Tuesday, May 23, 2023

కొత్త ప్రక్రియ : చతుర్ముఖి

అందరికీ అభివందనం 🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿



             ఇన్ని రోజులూ పలు ప్రక్రియల్లో మన రచనలు అలాగే నేడు మరో సరికొత్త తెలుగు సాహిత్య ప్రక్రియలో సరికొత్త రచనలు చేద్దాము...


      ఇక నేడు మనం చూడబోతున్న సరికొత్త ప్రక్రియ *చతుర్ముఖి*. ఇక ఇప్పుడు దాని లక్షణాలను దాని ఉదాహరణలు చూద్దాం...


చతుర్ముఖి :- 

1) ఇది నాలుగు వాక్యాల ప్రక్రియ .
2) ఇందులో ప్రతీ వాక్యంలో నాలుగక్షరాల పదాలు నాలుగుండాలి.
3) రెండవ పాదం మూడవ పాదం  అంత్యప్రాసలో ముగియాలి.
4) మొదటి వాక్యంలో మొదటి మూడక్షరాలు " *ర* " గణం  అవ్వాలి అలాగే నాల్గవ వాక్యం చివర *త* గణంతో ముగియాలి.

ఉదాహరణలు:- 

1)
అందమైన మల్లెపూలు విరబూసే సమయాన
మరుడంటి చెలికాడు సరసన చేరుకొని
వన్నెలున్న చిన్నదాన్ని సున్నితంగా హత్తుకొని
ముచ్చటించె ప్రియముగ చందమామ వెళ్ళేదాక

2)
ముజ్జగాలు చేతులెత్తి నమస్కారం చేసెదరు
అగుపిస్తే కన్నులకు అతగాడి స్వరూపము
అసురుల గణానికి ప్రసాదించి వరాలను
వారందరి ఆయువుల్ని హరించెడి శాంతాకారి

3)
రాజుకుంటే అహములు మనసుల నడుమన
మసిబారు బంధములు ఉదయించు పంతములు
మొదలౌను వాక్యుద్ధము ఉప్పొంగును నయనాలు
వదులుకో కోపమును పంచుకుంటూ ఆనందాన్ని

4)
వేడుకేగా జీవనము పుట్టిస్తుంటే నవ్వులను
సంబరాలే అనునిత్యం వదిలేస్తే పేరాశను
పండుగేగా ప్రతిరోజూ ఆదుకుంటే ఆర్తులను
రమ్యమేగా పయనము ఏకాగ్రత  ఉండేదాక

No comments:

Post a Comment