Tuesday, March 31, 2020

"కరోనా" పై రవీనా గారి కవిత.

*** చిత్రమైన యుధ్ధమిది ***

చిత్రమైన యుధ్ధమిది
రక్తపుటేరులు పొంగని
నిర్మానుష రణరంగమిది
వికటించిన మానవ మేధకి
ప్రకృతి విసిరిన విషాయుధమిది
నగరం నిశబ్దమవుతూ 
రోడ్లు తాచుపాముల్లా భయపెడుతూ 
రేపన్నది ప్రశ్నగా మిగల్చాలని
కాలం మ్రోగిస్తున్న మరణమృదంగమిది
అయితేనేమీ 
మనం ఎన్ని యుధ్ధాలు చేయలేదు 
ఎన్ని తంత్రాలు కుతంత్రాలు ఛేదించలేదు 
ఎన్ని ఆపత్తులు విపత్తులు ఎదుర్కోలేదు
ఎన్ని సార్లు నువ్వు నేను ఛిద్రమవ్వలేదు
కరోనా అయినా మరేదైనా
సూక్ష్మమైనా స్థూలమైనా 
దాని పుట్టుక తెలుసుకున్నాక
అంతం చేసే మంత్రదండం ఉన్నది మన  దగ్గరే
రాకెట్ కంటే వేగంగా 
దూసుకుపోయే మేధ మన సొత్తే
సహస్రనామాలు వేదఘోషలు 
సుబహ్ కీ అజాలు
ఓంకార నాదాలు
ఆమీన్ అంటూ ప్రార్ధనలు 
గురుగ్రంథ్ సాహీబా గుర్బానీలు
ఇవే కదా ప్రతి గృహంలో ప్రతిద్వనించే ఆంటీ వైరల్ డిస్ ఇంఫెక్టంట్ లు 
యుగయుగాలుగా యాగాలు చేసి 
ఆ నింగిని ఈ నేలనీ 
మధ్యలో వాయువుని ఆంటీ బైయోటిక్ గా మార్చింది మన పుణ్యభూమే 
వేల సంవత్సరాల నాటి ఆయుర్వేదం
చరఖ సంహిత శుశృత వైద్య ప్రిస్క్రిప్షన్లు  మనవే 
ధన్వంతరి వారసులం విరుగుడు త్వరలోనే కనుక్కుంటాం
అందాకా ...
మనల్ని మనం గృహ సీమలో నిర్బంధించుకుందాం 
అంత మాత్రాన 
కాలం ఏమీ ఆగి పోదు 
మనం శూన్యమైపోము
తడి మడి మనకు కొత్త కానే కాదు
నఖాబ్ లు మనకు చిరాకు తెప్పించవు
వాకింగ్ లేదని టాకింగ్ మాని
వంద సూర్య నమస్కారాలు రోజు చేద్దాం 
ఎందుకో ఏవిటో ఎలానో ఎపుడో అన్న నెగటివ్ ప్రశ్నలు మాని
గడిచే క్షణాలని చిరునవ్వుతో స్వాగతించి పాసిటివ్ ఔరాని ఆహ్వానిద్దాం
పొద్దేపోదు అని నిరాశల్లోకీ జారకుండా
ధ్యానం జ్ఞానం మనలో నింపుకుందాం
భవసాగరంలో మునిగి 
మనల్ని మనం ఏనాడో మరిచిపోయాం
ఒక్కసారి మనతో మనం మాట్లాడుకుందాం
జీవిత పుటాలని తిరగేస్తూ 
చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ
మనల్ని మనం కొత్తగా లిఖించుకుందాం 
హృదయపు తెర వెనుక ఏ అహమో మొహమాటమో అడ్డొచ్చి 
ఏ స్నేహాన్నో దూరం చేసుకొని ఉంటాం 
ఇప్పుడు ఆ ఇజాలన్నీ మాఫీ చేసి
ఆత్మీయులని ఆక్టివేట్ చేసుకుందాం
ఏ మూలో నక్కి ఉన్న ఫోటో ఆల్బం తెరిచి
మసిబట్టిన బంధాలని తాజాగా శుభ్రం చేసుకుందాం 
ఎన్నాళ్లయ్యిందో ఇంట్లో అందరితో మనసువిప్పి కబుర్లు చెప్పి
రండి....
కలిసి రెండు ముద్దలు తింటూ ఆప్యాయతలని పంచుకుందాం 
జ్నాపకాల్లో మాత్రమే మిగిలిన
అష్టాచెమ్మా మళ్లీ ఆడుకుందాం
తాతముత్తాతల ఆరోగ్య సూత్రాలు
నియమ నిబంధనలు పాటిస్తూ
కుటుంబాన్ని రక్షించే డిగ్రీ లేని వైద్యుడవుదాం
గొళ్లెంవేసి ఇంటిని కాపాడే సాయుధ పోలీస్ మనమవుదాం 
కరోనా ప్రబలకుండా జాగ్రత్త పడదాం
అదిగో....
ఏ దుష్ట శక్తో మన ఇంటికి ఆవల దాగి ఉన్నది
మానసిక స్వస్థతపై దాడీ చేయాలని పొంచి ఉన్నది
బస్తీలో గస్తీలు మాని
ఉమ్మడిగా ఒకరికొకరు ధైర్యం చెబుతూ
సంయమనం పాటిద్దాం  
అమావాస్య చీకట్లు తప్పక తొలుగుతాయి
పున్నమి వెన్నెల ఇంకో ఆమడ దూరంలోనే ఉంది
కలిసికట్టుగా ఈ యుధ్ధాన్ని యోధులమై ఎదుర్కుందాం 
మశూచినే మట్టుబెటిన ఘనులం
వికారిలో వికటించిన కరోనాని
శార్వరిలో శ్వాస ఆడకుండా చేద్దాం
చేయి చేయి కలపకుండా 
ఒక్కమాటపై నిలబడి
ఈ ఆపత్తుని దాటేద్దాం
 
...@రవీణ చవాన్

Monday, March 30, 2020

ఐనంపుాడి శ్రీలక్ష్మి గారి కవిత. (KCR గారు మెచ్చినది).

కరోనా కి ఓ రిటర్న్ గిఫ్ట్ !
     - అయినంపూడి శ్రీలక్ష్మి
       99899 28562
-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

ఏమైందిప్పుడు
క్షణాలు మాత్రమే కల్లోలితం
ఆత్మస్థైర్యాలు కాదు కదా
సమూహాలు మాత్రమే సంక్షోభితం
సాయం చేసే గుండెలు కాదు కదా !

ఎన్ని చూడలేదు మనం
కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు
కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు
ప్లేగుని జయించిన దరహాసంతోనే కదా
చార్మినార్ ని నిర్మించుకున్నాం !

గతమెప్పుడూ విజయాల్నే గుర్తు చేస్తుంది
వర్తమానమెప్పుడూ సవాళ్ళనే చూపిస్తుంది
భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది
కుంగుబాటు తాత్కాలికమే
యుద్ధభూమిలోకి దిగాక
వెనక్కు తిరగటం, వెన్ను చూపటం మనకు తెలియదు
యుద్ధం ఏ రూపంలో వస్తేనేం
మిస్సైల్ అయినా - వైరస్ అయినా
పెద్ద తేడా ఏం వుంటుంది కనుక !

నీకు బాగా తెలుసు-
జీవనవాంఛాజనితం మన దేహం
ఎన్ని మార్లు యుద్ధ ప్రసవాలు చూడలేదు
ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు !
కరోనా పాజిటివ్ అయితే ఏంటట
పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక
సామాజిక దూరం మన అస్త్రమయ్యాక
జనతా కర్ఫ్యూ మన కవచమయ్యాక
ఇప్పుడిక క్వారెంటైనే మన వాలెంటైన్ !

 
ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా ?
క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు
దొంగతనంగా ప్రవేశించిన కరోనాకి కరుణ తెలియదు
క్యా కరోగే అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు
లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు
నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో
పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం
మన కలాల్ని కరవాలాలుగా మార్చి కవి సిపాయిలుగా మారదాం
నిరస్త్రగా-క్షతగాత్రులుగా మిగలకుండా
రథ, గజ, తురగ పరివారాలతో పనిలేకుండా
ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా ప్రతియుద్ధం ప్రకటిద్దాం
దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది - ఆత్మస్థైర్యంతో ఎదిరిద్దాం
కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం
ఎన్నో యుద్ధాలను చూసాం - కానీ ఇది ఎంతో ప్రత్యేకం
గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు
విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక పోరాటం చేయాలి
ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి సైనికుడు కదా
ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల రక్షణ వలయం అల్లుదాం రండి
కబళించాలని చూసే కరోనాని మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం
విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి ఐసోలేషన్ వ్యూహంతో
నమస్తే మంత్రంతో రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రండి !

-- 
With Best Regards

శ్రీలక్ష్మి ఐనంపూడి
Cell: 99899 28562
Website:www.inampudishreelaxmi.com
E-mail: shreelaxmi.inampudi@gmail.com

Sunday, March 29, 2020

కరోనా పై జి.కళావతిగారి కవిత

పాలకులకైనా.....పాలితులకైనా.....
*******************************

గొడ్డు మాంసం కొన్నాడని అఖ్లావ్ ను
గొడ్డును చంపినట్టు చంపినపుడు
ఇంత బాధ లేదు.....!
సంచారజాతి ప్రజల్ని ఊరినుండి వెళ్ళగొట్టడానికి
ఆ జాతి పసిమొగ్గ ఆశల కన్నులైనా ఇంకా విచ్చుకోని
కాశ్మీరీ కుంకుమపూరెమ్మ ఎనిమిదేళ్ల అసిఫాను
గుడిలో బంధించి వారం రోజులు అత్యాచారం చేసి చంపినపుడూ
ఇంత భయం లేదు.....!!

నక్సలైట్లనే నెపం మీద
మనుషుల్ని బూటకపు ఎన్ కౌంటర్ లలో కాల్చి పడేసినపుడు
ఇంత స్పందన లేదు.....!
దేశద్రోహులంటూ సాయిబాబా వరవరరావు మొదలు మేధావుల్ని
గృహనిర్బంధంలో జైలు నిర్బంధంలో శిలువేసినపుడూ
ఇంత సమాలోచన లేదు.....!!

ఢిల్లీలో పంజాబ్ లో విప్లవబావుటాలై గొంతెత్తిన విద్యార్థులను
రాజ్యహంకారం రంకెవేసి కాళ్లు చేతులు తలలు విరగ్గొట్టి పారేసినపుడు
ఇంత ఆందోళన లేదు.....!
షాహిన్ బాగ్ ఉద్యమంలో నక్షత్రాలై నిలిచిన మహిళలను
మగపోలీసులు పొట్టుపొట్టుగా కొట్టినపుడూ ఇంత ఆలోచన లేదు.....!!

ఒకనాడు కారంచేడులో దళితుల్ని సామూహికంగా హత్య చేసినప్పుడు
మరోనాడు గుజరాత్ లో దళిత మహిళపై
బహిరంగంగా అత్యాచారం చేసినప్పుడు
ఇంత వణుకు లేదు.....!
ఈశాన్య రాష్ట్రాలలో మోహరించబడిన కేంద్ర పోలీస్ ఫోర్స్ దాష్టీకాలను
ఇరోం షర్మిల లాంటివాళ్లు దశాబ్దాల పాటు ప్రశ్నించినపుడూ 
ఇంత అలర్ట్ లేదు.....!!

దక్షిణాఫ్రికాలో సిరియాలో లక్షలాదిమంది పసికందులు
ఆకలి చావులు చస్తున్నప్పుడు
ఇంత ఆర్ద్రత లేదు.....!
పేదవాళ్లు ఉట్టికి స్వర్గానికి అందలేక వగచుతున్నప్పుడు
తరాలకు తరాలు పీడనలో మ్రగ్గుతున్నప్పుడు
ఆధిపత్యాలు అణచివేతలు వికృత రూపాలు దాల్చుతున్న ప్పుడూ
ఇంత ఆవేదన లేదు.....!!

కార్పొరేట్ కుట్రలు కోట్లాది రూపాయల్ని దోచి దోచి
కోట్లాదిమంది ప్రజల్ని పేదవాళ్లను చేస్తున్నప్పుడు
ఇంత అలజడి లేదు.....!
అవినీతి రాజకీయం ఓటుకు పదివేలు పంచి
అధికారం మరిగి అరాచకం చేస్తున్నప్పుడూ
ఇంత ఆదుర్దా లేదు.....!!

ఎన్ ఆర్ సి మరియు సిఎఎ లతో రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని విస్మరించి
నేతలు మతప్రాతిపదికన దేశ ప్రజల్ని విభజించపూనినపుడు
ఇంత కలవరం లేదు.....!
శ్రమ పొలంలో తమ రెక్కలు ముక్కలు చేసుకుని
దేశానికి అన్నం పెట్టిన రైతులు
తమ బిడ్డలకు అన్నం పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ
ఇంత కనికరం లేదు.....!!

మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారని
నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీలంకేశ్ ల
ఊపిరి తీసినపుడు
ఇంత ఉలుకు లేదు.....!
ఆర్టికల్ 370 రద్దుతో గత 237 రోజులుగా
కాశ్మీర్ ఊపిరిని జైలులో నిర్బంధించి ఉంచినా
ఇంత ఉద్వేగం లేదు.....!!

ఇప్పుడు కరోనా వచ్చింది.....!
మనిషి నుండి మనిషికి శరవేగంగా ప్రాకుతుంది.....
రోజుల్లో ప్రాణాల్ని  హరిస్తుంది.....
సామూహికంగా మనుషుల్ని బలిగొంటుంది.....
అంటేనే అందరి ప్రాణం ఝల్లుమంటుంది.....
చావు మనదాకా వస్తోందంటే హృదయం గుర్తొస్తోందొక్కొక్కరికీ.....!!

ఇప్పుడు మానవతా రాగాలు.....
దూర సుదూర మమతా గానాలు.....
అందరూ బాగుండాలనే ఆకాంక్షలు.....
ప్రేమ ఆప్యాయత అన్నీ ఉపరితలం మీదికొచ్చాయి.....!
కాలుష్యం స్ఫురణకొస్తోంది.....
దేవుడికి కాదు సైన్సుకు దండం పెట్టాలని స్మరణకొస్తోంది.....!!

ఇప్పుడు ప్రతి మనిషి తనచుట్టూ తాను కంచె నాటుకున్నా సరే.....
తల్లీబిడ్డలు తాకుకోకున్నా సరే.....
ఎవరి చావుకెవరూ హాజరు కాకున్నా సరే.....
కన్నీటిని కర్తవ్యంగా మ్రింగుకున్నా సరే.....
ప్రాణం మిగిలితే చాలు అనిపిస్తోంది.....!
బ్రతుకంటే ఎంత తీపి... ఉంటే ఉండనీ... తప్పు లేదు.....
కానీ...అమానవీయత అసమానతలే అసలు వ్యాధులని
కనీసం కరోనా భయం పోయాకైనా గుర్తుకొచ్చేనా మరి.....??!!

ఫ్రెంచి విప్లవం చెప్పినా.....
రాబోయే నూతన విప్లవాలు చెప్పినా.....
ప్రకృతి చెప్పినా.....సైన్స్ చెప్పినా.....
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ప్రపంచ విలువలని.....
ప్రైవేటు ఆస్తికి కళ్ళెమే అత్యాశల విరుగుడని.....
గుడిసె పెరిగి మల్టీప్లెక్స్ తరగడమే మార్గమని.....
మనిషిని మనిషి ప్రేమించడమే అంతిమమని.....
తెలిసి వచ్చేనా... ఈ కరోనాతోనైనా...ఇకనైనా.....?????!!!!!
                        - జి.కళావతి,
                        28-03-2020.

Saturday, March 28, 2020

తెలుగు సామెతలతో కవిత.

ఊరికే పుట్టలేదు మన తెలుగు సామెతలు :---

1. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు
    చైనా చేసిన పాడుపనికి కరోనా పుట్టింది !
2. తను తీసుకున్న గోతిలో తానే పడింది !
3. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని !
4.  ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ,
     తుమ్ముకు తమ్ముడు లేడనుకుంది ఇటలీ !
     చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది !
5. మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు
    ఇటలీ కంటుకుంది కరోనా !
 6.ఇంతింతై, వటుడింతై అన్నట్లు విజృంభించింది కరోనా!
 7. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం?
 8.తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం!
 9. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అన్ని దేశాలకు పాకింది కరోనా!
10.తగువెలా వస్తుందిరా జంగమ దేవరా అంటే 
      బిచ్చం పెట్టవే బొచ్చు మొహం దానా అన్నట్టు
      అమెరికా చైనాను నిందించడం మొదలు పెట్టింది !
11. పైగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా అని
      ఆలోచనలో పడింది!
12. అ, ఆ లు రావుగానీ, అగ్ర తాంబూలం నాకే అన్నట్లు 
       వ్యాక్సిన్ కూడా కనిపెట్టానంటోంది అమెరికా !
13. ఈలోగా కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు
       విదేశాలనుండి కొందరొచ్చి కరోనా అంటించారు !
14. అగ్నికి, వాయువు తోడైనట్లు A నుండి B కి,
       B నుండి C కి అది పాకింది !
15.  చాపకింద నీరులా పాకడం మొదలైంది !  
        దాంతో అదిరి పడ్డాయి ప్రభుత్వాలు !
16. కీడెంచి మేలంచాలనుకుని  LOCK DOWN ప్రకటించాయి !
17.వాన రాకడ! ప్రాణం పోకడ ఎవరి కెఱుక మరి !
18. ప్రజలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయి పోయారు !
19. బతికుంటే బలుసాకు తినొచ్చని కొందరూ
20. ఊపిరుంటే ఉప్పమ్ము కోవచ్చని కొందరూ
       ఇంట్లోనే ఉన్నారు !
21. అన్నీ తెలిసినమ్మ అమాస నాడు ఛస్తే
       ఏమీ తెలీనమ్మ ఏకాశి నాడు చచ్చినట్లు
       ప్రమాదం అని తెల్సి కూడా కొందరూ
22.దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇంకొందరూ
      బైట తిరుగుతున్నారు!
23.కొరివితో తల గోక్కోకండిరా అని పోలీసోళ్లు
     మొదటి రోజు సుద్దులూ, బుద్ధులూ చెప్పారు! 
      ఐనా వినలేదు !
24.అడ్డాలనాడు బిడ్డలు గానీ, గడ్డాల నాడు కాదు కదా!
25.దండం దశ గుణం భవేత్ అనుకున్నారు పోలీసులు !
26.వడ్డించే వాడు మనోడైతే అన్నట్టు వడ్డించడం మొదలెట్టారు !
27.పట్టి పంగానామాలు పెడితే 
     గోడ చాటుకెళ్లి చెరిపేసుకున్నట్లు
     తిరుగుతునే ఉన్నారు కొందరు !
28.పొర్లించి, పొర్లించి కొట్టినా
      మీసాలకు మన్నంట లేదన్నట్టు
     తిరుగుతూనే ఉన్నారు ఇంకొందరు !
29. అందుకే అన్నారు కుక్కతోక వంకర అని !
30.ఇకపోతే కూరగాయల ధరలు 
      అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు
      ఆకాశాన్ని అంటుతున్నాయి !
31. మోసేవాడికి తెల్సు కావడి బరువు అన్నట్లుంది
       డాక్టర్లు, పోలీసులు,పారిశుధ్య కార్మికుల పని !
32. అడిగే వాడికి చెప్పేవాడు లోకువన్నట్లు
      కరోనా ఎప్పుడు తగ్గుతుంది?
       వ్యాక్సిన్  కనిపెట్ట డానికి ఎన్ని రోజులు
       పడుతుందని అడుగుతారు జర్నలిస్టులు!
33.అనుభవజ్ఞులందరూ మాకు మాత్రం ఏం తెలుసు
      ఐతే ఆదివారం, కాకుంటే సోమవారం అంటున్నారు !
34.కొండల్లే వచ్చిన ఆపద మంచల్లే కరుగు తుందన్నట్లు
     దేనికైనా TIME రావాలి కదా !
35 ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మరి !
36. అందుకే ప్రజలందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా
      LOCK DOWN పాటించి ఇంట్లోనే సంతోషంగా ఉండండి !
36. సంతోషమే సగం బలం మరి !
37. ఇప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి
      శుచి, శుభ్రత పాటిస్తూ, ఆహారపు అలవాట్లు
       ఆచార, వ్యవహారాలు మార్చుకోండి !
38.ఉందిలే మంచి కాలం ముందు ముందునా
       అని అందరూ ఎదురు చూడండి !
39. సర్వే జనా! సుఖినోభవంతు !









    అందుకే అంటారు చెడపకురా చెడేవు అని!

కరోనా" అంటే ఏమిటి ?

కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది?  ఎలా నివారించ వచ్చు? 
    కరోనా అనునది  ప్రాణము లేని వొక ప్రోటీన్ పదార్థపు కణము, దీని పైన క్రొవ్వు పదార్థము వొక పొరలా యేర్పడి వొక పౌడరు లా  వుంటుంది. ఇతర వాటిలా కాక యీ  కణము కొంత బరువు కలిగి వుండటం తో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది.
    పట్టు పురుగుకు వచ్చే 'ఫిబ్రిన్' వ్యాధికి దీనికీ  కొన్ని పోలికలున్నాయి. ఫిబ్రిన్ వ్యాధి కూడా పట్టు పురుగు నోటి ద్వారానే పురుగు శరీరము లోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే పట్టుపురుగు మల్బరీ ఆకును తిని దాని రసమును తన శరీరం లోని ద్రవము తో  సమ్మిళిత మవుతుందో, మరుక్షణం, ఆ మిశ్రమ ద్రవం తో యీ 'ఫిబ్రిన్,  కణము వొక గంటలో కొన్ని లక్షల కణములుగా విభజింప బడి, వొక రోజులో పట్టుపురుగు యే దశ లో వున్నా, శరీరం పూర్తిగా ఆక్రమించి పురుగును చంపేస్తుంది. ఒక పురుగులో చేరిన మరు గంటలో ఆ పురుగు విసర్జించే మల మూత్రముల ద్వారా బయటకు వచ్చి, ఆకుల పై పడి వేరొక పురుగు నోటి ద్వారా ఆ పురువుకు సంక్ర మిస్తుంది. ఇలా వొక రోజు లోనే కొన్ని వేల పురుగులను సంహరిస్తుంది. 
    నేడు కరోనా యెలా చైనా, ఇటలీ దేశాలకు మరణ మృదంగ మైనదో, అలాగే 150 సంవత్సరాల క్రితం ఇటలీ ఫ్రాన్స్ దేశాల పట్టు పరిశ్రమను కుప్ప కూల్చింది. ఇప్పటికీ దీనికి మందు కనుగొనబడ లేదు. 1890 సంవత్సర ప్రాంతంలో 'లూయీ పాశ్చర్' కనుగొన్న పట్టు పురుగు ను చంపి పరిశోధనా కేంద్రాలలో దాని శరీర ద్రవ పరీక్ష విధానమే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా  వాడుకలో వుంది 
    ఇప్పటికీ కూడా ఏవొక్క పురుగులో యీ వ్యాధి కనపడినా, ఆ ప్రాంతం సుమారు 2-3 చ కిలో మీటర్లు యుద్ధ ప్రాతిపదికన మొత్తం పురుగులను కాల్చివేసి,  ఫార్మోలిన్ ద్రావణం తో వూరూరు శుద్ధి చేస్తారు. అంతేకాదు, ఆ ప్రాంతములో సుమారు 4 నెలల కాలం పట్టు పురుగుల పెంపకం నిషేధిస్తారు. కారణం యీ వ్యాధి కణం సుమారు 13 వారాల పాటు ఎటువంటి ఆహరం లేకుండా సజీవంగా వుండ గలదు.
    నేడు కరోనా కూడా అంతే. ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయం లో నిర్జీవ అండం యెలా  14 రోజులు వుండి, వీర్య కణం తో జీవకణం గా మారి, కణ విభజన మొదలవుతుందో,  యీ కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణం గానే వుండి, యీ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరం లోని "చీమిడి" తో సంపర్కమవుతుందో  మవుతుందో, దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షల లో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, వూపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
   రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా,  కఫము ద్వారా, యీ రోగ కణాలు ఎచ్చటంటే  అచ్చట పడతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే,  ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి  నిర్వీర్యమై పోతుంది.
   ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం వొక కారణం.
    ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించిన చో అవి మనకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మనం మన చేతుల తోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు,  వ్రేళ్ళకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును,  నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. 
    ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, యిక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి  కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది. 
   దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా,  దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు. 
     అదియేలా? 

    దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.  
    సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. 
    మన శరీరాన్ని,  తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడం తో  మన శరీర భాగాలను అంటుకున్న యీ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై యీ రోగ కణాలు మరలా పడ్డా,   అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మరు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
    వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు  అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో వొక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను, మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే,  యీ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ యెట్టి పరిస్థితులలో కానీ యీ కణం మన ముఖానికి చేర కూడదు. కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ  సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం. 
    ఇదే వైదులు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న వుద్దేశాలు.
   దీనిని మీవారికందరికి తెలిపి యీ వ్యాధినుండీ జాగ్రత్త పరచండి. వ్యాధిని మీవంతు గా నిర్ములించండి.
  డా| పత్తికొండ సురేంద్ర రావు