Sunday, October 20, 2019

స్వప్నగీతం   . 
______________________
వెన్నెల  కురిసిన వేళలలో, నా
కన్నులు కాంచిన స్వప్న మిదే 
కమ్మని ఊహల మధురిమలే  రా 
రమ్మని పిలిచెను గీతికలై ... 
నవ్వుతూ పాడనా .
 నే కోయిల గీతికనై ॥ 

కళకళ సొగసుల జాబిలినై , 
తారల నడుమ చరించనా 
కదలే మేఘ మాలికనై  
నీలాకాశంలో విహరించనా 
ఏడురంగులా ఇంద్ర ధనుసునై , 
దివిలో కాంతులు వెదజల్లనా 
మేఘం వెనుక దాగిన చినుకై 
చిరుజల్లుగా నే వర్షించనా  ॥ వెన్నెల ॥

ఆమని ఎదలో కోయిలనై  
వసంత గీతం పలికించనా 
సాగే ఏరుల గలగలనై .. నే ...
చిరు సడి అలనై ఉప్పొంగనా 
వీచే గాలి వీచికనై  సుమ 
అందాల గంధాలు దివి పంచనా 
పైరు పచ్చని సింగారము నా 
కవిత కన్నియకు అలరించనా ॥వెన్నెల ॥ 

సప్త స్వరాలకు సరిగమనై  
సంగీతికి శృతి-లయ నేనౌదునా 
ప్రకృతి  పడతితో పదములు కలిపి 
అందెల సవ్వడి వినిపించనా 
భావ-భంగిమల ,
నాట్యపు గతులను 
జతినై -గతినై ఆడించనా 
ఓంకారములో 
ప్రణవము నేనై 
విశ్వమంత నే విహరించనా ॥ వెన్నెల ॥ 
__________________________________________

No comments:

Post a Comment