Tuesday, November 30, 2021

దశావతారములు

తపస్వీ మనోహరం పత్రిక వారి ఈ పుస్తకం కొరకు ,

అంశం : దశావతారాలు.
ప్రక్రియ : పంచపది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

మానవ సమాజంలో మనుషుల నడవడిక పై  ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి.
ధర్మార్ధ ,,మొాక్షముల నిరంతర సాధనకు 
ఈ అవతారాల విశిష్ట  వ్యక్తిత్వ విలువలు మనకు మార్గదర్శకమౌతాయి.
సామాజిక ధర్మాన్ని , నీతి, నియమాలను తప్పిన వారందరుా ఏదో ఒకనాడు పతన మవక తప్పదన్న మాటకు ఈ అవతారాలు మాధ్యమమై నిలచి
మనిషి స్వార్ధపుారిత దురాలోచనా విధానానికి ,
తగిన జ్ఞాన సముపార్జనకు దోహదమౌతాయన్న
నమ్మకంతో రాస్తున్న దశావతార మహిమలు.

1 . మత్స్యావతారము .
-------------------
చాక్షుష మన్వంతర అంత్యకాలములో
సోమకుణ్ణి వధించి ,వేదాలను రక్షించిన అవతారము.

సత్యవ్రతుణ్ణి రక్షించిన సారసాక్షుని అవతారము.

మహీరూపమైన నావలో సకల బీజాలనుా, ఓషధుల్నీ ,
సప్తర్షులనీ ఎక్కించి ,మూపు పై ధరించి రక్షించిన
అవతారము.

మహా మత్స్యావతారుడై అవనికి వేద నిధి-
నందించిన శ్రీమహావిష్ణువు ప్రథమావతారము.

మానవసమాజంలో మంచిని రక్షీంచేందుకు ఉద్భవించిన ఆ పరమేశ్వరుని అవతారమహిమను తెలియుమీశ్వరీ ॥

2.కుార్మావతారము.
-----------------
దేవ ,దానవుల "సముద్రమంథన" సమయము.

వాసుకిని తాడుగా మందరగిరిని కవ్వముగా
వాడిన సమయము.

ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపిన అవతారము.

"కుార్మావరారుడై "అమృతమధనానికి సహాయం 
చేసిన శ్రీమహావిష్ణువు  ద్వితీయావతారము.

చిలికిన అమృతమును దేవతలకు అందించేందుకు
మొాహినీ అవతారమెత్తి, అసురుల బారినుండి
అవనిని గాచిన అవతారపురుషుని
లీలలను గనుమీశ్వరీ.॥

3.వరాహావతారము:
-----------------
సత్య యుగంలో ముల్లోకాలను అల్ల- కల్లోలం 
చేసిన "హిరణ్యాక్షు"డొక  అసుసుడు .

వర గర్వ బలంతో,భుాదేవిని పాతాళంలోకి తొక్కినవాడు.

బ్రహ్మ నిద్రిస్తుా ఉండగా, వేదాలను తస్కరించినవాడు.

"వరహావతార"మెత్తిన విష్ణుముార్తిచే సంహరింపబడిన
ఘొార అసురుడు.

భుాదేవినీ, వేదాలను రక్షించిన అవతారపురుషుడు
తప్పులు,పాపాలు చేసినవారిని, ఎప్పటికైనా
శిక్షిస్తాడని  తెలియజెప్పిన అవతారమిది ఈశ్వరీ ॥

*****************************************
4.నరసింహావతారము:
-------------------
హిరణ్య కశ్యపుని పుత్రుడు,విష్ణుభక్తుడైన బాల ప్రహ్లాదుడు .

దేముడు ప్రతీ చోటా ఉన్నాడన్నందుకు తండ్రిచే
శిక్షింపబడుతుా ఉండేవాడు.

భక్తికి లొంగిపోయే కరుణామయుడు భగవంతుడు.

 ప్రహ్లాదుని రక్షణకై  స్తంభం నుండి వెలువడి
" హిరణ్యకశిపుని" దునిమిన "ఉగ్ర నారసింహుడు."
 
 దుష్టులను దునిమేందుకు  ఏ రుాపమవసరమొా ఆరుాపమునెత్తి అవనిని కాచే ఆదినారాయణుని 
 శరణనుమీశ్వరీ॥
 
 *************************************
5. వామనావతారము : 

దానధర్మాలకు మారుపేరైన "బలి", అసురవంశజుడు.

అట్టి "బలి చక్రవర్తిని" బలిమినణచ వచ్చిన "వామనరుాపుడు" శ్రీమన్నారాయణుడు .

ముాడడుగుల భుామినడిగి ముల్లోకాలను 
ఆక్రమించిన ముాలపురుషుడు.

అసుర బారినుండి అవనిని కాపాడడానికి వచ్చిన 
మరుగుజ్జు రుాపుడు శ్రీమన్నారాయణుడు.

ధర్మాన్ని కాపాడడానికి వామన  వటువుగా ధరనవతరించినది శ్రీ మహావిష్ణువే ఈశ్వరీ .॥

************************************::::
6. పరశురామావతారము :

జమదగ్ని, రేణుకల పుత్రునిగా, కోపిష్టి తండ్రి
ఆజ్ఞ మేరకు తల్లిని , సోదరులను వధించిన
 పితృ వాక్యపరిపాలకుడు, పరశురాముడు. 

కామధేనువునివ్వని కారణంగా కార్తవీర్యార్జునుని కుమారులు  తండ్రి జమదగ్ని తల నరికినందుకు
కోపోద్రిక్తుడైన పరశురాముడు.

తల్లి రేణుక  రోదన చుాడలేక కార్తవీర్యార్జునుని కుమారులనందరినీ చంపి తండ్రిని బతికించిన వాడు.

కుపితభావుకులు, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించినవాడు.

ఆవేశము అనర్ధాలకు కారణమని తెలిపేందుకు 
అవతరించిన ఆపద్బాంధవుడని తెలియుమీశ్వరీ ॥

**************************************
7.  రామావతారము:
 ---------------+
పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలచిన "శ్రీరాముని" అవతారం.

దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సత్య, ధర్మ,
నిగ్రహాలకు ప్రతిరుాపమై నిలచిన వైనం.

సామాజిక  కట్టుబాట్లకు, ధర్మానికి, మానవుడు ఇవ్వవలసిన ప్రాధాన్యతకు నిదర్శనం .

కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతాయుత
కార్య సమర్పణకు నిజమైన తార్కాణం శ్రీరామ చరితం.

సామాజిక కట్టుబాట్లను గౌరవించే జీవన విధానాన్ని 
ఆచరించుమీశ్వరీ ॥

***************************************
8.. బుద్దావతారము:

త్రిపురసంహారానికై బుద్ధావతార రుాపుడైన విష్ణువు.

త్రిపురాసురుల వధకై వారి పత్నుల పాతివ్రత్యాన్ని  భంగపరచుటకై  అశ్వత్థవృక్షంగా మారిన విష్ణువు .

త్రిపురాంగనల పాతివ్రత్యబలాన్ని నశింపచేసి , 
శంకరుని చేతి అస్త్రంగా మారి , త్రిపురాసురులను 
వధించిన విష్ణువు .

సిద్ధార్ధ నామ ముతో జని, సన్యాసియై సత్య, ధర్మ ,అహింసల బాటను ప్రజలకు బోధించిన ఆది బిక్షువు విష్ణువు .

బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో మేటియైన గౌతమ బుద్ధుని బోధనలను 
గౌరవించుమీశ్వరీ . ॥

************************************:

9.కృష్ణావతారము:
***************
కర్మ , ధర్మ , జ్ఞానాదులనే పదునెనిమిది యొాగ తత్త్వ సారములను అవనిని తెలిపేందుకు అవతరించినవాడు.

ఆతడే లీలా మ‍నుష వేషధారి శ్రీకృష్ణుడు.

పసి బిడ్డడై యశోదానందులను, రేపల్లె బాలికలను
తన లీలలతో ఆనందపరచి ,అసురసంహారము గావించినాడు.

కురుక్షేత్ర సమర సమయంలో మనుజులు చేసిన
కర్త, కర్మ, క్రియలకు తానే కారణభుాతుడనని--
భుా భారమును తగ్గించిన బలరామానుజుడు.

కృష్ణావతాడుడై యుద్ధమందు అర్జునునికి 
సారధిగా నిలచి, గీతా వేద సారములను , తత్త్వజ్ఞానమునుా బోధించిన శ్రీ  విష్ణుదేవునకు అంజలినిడుమీశ్వరీ.॥

**********************************::
10. కల్కీ అవతారము :
-------------------
దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారమునకు, ప్రతీ యుగంలోనుా మానవరుాపంలో అవతరిస్తున్న  భగవంతుడు .

కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి పుత్రునిగా
ఉద్భవించిన  సర్వమ్లేచ్ఛ సంహారుడు, కల్కి భగవానుడు.

ప్రస్తుత సామాజిక ,రాజకీయ పరిస్థితుల దుర్గతికి 
సకల జన ,క్షామ, కామ ,లలామ శోక సంక్షోభణల విజృంభణకు కారణం కలి ప్రవేశమన్న తీర్మానం.

మనిషి స్వార్ధం తో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు చేసి , జన పతనమొందించే కలి కరవాలం ॥

కలి నివారణకై  మనుజులు ధర్మ పథంలో నడచి ,సమ సమాజ స్థాపనకై శాంతి బాటలో నడిచే సద్బుద్ధినీయమని ఆ భగవంతుని ప్రార్ధించు జగదీశ్వరీ.॥


హామీ:
పై దశావతారాలు  నా స్వీయ రచనలు.

No comments:

Post a Comment