Tuesday, September 24, 2013

షేక్ హేండ్...కవిత.

కరచాలనం 
 పలక  బలపము బట్టి ఓ,న,మ: లను దిద్ది 
వలయు విద్యల దీర్చి దిద్దు చేయి 
గురువు ,పెద్దల పదము లంటి  దండములెట్టి 
చనవు నాశీర్వచన మిచ్చుచేయి
కార్యభారము లెల్ల నింపుగా సవరించి 
సవ్య స్నేహపుపాలు పంచు చేయి 
కావ్య రచనలు చేసి కీర్తి బడసిన చేయి 
దివ్య జ్యోతుల నింట వెలిగించు చేయి 
అతిధి సత్కారముల నందేవేసిన చేయి
ఆదరించి  అన్నమెట్టు  చేయి 
అడిగి నంతనె లేదు లేదన్న మాటొదిలి 
కలిగినంతయె దాన మోసగేటి చేయి 
గుడిలోన జేగంట మ్రోగించి వేల్పులను 
మనసార ధ్యాన్నించి  మ్రొక్కు చేయి 
దడిలోన పూలన్నీ దెచ్చి మాలలు గుచ్చి 
తగు భక్తి  గురు సాయి సేవించు చేయి 
ఇష్ఠ్ఠాల విందులను ఇచ్చి మురిసెడు చేయి 
కష్ఠ్ఠాల కన్నీరు తుడుచు చేయి 
నష్ఠ్ఠాల నగుబాట్ల తట్టి  ధైర్యము నిచ్చి  
శ్రేయమౌ శుభములను  ఒనరించు చేయి 
గట్టి మేలును చేయు ఘనమైన దా చేయి 
అట్టి దానిని పట్టి ఆదరింపగదోయి 
జట్టు సేయగ  వచ్చి కరచాలనము చేసి 
మేటి సంస్కారములనందుకోవోయి ॥ 
______________________________

రచన,శ్రీమతి ,
జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
________________________________











Monday, September 16, 2013

మధురానగరిలో

"మధురానగరిలో ... ", 

(కల్యాణి రాగం ). 

______________________
మధురానగరిలో, మలయమారుతము -
మధురమై సాగెనే ,మాధవ గీతమై పాడెనే..  ఆ .. ॥ 

ఆధరసుధారస , మాధురి గాంచిన 
వేణువే మ్రోగేనే .. అదె సంగీతమై పాడెనే .. ఆ      ॥  మధురా ॥ 

మోహన మురళీ   ,  రాగాలనువిని 
కోయిలే పాడెనే   , అదె  సంగీతమై పలికేనే !
విరహపువేదన   , వీనులవిందుగ 
వంతులై పోయెనే ,  అల్లరి అందమై విరిసెనే  ,
ఆ  ......        ॥  మధురా ॥ 

అందరివాడూ ...   అల్లరి మోహను-నందెలే 
ఘల్లనే ' నాట్యపు , విందులే చేసెనే .. ..
యమునా తటిదరి   బృన్దావని సరి -
సందడైపోయెనే   ,  స,రి,గ,మ  
సంగతై పాడెనే ..... 

మురళీధరుని    మోహన రూపమె -
అంతటై  నిలచెనే  ....అందరి 
మనసులే మురిసెనే ...ఆ .. ॥ మధురా ॥ 
_____________________________________________రచన, శ్రీ మతి
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
-----------




ఏడే మాధవుడుా....

" ఏడే మాధవుడూ ". 

_( ఆభేరి రాగం )_________

ఏడే ... మాధవుడూ ..కనరాడే . నా ధవుడూ 

ఏడే  మాధవుడూ రాడే నాధవుడూ 
నను విడనాడే భూధవుడూ ... 
సఖియా చెలియా ఏడే  నా ధవుడూ ....॥ 

అన్నది రాధా ..బాధగా..... 
వినరే చెలులారా.. సంగతి కనరే సఖులారా ...॥ 

పొదపొదలో దరిదరిలో .... 
ఆతని అడుగుల సవ్వడి వినబడె 
వేణునాదమే వీనులవిందుగ 
మదిలో సవ్వడి చేయగ  వినబడె 

ఏడే మురళిధారీ  ... నను  వీడే దయమాలీ ........ 
అన్నది రాధ .. బాధగా ... 
వినరే చెలులారా  సంగతి కనరే సఖులారా ॥ 

ఆతని మురళీ గానము వినబడె 
ఆతని రూపము కన్నులకగపడె 
కలయో .. నిజమో .. తెలియగ రాదే .. 
కన్నులు తెరచిన అగపడలేదే 

ధారల కన్నుల కన్నీటి ఆన 
దీనను నన్నిక మన్నిక నేలగ 

రాడే ... మాధవుడూ .. ఏడే  నా ధవుడూ 
అన్నది రాధా బాధగా ... 
వినరే చెలులారా , సంగతి కనరే సఖులారా ...॥ 
_____________________________