Tuesday, February 2, 2021

సాహిత్యం ఎందుకు..?

మహతి సాహితీ కవిసంగమం కరీంనగరం- ప్రతిరోజు కవితా పోటీలు
పర్యవేక్షణ: డా.శ్రీ అడిగోప్పుల సత్తయ్య గారు
నిర్వహణ: బీరప్పల అనంతయ్య గారు
తేది ;2-2021(మంగళవారం)
అంశం :సాహిత్యం ఎందుకు?
పేరు :పి. లక్ష్మీ భవాని
ఊరు: విశాఖపట్నం
ప్రక్రియ: ఐచ్ఛికం
శీర్షిక: సాహిత్యం ఎందుకు?
(వ్యాసరచన)
"తెలుగు సాహిత్య మూలాలు"

తెలుగులో సాహిత్యం ఎలా పురుడుపోసుకుంది,
తెలుగు సాహిత్య నిర్మాణం వెనుక ఉన్న మూలాలేంటి?వాటి పునాదులేంటి?క్రీ.పూ 200 ప్రాంతంలోనే తెలుగు భాష మొగ్గుతొడిగితే,సాహిత్య నిర్మాణం ఎందుకు అంత ఆలస్యమైంది? నన్నయని ఆదికవి అని ఎందుకు అంటారు?అంటే తెలుగులో అంతకన్నా ముందు కవులు లేరా? నన్నయ తరువాత వచ్చిన శైవ కవులు మహాభారత నిర్మాణం ఎందుకు చేపట్టలేదు?
  తెలుగు సాహిత్యం పదకొండవ శతాబ్దానికి చెందిన ఆదికవి నన్నయతో ప్రారంభమైందని చెప్పవచ్చు. నన్నయను ఆదికవి అనడానికి గల కారణం,అంత కన్నా ముందు తెలుగులో కవులు లేరని కాదు. తెలుగు సాహిత్యానికి ఒక మార్గం చూపి తెలుగు సాహిత్య సృష్టి చేసిన వారు నన్నయ. అందుకే నన్నయని ఆదికవి అన్నారు.నన్నయ కాలం నాటికే సంస్కృతంలో చతుర్వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,ఉపపురాణాలు,మహాభారతం,రామాయణం వాడుకలో ఉన్నాయి.సంస్కృత ఆధిపత్య జాడలు సుస్పష్టంగా ఉన్న రోజులవి.నన్నయ సమకాలీనులుగా మల్లియ రేచన,వేములవాడ భీమకవి తెలుగులో రచనలు చేస్తున్నారు.మల్లియ రేచన కవిజనాశ్రయం, పావులూరి మల్లన గణితసార సంగ్రహం,భీమకవి కావ్యాలను రచించారు.అంటే క్రీ.శ 11 వ శతాబ్దం నాటికే తెలుగు వాళ్లకు ఒక స్పృహ కలిగింది. అసలు సాహిత్యాన్ని,పురాణాలను,ఇతిహాసాలను,కావ్యాలను సంస్కృతంలో చదవడమేంటి?నా మాతృ భాషలో,జాను తెలుగులో ఆ గ్రంథాలను చదుకుంటే బాగుంటుంది కదా అని.తరచి చుస్తే నన్నయ తరువాత వచ్చిన శివ కవులు,తిక్కన,ఎఱ్ఱన మొదలగు వారు,అంటే తెలుగు సాహిత్యం ప్రారంభమైన 300 సంవత్సరాల వరకు ఆనాటి కవుల ప్రధాన ఉద్దేశం,నా తెలుగులో రచించాలన్న స్పృహ.
  ఇవన్నీ ఇలా ఉండగా,నన్నయ మాహాభారతాన్నే ఎందుకు రచించాలి?రామాయణ భాగవతాలను ఎందుకు రచించలేదు అని తరచి చూస్తే, నన్నయ తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో కవిగా ఉండేవాడు.ఒక రోజు ఆ రాజు నన్నయను పిలిచి సంస్కృత పండితులు,వ్యాకరణులు కొలువు దీరిన సభలో,నన్నయా నీవు మహాభారతాన్ని తెలుగులో రచించు అని ఆదేశిస్తారు.అందుకు రెండు కారణాలు ఉన్నాయి.తెలుగు భాష అస్థిత్వాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకటయితే,మరోటి వైదిక తత్వాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం.ముందుగా తెలుగు భాష విషయానికి వస్తే,ఆ కాలంలో తెలుగు లిపి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. పదజాలం,భాష ఉత్కృష్ట దశలో లేదు.ఇదే సమయంలో అప్పటికే కన్నడ,తమిళ భాషల్లో మహాభారత రచన జరిగి,దేశీ సాహిత్యం స్థానిక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.దీంతో తెలుగులో సాహిత్యం లేదని తెలుగు వాడు బాధపడుతున్న రోజుల్లో,తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతిష్ట జరగాలంటే,తెలుగు సాహిత్య రచన జరగాలని,అందుకు మహాభారత రచనను చేపట్టాలని రాజరాజ నరేంద్రుడు నన్నయని కోరతారు.దీంతో తెలుగులో సాహిత్య రచన ప్రారంభమైంది.
  అయితే రాజు మహాభారతాన్నే రచించమనడానికి గల కారణాలలో ముఖ్యమైనది వైదిక మత పటిష్టత.ఈయన కాలంలో బౌద్ధ,జైన మతాలు తమ తమ అస్తిత్వ పోరాటాలు చేస్తున్నాయి.రాజు వైదిక మతాభిమాని.ఆయా మతాల భావాలు వైదిక మతానికి పూర్తిగా వ్యతిరేకం.దీంతో వైదిక మతానికి సంబంధించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని కోరతారు.దీంతో తెలుగు సాహిత్య సృష్టికి బీజాలు పడ్డాయి.
  నిజానికి తెలుగులో సాహిత్యం 2000 సంవత్సరాల కిందటే సృష్టించబడి ఉండేది.ఆ విషయమేంటో ఒక సారి చూద్దాం.ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టిన సందర్భమిది. శాతవాహన రాజైన కుంతల శాతకర్ణి కాలంలో దేశీ భాషలే రాజ్య భాషలు.కుంతల శాతకర్ణి ప్రేమ వివాహం చేసుకున్నారు.ఒక రోజు తన సతీమణితో కలిసి నదిలో జలకాలాడుతుండగా,తన భార్యపై శాతకర్ణి నీళ్లను చల్లడం మొదలుపెడతాడు. అప్పుడు రాణి 'మొదకై తాళహ' అనే సంస్కృత పదాన్ని పడే పదే పలుకుతుంది.ఆ సంస్కృత పద అర్ధం తెలియని రాజు,తన ఆస్థానంలోని మంత్రివర్యులని పిలిపించి ఆ పదానికి అర్ధం ఏంటని అడుగుతారు.మంత్రికీ సంస్కృతంపై పట్టు లేకపోవడంతో కష్టంగా ఒక అర్ధాన్ని చెబుతారు.మొదకై అంటే ఉడ్రాళ్లని,తాళహ అంటే కొట్టండి అని.అంటే ఉండ్రాళ్ళని బహుమతిగా ఇవ్వండి అని రాణి గారు చెప్పారు ప్రభు అని సెలవివ్వగానే,బుట్టలు బుట్టలుగా ఉండ్రాళ్ళని బహుమతిగా రాణికి ఇస్తారు రాజు. అవి చూసిన రాణి ఇవేమిటని ప్రశ్నించగా, జలకాలాడుతున్నప్పుడు నీవే ఉడ్రాళ్లని బహుమతిగా ఇవ్వమని అడిగావు కదా అని రాజు బదులివ్వగానే రాణి పక్కున నవ్వి,మొదకై తాళాహా అంటే నీళ్లతో నను కొట్టొద్దు అని అర్ధమని, సంస్కృతం వచ్చి ఉంటే నీకు అర్ధం అయ్యేదని రాజు అజ్ఞానాన్ని చూసి రాణి ఎగతాళి చేసింది.దీంతో చిన్నబోయిన రాజు అప్పటి వరకు రాజ్య భాషగా ఉన్న ప్రాకృతాన్ని కాదని సంస్కృతాన్ని రాజ్య భాషగా ప్రకటిస్తారు.సంస్కృత వ్యాకరణ సృష్టికి పూనుకుంటారు. దాంతో రాజ్య భాష ముందు దేశీ భాషలు అణగారిపోయి తిరిగి పునరుద్ధరింపబడడానికి వెయ్యేళ్ళు పట్టింది.అంటే నన్నయతో తెలుగు సాహిత్య పునరుద్ధణ ప్రక్రియ ప్రారంభమైంది.
   మహాభారత రచనలోకి వస్తే,వ్యాసుడు రచించిన మహాభారతంలో 100 పర్వాలున్నాయి.వాటిని నన్నయ 18 పర్వాలుగా విభజించి,చివరి రెండు పర్వాలను పక్కనపెట్టారు.అంటే 98  పర్వాలను 18 పర్వాలుగా మార్చారు.ఆదిపర్వం,సభాపర్వంతో మొదలుకుని స్వర్గారోహణ పర్వంతో మహాభారతం ముగుస్తుంది. ఇందులో విశేషమేమంటే నన్నయ మొదటి పద్యాన్ని సంస్కృతంలో రచించడం.అందుకు గల కారణాన్ని నన్నయ పద్యంలోనే చెబుతారు.ఓ సంస్కృత భాషీయుల్లారా,నా దేశీ భాషలో కావ్యం రచిస్తున్నాను,దానికి మీ చేదోడువాదోడు కావలి అని అనడం,సంఘంలో సంస్కృత ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో విశదీకరిస్తుంది.సరైన లిపి,పదజాలం లేని అలాంటి రోజుల్లో తెలుగు భాష సృష్టి జరగాలంటే వారి సహాయ సహకారాలు తప్పనిసరి.నన్నయ సమన్వయ వాదాన్ని అనుసరించారు.
    నన్నయ తరువాత వచ్చిన వారు శైవ కవులు.వారిలో ప్రముఖులు పాల్కురికి సోమన్న,నన్నె చోళుడు,మల్లికార్జున పండితుడు .వీరు పన్నెండవ శతాబ్దానికి చెందినవారు.సంస్కృత ఆధిపత్య చెర నుండి తెలుగు భాషని తప్పించిన తొలి యుగం కూడా ఇదే. నన్నయ మణిప్రవాహ శైలిని అనుసరించగా, కేవలం తెలుగులో మాత్రమే రచనలు చేస్తాము,అని చెప్పి సంస్కృతాన్ని బహిష్కరించిన కవులు శైవ కవులు. నన్నయ పూరించని మహాభారతాన్ని వీరు  కొనసాగించకపోవడానికి ముఖ్యకారణమిదే.వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారు పాల్కురికి  సోమన్న.ఈయన ఓ విప్లవకారుడు,తెలుగు జాతి గర్వించదగ్గ పునాది వేసినవారు.సంస్కృతాన్ని నేను ఎదిరిస్తాను అని మొదటిసారిగా తెగేసి చెప్పిన వారు పాల్కురికి.శతకం,ద్విపద,రగడ,ఉదాహరణం వంటి గానబద్ధమైన ప్రక్రియలను సృష్టించారు.శైవ కవులు మొదటి సారిగా దళితులకు,నిమ్న వర్గాలకి పెద్ద పీఠ వేశారు.స్త్రీ చైతన్యానికి,సంఘంలో వారికి సముచిత స్థానం కోసం కృషి చేశారు.అయితే శైవ కవులు అందించిన సాహిత్యంలో ఎక్కువగా మతపరమైన అంశాలు ఉండి,సంకుచిత తత్వాలతో ముందుకు సాగడం నకారాత్మక అంశం. అయినా ఎన్నో సాహిత్య ప్రక్రియలను వీరు పరిచయం చేసి,తెలుగు వారి అస్తిత్వం కోసం పోరాడారు.
    పాల్కురికి తరువాత వచ్చిన 13 వ శతాబ్దపు కవి తిక్కన.ఈయన తన ముందు వారైన శైవ కవులు సృష్టించిన ప్రక్రియలను కొనసాగించకుండా,నన్నయకు కొనసాగింపుగా విరాట పర్వం నుండి మహాభారతాన్ని రచించారు.మరి తిక్కన మహాభారతాన్నే ఎందుకు రచించారు?దానికి సమాధానం విరాటపర్వంలోని అవతారికలో తిక్కనే చెబుతారు.'తెలుగు భాష వినిర్మింప' అంటే తెలుగు భాషని పునర్నిర్మించడం కోసం అని అంటారు.అలాగే 'ఆంధ్రావళి మోదం ఒరయునట్లుగా' అని చెప్పడం ద్వారా నా తెలుగు జాతి గర్వం కోసం,ఉనికి కోసం,తెలుగు ప్రజల గుండె చప్పుడు కోసం నేను మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నాను అని అంటారు.తిక్కన పామరులకు అర్ధమయ్యే భాషలో తన రచనలు రచించారు.
    తిక్కన తరువాత వచ్చిన 14 వ శతాబ్దపు కవి ఎర్రన. ఈయన అరణ్యపర్వ శేష భాగాన్ని పూర్తి చేయడంతో పాటుగా,వ్యాస మహాభారతంలో వదిలివేయబడిన హరిపర్వం,భవిష్యపర్వాలను తెలుగులోకి అనువదించారు.అదే హరివంశం. ఎర్రన సమకాలీనుడు నాచర్ల సోమన ఉత్తర హరివంశాన్ని అనువదించారు.ఎర్రన్నతో మొత్తంగా సంస్కృత మహాభారతం తెలుగులోకి వచ్చింది.రామాయణం అప్పటికే తెలుగులోకి రావడం జరిగింది.
మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం అనే దాంతో తెలుగు సాహిత్యం ప్రారంభమైoది

No comments:

Post a Comment