Tuesday, July 27, 2010

nervaalaniunaadi

నేర్వాలని ఉన్నది .
-------------------
ఎగసిపడే కెరటాలను చూడాలని ఉన్నది
అది చూచి ఏదేదో నేర్వాలని ఉన్నది ,
అలల కళల తేలే ఓ అందమైన భావమా
అంతులేని తీరాలకు సాగిపోవు సాగరమా ౧
హోరులెత్తు వేగముతో కెరటాలను లేపావు
అంతలోనే తీరముదరి నురగాలుగా మార్చేవు
ఆవేశం పొంగు నణచి అణగి ఉండ మన్నావు
ఆలోచనతో కూడిన దారి వెళ్ల మన్నావు !
అలల వెనుక పారు నీటి నిశ్చలతను చూపావు
దాని వెనుక సుడిగుండా లెన్నో దాచి ఉంచేవు
ఒడి దుడుకులు ఎన్ని ఉన్న ఓర్చుకోమన్నావు
జీవితమే ఆటు పోట్ల అలజడి బడి అన్నావు !
నిశ్చలమౌ నీరములో నిదులెన్నో దాచేవు
నాచు పట్టినట్టి నిధుల కోట్ల విలువ తెలిపావు
మౌన వేదనే మనిషిని మార్చు మధువు అన్నావు
అనుభవాల ఓర్పు నిధులే పెన్నిధి, వర మన్నావు !
మూగ జీవులకు నెలవై ,జీవితాన్ని పంచేవు
సాటివారి సాయపడే గుణము మంచిదన్నావు
జీవితాల ఒరవడిలో కళల దేలమన్నావు
ఉన్న మంచి పదిమందికి పంచిపెట్టమన్నావు !!

రచన పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

No comments:

Post a Comment