Tuesday, May 20, 2025

పంచమ వేదం

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



No comments:

Post a Comment