*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ పండుగే*
తేదీ : *11-03-2025. (మంగళవారం).
అంశం : *కోతి* (గేయం)
శీర్షిక : మానవ జాతికి తరాల తాతిది.
రచన : శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర .
అందని కొమ్మల నూగిసలాడుచు
ఆటల ,వేటల నలరెడు కోతిది
చిలిపి చేతలతో చిందులు వేస్తూ
చెడుగుడులాడే చలాకి కోతిది !!
కొమ్మల నెగురుచు , రెమ్మల తుంపుచు
ప్రకృతి అందము నాస్వాదించుచు
నల్లని కళ్ళతో, నటు నిటు చూచుచు
కిచకిచ నవ్వుల చెలగెడు కోతిది ,!!
తోకను ఊపుచు, తోటి చెలులతో
పండ్లను కొరికి , పట్టి విసరుచూ
పరాచకాలతో పరుగులు పెడుతూ
అల్లరి చేసే చిల్లర కోతిది !!
తెలివికి పెద్దది , చేతల దొడ్డది
పెంకితనానికి పెడసరి బిడ్డది
ఆటల పాటల ఆనందిస్తూ
అలసట నెరుగని అల్లరి కోతిది !!
మనిషిని పోలిన మనసున్న జాతిది.
కిచ కిచ అరుపుల కిలాడి కోతది.
బుద్ధి బలానికి పెట్టని కోటది .
మానవ జాతికి మునుపటి తాతిది. !!
దేవుని రాముని కొలచిన కోతది.
సంద్రము దాటిన సాహస కోతిది
సీతమ్మ జాడను తెలిపిన కోతిది.
లంకను గాల్చిన లడాయి కోతిది !!
వారధి కట్టిన వానర జాతిది.
రావణు చావుకు కారణమైనది
సీతారాముల కలయిక సాక్షిది.
నమ్మిక భక్తిని చాటిన కోతిది. !!
-------------------------
ఈ గేయం నా స్వీయ రచన.