Sunday, January 26, 2025

లైఫ్ లైన్* - సంగెవేని రవీంద్ర 99871 45310

■ *లైఫ్ లైన్*
                  - సంగెవేని రవీంద్ర
                    99871 45310
రక్తాన్ని అనాయాసంగా విభజిస్తే
రంగు కణాలు కాదు..
కన్నీళ్లు చెమట కనిపించాయి...

అలిసిపోయిన బాపు కళ్ళల్లో
మసిబారిన కలల శకలాలు
కనిపించాయి...

ముడతలు పడ్డ అమ్మ గుండెలో..
మడతలుపడ్డ మమతలు కనిపించాయి..

ఆర్థికాంశాలతో పేగు బంధాలను తెగ్గోసే
తోబుట్టువుల అత్యాశలు
కనిపించాయి..

ఆకల్ని ఆర్పేసుకునేందుకు
దేహాన్ని దహించుకునే పడతి
వడలిపోయిన వక్షోజాల 
క్షీణత కనిపించింది..

కోటి ఊహలతో ఏడడుగుల
అగ్ని సరస్సును దాటివచ్చిన 
ఆలి ఆశల సమాధిలో 
విరిగిన అస్థికల 
నుసి కనిపించింది..

స్నేహాల ముసుగులో
స్వార్థ సాధన లక్ష్యంగా చేసిన
గాయాలు కార్చే అనుబంధాల
వికృతాలు  కనిపించాయి..

రక్తానికేమైంది?
దుర్భేద్య రక్షణ వ్యవస్థలో
సరళ సహజంగా ప్రాణధారలతో ప్రవహించే  రక్తమిప్పుడు
కల్తీ కణాలతో కలుషితమెందుకయింది??
రక్తమా..! నిన్ను నువ్వు రక్షించుకో..!!
'మనిషి' బతుకుతాడు!!
                ***

No comments:

Post a Comment