Tuesday, July 27, 2010

nervaalaniunaadi

నేర్వాలని ఉన్నది .
-------------------
ఎగసిపడే కెరటాలను చూడాలని ఉన్నది
అది చూచి ఏదేదో నేర్వాలని ఉన్నది ,
అలల కళల తేలే ఓ అందమైన భావమా
అంతులేని తీరాలకు సాగిపోవు సాగరమా ౧
హోరులెత్తు వేగముతో కెరటాలను లేపావు
అంతలోనే తీరముదరి నురగాలుగా మార్చేవు
ఆవేశం పొంగు నణచి అణగి ఉండ మన్నావు
ఆలోచనతో కూడిన దారి వెళ్ల మన్నావు !
అలల వెనుక పారు నీటి నిశ్చలతను చూపావు
దాని వెనుక సుడిగుండా లెన్నో దాచి ఉంచేవు
ఒడి దుడుకులు ఎన్ని ఉన్న ఓర్చుకోమన్నావు
జీవితమే ఆటు పోట్ల అలజడి బడి అన్నావు !
నిశ్చలమౌ నీరములో నిదులెన్నో దాచేవు
నాచు పట్టినట్టి నిధుల కోట్ల విలువ తెలిపావు
మౌన వేదనే మనిషిని మార్చు మధువు అన్నావు
అనుభవాల ఓర్పు నిధులే పెన్నిధి, వర మన్నావు !
మూగ జీవులకు నెలవై ,జీవితాన్ని పంచేవు
సాటివారి సాయపడే గుణము మంచిదన్నావు
జీవితాల ఒరవడిలో కళల దేలమన్నావు
ఉన్న మంచి పదిమందికి పంచిపెట్టమన్నావు !!

రచన పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

tolivalapu

తొలి వలపు .
___________

చిరు నవ్వుల వన్నెల సిరి సీతను చూచీ
సిరి వెన్నెల సిగ్గు పడెను కాంతులు బాసి
తరగని వన్నెలు కోమలి ముఖమున గాంచీ
నెలరాజే నీరసపడే కళలను బాసి !
చారెడు కాటుక కన్నుల సొగసులు చూసి
ముకుళించెను కలువ భామ ,మూతిని ముడిచి
విలుబోలిన కనుబొమ్మల విరుపును చూచి - శరము
కనుపాపల చిక్కు పడెను వింటిని బాసి !
ఎరుపెక్కిన పెదవులు రస మధురిమ లిడగ - ముద్ద
మందారములూసులాపే మనసు మూగగ - కలికి
పలువరుసల మెరపులు చిరు కాంతులీనగా- దాగె
ముత్యపు సరులన్ని సాగరాన చాటుగ !
వాలు జడల కురుల సఖులు నాట్యము లిడగ - తాచు
పాములు కుబుసములు విప్పే జతను చేరగ - చెదరు
ముంగురులే భ్రమరములని భ్రమసి ప్రేమగ- కమల
ముఖ కన్నియ కళలు విడెను మధువు పంచగ !
బంగరు వన్నెల కోమలి సొగసులు చూచి
పచ్చాని చేమంతి ఒదిగే రేకులు ముడిచి - ఇంతి
కుకాముల కుంభముల జారు పైటను చూచి
సిగ్గు పడెను శిఖరములే బిగువులు బాసి !
పొలది మేని కులుకులు పలు కళల తేలగ - మింట
హరివిల్లులె హొయలు వీడె గుండె బరువుగ
ఊయలలా ఊగు నడుము జిలుగులు చూచి - దాగి
సంభ్రమాన చూచె లతలు గుసగుసలాపి !
మల్లెలు, జాజులు మేలిమి ముసుగులు వేసే - ముద్దు
ముచ్చటలిడు మృదు పదముల జాడలు చూచి - కలికి
నడకల నిడు నవ రసముల భంగిమ చూచి - నెమలి
కన్నియలె నివ్వెరపడే నాట్యము మరచి !
అంతలో ........
అందానికి బంధము పడె ,అడుగు తడబడె - అదురు
బెదురు కనుల చూడ్కుల అలివేణి నిలబడె- చెదరు
సౌందర్యపు రాశి కనులు సిగ్గు లోలికెగా - నవ
మన్మధ సుందరుని రామ చంద్రుని కనగ !
తోలి వలపుల చూపుల తూపులను నిలుపగ - పూల
శరములు విడే మన్మదుడదే మంచి క్షణముగ - సీతా -
రాముల కళ్యాణ మిలను కనులు పండగ - ప్రక్రుతి
పడతి సఖులు సహజ రీతి కళలు నిండేగ !!
రచన - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

snaeham


స్నేహం .(కవిత )

స్నేహమా ! అనురాగమా !
జ్ఞాపకాల తరంగాల మనోభావమా ౧
మరపురాని వసంతాల
మధుర గానమా .......
కలిమిలోన కల రెందరో
మనిషి రీతి మారదు
కలత చెందు సమయములో
స్నేహమొకటే వీడదు
రంగు రూపు ,రూకల నిధి
కోరమన్న కోరదు
మంచి మాట ,మనసు చాలు
బెరమసలు చేయదు !

మరచిపోకు ,మరలిరాదు
మరపురాని స్మృతి పథం
ఎదుట నున్న దెండమావి
భ్రమ నీకది కాదు గమ్యం
తీపి చెంత చేరును చిరు
చీమ దండు నిరంతరం
వగచి నంత గతము రాదు
నీవు తలచిన క్షణ0 .

రచన -- జగదీశ్వరీ మూర్తి .

vamdanaalu


వేయి పున్నాల వెలుగుతో మా యింట కొలువై నిలచిన ,పూజ్యులు ,వందనీయులు ఐన మా అత్తగారు " శ్రీ పుల్లాభట్ల ఈశ్వరమ్మ " గారి ఎనభైరెండవ జన్మదినోత్సవ సందర్భంగా వారి ఆశీర్వాదాభిమానాలని కోరుతూ కోడలు '' జగదీశ్వరీమూర్తి '' సమర్పిస్తున్న ' 'జన్మదిన శుభాకాంక్షల '' పారితోషిక కవితా కుసుమాంజలులు .

వేయిపున్నముల వెలుగు కనుల నిండగ
నేటి కిక నిండెను ఎనుబది రెండేండ్లు నిండుగ-- మేలు
పలుక ఇలకు ఏతె0 ఛిరి జేలు వేలుగా -- ఇంక
మా ఇంటను జరిగె సంతసాల పండగ !!

కొట్రా వారి కంటివెలుగు కొలువుదీరెగా --పుల్లా -
భట్ల రాయ " లింగమూర్తి '" ధర్మపత్నిగ --పుట్టి
నింటి వారి పేరు నిలుప శాంత మూర్తిగ -- మెట్టి
నింటి వారి మనసు దోచే ప్రేమ మూర్తిగ !!

నవరత్నాలింట పండె వేల్పు వరముగ -- భవ
బంధములే చుట్టు ముట్టె తీపి కలలుగ-- పుత్ర-
పౌత్రాదుల కాశిశులిడ పెద్ద తానుగ -- మిత్ర -
భావముతో పుత్రికలకు నిలిచె తోడుగ !!

ఏనాటికి వీడనిసిరి దైవ భక్తిగ -- ఇంట
కొలువుదీర్చి , కొలువుల కోవియాడే తపముగ --
విలువైన నుతులు ,కీర్తనలే నిత్య పూజగ --వేల
భజనల ,రాగాల విందు నైవేద్యముగ !!

కానరాని మురళి కధల కబురు లందగ -- వేణు
గోపాలుడే నడచి వచ్చె నీశ్వరి దెసగా -- స్తుతి
రత్నమాల రాసులబడి వెదకె బెదురుగ --
రాగాలు పలుకు వేణువు ఉనికదని తోచగ !!

ఆ సోముడు ఆమె కళల నమరెను దివిలో
శ్రీరాముడు వెదకె బంటు నీశ్వరి హృదిలో
వాణి బాసె పలుకులామె నాలుక పొదలో - అలి
వేణి అంబ నిలిచెను నవరత్న కీర్తిలో !!

యతి,ప్రాసలు గంతులేసే కందపు కృతిలో-- పూలు
రాగాలై కురిసేనామె గీత వనములో -- సం
గీత నిధిని వేదకిరి గంధర్వులు భువిలో -- కవులు
కళలు బాసి కేలు మోడ్చి నిలచిరి ఇలలో !!

కమ్మని కల నిజమాయెను కరుణ మీరగ -- అమ్మ
దీవెనలే ఫలియించెను నాదు వరముగ -- రామ
చంద్రుని పోలేటి పతికి ధర్మ పత్నిగ -- వాని
కన్న తల్లి ఈశ్వరమ్మ దీవెనలిడగా !!

సంగీతము, సాహిత్యము లిట వెలుగమ్మ
పడునారౌ కళలు ఇంటి నిలయమమ్మ -- అమ్మ
లాంటి మమత ,నిండు ప్రేమ పంచెడి కొమ్మ -- ఆమె
ఎవరో కాదు ,మా అత్తయ్య "ఈశ్వరమ్మ ".

రచన , పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .