11/04/2023.
"మనోహరి" అంతర్జాల మహిళా మాస పత్రిక కొరకు ,
చిత్రం : అమెరికా అమ్మాయి.
పాట : పాడనా తెలుగుపాట.
శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
------------------------
పాడనా తెలుగుపాట పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట॥
ఒక పాట - పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట
ఒక పాట - పాడనా తెలుగు పాట
వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట
పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥
పై పాటకు సమీక్ష :
శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
-------------.------------
నేను 1976 లో అమెరికా అమ్మాయి అన్న చిత్రాన్ని చుాసాను. అప్పుడు నాకు అప్పుడు పదహారు సంవత్సరాల వయసనుకుంటాను..
అప్పటికే కాలం మారిందంటుా..ఎన్నో పాశ్ఛాత్య పద్ధతులకు అలవాటు పడిన ఎందరో
కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తుా, మన కట్టు బొట్టుల వంటి సాంప్రదాయాలను కాస్త పక్కన పెట్టేరనే చెప్పాలి.
అవంటి సమయంలో ఈ చిత్రం మన సాంప్రదాయాల
విలువలను తెలియపరచే విధంగా ఎ. పి. నాగరాజన్ గారు రాసిన ఈ కధకు , గొల్ల పుాడి మారితీ రావుగారు
మాటలు , సంభాషణలు ( dialogues) రాయగా ,
సంగీతం శ్రీనివాసురావుగారి దర్శకత్వంలో నవత క్రిష్ణంరాజుగారి నిర్మాణంలో విడుదలై చాలా చోట్ల
ఎంతో దిగ్విజయాన్ని సాధించింది .
పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం అంటారు.
ఈ చిత్ర కధా సారాంశం ఏమిటంటే...
అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.
మంచి కధ , కధకు తగిన తారాగణం, మాటలు పాటలు , ఒక దానిని మించిన ఒకటిగా పేరుపొందిన చిత్రమిది.
అందులో "పాడనా తెలుగు పాట.".అన్న పల్లవి ఎత్తుబడే..
"పాటకు ప్లవి ప్రాణం " అన్నది నిజమే అన్నంతగా.
వినగానే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండడం ఒక విశేషం .
తెలుగుకు ,తెలుగుదానికి , సద్ధర్మ -సాంప్రదాయాలకు
విలువనిస్తుా రచయిత రాసిన ఈ కధ మన తెలుగువారిని
ఆలోచింపజేసేదిగా చిత్రానికి అనువైన సంభాషణలతో
అత్యద్భుతంగా తీర్చి దిద్దేరు.
ఒక అమెరికా అమ్మాయి, మన తెలుగు సాంప్రదాయ రీతిలో చీర కట్టుకొని , ముఖాన ముచ్చటైన బొట్టుతో తీరైన బారెడు జడలో పుాలతో తనను తాను -అలంకరించుకొని ,
"వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట."
అంటుా పాడుతుా మన సాంప్రదాయపు విలువలను తెలియపరచడమే గాక , మన వైవాహిక జీవిత విలువలను పెంచే వలువల గురించి, కట్టు బొట్టుల తీరు గురించి తెలియబరుస్తుా...పాడుతుా ఉంటే.
ఆమె , మనం ప్రాధాన్యతనిచ్చే పాశ్ఛాత్య కట్టు బొట్టుల అనుకరణను ప్రశ్నిస్తున్నట్టనిపించింది.
ఇంత మంచి సాహిత్యం ఈ నాటి పాటల్లో చాలా తక్కువే
అని చెప్పవచ్చు.
అంతేకాదు.ఆరవైనాలుగు కళలకు నిలయమైన
మన దేశ ఘనతను మన సాంప్రదాయ సంగీత ,
కళా ,వైభవాన్ని గౌరవిస్తుా..
"త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది "
అంటుా మన భాష తీయదనాన్ని, మన దేశ సంగీత గాన వైభవాన్ని, మన చరిత్ర కారుల ,వ్యక్తిత్వ విశిష్టతలను గుార్చి అమె పాడుతుా చెప్పే విధానం చాలా మందిని తలదించుకునేలా చేసిందనే చెప్పాలి.
"కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో"
అని మన భరత మాత ప్రకృతి శోభలను వర్ణిస్తుానే ,
మన ఆధ్యాత్మిక విశిష్టతలనుా ,భగవదారాధనా తత్వాన్ని తెలియజేయడమేగాక
మన ప్రకృతి అందాలను , కావ్య ప్రబంధాలనుా
వర్ణించే అద్భుత కావ్య భాషగా మన "తెలుగు" భాషను "చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట"అంటుా ,
మన భాషకు విలువనివ్వకుండా పరభాషకు పట్టం కడుతున్న మనకు, మన భాష గొప్పదనాన్ని
విశదీకరించిన తీరు అద్భుతంగా అనిపించింది .
ఆ వయసులో నాకే ఆపాట విన్నాకా మన సంస్కృతి సాంప్రదాయాల గుార్చి పర దేశీయుల నోటంట వినడం
చాలా బాధనిపించి, "మనలను మనమే అవమానించుకుంటున్నామా ..." అనిపించింది
మనల్ని మనం గౌరవించుకోవడమంటే మన దేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలన్న
గొప్ప సందేశాన్నిచ్చిన చిత్రంగా, ఇప్పటికీ ఎందరో మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ చిత్రమన్నా ఈ చిత్రంలో పాఁటలన్నా...నాకు ఇప్పటికీ ఇష్టమే..
ఎవరైనా చుాడని వారుంటే ఈ చిత్రాన్ని ఒక్కసారి
చుాడమని కోరుతుా...
మరోసారి మరో పాటతో....
మీ ...పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :మహారాష్ట్ర .
హామీ :
ఈ సమీక్ష నా స్వీయ రచన.
No comments:
Post a Comment