*నా తెలుగు పూదోట....!!*
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు పూదోట
మందార మకరందం అంతా నింపుకొనే
ప్రతి పువ్వులో సుగంధాలను పులుముకొనే
లేత చిగురాకులు తిన్న కోయిల
మధుర కంఠంలో కూనిరాగాలు తీస్తుంది..
వేసవిలో నీ తాటి నుంజల చల్లదనం
మధుర ఫలము లోని మాధుర్యం
రసాస్వాదన రూపములో కురిపించే
తెలుగు పదాలు పలికిన చోట
నవ రసాలు అన్ని పులకరించే.
గోదావరి మాత కొబ్బరి బొండాలలో
అచ్చతెలుగు నీళ్లు పోసి పలకరించే
కృష్ణమ్మ బిరా బిరా సుందర పదాలతో పొంగిపొర్లే
తుంగభద్రా నది అలనాటి వైభవాలతో
మధుర జ్ఞాపకాలు మూటగట్టి తిరుగుతుంది..
హంసవాహిని పలుకుల్లా అక్షర బద్ధమై
నన్నయ్య ఘంటం నుంచి
చిన్నయ్య గ్రాంథికము వరకు
గురజాడ తెలుగు పదాలతో
ఆంధ్రమాత నలుచెరుగులా
అక్షర ధాన్యాగారము పండించే..
సాహితీ పూదోటలో ఎన్నో గ్రంథాలు పుష్పించే
తెలుగుతల్లి మెడలో సుగంధ
పరిమళాల కావ్యాలెన్నో
నిత్య శోభాయమానంగా విరాజిల్లే..
కావ్య సంపదతో కళ్ళు మిరుమిట్లు గొలిపే
ఎందరో బిడ్డలకు శాశ్వత కీర్తి ప్రసాదించే
అవే అవే నా తెలుగు తోటల్లోనూ
పరిమళించిన సువాసనల గ్రంధాలు..
పద్యములో పరిమళించిన గాత్రాలు...
అక్షర భిక్ష పెట్టిన అమృత భాండాగారాలు...
రవి తో సమానం గా వెలిగిన కవుల జ్ఞాన మనో నేత్రాలు...
అవే అవే అవే మాటలు పాటలు భావాలు
ఆలోచనలు ఆవేశాలు
అనంతం అక్షరం అక్షరం ఒక భావరూపమై
ఆలోచనల కదలికకు రూపమై
లక్షల మెదళ్లకు భావాలకు
రూప ప్రతిరూపాలై
ముందుకు సాగుతున్నది నా భాష నా మాతృభాష..
✍
*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*
9885066235
No comments:
Post a Comment