తెలుగు తల్లికి వందనం
----------------------
తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు కీర్తికి వందనం.
తెలుగు వెలుగై తరలి వచ్చెను
పలుకు తేనెల సుధలతో
మల్లె మాలల మధుర సౌరభ
మొప్పు మాటల కళల తో ||
వేద ఘోషలు పుణ్య గాధలు
తల్లి నడిచెడు పథములు
తెలుగు తల్లికి వెలుగునిచ్చే
కీర్తి చంద్రిక తారలు ||
తేటగీతులు , ఆటవెలదులు
కంద సీసపు మాలలు
తెలుగు పద్యపు పాదములనిడు
మేలి సిరి సిరి మువ్వలు ||
విజయనగర కాకతతీయుల
ఖ్యాతి ఆమెకు వైభవం
రత్నగర్భ గ పేరు తెచ్చెను
కోటి నిధుల ప్రాభవం ||
జాతి కవులుగ పేరు గాంచిన
సుతుల కీర్తులె తేజము
ఆంధ్ర కేసరి వంటి సుతులకు
మాత ఒడి తరు కల్పము ||
మేలు సంస్క్రుతి నిండు ధనమే
తెలుగు తల్లికి భరణము
సంప్రదాయ సంగీత గీతులె
వన్నె తెచ్చెడి సద్ధనం ||
కూచిపూడి నాట్య సంపద
కొలువు దీరిన వైభవం
తెలుగు దనమే మనకు అభయం
తెలుగు బాట అదే స్వర్గం.
-----------------------------
రచన. శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
Tuesday, November 20, 2018
తెలుగు తల్లికి వందనం .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment