తపస్వి మనోహరం E-book కొరకు కథ.
అంశం:* రైలు " కథలు...
శీర్షిక : అందమైన అనుభవం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
కళ్యాణ్ : మహారాష్ట్ర.
కధా ప్రారంభం.
-------------
బట్టలు సర్దుతూనే మా వారి మీద నేను విసుక్కుంటున్నాను
"ఆయనేప్పుడూ ఇంతే .ఏ రోజు ఏ పని వద్దంటామో, ఆ రోజే ఆ పని చేస్తారు. తిథి ,వార, నక్షత్రాల మీద నమ్మకమే లేదు. జాతకాల మీద నమ్మకం లేదు, శకునాల మీద నమ్మకం లేదు, వాస్తు మీద నమ్మకం లేదు.
పూర్తిగా నమ్మక్కర్లేదు గాని, కనీసం కొంతవరకైనా నమ్మాలి కదా,. పూర్వం పెద్దలు ఎందుకు చెప్పారో..?.. ఏమో.?
నాకైతే అన్నిటి మీద నమ్మకమే...
కానీ , ఆడదాని మాట ఎప్పుడు నెగ్గిందని ,ఎప్పుడూ మగాడిదే కదా పై చేయి." అంటూ....
ఇంతకీ జరిగిందేంటంటే..,
బొంబాయి లో మా అత్తగారు, ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళని చూడడానికి వెళ్దాం అంటూ , ఆయన "ట్రైన్ కి టికెట్ బుక్ చేస్తాను" అన్నారు .
చాలా రోజులలై హైదరాబాదులోనే ఉన్నాం కదా. ఇలా .నలుగురినీ కలిసి వస్తే మనసుకు కాస్తా ఆనందంగా ఉంటుంది కదా, అని నేను కూడా" సరే " అన్నాను .
దాంతో మా వారు సంబరపడిపోయారు
" సరే మంచి రోజు చూడు, టికెట్లు బుక్ చేస్తాను" అని నాతో చెప్పనే చెప్పారు.
అయితే మంచి రోజు చూసి నేను చెప్పాను కూడా .కానీ ఈయనేమో "అసలు ఎక్కడా రిజర్వేషన్ లేవు" అంటూ కరెక్ట్ గా "పౌర్ణమి" రోజున టికెట్లు బుక్ చేసేసారు .
దాంతో, నాకేం చేయాలో తోచలేదు లేదు. ఎందుకంటే , పున్నమి రోజు పులి కూడా బయలుదేరదంటారు కదా, మన పెద్దలు.
ఆరోజు బయలుదేరితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో ? అన్న భయంతో, మరో రోజు టికెట్లు దొరుకుతాయేమో చూడండి." అన్నాను .
దాంతో మావారికి చిర్రెత్తుకొచ్చింది.
" నీకు కావలసినప్పుడల్లా రిజర్వేషన్లుదొరుకుతాయా? ఎప్పుడు రిజర్వేషన్లు దొరికితే అప్పుడు బయలుదేరాలి గానీ" ,అంటూ రుస రుసలాడారు మావారు .
నేనైతే ప్రతి పౌర్ణమికి ఉపవాసం ఉండి, "సత్యనారాయణ స్వామి వ్రతకల్ప" పుస్తకం , చదువుకుని, స్వామివారికి ప్రసాదం నివేదన చేసి, ఒక ముత్తైదువకి భోజనం పెట్టి , పసుపు, కుంకం, పండు-తాంబూలాలతో పాటు, చీర పెట్టడం నాకు అలవాటు. అది గాక ,
ఆరోజు ప్రయాణం పడితే, నేను ఉపవాసంతో ప్రయాణం చేయాలి . నాకు పూజ కూడా చేయడం అవదు .పౌర్ణమి నాటి పూజ, రాత్రి పూటే , చంద్రోదయం తర్వాత చేస్తారు. ప్రయాణం రోజు పూజ చేయడం కుదరదు .దాంతో వ్రత భంగం అవుతుందనే బాధ మరొకవైపు, కలుగుతున్నాది.
దాంతో ప్రయాణం రోజు వరకు, ఇద్దరి మధ్యన వాదనలే..," "ఏం పర్వాలేదు వెళదాం " అంటూ అతను,
"వద్దంటూ" నేను వాదించుకున్నా , మొత్తానికి అతనే నెగ్గారు.
దాంతో " ఏమవుతుందో, ఏమో " అని ఒక ఒక పక్కన భయం వేస్తున్నా , ప్రయాణానికి కావాల్సిన సామాన్లు, బట్టలు, సర్దడం మొదలెట్టేను.
"ఇంకా వంటవండాలి.. భోజనాలు చేయాలి. రాత్రికి ఏదో చేసి పట్టుకోవాలి . అంట్లగిన్నెలు తోముకొని ఇల్లంతా సర్దుకోవాలి."
"ఈ పనులన్నీ ఒక్కత్తినే ఎలా చేస్తానో ఏమో.."
"ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇంట్లో , టైము లోపల అన్ని పనులు చేసుకుని తెమిలే సరికి తల ప్రాణం తోకకి వస్తుంది.
"ఈయనకి ఒక్క పని కూడా చేతకాదాయే.
ఏ పని చెప్పినా, తిరిగి ఆ పని, నేను చేసుకోవలసి వస్తుంది".
అనుకుంటూ, విసుక్కుంటూ, ఎలాగో ఒకలాగా , సామానంత సర్ది , ప్రయాణానికి రెడీ అయ్యాను. .
కరెక్ట్ సమయానికి , ఈయన బుక్ చేసిన "క్యాబ్ " కుాడా వచ్చేసింది.
దాంతో ఈయన" తొందరగా, పద " అంటూ హడావుడి చేసేరు.
" హైదరాబాద్ టు ముంబై వెళ్ళే హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ " మధ్యాహ్నం 2:30 కి హైదరాబాదు లో బయలుదేరుతుంది.
మేము "బొల్లారం" ష్టేషన్ వైపు ఉన్నాము
" బేగం పేట్" కు వెళ్తే గాని, మాకు బండి ఎక్కడానికి అవ్వదు.
అందుకనే ,ఎప్పుడు ప్రయాణం చేసినా ఒక గంటన్నర ముందు గానే బయలుదేరవలసి వస్తుంది.
మొత్తానికి ఇల్లు తాళం పెట్టి, బేగంపేట్ చేరేసరికి రైలు వచ్చి రెడీగా ఉంది.
ఇద్దరం ఆడుతూ, పడుతూ, కోచ్ వెతుక్కోనేసరికి మరో 10 నిమిషాలు పట్టింది.
గబగబా సామాన్లన్నీ మోసుకుంటూ, ఈడ్చుకుంటూ, ఎలాగో పెట్టలో పడ్డాం.
టికెట్లో సీటు నెంబర్లు చూసుకుని వెళ్లేసరికి ,అవన్నీ నిండుగా ఉన్నాయి .మా సీట్లో ఎవరో దంపతులు కూర్చుని ఉన్నారు.
మా వారు మర్యాదగా" ఏమండీ ,ఈ సీట్లు మావి. కాస్త లేస్తారా.? సీటు కింద సామాన్లు సర్దుకోవాలి" అని చెప్పారు.
ఆయన ఒకసారి మా వారి వైపు చూసి ,"ఇవి మీ సీట్లు కావండి . ఇవి. మాసిట్లే. మేము 15 రోజులు ముందు నుండే బుక్ చేసుకున్నాం. " అని అన్నారు.
దాంతో మా వారు జేబులో ఉన్న టికెట్లు తీసి ,ఆయనకి చూపిస్తూ , "కాదండి ఇవి మా సిట్లే . కావాలంటే చూడండి " అంటూ టిక్కెట్లు చూపించారు .
కానీ ఆయన "ససేమిరా" అంటూ అక్కడే కూర్చున్నాడు ఎంతకీ లేవరు." టికెట్లు చూపించాం కదా"
అని మా ఆయన
" మా దగ్గర కూడా టికెట్లు ఉన్నాయి కదా "అంటూ అతను వాదించుకున్నా రు..
ఈ గొడవ మధ్య నిలబడి, నిలబడి , నా కాళ్లు పీకుతున్నాయి.
"అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. .టి.సి .రానివ్వండి అతను ఈ టికెట్ల గొడవ చూసుకుంటాడు " అంటూ కొందరు సలహా ఇచ్చారు.
దాంతో అతను కాస్త జరిగి మా ఇద్దరం కూర్చునేందుకునందుకు కాసింత చోటు ఇచ్చాడు.
" బతికేం రా భగవంతుడా " అనుకుంటూ అక్కడ కూర్చున్నాం.
మా వారు అతనితో "ఏవీ, మీ టికెట్లు చూపించండి" అని అడిగారు . అతను ససేమిరా అన్నాడు.
దాంతో వాళ్లు ,మేము, ఎడముఖం, పెడముఖంగా కూర్చున్నాము.
టి సి రావడానికి చాలా సమయం పట్టింది.
అతను రాగానే మా వారు ముందు అతనిని పట్టుకుని మా దగ్గరికి తీసుకువచ్చారు .
మా ప్రాబ్లం విన్న టి .సి. చాట్ ని చూశారు .అందులో మా ఇద్దరి పేర్లు నమోదై ఉన్నాయి.
మా సీట్లలో కూర్చున్న వారి టికెట్లను అడిగారతను.
అతను సణుకుతూ విసురుగా టిక్కెట్లు చూపించాడు.
టి.సి , "ఇవి మీ సీట్లు కావండి . రెండు డబ్బాల అవతల మీ కోచ్ ఉంది చూడండి. అక్కడ ఉన్నాయి మీ సీట్లు అంటూ కోచ్ నంబరు చూపించాడు.
దాంతో అతని మొహం ముడుచుకుని, కోపంగా లేచి, కనీసం "సారీ " అయినా చెప్పకుండా, సామాన్లు, బరబర మని లాక్కుంటూ వెళ్ళిపోయాడు.
దాంతో" హమ్మయ్య "అనుకుంటూ ,మేము మా సీట్లలో రిలాక్స్ గా కూర్చున్నాం.
అప్పటిదాకా ముందున్నతనికి వంతపాడినందరుా ,
ఒక్కసారిగా మా పక్షాన మాట్లాడడం మొదలెట్టేరు.
"అబ్బో ..అతను టిక్కెట్టు చుాసుకోకుండా , దాబాయింపుతో, ఎంత చక్కగా వీళ్ల సీట్లను ఆక్రమించాడో..." అని ఒకరంటే..
"ఈ కాలంలో అన్యాయం ఎక్కువైపోయిందండీ...
మాట్లాడే వాడు లేకపోతే పుార్తిగా దోచేస్తారు మనల్ని"
అని మరొకరుా... అంటూ ఒకరొకరిగా మాపై ,సానుభుాతి కురిపించేసారు.
మేము మా సామాన్లను సమంగా సీట్లకింద సర్దుబాటు
చేసుకుని నిశ్ఛింతగా కుార్చున్నాము.
ట్రైన్ లో అందరుా ఆసరికే ఆప్తులైపోయినట్లు .
ఒకరితోనొకరు మాట్లాడీసుకుంటున్నారు.
ఇద్దరిద్దరుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ,
ఒకొక్కరుా వేరు వేరు విషయాలను చర్చిఁచుకుంటుా
ఉండడం వల్ల , ట్రైన్ అంతా గొడవ గొడవగా ఉండీ..
ఎవరేం మాట్లాడుతున్నారో మరొకరికి అర్ధం కాని రీతిలో , మాకు సమయం బాగానే గడిచుపోతోంది
అందులో కొందరు మాతో కుాడా మాటలు కలుపుతుా
రాజకీయాల దగ్గరినుండి , రైతుల ఇక్కట్ల దాకా , పెరిగిపోతున్న ధరలదగ్గరినుండీ నలిగిపోతున్న మధ్యవర్తుల దాకా, గల అన్ని రకాల బాధలనుా చర్చించుకుంటుా, టైం పాస్ చేస్తున్నారు.
ఈ మధ్యలో అలసట తెలీకుండానే రాత్రి ఏడు గంటలు దాటిపోయింది.
చాలా మంది ఇంటినుండి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను విప్పి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటుా
రుచులు ఆస్వాదిస్తున్నారు.
వారితో పాటు మేము కుాడా తెచ్చుకున్న
దిబ్బరొట్టెను కొబ్బరి చట్నీతో లాగించేసాము.
రాత్రి ఎనిమిదిన్నర గంటలయ్యేసరికి , చాలామంది తమతమ సీట్ల లో నిద్రకుపక్రమించేదుకు సిద్ధమవుతుా
తమ తమ సీట్ల లో దుప్పట్లు పరుస్తున్నారు.
కొందరు పై బర్త్ లకు ఎక్కి అసక్కడినుంచీ , కింది బర్త్ వాళ్లతో బాతాకానీలు కొడుతున్నారు.
ఇంతలో ట్రైన్ షోలాపూర్ ష్టేషన్ లో ఆగింది.
కొందరు ఏదో పేద్ద పనిన్నట్లు , ట్రైన్ దిగి
ఆచివరి నుండి , ఈ చివరి వరకు గల అన్ని ష్టాల్స్ నుా
చుట్టబెడుతుా అక్కరలేకపోయినా ఏవేవో కొనేస్తున్నారు.
షోలాపూర్ లో ట్రైన్ ఎక్కిన వాళ్ళు, ,
, గాభరాగా , తమ తమ సీట్లను వెతుక్కుంటూ ,
అందరినీ తోసుకుంటుా, గుద్దుకుంటుా వెళిపోతున్నారు.
ట్రైన్ అంతా గొడవ గొడవగా తయారయింది.
ఈ గొడవలో , ఒక పాతికేళ్ల అబ్బాయి ,అటూ ఇటూ ఈ కోచ్ నుండి ఆ కోచ్ కి, ఆ కోచ్ నుండి ఈ కోచ్ కి, తన సీట్ కోసం వెతుక్కుంటూ తిరగడం నేను గమనించాను.
అతని చేతిలో బరువైన పెట్టె ఉంది .
దానిని ఈ చేతి నుండి ఆ చేతికి , ఆ చేతి నుండి ఈ చేతికి, మార్చుకుంటూ , పాపం ఆకొస నుండి ఈ కొసకి.. ఈ కొసనుండి ఆ కొసకి , తిరుగుతూన్నాడు.
అక్కడ ఎక్కిన వారంతా సద్దుకుని , నిద్రకుపక్రమించేరు. కానీ ఈ అబ్బాయికి మాత్రం
తన సీటు ఎక్కడో తెలియనట్టుంది .చేతిలో బరువుతో ఎప్పటినుంచో అలా తిరుగుతుానే ఉన్నాడు.
నాకు అతని మీద చాలా జాలేసింది.
నేను మా వారితో
" ఏవండీ , ఆ అబ్బాయి చాలాసేపటినుండి అలా తిరుగుతూనే ఉన్నాడు . పాపం .అతనిది ఈ కోచ్ కాదేమొా । అతను ఎక్కడికెళ్తున్నాడో కనుక్కొని
ఆతని సీట్ నంబరేదొ మీరే చుాసి చెప్పండి. అతను కుాడా ముందు , మనసీట్లో కుార్చున్నవారిలా, కన్ఫ్యుాజ్ అవుతున్నట్టున్నాడులా ఉంది. మన అబ్బాయి వయసే ఉంటుంది .
ముందు కాస్తా , ఆ అబ్బాయిని కాసేపు ఇక్కడ కూర్చోనిచ్ఛి, "ఆ తర్వాత వివరాలు అడుగుదాం * అన్నాను.
మా వారు ఏదో అనే లోపునే , ఆ పక్కన కూర్చున్న వాళ్ళు , *అతి కష్టం మీద మీ సీట్లు మీకు దొరికాయి.
" మళ్లీ ఇంకొకరితో. ఎందుకు చెప్పండి , ఇతనెలాంటివాడో..
ఏంటో...
ఈ కాలంలో ఎవరినీ నమ్మకుాడదండీ...జాలి అస్సలు పనికి రాదు. టి సి రానివ్వండి అప్పుడు ఇతని సంగతి, అతనే చూసుకుంటాడు." అన్నాడు .
ఇంతలో మరొకతను.
"వద్దండీ .ఇలాంటి వాళ్ళలో, దొంగలు కూడా ఉంటారు. ఇలా తిరుగుతూనే , మనల్ని ఏమార్చి , మన సామాన్లు పట్టుకెళ్ళిపోతారు . ముందుగా అతనిది, ఏ కోచో ,ఏ సీట్ నెంబరో, అడిగి తెలుసుకోండి . అంతేగాని కొత్త వారెవరికి చోటు ఇవ్వకండి." అంటూ ఒక ఉచిత సలహా పారేశాడు.
అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతనికి వంతు పాడారు.
ఈలోగా ఆ అబ్బాయి కరెక్ట్ గా, మా సీట్ల దగ్గరికే వచ్చి
ఆ పెట్టెను చేతితో పట్టుకొనే ,ఒక పక్కకు ఒదిగి అలసటగా నిలుచున్నాడు.
అంతలో మరొక అతను" చూశారా ! అతను, ఆ పెట్టెను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో ! అందులో ఏముందో ఏమో ? ఆ పెట్టను కనీసం, కిందకు కూడా దించడం లేదు '" అన్నాడు గుసగుసగా.
వెంటనే ఆ పక్కనున్నతను, " అవునవును. ఇలాంటి వాళ్లే రైళ్లలో అందరూ పడుకునేటప్పుడు , మత్తుమందు జల్లి, సామాన్లన్నీ పట్టుకొని పోతారు. ఇలాగే నటించి ముందు కొంచెం జాగా అడుగుతారు. ఆ తర్వాత మనకు నమ్మకం కలిగించేట్టు మాట్లాడతారు . మనం వాళ్ళని, నమ్మేమని తెలిసిన తర్వాత ,మనల్ని పూర్తిగా దోచేస్తారు. ఈ మధ్య ఇది ఒక బిజినెస్ అయిపోయింది.
వీళ్ళ గ్యాంగ్ అంతా చుట్టుపక్కల ఎక్కడో , ఉండే ఉంటుంది.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.". అంటూ చెప్పుకుపోతున్నాడు
అయితే, మాకు మాత్రం అతను చాలా మంచివాడు లాగా కనిపిస్తున్నాడు అతని ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది.
నేను మా వారు వైపు చూశాను . ఆయన వెంటనే ఆ అబ్బాయిని పిలిచి , "ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ పెట్టె పట్టుకుని అలా తిరుగుతుతూనే ఉన్నావు .మీకు టిక్కెట్ లేదా.బాబుా.? "అని అడిగారు.
అతను మరాఠీలో "లేదండి! నా టిక్కెట్టు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు . ఏ కోచో తెలియదు .ఏ సీటో తెలీదు.
మా గురువుగారు నన్ను పూనా వెళ్ళమని ,అక్జడ గురువులకు ఈ పెట్టెను అందించమవి , అన్నారు. ఈ కోచ్ లో ఎక్కి , టికెట్ కలక్టరు వచ్చనపుడు ,నన్ను అతనికి ఫోన్ చేయమన్నారు. నేను టికెట్ కలక్టరుగారి కొిసం వెతుక్కుంటుా ఆటెళ్ళగానే , ఒకతను అతను ఇటువైపు ఉన్నట్లు చెప్పారు. దాంతో నేను మళ్ళీ ఇటు వచ్చాను . అలా తిరుగుతుానే ఉన్నాను గానీ టికెట్ కలక్టరు గారిని కలవలేకపోయాను . అతను ఎక్కడున్నారో ?..ఏమొా...?
చేతిలో పెట్టె , చాలా బరువుగా ఉండడం వల్ల
నాకు, చాలా అలసట ఆనిపించి ఇక్కడ ఆగాను .
అంటుా చెప్పుకొచ్చాడు.
మావారు కుాడా ఆతని వాళకం చుాసి ,
"సరే బాబు. ఇలా రా , టి సి వచ్చేదాకా ఇక్కడ కూర్చో "అని అన్నారు.
అతను వెంటనే మరాఠీలో
" ధన్యవాదాలు దాదా" అంటూ, సీట్లో ఒక పక్కన ఒదిగి కూర్చున్నాడు .
కానీ అతను, ఆ పెట్టెను మాత్రం, కింద పెట్టలేదు.
అది చిన్న బ్రీఫ్ కేస్ సైజ్ లో ఉంది. అతను ఆ పెట్టెను తన ఒడిలో పెట్టుకునే కూర్చున్నాడు.
అక్కడ ఉన్న అందరూ మా వారి వైపు కోపంగానే గాక , , అనుమానం గా కూడా చూశారు.
"ఆపెట్టెలో ఏముందో..?.అది మొాయలేనంత బరువు ఎందుకుందో...? అన్న అనుమానం మాకుా వచ్చింది.
కానీ మా వారు అందరితో టి.సి వచ్చాక ఇతని సంగతి చూద్దాం. అంతదాకా ఓపిక పడదాం " అని నచ్చచెప్పారు.
కొంతసేపట్లో అంతా సర్దుకుని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఈ లోపల మావారు, ఆ మారాఠీ అబ్బాయితో "ఎక్కడికి వెళ్తున్నావు బాబూ, టికెట్ లేకుండా ఎందుకు ట్రైన్ ఎక్కావు ' అని అడిగారు.
వెంటనే ఆ అబ్బాయి "పూనాలో నేను, ఈ దత్త గురు పాదుకలని అందించాలండీ .అక్కడ గురు పౌర్ణమి
సందర్భంగా ,తెల్లారి నాలుగు గంటల సమయంలో నగర సంకీర్తనోత్సవం జరుగుతుంది . ఆ సమయానికి నేను ఈ దత్తగురు పాదుకలని ,అక్కడి గురువు గారికి అందించాలి . . ప్రతీ ఏడాదీ, మా గురువుగారు ,
ఈ శ్రీపాదవల్లభుని పాద పద్మాలను , ఈ ఉత్సవాలకు
పంపిస్తుా ఉంటారు. ఈ వత్సరమే నాకు ఈ సదవకాసం వచ్చింది . నేను వారివద్ద వేదం నేర్చుకుంటున్నాను. వారి ఆజ్ఞ తోనే నేను షోలాపూర్
లో ఈ ట్రైన్ ఎక్కేను. సడన్గా , ప్రోగ్రాం ఫిక్స్ అవడంతో నాకు టికెట్ సమస్య వచ్చింది .
మా గురువుగారు చాలా మంచివారు. టీ.సీ రాగానే, తప్పకుండా నాకు టికెట్ అరేంజ్ చేస్తారు.,"
అని, అతడు చెబుతుండగానే , టి.సి., కొత్తగా సోలాపూర్ లో ఎక్కిన వాళ్ళ టికెట్లు, చెక్ చేసుకుంటూ , అటువైపుగా వచ్చారు.
మరాఠీ అబ్బాయి ఆనందంగా లేచి నిలబడ్డాడు.
********
అతను లేచి టికెట్ కలెక్టర్ తో తన గోడు వెళ్ళబోసుకొని ,
తనకు" పుానా " దాకా సీటు కావాలని అడిగాడు.
టి సి..ఈ ట్రైన్ లో, మరెక్కడా వెయిటింగ్ లిష్ట్ లో
ఖాళీలు లేవనీ , కావాలంటే టిక్కెట్టు తీసుకోమని
చెప్పాడు.
ఆ అబ్బాయి వాళ్ళ గురువుగారికి పదే పదే ఫోన్ చేస్తున్నాడు. కానీ ఫోన్ కనెక్ట్ అవడం లేదు.
డబ్బిస్తే గానీ టికెట్టు ఇవ్వనని టి.సి.అరుస్తున్నాడు .
ఆ అబ్బాయి తన దగ్గర అసలు డబ్బులు లేవని ,
తనకు రాత్రి భోజనానికి కుాడా డబ్బు లేదని ,
ఒక్కసారి గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవుతే , ఆయన తప్పకుండా తనకోసం టిక్కెట్ తీసుకుంటారని," పదేపదే టి.సి.ని బతిమాలుతున్నాడు.
అతని పరిస్థితి చూస్తూ ఉంటే మాకు చాలా బాధ వేసింది.
వెంటనే నేను మా వారితో, ఈరోజు గురుపౌర్ణమి కదండీ. ఆ అబ్బాయి నిజమే చెప్తున్నాడేమొ . నిజంగానే ఆ పెట్టిలో " దత్త గురు పాదుకలు " ఉన్నాయేమో....
మీరు అప్పుడప్పుడు చాలా మందికి ధన దానం చేసిన రోజులున్నాయి కదా...
అలాగే అనుకుని మీరు ఈ అబ్బాయికి టికెట్ తీసి ఇవ్వండి, పాపం , ఇప్పటికే చాలాసేపటి నుంచి అవస్థలు పడుతున్నాడు" అన్నాను.
ఆయన కాసేపు ఆలోచించి , టి.సిని పిలిచి ఆ అబ్బాయి కోసం 2000. పే చేసి ,టికెట్ తీసుకున్నారు.
ఆ అబ్బాయి కృతజ్ఞతతో మా వైపు చూస్తూ . మా గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవ్వగానే ,నేను తప్పకుండా మీరు చేసిన సహాయం గురించి చెబుతాను . ఆయన వెంటనే మీకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు " అంటూ ఆనందంగా టికెట్ తీసుకున్నాడు.
నేను అతను "భోజనం చేయలేదు " అన్నమాట జ్ఞప్తికి వచ్చి, మాతో తెచ్చుకున్న ఫ్రూట్స్ కొన్ని తీసి ఆయన చేతిలో పెట్టాను. ఆయన నా వైపు కృతజ్ఞతగా చూసాడు .
అక్కడున్నవారంతా మమ్మల్ని వెర్రి వాళ్ళమన్నట్టు
చుాస్తుా..మేం చేసిన పనిని విమర్శిస్తుా..
ముసి ముసిగా నవ్వుకుంటున్నారు. కొందరు , ఈ అబ్బాయి వల్ల తమకు ఏమైనా నష్టం జరిగితే ,
దానికి మేమే బాధ్యులమని, తెగేసి చెపుతున్నారు.
మావారు మాత్రం ఎవరికీ సమాధానమీయకుండా ,
సైలెంట్ గా కుార్చున్నారు.
ఇంతలో ఆ అబ్బాయి మాతో , " ఏమండీ . నేను కాసేపు
ఈ పెట్టెను మీ సీటుమీద పెట్టవచ్చా"... అని అడిగాడు.
మేము" సరే" అన్నాము.
ఆ అబ్బాయి ముందుగా ఆ సీటును , ఒకచేత్తోనే నీళ్ళతో శుభ్రంగా తుడిచి ,
జాగర్తగా ఆ పెట్టెను సీటు మీద పెట్టేడు
తర్వాత అందరివైపుా చుాస్తుా...
" ఈ రోజు అతి పవిత్రమైన రోజైన గురు పౌర్ణమి .
నేను , శ్రీపాదవల్లభుని పాద ప్రతిమలను, మాగురువుగారి ఆజ్ఞ మేరకు, పుానాలో గల గురువులకు, అందించబోతున్నాను .
సమయానికి టికెట్ దొరకని కారణంగా , నాకు సహాయం చేసిన అన్నగారితో పాటు , మీ అందరికీ కుాడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీరంతా నాకు చేసిన ఈ సహాయానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. మీరు చేసిన సహాయానికి ప్రతి ఫలంగా ,
మీరంతా "శ్రీపాద వల్లభుని" కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటుా , నేను మీకు "గురుపాదుకా దర్శనం" ఈయబోతున్నాను.
అని అందరికీ నమస్కరించి , ఆ పెట్టె ముాతను
తీయడానికి సిద్ధమయ్యాడు.
అక్కడున్నవారిలో కొంతమంది భక్తిగా చుాస్తుా ఉంటే , మరి కొంత మంది , భయంగా చుాస్తున్నారు. మరి కొంతమంది తాము ఆ అబ్బాయిని అవమానించి , అవహేళన చేసామని తెలిసికూడా, అతను, తమకు ఇంత గౌరవం ఇస్తున్నందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.
మేము కుాడా, అతను ఆ పెట్టి తెరుస్తున్నందుకు ఆత్రంగా చుాస్తున్నాము .
అతను ఆ పెట్టెకు వేసి ఉన్న చిన్న తాళం కప్పను తొలగించి , ఆ పెట్టె ముాతను తెరచాడు.
అంతే ! అందరి కళ్ళుా ఒక్కసారిగా జిగేల్ మన్నాయి. అందరి నోర్లుా , ఆసాంతంగా తెరచుకున్నాయి.
మా కుాపే అంతా మంచి గంధపు సువాసనతో నిండిపోయింది.
ఆ పెట్టెలోపల వెలుగుతున్న చిన్న చిన్న లైట్ల వెలుగులో, చిరునవ్వులు చిందిస్తున్న
శ్రీపాద వల్లభుని చిత్రపటం , పెట్టె మూతగా గల పైభాగంలో ప్రసన్నంగా కనిపిస్తోంది .
పెట్టె క్రింది భాగంలో , బంగారం తొడుగుతో మహిమాన్వితమైన " గురు పాదుకలు " వింత వెలుగులతో ప్రకాశిస్తుా కనిపించాయి.
ఒక్కసారిగా మా ఒళ్ళు ఒక్కసారిగా జలదరించి , భక్తితో .
పులకరించింది.
కళ్ళ నుండీ , ఆనందభాష్పాలు కురియసాగాయి.
ఆవల కిటికీ లోంచీ పుార్ణ చంద్రుని దర్శనం , లోపల గరు పాదుకా దర్శనం తో, మా జన్మ ధన్యమైపోయింది.
అంతదాకా, ఆ అబ్బాయిమీద అనుమానపడిన వారంతా ఒక్క సారిగా లేచి , పాదుకలకు భక్తితో నమస్కరించి , ఆ అబ్బాయిని ఆప్యాయంగా
దగ్గరకు తీసుకుంటున్నారు.
అంతేకాదు , మా వల్లే తమకీ భాగ్యం కలిగిందని
మమ్మల్ని వేనోళ్ళ కొనియాడడం మొదలెట్టేరు.
ఈ అనందకర సమయంలో మేమంతా మునిగి ఉండగానే , ఆ అబ్బాయి ఫోను మొాగింది.
ఆ అబ్బాయి ఫోను చుాసుకొని , "మా గురువుగారు" చేసారంటుా.. ఆనందంగా చెప్తూ,.మాట్లాడడం మొదలెట్టాడు.
తను ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి పడిన కష్టం అంతా చెప్పాడు టికెట్ కలెక్టర్ వచ్చిన సమయంలో తను గురువుగారికి
ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోను తగలక తను ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పాడు.
చివరకు తన మీద నమ్మకంతో ,తనకు టిక్జెట్టు తీసి,. సీటు ఇప్పించినన మా గురించి గొప్పగా చెప్పేడు.
కొంత సేపు మాట్లాడాకా అతను ఫోను మా వారి చేతికిచ్చాడు
"గురువుగారు మీతో మాట్లాడతారట " అంటుా..
మా వారు మొగమాటపడుతుా , ఫోన్ తీసుకున్నారు.
మా వారు ,అవతలి వైపు గురువు గారికి నమస్కారం చెప్పారు. అటు నుండి గురువుగారు కూడా, మా వారికి ప్రతి నమస్కారం చేసి,
అత్యవసర సమయంలో తమ శిష్యునికి సహాయం చేసి నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మేము టిక్కెట్ కొరకు పే చేసిన సొమ్మును , గూగుల్ పే చేస్తానని చెప్పి. ,మా వారి ఫోన్ నెంబరు అడిగి తీసుకుని , మాకు మరొకసారి ధన్యవాదాలు చెప్పి, ఫోన్ కట్ చేశారు
మరుక్షణమే మా రెండు వేల రూపాయలు, ఫోన్ ద్వారా అకౌంట్ లోకి చేరిపోయాయి.
గురు శిష్యుల నిబద్ధత, చిత్తశుద్ధి, చూసిన మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఉన్నందుకు ఆనందం కలిగింది..
ఆ తర్వాత ఆఅబ్బాయి ,తాను ఉంటున్న ప్రదేశం గురించి చెప్పి ,శ్రీపాద వల్లభుల నిజపాదుకలు గల ,ఆ మందిరానికి తమను తప్పకుండా రమ్మని ఆహ్వానించి, తాము వచ్చినప్పుడు అతనికి తెలియజేస్తే , తమకు రూమ్ సదుపాయం, భోజన సదుపాయం ,తప్పకుండా చేస్తానని చెప్పి , తన ఫోన్ నెంబర్ ఇచ్చి, అందరికీ నమస్కరించీ , "గురుపాదుక" లను తీసుకొని , అందరికీ శుభ రాత్రి చెప్పి, ఆ అబ్బాయి ,తనకు నియమించిన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి అందరూ అదే విషయం గురించి ఆనందంగా చర్చించుకుంటూ, మాకు ధన్యవాదాలు తెలుపుతూ , మాట్లాడుకోవడం లో సమయం, అర్థ రాత్రి దాటింది.
ఆ రాత్రి అందరూ, అలా మాట్లాడుకుంటూనే , హాయిగా నిద్రలోకి జారుకున్నారు.
మాకు కూడా, పడుకున్న కాసేపటికి , బాగా నిద్ర పట్టేసింది.
తర్వాత, ,పూనా ఎప్పుడు వచ్చిందో , ఆ అబ్బాయి ఎప్పుడు దిగిపోయాడో కూడా, మాకు తెలియలేదు.
కానీ ఆనాటి అనుభవం , మేము ఎప్పటికీ మర్చిపోలేము.
ఆనాడే కాదు , ఎప్పటికీ కూడా, పౌర్ణమి వచ్చిందంటే ఈ సంఘటన , మాకు బాగా జ్ఞాపకం వస్తుంది.
ఆ అబ్బాయి జ్ఞాపకం వస్తాడు. అతని గురువుగారు జ్ఞాపకం వస్తారు. జరిగిన ఆ సంఘటన తర్వాత మేము శ్రీపాద వల్లభునకు నిజ భక్తులమయ్యాము. అంతే కాదు .మా పూజ మందిరంలో , సద్గురు ,శ్రీపాద వల్లభుల , దివ్య పాదుకులను మేము కూడా ప్రతిష్ట చేసుకున్నాము.
మీరంతా ఎప్పుడైనా మా ఇంటికి తప్పకుండా రండి.
మా ఇంటి పూజా మందిరంలో గల , "శ్రీ పాద వల్లభుల పాదుకా దర్శనము" చేసుకొని , మా ఆతిథ్యం స్వీకరించి,
మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లండి .
" ఓం శ్రీ గురు దత్తాయ నమః "
No comments:
Post a Comment