Tuesday, September 5, 2023

అమ్మ చేతి పసుపు బొమ్మ.

అంశం  : వినాయక చవితి .
శీర్షిక :  అమ్మ చేతి పసుపు బొమ్మ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
-------------------

పార్వతమ్మ జేసే పసుపు బొమ్మొక్కటి
నలుగు పిండితోడ నయముగాను !!
ముద్దులొలుకు బొమ్మ ముచ్చటైనది బొమ్మ
 పచ్చనైన  బొమ్మ, పసుపు నిండిన బొమ్మ !!
 
 అచ్చముగా బాలునివలె  అగుపించె నాబొమ్మ
  అపురూపమైనట్టి అందాల  బొమ్మ  !!
  గుజ్జురూపము నిండు బొజ్జ బాలుని బొమ్మ
  ముజ్జగాలకొజ్జౌనని ఎవరు తలచేరమ్మ !!
  
  ముద్దు బాలుని బోలు  ముచ్చటౌ బొమ్మకు
 శ్వాస పోసి మురిసె  సారసాక్షి !!
 పుత్ర ప్రేమ తోడ. పులకరింపగ మనసు
 పూర్ణ ఆయువిచ్చి పలుకు నిచ్చే !!

తనివి తీరగ తాను తీపి ముద్దుల తోడ
ఆటపాటల దేలె ,నమ్మ బాలుని తోడ!!
 తాన మాడ దలచి, బాలు, నావల నిలిపి
 కాపు కాయు మనెను కలికి మీనాక్షి !!

మూడు కన్నుల వాడు ముంగిటను చేరంగ,
బాలుడడ్డగింప  , భవుడు కోపించె
రగులు క్రోధము తోడ, రక్కెశూలము తోడ
బాలు శిరము ద్రుంచె బలిమి మీర !!

శిరము లేని వాని చిత్ర రూపుని గాంచి
 గౌరి నేలను గూలె , బాధ గాధై దేలె
విషయమంతయు. నెరిగి విషపు కంఠము వాడు
దంతి ముఖమమర్చె,  తరుణి మురిసె !!

వికృత రూపవైన,  విఘ్నహరుడవంచు 
వరములిచ్ఛి బ్రోచె  వరుస నీశ్వరుడు
గుణ నాయకుని జేసి, ఘన పట్టమును గట్ట
మొదటి పూజలంద, ముద్దు బాలుడు మురిసె !!

  గుజ్జురూపము వాడు  గరిక పూజల రేడు
 ఎలుక వాహనమెక్కి జగము లేలెను వాడు
సకల విద్యలకెల్ల ఒజ్జయై వెలిగేటి.
విఘ్నరాజతండువి నాయకుండు !!

భాద్ర పదము నందు భక్తితో కొలవండి
చంద్ర తాపము బాపి , శాప ముక్తులు కండి
బాల గణపతి గొలచి భాగ్యముల నందండి
విఘ్నములను బాసి విశ్వ విజయులు కండి !!


No comments:

Post a Comment