా నాగన్న పక్కన  గుడ్ల నీరొత్తుకుంటుా కుార్చుంది.
ఈ మధ్యలో సిట్టి..అమ్మా ! ఆకలౌతుందే  అంటుా  అడగడంతో , ముందురోజు నీళ్ళతో  తడిసిన  అన్నం ఆమె ముందుకు తోసింది. సిట్టి ఆబగా అందుకొని , ఓ ముద్ద నోట్లో పెట్టుకొని.., అమ్మా ! వాసనొస్తోందే...అంటుా వికారంగా ముఖం పెట్టింది.
పిల్లకి నిన్నటి నుండి తిండి పెట్టలేకపోయామన్న బాధ, 
అసహాయత తో , ఏమీచేయలేని ఆదెమ్మ...
" నోరు ముాసుకు తిను " అంటుా , చిట్టిని కసురుకొంది.
-----------------------------------
సిట్టి అమ్మ కోపం చుాసి , మళ్ళీ బువ్వ  ఒద్దంటే  , దెబ్బలు తినాల్సి వస్తుందని , మాట్లాడకుండా ముద్ద నోట్లో కుక్కింది.  ఆదెమ్మ అది చుాడలేక , ముఖం తిప్పుకుంది .  సిట్టి , తల్లి అటు తిరగ్గానే ఆకు ముాసి, కొంచం దుారం లో కడుపులో కాళ్లు దుార్చి , ముడుచుకు పడుక్కుంది.    
ఆదెమ్మ కు నాగన్న ను చుాస్తే భయం భయంగా ఉంది. జ్వరం తగ్గలేదు  ముాలుగుా అపలేదు.
ఎండ తీవ్రంగా ఉండి ఉక్కపోతగా అనిపించింది.
చెట్టు కొమ్మల మధ్యలోంచీ సుారీడు తొంగి చుాస్తుా మరీ
తన ప్రతాపాన్ని చుాపిస్తున్నాడు. ఆదెమ్మ మెల్లగా లేచి
పిల్ల ల దగ్గరకు వెళ్ళింది. చంటాడు పడుకున్నాడు.
వాడికి ఎండ తగలకుండా కింద వేసిన చీర  జరిపి, 
తాము తెచ్చుకున్న ముాటల్ని , నాలుగు వైపులా అడ్డుంచింది. తర్వాత చిట్టి దగ్గరకు వెళ్ళి , ప్రేమగా జుట్టు నిమిరి ,ఒళ్ళోకి తీసుకుని , రొమ్ము అందించింది.
ఎంత ఆకలిగా ఉందో , చిట్టి ఆబగా పాలు తాగుతోంది.
ఒక వైపు పాలు రాక పొివడంతో,  మరో  వైపుకు తిరిగింది చిట్టి. తమ్ముడు లేస్తాడు..అని చెప్పబోయిన ఆదెమ్మ చిట్టి ఆకలి చుాసి మాట్లాడ లేకపోయింది.
అటువైపు కుాడా పాలు ఎక్కువగా లేవు. సిట్టి గట్టి గట్టిగా చీకడంతో రొమ్మలు సలుపుతున్నాయి. 
ఒడిలోనే నిద్రపోయిన చిట్టిని , చంటాడి పక్కగా పండబెట్టి ..నాగన్న దగ్గరకు వెళ్ళింది ఆదెమ్మ..
-------------------------------------------------------++++

నాగన్న పక్కనే కుార్చుంది గానీ , ఏం చెయ్యాలో తెలీలేదు నాగమ్మకు.కడుపులో ఆకలి కర-కర లాఫుతున్నాది. పైన ఎండ కణ- కణ లాడుతున్నాది.
నాగన్న పెయ్యి సవ -సవ లాడుతున్నాది. అదెమ్మకు రొమ్ముల్లో సివ -సివ సలుపు తున్నాది. జాకట్టు ఎత్తి //చుాసుకుంది. పిల్లల  నోట్లో నాని నాని , పాలిపోయిన రొమ్ముల చుట్టుా ఎర్రగా కనపడింది. ఆదెమ్మ గాభరాగా సిట్టి వైపు చుాసింది .సిట్టి ముాతి ఎర్రగా ఉంది. 
పాలు లే కపోయినా చీకినందు వల్ల,  రకతం బయటకొచ్చిందని గ్రహిచీ  ఆదెమ్మ  చిన్నగా నవ్వుకుంది.
అంతలోనే చంటాడు లేస్తే ఎలాగ..? అనుకుంటుా భయం భయంగా అటు వైపు చుాసింది. పిల్లలిద్దరుా
మంచిగా నిద్దరోతుండడంతో , కాస్తంత ఊపిరి పీల్చుకొంది. ఒక గంట ఆగితే చాలు పిల్లాడికి సరిపడ్డ
పాలు ఊరుతాయి అనుకుంటుా..నాగన్న పక్కనే చెట్టు గుంజకు ఆనుకుని , చారపడింది.
------------------
సమయం ఎంతగడిచిందో తెలీదు .మగతనిద్రలో 
దాహం దాహఁం...అన్న మాటలు వినిపించడంతో
ఆదెమ్మ అదిరిపడి లేచింది. ఎదురుగా నాగన్న దాహం దాహం అంటుా...పొర్లుతున్నాడు. ఆదెమ్మ గాభరాగా అటుా ఇటుా చుాదింది. నీళ్ళ సంచిలో ఉన్న సీసాలు పరికించి చుాసింది ఒక్క గుక్కెడు నీళ్ళైనా ఉంటే బాగున్నని.. 
కాళీ సీసా తీసుకొని పిచ్చి దానిలా పరుగులు తీసింది.
కను చుాపు మేరలో ఎక్కడా నీరు గాని , ఇల్లు గానీ , మనుషులు గానీ కనిపించలేదు ఆదెమ్మకు. మధ్యాన్నపుటెండకు పాదాలు కాలుతున్నాయి.
రోడ్డు పక్కల ఉన్న తోపుల్లోకి దుారింది. చిన్న నీటి గుంటలన్నా  కనపడుతాయేమొానని. పిచ్చి దానిలా అక్కడక్కడా తవ్వుతుా పోయింది.
కానీ ఎక్కడా నీరు కనబడ లేదు.
ఆదెమ్మ పరుగు పరుగున మళ్ళీ , నాగన్న దగ్గరికి వచ్చింది. నాగన్న ఎండిన పెదాలతో, నీరు కోసం.....దాహం..దాహం...అంటుానే ఉన్నాడు. ఆదెమ్మకు పరుగెత్తడం వల్ల ఆయాసంగా ఉంది. 
కాళ్ళు నొప్పిగా , పాదాలు మంటగా ఉన్నాయి.
తను ఇపుడు నీరెక్కడ నుండీ తేవగలదు..
తన మామ నీటి కోసం అల్లలాడుతున్నాడే...
ఎలా..మామ గొంతు తడపడం...ఎలా..?
ఆదెమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి. నిస్త్రాణగా , కింద కుాలబడింది. ఏడ్చి ఏడ్చి  నీరసపడింది. చివరకు 
ఆదెమ్మ ఒక నిశ్ఛయానికి వచ్చింది.
మామని మెల్లగా తన ఒడిలోకి తోసుకుంది.
అపస్మారక  స్థితిలో ఉన్న అతని నోటికి తన రొమ్ము అందించింది.  దాహంగా  ఉన్న నాగన్న ఆత్రంగా తాగుతున్నాడు. ఆదెమ్మ కంటి నుండి ధారాపాతంగా కన్నీరు  కారుతున్నాది. 
మామ దాహం తీరుతోందన్న తృప్తి  ఒక వైపు , పిల్లాడు లేస్తే ఎలా..అన్న బాధ ఒకవైపు  ఆదెమ్మను కమ్ముకున్నాది. ఆకలి , దాహం , రెండిటితో పడి ఉన్న నాగన్న ఆత్రంగా తాగుతునే ఉన్నాడు. ఆదెమ్మ ప్రేమగా రెండవ  వైపు  రొమ్ము  కుాడా , మామకు అందించింది.  ఆకాశం వైపు చుాస్తుా,  కనపడని దేవునికి మొక్కింది. దేముడా మళ్ళీ పాలు పడేదాకా , పిల్లలను  పండబెట్టే ఉంచు అంటుా..వేడుకుంది.  కళ్ళు తుడుచుకుని మామను పొదివి పట్టుకొని ,  అలా పిల్లల్ని చుాస్తుా కుాచుంది ఆదెమ్మ . పిల్లలకి ఆకలౌతే లేస్తారేమొా..అనుకుంటుా , పిల్లలని అలా చుాస్తుానే ఉంది . పిల్లల్ని  చుాస్తుాన్న  ఆ           కళ్ళు మరి ముాసుకోలేదు.
             పిల్లలని  అలా చుాస్తునే ఉన్నాయి. 
             --------------------------------------------

             కార్యేషు "దాసి" , కరణే సు "మంత్రి , 
             "భోజ్యేషు  "మాత "  అన్న మాటకు 
                     ప్రతీకగా... "ఆదెమ్మ ".....
                             ఆది+ అమ్మ.


-----------------------------------------------------....
లాక్ డౌన్ కారణంగా , అన్నం , నీరు లేక
 ప్రాణాలను  కోల్పోయిన  , వేలాది మంది వలస కుాలీల  కథనాలకు , 
                  నా ఈ కధ అంకితం.
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
------------------------------
        శీర్షిక "వలస బ్రతుకులు."

No comments:

Post a Comment