కరచాలనం
-----------
పలక బలపము పట్టి , ఓ,న,మా ,లను దిద్ది
వలయు విద్యల తీర్చి దిద్దు చేయి.
గురువు పెద్దల పదము లంటి దండములెట్టు ,
చనవు నాశీర్వచనమిచ్చు చేయి. ||
కార్య భారములెల్ల ఇంపుగా సవరించి
నవ్య స్నేహపు పాలు పంచు చేయి.
కావ్య రచనలు చేసి కీర్తి. బడసిన చేయి
దివ్య జ్యోతుల నింట వెలిగించు చేయి ||
అతిధి సత్కారముల నందెవేసిన చేయి
ఆదరించీ అన్నమెట్టు చేయి.
అడిగినంతనె లేదు లేదన్న మాటొదిలి
కలిగినంతయె దాన మొసగేటి చేయి. ||
గుడిలోన జేగంట మోగించి వేల్పులను
మనసార ధ్యాన్నించి మొక్కు చేయి.
దడిలోన పూలన్ని దెచ్చి మాలలు గుచ్చి
తగు భక్తి గురుసాయి సేవించు చేయి. ||
ఇష్ఠాల విందులను ఇచ్చి మురిసెడు చేయి
కష్ఠాల కన్నీరు తుడుచు చేయి.
నష్ఠాల నగుబాట్ల. తట్టి ధైర్యము నిచ్చి
శ్రేయమౌ శుభములను ఒసగేటి చేయి ||
గట్టి మేలును చేయు ఘనమైనదాచేయి
అట్టిదానిని పట్టి ఆదరింపగదోయి.
జట్టు సేయగ వచ్చి. కరచాలనము చేసి
మేటి సంస్కారములనందుకోవోయి ||
---------------------------------
రచయిత్రి
శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
కల్యాణ్
Tuesday, November 20, 2018
కరచాలనం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment