Tuesday, November 20, 2018

చిలకమ్మ కధ.

చిలకమ్మ కధ
------------
అందాల ఓ చిలుక  
ఆకాశమందునా
గూడు కట్టగ తలచి
నింగి నెగిరీ పోయె ||

చెట్లు చేమలు నిండు
ఓ చిన్ని అడవిలో
గుబురు నిండిన
ఆకు చివురు కొమ్మల నడుమ
ఏరి చేర్చెను
ఎండు పుల్లలెన్నో వెదికి
గూడు వెలసెను తుదికి
సేద తీరగ మదికి ||

ముద్దు ముచ్చటవలసి ,
కోరి తానే వలచి
గోరింక తోడుగా. ,
చిరు కూనలను సాకె ॥

కిచ  కిచలు అవి పలుక
చిన్ని రవముల తోడ
చిందులేసెను చిలుక
గోరింక జత కలుప ||

ఏఏటి కా ఏడు
తీరనీ భయమంట
తరుల గూల్చెడి నరుల ,
మ్రొక్కి వేడెడిదంట ॥

ఎగరలేని కూన ,
ప్రాణాలె పణమంట
చిలకమ్మ కంటిలో ,
కన్నీటి వరదంట ||॥

నమ్మలేనీ వింత ,
మరుగాయె వనమంత
నీడ నిచ్చెడి జాడ
కానరాలేదంట ॥

తరుల జాడలు తరిగె.
కొండ చరియలు విరిగె
చిలకమ్మ గూటికై  ,
చిరునీడ కరువాయె ||

( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )

--------------------------------------
       రచన. శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
     కల్యాణ్  ( మహరాష్ట్ర  ).

No comments:

Post a Comment