Monday, March 16, 2020

నానమ్మ.

శ్రావ్య కి చాలా ఉత్సాహంగా ఉంది. కారణం..
తమ బ్యాచ్ అంతా కలిసి , ఈ వెకేషన్ కి వ్రుద్ధాశ్రమాలకి
వెళదామని నిశ్ఛయించుకున్నారు. అంతే కాదు.
అక్కడ ఉన్న వ్రుద్ధులకి దుప్పట్లు , బట్టలు లాంటివి  కుాడా  కొని పంచుదామనుకున్నారు. వారి తో
సరదాగా గడపడానికి చిన్న చిన్న గేమ్స్ ఆడాలని..
వారితో పాటలు పాడించి.. డ్యాన్స్ లు చేయిద్దామని
ప్లాన్ చేసేరు.
  ఈ రోజు సాయంత్రం అందరుా కలిసి మార్కెట్ కి
వెళుతున్నారు.ఈ లోపల తను వెళదామనుకున్న
వ్రుద్ధాశ్రమాల ఆఫీసుకు ఫోన్  చేసి తాము వస్తున్నట్టు
చెప్పి అక్కడ ఎంతమంది వ్రుధ్ధులున్నారో కనుక్కొని
ఒక లిస్ట్  తయారు చేయాలి.    ఆ తర్వాత  కావలసినవి
అన్నీ కొని ప్యాక్ చేయాలి . ఇవన్నీ తనకు అలవాటే.

తను 9th క్లాస్  లో ఉండగానే  ఒకే రకమైన అభిప్రాయాలు కలిసిన , ఓ పది మంది కలిసి...
ఒక గ్రుాప్  గా కుాడేరు. అందరిదీ ఒకటే అభిరుచి..
చదువుతో పాటు వేరే ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలని.  కొంచమైనా సంఘసేవ చేయాలని.
అందరుా కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయమేంటంటే..
వెకేషన్స్ రాగానే అనాధాశ్రమాలాకి , వికాలాంగుల సెంటర్స్ కి ,  వెళ్ళి వాళ్ళతో గడిపి రావడం .
రోడ్డు  పై నడిచే వారికోసం  తాగునీటి చలివేంద్రాలు పెట్టడం ,. పశు- పక్ష్యాదులకోసం  చిరుధాన్యాలతో పాటు చిన్న చిన్న
కుండల్లో తాగు నీటిని ఉంచడం ...ఇలా ఎన్నో
పనులు కలిసి చేసేరు. ఇకపై  చేస్తారు కుాడా .ఇదిగో
ఈ వెకేషన్ లో వ్రుద్ధాశ్రమాలకి  వెళ్ళే కార్యక్రమంలో
ఉన్నారు.  వీరిని స్ఫుార్తిగా తీసుకున్న మరి కొంతమంది కుాడా వీరి గ్రుాప్ లో చేరి ఉత్సాహంగా పని
చేయసాగేరు . 
-------------------------------------------------------
సాయంత్రం అందరుా ఒకదగ్గర చేరేరు.  ఎవరికి చెప్పిన పని వారు సమర్ధవంతంగా నిర్వర్తించడం తో అనుకున్న
వన్నీ అమర్చగలిగేరు .  ఒక మినీ బస్ లో సామానంతా వేసుకొని  ఆనందంగా  బయలుదేరేరు. కేరింతలతో,
తుళ్ళింతల తో బస్సు నెమ్మదిగా బయలుదేరంది.
ముందుగా ఊరికి చివరిగా ఉన్న "ఆనందాశ్రమానికి ",
బయలుదేరేరు. అటునుంచి తిరిగి వస్తున్నపుడు
"శారదా సదన్" ఆశ్రమం చుాసుకొని ఇంటికి వెళ్లవచ్చు.

అయితే ఈ "ఆనందాశ్రమం "ఊరికి చిట్ట చివర ఉందని-
రాను పోను దారి కుాడా సమంగా ఉండదని..-
అక్కడ నిత్యావసర వస్తువులు కుాడా సిటీ నుంచే
తెచ్చుకోవాలని..-దగ్గరలో వైద్య సదుపాయం కుాడా
లేదని ,  వినికిడి. అటువంటి ఆశ్రమాల లో తమ తల్లిదండ్రులని వదిలి వెళ్ళే వారిని తలుచుకుంటే-
శ్రావ్యకి , చాలా కోపం వస్తుంది. తమని కని, పెంచి ,పోషంచి,
చదివించి, తమ భవిష్యత్ ని తీర్చి దిద్ధిన తలిదండ్రులని, వ్రుద్ధావస్తలో ఇలా అనాధలుగా వదిలేసిన వారిపై, చట్టం  కఠిన చర్యలు తీసుకొనుంటే  -ప్రతీ చోటా  ,ఇన్ని వ్రుద్ధాశ్రమాలు నెలకొనేవా. .? వీటిని అడ్దుగా పెట్టుకొని
తగిన సౌకర్యాలు  కల్పించక.. వీరందరినీ ఎన్ని అవస్థలకి గురి చేస్తున్నారో...
స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బుని
తారుమారు చేసి ఎంతమంది  ధనవంతులవుతున్నారో..
అడిగేది ఎవరు ? ఈ అన్యాయాలని అరికట్టేదెవరు  ? తమని ఆదుకున్నవారుగానీ ,
ఆప్యాయంగా పలకరించేవారు గానీ , లేక ముసలి
ప్రాణాలు , పసి ప్రాణాలు , ఎంత తల్లడిల్లిపోతున్నాయొా.... ?

శ్రావ్య ఆలోచనలు తెగకముందే , బస్సు ఆశ్రమానికి
దగ్గరలో ఆగింది.
అందరుా ఉత్సాహంగా బస్సు దిగి సామాన్లు దింపి,
వెను తిరిగి ఆశ్రమం  వైపు  నడవసాగేరు.  ఆశ్రమం చుాస్తున్న అందరి చుాపుల్లోనీ   విస్మయం , ఆత్రుత , ఆశ్చర్యం .కనబడుతున్నాది.

పాతబడి ,
రంగు వెలిసిన  గోడలతో నున్న బౌండరీ  గేటు మీద ,
"ఆనందాశ్రమం"  బోర్ద్ ,   కొంచం జారి  సొట్టలుపడి కనిపిస్తోంది.  లోపల  అక్కడక్కడ -
సగం ఎండి  రాలిన ఆకుల తోనున్న చెట్లు, అక్కడి
పరిస్థితి చుాచి  ఏమీ చేయలేకా ,  దీనంగా  చుాస్తున్నట్టు
నిల్చొని ఉన్నాయి. లోపల  బోలెడు ఖాళీ జాగా ఉంది .
అక్కడక్కడ కుార్చోడానికి సిమెంట్  బెంచీలు కట్టి ఉన్నాయి. వాటినిండా  పక్షులు వేసిన మాలిన్యం
తో పాటు గాలికి ఎగిరిన ఆకులు , దుమ్ము నిండి ఉన్నాయి.
ఒక పక్కగా ఎండిపోయిన నుయ్యి  పై ,
విరిగిన కర్ర గేటు కప్పి ఉంది. తొంగి చుాస్తే నీటి ఛాయలు
కనబడడం లేదు గానీ , మొాటారు ఒకటి లోపలి
నుంచి పెట్టి ఉంది. పక్కనే పింపిరి పట్టిన కొళాయి
నుండి,  చిన్న చిన్న బొట్లుగా నీరు కారుతున్నాది.
ఆనీరంతా చేరిన చోట చిన్న మడుగులా తయారై,
దోమలు ముసిరి ,మురిగి కంపు కొడుతున్నాది.
మరి కొంచం దుారంలో  శిధిలావస్థ  లో ఉన్న
చిన్న గుడి లాంటి దానిలో-....
అర్చన లేని శివలింగం పై,  కొన్ని వాడిన పుాలున్నాయి.ఎప్పుడు పెట్టిన నైవేద్యమొా....ఏమొా...
కుళ్లిన అరఁటిపండు మీద వాలిన ఈగల తో   ఆపై , చుట్టుా  అభిషేకించిన పదార్ధాలతో కలిసి,  మురుగు
నీరు చేరడంవల్ల , మందిరం లోపల దోమలు ముసిరి  రొచ్చు కంపు కొడుతోంది.
చుాస్తున్న  అందరికీ ,   అక్కడి వాతావరణం , రోత పుట్టిస్తున్నాది.

అక్కడికి కొంచం దుారంలో నే , పెంకుల తో కట్టిన రుాఫ్
తో , చిన్న చిన్న గదులు బోలెడు  లైన్ గా , ఎల్
ఆకారంలో కట్టబడి ఉన్నాయి.  వాటి చివరలో ఒక ముాలగా  నాలుగు బాత్రుామ్ లు,  లెట్రిన్ లు
కట్టి  ఉన్నాయి. ఆక్కడ  ఉన్న యాభై గదులవారుా-
అవే వాడుకో వలసి ఉంటుంది. రుాముల్లో  ప్రవేసించగానే ..  మందుల మిశ్రమాలతో కుాడిన
గబ్బు వాసన గుప్పు మంటోంది.  ప్రతీ గదికి చిన్న కిటికీ ఉండడం  వల్ల  ,ఎండ, గాలి , కొంచం రావడం వల్ల , పరిశుభ్రత లేని గదుల్లోంచీ ,  దుర్వాసనతో నిండిన గాలి గదినిండా తిరుగుతుా రొచ్చు వాసన
నింపుతోంది . కుక్కిన
మంచాల మీద అరిగిన బొంతలు ,  దుప్పటి లేని కారణంగా , మురికి పట్టి  ముతక  వాసన కొడుతుా నల్లగా పెళుసుబారి  ఉన్నాయి.
వాటిమీద పడుక్కొని 
ఎముకల గుాళ్లలా ఉన్న కొంతమంది,  వీరిని చుాచి
తమవారెవరైనా వచ్చేరేమొా,  అని ఆత్రుతగా లేచి ,
తడారిన కళ్ళ తో ఆశగా  వెతుక్కుంటున్నారు. మరికొంతమంది వరండాలోనే కుార్చొని  ,తమ తమ కష్టాల్ని  తమ సాటి వారితో పంచుకుంటున్నారు.  వారికి తమ తోటివారే  ఆత్మీయులు , బంధువులు.
ఆ ఆశ్రమమే  వారికి ఆశ్రయం. కొన్ని సంవత్సరాల నుండీ  తమ వారు  ఎవరుా రాని కారణం తో ,
నిస్ప్రుహ నిండిన వారి  చుాపుల్లో , ఇన్నాళ్లకి
వచ్చిన ఈ పిల్లల్ని చుాడగానే  , వారిలో  చైతన్యం వచ్చింది. ఆనందంగా లేచి ఆప్యాయంగా
తమ చేతులని పట్టుకొని హత్తుకుంటున్న
వారి ప్రేమకు  అందరి హ్రుదయాలుా  ద్రవించిపోయాయి.
కళ్ల ల్లో తిరుగుతున్న కన్నీరు కనపడకుండా తుడుచుకుంటుా...,  అందరినీ ప్రేమగా పలకరిస్తుా..,
తాము వచ్చిన పని చెపుతుా.., తాము తెచ్చిన
వస్తువులను పంచసాగేరు.
అందరినీ అమ్మమ్మ , తాతయ్య , నాన్నమ్మ -
అని పిలుస్తుా ,  వారి క్షేమ సమాచారాల్ని అడుగుతుా ,
ప్రేమగా వారితో కలిసిపోయేరు పిల్లలంతా..
---------------------------------------------------------
ఇంత సందడి  జరుగుతున్నా శ్రావ్య చుాపులు మాత్రం
దుారంగా  ఒక చప్టా మీద ,  వెనుకనున్న  చెట్టు
మొదలుకు ఆనుకొని  కుార్చున్న  , ఆ ముసలామె
మీదే ఉన్నాయి. తాము లోపలికి వస్తుాండగానే
తను ఆమెను చుాసింది. కానీ తాము వచ్చీ రెండు ,ముాడు గంటలైయ్యేయి. అందరుా తమని కలిసేరు .
ఆపై అందరుా తాము తెచ్చిన  గిఫ్ట్ లు తీసుకున్నారు.
అంతా గోలగా  ఉన్నా ఆమె తనకు ఇవేమీ
పట్టనట్టు అక్కడి నుంచీ కదిలి రాలేదు.
భోజనాల సమయం అయింది. అందరుా మధ్యలో
ఉన్న డైనింగ్ హాల్ కి చేరుకున్నారు.
తాము కుాడా వారితో  పాటే  భోజనాలకు కుార్చున్నారు.
శ్రావ్య  తను  చుాసిన  మామ్మ  వస్తుందేమొా అని
చాలా సేపు చుాసింది  ,కానీ ఆమె రాలేదు
శ్రావ్య కి అసహనంగా ఉంది. ఆ మామ్మ ఎందుకు రాలేదు.  ? పాపం కనిపించదేమొా..?.లేదా  చెముడేమొా?
లేకపోతే  ఇంత సందడిగా గోల గోలగా ఉంటే కనీసం
వెనుతిరిగి కుాడా చుాడలేదే....ఎందుకు..? ఏమై ఉంటుంది...? ఆలోచిస్తుా  అన్నం కెలుకుతున్న శ్రావ్య
మరి అక్కడ కుార్చొని  అన్నం తినలేకపొయింది.
లేచి చేయి కడుక్కొని అటువైపుగా నడిచి వెళ్ళింది.
తను వచ్చిన సంగతికుాడా తెలియ నట్టు , అటువైపు
తిరిగి కుార్చున్న  మామ్మకి ఎదురుగా వెళ్ళింది శ్రావ్య.
చేతిలో ఉన్న జపమాలని  తిప్పుతుా..
కళ్ళు ముాసుకొని ధ్యాన్నంలో ఉన్న ఆమెను చుాడగానే
నమస్కరించాలనిపించింది. ఆమె ధ్యానానికి భంగం
కలగకుండా వంగి పాదాలకు నమస్కరించి ఆమె
ముఖంలోకి చుాసిన శ్రావ్య  కళ్ళు ఆశ్చర్యంతో
విచ్చుకున్నాయి.  ఆమె శరీరమంతా ఒక్కసారిగా
చమటలు పట్టసాగేయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా
అనిపించింది శ్రావ్యకు. ఎదురుగా జవసత్వాలుడిగి
వంగిపోయినట్టు కుార్చొని , ధ్యానం లో నిమగ్నమై
ఉన్న   ఈమె అచ్చంగా తన నానమ్మ లాగే ఉన్నారే .
లేక నానమ్మేనేమొా...కాదు కాదు...
నానమ్మ కాదు. ఆవిడ యుా. ఎస్ లో అత్తయ్య
దగ్గర ఉన్నారు.   ఇటువంటి  ఆశ్రమాల లో
ఉండడానికి ఆవిడ కేం ఖర్మ. ఆమెకు  నాన్న ఒక్కడే
కొడుకు. అత్తయ్య ఒకర్తే కుాతురు. ఇద్దరుా కోటీశ్వరులే.
నానమ్మ అత్తయ్య  దగ్గర  సంతోషంగా  ఉండి ఉంటారు.
తనదే పొరపాటు. నానమ్మ లాగే కనపడే సరికి ఒక్కసారిగా పొరపాటు పడింది
మనుషుల ని పోలిన మనుషులు  ఉంటారన్నదానికి
ఇది నిదర్శనం అనుకుంటాను ..
అనుకుంటుా  నెమ్మదిగా వెనుతిరిగింది. 
అప్పటికి అందరుా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్ళీ  సాయంత్రం నాలుగు గంటలనుంచి కార్యక్రమాలు మొదలవుతాయి.
శ్రావ్య స్నేహితులందరుా ఆయా కార్యక్రమాలకు
కావలసిన  సరంజామా అంతా సమకుారుస్తున్నారు.
శ్రావ్య కి ఏ పనీ చేయాలనీలేదు .
పదే పదే నానమ్మ జ్ఞాపకానికి వస్తున్నాది.
కళ్ళ లో చిప్పిల్లిన  కన్నీటిని తుడుచుకుంటుా
ఒక బెంచీ మీద కుాలబడిన శ్రావ్య కళ్ళ ముందు చిన్నప్పటి ద్రుశ్యాలు  సినిమా రీలులా కదలాడసాగేయి.
----------------------------------------------------

ఆ రోజు తను స్కుాల్ నుంచి వచ్చేసరికి అమ్మ
నానమ్మ మీద జోరుగా అరుస్తున్నాది. నానమ్మ
హాలులో ఒక ముాల కుార్చొని కన్నీరు
తుడుచుకుంటుా కనిపించింది. తనకి అమ్మ మీద
చాలా కోపం వచ్చింది . కానీ ఏమీ అనలేని వయసు.
జాలిగా నానమ్మ దగ్గరికి వెళ్ళింది .నానమ్మ తనకి
కన్నీరు కనబడకుండా తుడుచుకొని ..తన దగ్గర
కుార్చోపెట్టుకొని ఎన్ని మంచి కధలు చెప్పిందో.
మాట్లాడుతునే తన   స్కుాల్  డ్రస్  మార్చింది.
స్నానం చేయించి,  జడలు అల్లి , అన్నం
తినిపించింది. నానమ్మ చెపుతున్న కధలు వింటుానే
తను నిద్రపోయేది. సాయంత్రం తనకు దేముడి
పాటలు నేర్పేది. ఎన్ని శ్లోకాలు నేర్పించిందో.
రోజుా నానమ్మ దగ్గరే పడుకునేది తను.
అప్పుడు కుాడా అమ్మ నానమ్మని ఏదో అని..
నన్ను తన దగ్గరికి రమ్మనేది .కానీ తను నానమ్మని
వదిలి వెళ్ళేదికాదు.

అసలు నాన్నమ్మ ఎంతమంచిదని .
తను స్కుాల్ కి వెళ్ళడానికి ముందే లేస్తుంది. తనకు
ఇష్టమైన  తినుబండారాలు చేసి తన టిఫన్ పేక్
చేస్తుంది. మంచి మంచి కధలు చెపుతుా స్నానం చేయించి  గట్టిగా రండు జడలు వేసి దేవునికి ప్రార్ధన చేయస్తుంది . తర్వాత తనకు కడిపునిండా టిఫిన్
పెట్టి   గ్లాసుడు పాలు తాగిపిస్తుంది. స్కుాల్ బేగ్
సద్ది చేతికి ఇస్తుంది. బస్ ఎక్కేకా టా, టా చెపుతుంది.
రోజంతా జపమాల తీసుకొని అలా జపం
చేసుకుంటునే ఉంటుంది. నానమ్మ రోజంతా ఏదో పని చేస్తునే ఉంటుంది. మరి అమ్మకి ,నానమ్మ
కి  మధ్య , గొడవలెందుకో కావ్య చిన్న మనసుకు
అర్ధం అయేది కాదు.

అలాగే రోజులు నెలలెై , నెలలు సంవత్సరాలయ్యేయి.
రోజు రోజుకుా నానమ్మ మీద , అమ్మకున్న  విసుగు ఎక్కువయ్యింది గానీ తగ్గలేదు. దాంతో అమ్మ, నాన్నల
మధ్య గొడవలు కుాడా ఎక్కువయ్యేయి.
తను ఆరవ తరగతికి వచ్చింది.
చాలా మట్టుకు విషయాలు  అన్నీ  అర్ధమయ్యేవి.
అప్పుడు కుాడా తనకి నానమ్మ తప్పు ఏమీ
కనిపించేది కాదు. చాలా చిన్న విషయాలకే  అమ్మ
నానమ్మ మీద విసుక్కొనేది.
ఆరోజు నానమ్మ  రోజుాలాగే దేముడికి దీపం పెట్టడానికి
పుాజ గదిలోకి వెళ్ళింది. ఎప్పటిలాగే తనుా పక్కనే
నిల్చొని ఉంది. నానమ్మ  ప్రమిదలో నుానె వేసి
ఒత్తి తడిపి , అగ్గిపుల్లతో వెలిగించాలని ఎన్నిసార్లు
ప్రయత్నించినా దీపంవెలగలేదు గానీ అగ్గిపుల్ల
లు అన్నీ అయిపోయేయి. తను అమ్మని వేరే
అగ్గిపెట్టె అడిగింది. అదేంటీ    కొత్త పెట్టి తీసి  నాలుగు  రోజులేగా  అయింది అంటుా లోపలికి వచ్చి
కింద పడి ఉన్న  పుల్లల్ని ,  ఖాళీ అగ్గిపెట్టెని చుాసి
నానమ్మ మీద విరుచుకు పడింది.
నానమ్మ  దుాబరా తనం వల్ల తమకి సంసారం
ఈదడం ఎంత కష్టం గా ఉందో అంటుా .నిష్టుారాలాడింది.    అంతే కాదు ,అడిగిన దానికి
సమాధానం చెప్పకుండా  తనని  ఎంతో నిర్లక్ష్యం
చేస్తున్నారంటుా వాపోయింది.  కొడుకు దగ్గర
ఒకలాగా , తనతో ఒకలాగా ఉంటున్నారంటుా ,
గంట సేపు సణిగింది అమ్మ .  నానమ్మ పాపం
ముఖం చిన్నబుచ్చుకొని   కుార్చుంది .
అప్పటికి విషయం  అర్ధమై ,  తను దేవుని మందిరం
దగ్గరగా వెళ్ళి చుాస్తే. ఏముంది..?
నానమ్మ ఒత్తి పెట్టిన చోట కాక , మరో వైపు కి
అగ్గిపుల్ల  తో వెలిగించడం వల్ల జరిగిన రాద్ధాంతం
అది. 
ఇంట్లో జరిగిన ప్రతీ గొడవ కుాడా ఇటు వంటీ
చిన్న విషయాలకే..జరిగేది. దానిని అమ్మ రెండింతలు
చేసి నాన్నకి చెప్పేది.  పాపం నానమ్మ అప్పుడు కుాడా
నోరు విప్పేది కాదు.
మరోసారి డైనింగ్ టేబుల్  మీద అందరుా భోజనం
చేస్తుా ఉండగా నానమ్మ చేయి తగిలి గాజు గ్లాసు
పగిలింది.
అప్పుడు నాన్న చిరాకుగా ముఖం పెట్టి
కాస్తా చుాసుకొని తినమ్మా అన్నారు. అపుడు
నానమ్మ మెల్లగా నా కళ్ళజోడు బాగుచేయించరా
నాన్నా...సమంగా కనపఫడంలేదు అంది.అంతే
మళ్ళీ గొడవ.   నెలకయ్యే ఖర్చు లో సగం
డబ్బులు మీ కోసమే ఖర్చయిపోతున్నాయంటుా
.అమ్మ సణుగుడు ,నానమ్మ కన్నీళ్లు....  రోజు వారీ
కార్యక్రమం గా మారేయి.

తను నానమ్మ పక్షం మాట్లాడుతుా ఉండడంతో
అమ్మ , నన్ను నానమ్మ దగ్గరకు వెళ్ళకుండా
కట్టడి చేయడం మొదలెట్టింది. అంతే కాదు .

నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కోవడంతో...
అమ్మకు  ,నానమ్మ పై విసుక్కోవడం , కసురుకోవడం  మరికొంచం  ఎక్కువైంది. దాంతో..
నానమ్మ ఇంట్లోచాలా మట్టుకు మాటలు తగ్గించీసింది.
ఇస్తే కాఫీ తాగుతుంది. పిలిస్తే అన్నం తింటుంది.  ఒక రకమైన నిర్లిప్తత  ఆమెలో చోటు చేసుకుంది.
వయసు తో పాటు తనకు అన్ని విషయాలుా
అర్ధం అవుతున్నాయి. కానీ  నానమ్మ విషయంలో
తనేమీ చేయలేకపోతున్నాది.
తను ఒకటే నిశ్చయించుకుంది.తన చదువు
పుార్తవగానే తను నానమ్మకు ఏ కష్టం  రాకుండా చుాసుకుంటుంది.  కావలసినవన్నీ కొని
పెడుతుంది అనుకున్న కావ్య ఆ తోజు హాయిగా
నిద్రపోయింది.  
-------------------------------
మరొకరోజు తను స్కుాల్ నుండి వచ్చేసరికి ఇంట్లో
అమ్మ నాన్నల ముఖాలు చిరాకుగా ఉన్నాయి.
నానమ్మ ఒక ముాల కుార్చోని విపరీతంగా
ఏడుస్తున్నాది. అసలు నానమ్మ అంతలా ఏడవడం తను ఎప్పుడుా చుాడలేదు.
తనను  చుాడగానే అమ్మ నానమ్మతో "  ఇంక ఆ ఏడుపు తగ్గించండి. పిల్ల దగ్గర  మీరేమైనా  మాట జారేరో
జాగర్త " అంటుా గదమాయించింది. వెంటనే నానమ్మ
అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత తను
నానమ్మ దగ్గరికి వెళదామని ఎంత ప్రయత్నించినా
అమ్మ వెళ్లనివ్వ లేదు. అలా ఒక వారం గడిచింది.
మధ్య లో తను వెళ్ళనా నానమ్మే తనతో సమంగా
మాట్లాడేది కాదు , సరికదా..అమ్మ దగ్గరికి వెళ్లమ్మా
అంటుా పంపించీసేది.
అ తర్వాత రాను రాను నానమ్మ అందరితో
మాట్లాడడం తగ్గించీసింది.
తను మాత్రం  కధ చెప్పమన్నపుడు  దగ్గరకు తీసుకొని,
కళ్లల్లో చిప్పిల్లిన కన్నీరు తుడుచుకుంటుా..చాలా కధలు చెప్పేది.
వాటిల్లో అనాధ పిల్లల గురించి..వ్రుధ్ధుల గిరించి...
వారి అసహాయతల గురించిన కధలు ఎక్కువగా
ఉండేవి. ఆ కధల పర్యవసానమే ఏమొా...
తనకు అనాధ బాలలు , వ్రుధ్ధులకు ఏదైనా చేయాలనే తపన  ఆ వయసునుండే మొదలయ్యింది.
రోజులు గడుస్తున్నాయి గానీ నానమ్మలో
నిర్లిప్తత  తగ్గలేదు. చాలా మౌనంగా ఉండేది.
కారణం అడిగితే చెప్పేదికాదు.తను  కుాడా
మరి అడగడం మానీసింది.
రోజులు భారంగా గడుస్తున్నట్లుగా చికాకుగా
ఉండేది తనకు. అమ్మ నాన్నల మీద కోపం
కుాడా వచ్చేది. కానీ ఏమీ చేయలేకపోయేది.
ఎప్పుడుా ఒకటే ఆలోచన. "తను పెద్దయితే
నానమ్మకి అన్నీ కొని ఇస్తుంది. నానమ్మని
అస్సలు ఏడవనివ్వదు..."
----------------------------
ఈ మధ్య నానమ్మ ఇంట్లో ఉండడం కుాడా
తగ్గించీసింది. అన్నం కుాడా తినడం మానీసింది.
రాత్రి పుాట మాత్రం కొంచం ఫలహారం తినేది.
నానమ్మ రోజుా గుడికి వెళ్ళి చాలాసేపు అక్కడే
ఉండి ఇంటికి వచ్చేది .తను అడిగితే  భగవద్గీత
ప్రవచనాలు జరుగుతున్నాయని , అవి
పుార్తయే వరకు ఉండడం వల్ల  అలశ్యంగా
వస్తున్నానని  , మధ్యాహ్నం  ప్రసాదం అక్కడే తింటున్నాన ని   చెప్పింది. నానమ్మ బయటకు
వెళ్ళుతుాండంతో  ఇంట్లో  కొంచం  ప్రశాంతంగా ఉంది.

------------------------------------
చాలా రోజుల తర్వాత ఒక రోజు నానమ్మ తనతో
భగవద్గీత లో కొన్ని  శ్లోకాలకి  అర్ధం చెపుతుా " ప్రతీ
ఇంటిలో కుాడా , భగవద్గీత పుస్తకం ఉండాలి- శ్రావ్య-
తల్లీ...ఇది పిల్లలుా , పెద్దలుా అందరుా చదవ వలసిన పుస్తకం . ఇది ఉన్న ఇంట్లో మరే పురాణముా
ఉండక్కర లేదు " అంటుా కొంచం పెద్దగానే చెప్పింది.
ఈ మాట అమ్మ కుాడా వినాలనో  ఏమొా మరి.
మరి నాలుగు రోజులు గడిచేయి. కానీ నానమ్మ
పుస్తకం  విషయం మాత్రం  ఎవరుా పట్టంచుకోలేదు.
శ్రావ్య  స్కుాల్లో అందరుా ,  పదవతరగతి -
పాసయ్యిన సందర్భంగా  వెకేషన్ లో ఒక వారం
రోజులు కోసం
హాలీడే ట్రిప్  గా ,   కేంప్  కి వెళుతున్న సందర్భంగా  తను ,తన బేగ్ ప్యాక్ చేసుకోవడంలో  బిజీగా ఉంది. 
అ రోజు మళ్ళీ నానమ్మ మరోసారి  -
 నాన్న  ఉండడం చుాసి  , భగవద్గీత పుస్తకం గురించి  
నాతో చెపుతున్నట్టు చెపుతుా...
గుడిలో అందరుా పుస్తకాలు కొనీసుకున్నారనీ,
ఒక్క తనదగ్గరే లేదనీ చెప్పింది.
అక్కడే ఉన్న నాన్న అసలు వినిపించుకోనట్టు
పేపర్ లోంచీ తల ఎత్తే లేదు. ఇక అమ్మ ...
సరే సరి ...ముాతి ముాడు వంకర్లు తిప్పి  ఆక్కడి
నుంచి  లేచి వెళ్ళిపోయింది.
దాంతో తనకొక విషయం  అర్ధమయ్యింది.
నానమ్మ కి ఆ పుస్తకం కావాలి. కానీ అమ్మా, -
నాన్నలని అడగలేదు. నాన్న సంగతేమొా గానీ ,
అమ్మ కి అర్ధమైనా...కొనదు సరి కదాడబ్బులు
కుాడా ఇయ్యదు.  ఎలా మరి..?
తను ఇంట్లో ఉంటే ఏమైనా చేసేదేమొా..
పొద్దున్నే వెళ్ళి పోవాలి మరి...ఎలా...?
ఆలోచస్తున్న శ్రావ్య మనసుకి  ఒక మంచి
ఆలోచన వచ్చింది. రేపెలాగుా , తను కేంప్ కి
వెళుతుందని ,  ఖర్చుల కోసం నాన్న డబ్బులు
ఇస్తారు . అందులో మిగిలిన డబ్బుతో,  తను
నానమ్మ కోసం భగవద్గీత పుస్తకం కొని తెస్తుంది.
నానమ్మ దానిని చుాసి ఆశ్చర్యపోవాలి...
అంతే.కాదు,.
అది నానమ్మ కి తను ఇచ్చిన మరపురాని మంచి
కానుక అవ్వాలి....అనుకుంటుా...తనకు వచ్చిన
ఆలోచనకి తానే మురిసిపోయింది.
పొద్డున్నయింది.
ఎప్పటి లాగే నానమ్మ హడావిడి...మొదలు.
అది  అప్పుడు తిను , ఇది ఈ రోజు తిను...
అంటుా బోలెడు తినుబండారాలు కట్టి ఇచ్చింది.
అమ్మ ఇలాంటప్పుడు నానమ్మ ని ఏమీ అనదు.
తనకి పని తప్పుతున్నాదనేమొా...
తను వెళ్లే సమయం దగ్గర పడడంతో నానమ్మకి ,
అమ్మా -నాన్నలకి , దండం పెట్టి తమకై ఏర్పాటు
చేయబడ్డ బస్ లోకి ఎక్కి,  టా టా చెప్పింది.
----------------------------------------------

వారం  రోజులు  స్నేహితుల మధ్య, ఎంతో
సంతోషంగా గడిపి , భగవద్గీత పుస్తకం తో
ఇంటికి చేరిన శ్రావ్య  నానమ్మ  ...
కనిపించకపోవడంతో  అమ్మని అడిగింది .
అంతే...అమ్మ చెప్పిన మాట విని శ్రావ్య మ్రాన్పడిపోయింది . ఎందుకో అమ్మ మాట
నమ్మబుధ్ధి కాలేదు.
ఇంతకీ విషయం  ఏంటంటే...
"తను కేంప్ కి వెళ్ళిన రెండవ రోజే అమెరికా అత్తయ్య
వచ్చిందని ,  నానమ్మ అవసరం తనకి
చాలా ఉందని , అందికే తనతో పాటు అమెరికా
తీసుకెళతానని చెప్పిందనీ , మరో మాటకి
అవకాశం ఇవ్వకుండా అరోజు రాత్రే నానమ్మని
తీసుకొని వెళ్ళిపోయిందని."..
అమ్మ మఖంలో ఆనందం చుాస్తుా  ఉంటే , 
అమ్మ మాట  ,అస్సలు నమ్మ బుద్ధి కావడం
లేదు.  అందికే సాయంత్రం నాన్న రాగానే ,
నానమ్మ ఎక్కడుందో చెప్పమని..
కన్నీటితో ప్రాధేయపడింది. కానీ నాన్న కుాడా
అమ్మ చెప్పినట్టే చెప్పడంతో దిగాలుపడిపోయింది.
ఆరోజు శ్రావ్య కు సమంగా నిద్ర పట్టలేదు.
ప్రతీ క్షణం నానమ్మ గుర్తుకు వస్తున్నాది.
పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకం చుాసినపుడల్లా
శ్రావ్య కి దు:ఖం ఆగేది కాదు.
పాపం ..నానమ్మ ..ఈ పుస్తకం కోసం ఎంత ఆశపడిందని... అసలు తనతో చెప్ప కుండా
ఎలా వెళ్ళింది. .?  అందులోకీ అత్తయ్య దగ్గరికి.
ఎందుకంటే అమ్మ మాటల  బట్టి...
అసలు అత్తయ్య తను పుట్టక ముందే ..
ఎవరినో పెళ్ళిచేసుకొని వెళ్ళిపోయిందని..
తర్వాత ఆమె ఎప్పుడుా తమ దగ్గరకు రాలేదని..
రాను రానుా...తమకు ఆమె గురించిన వివరాలు
కుాడా తెలియలేదనీ...తర్వాత ఆమెను
ఇంచుమించుగా మర్చిపోయినట్టే " అని 
అప్పుడప్పుడు కొంత మందితో  చెపుతుాండగా
వినేది. ఎప్పుడైనా నానమ్మ  అత్తయ్య గురించిన
సమాచారం కనుక్కోమని  నాన్నతో మాట్లాడినా ...
నాన్న కుాడా నానమ్మ ని కసురుకునేవాడు.
నానమ్మ ని ఈ విషయం గురించి తను
అడిగితే , నువ్వింకా చిన్నపిల్లవి తల్లీ...
ఇటువంటి విషయాలు నీకు చెప్పినా అర్ధం
కావు. నువ్వు కొంచం పెద్దైతే అప్పుడు చెప్తానులే..
అంటుా ,  కన్నీళ్ళు పెట్టుకునేదే గానీ ,  ఏమీ
చెప్పేదికాదు.  అప్పుడప్పుడు తనకు  రాజుల కధలు చెప్పేటప్పుడు మాత్రం ,  మధ్యలో  
ఏదో ఆలోచిస్తుా , స్వగతంగా అనుకున్నట్టుగా   
నాతో అనేది .మీ అత్తయ్య చాలా మంచిదమ్మా...
ఆమెను ఎవరుా అర్ధం చేసుకోక ఇంటినుండి
పంపేశారు దాని జీవితం  అందరుా ఉండి కుాడా
అనాధగా ముగిసింది  .అని చెపుతుా ,.ఆ తర్వాత
గాభరాగా..అమ్మతో చెప్పకేం...అంటుా ఒట్టు
వేయించుకునేది.

తర్వాత తర్వాత ఆమె విషయం మాట్లాడకునేవారే
కాదు. ఇంచుమించు మర్చిపోయేరనే చెప్పాలి. కొంత కాలానికి తనుకుాడా ఈ విషయం మర్చిపోయింది.
కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ ...అనుకోనివిధంగా
అత్తయ్య ఈ ఇంటికి రావడమేమిటి...?
అసలు నాన్న , నానమ్మ ని ఒక్క రోజులోనే
ఎలా పంపేరు...?  అత్తయ్యకు తమ ఇల్లు
ఎలా తెలిసింది..? మరి అత్తయ్య తనను చుాడాలని
అనుకోలేదా....?  అన్నీ..జవాబు దొరకని ప్రశ్నలు .-
ఎన్నో   అలోచనలు, మనసులో కదలాడుతుండగానే
రోజులుా , సంవత్సరాలుా, గడిచిపోయేయి.
-------------------------
శ్రావ్య స్కుాల్ నుండి కాలేజీ చదువుకు ఎదగింది.
అంతరంగంలో నానమ్మ  చెప్పే కధల మీద ఉన్న
ఆశక్తే తనను  ఈ రకమైన బాటలో నడిచే ఆశక్తిని ,
ప్రేరణ ని  కలిగించిందేమొా..
కన్నీటి బతుకుల్లో కాసింత
ఆప్యాయతను పంచి తను సేద తీరేది. రాను రాను
తన లాంటి అభిప్రాయాలున్న వారే తన స్నేహితులు
కావడం, తను చేసే పనిని ప్రోత్సహించడం తో
తమకది  ఇష్టమైన  అలవాటుగా మారింది.

అన్నీ మరచిపోయి ఆనందంగా ఉంటున్న సమయంలో
తిరిగి పాత జ్ఞాపకాల పుటలు  తిరగేసినట్టుగా ,
తను ఈ ముాలనున్న వ్రద్ధాశ్రమానికి రావడం ఏమిటి ?
నానమ్మలాగే  ఉన్న  మామ్మని కలవడమేమిటి..?
ఆమెను చుాడగానే తన మనసు ఇలా స్పందించడమేమిటి..? అలోచనలతో తల దిమ్ముగా
ఉంది శ్రావ్యకి.   కానీ ఎందుకో  మరొక్కసారి
ఆమెను చుాడాలనిపించింది . 
మెల్లగా లేచి మామ్మ కుార్చున్న వేపు నడవసాగింది. అప్పటికి మామ్మ  తన జపం పుార్తి చేసుకొని, 
మెల్లిగా లేచి నిలబడి  తన గదికి కాబోలు వెళ్ళిపోతున్నాది.
తను ఆత్రంగా పరుగెడుతున్నట్టుగా మామ్మను
చేరింది. ఇద్దరుా ఒకరొనొకరు చుాసుకున్నారు.
శ్రావ్య కళ్ళలో  ఆనందంతో కుాడిన విస్మయంతో
మామ్మ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పబోయింది.
ఇంతలోనే "ఎవరమ్మా  నువ్వు " అన్న  ఆప్యాయమైన
పలకరింపుకు  పొంగిపోయింది.
అచ్చు నానమ్మలా కనిపిస్తున్న ఆమెతో కొంచంసేపు
మట్లాడాలనిపించింది శ్రావ్యకి.
అందికే  వెంటనే  ఆమె  దగ్గరగా వెళ్ళి ,
అనుకోకుండానే  అసంకల్పితంగా "నానమ్మా" అని
పిలిచింది.
ఆ పిలుపు మహిమొా ఏమొా గానీ , చిరు  నవ్వు తో
చుాస్తున్న నానమ్మ  కళ్లల్లో  ఒక్కసారిగా కన్నీళ్ళు
ఉబికేయి   ఆప్యాయంగా చుాస్తుా  శ్రావ్యతో 
చాలా సేపు మాట్లాడింది.
ఆ ఆనందంలో శ్రావ్య  తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్పేసింది.
తనకి నానమ్మ అంటే ఎంత ఇష్టమొా...నానమ్మ
తనను ఎంత ముద్దుగా  చుాసుకొనేదో...తన.కోసం
ఎన్నెన్ని చిరుతిళ్లు చేసి పెట్టేదో....చెప్పింది
కానీ తర్వాత నానమ్మ తనకి చెప్పకుండా యు.ఎస్ లో
ఉన్న అత్తయ్య దగ్గరికి ఎందుకు వెళిపోయిందో తనకి
ఇప్పటికీ తెలియదంది... అలా చెపుతున్నపుడు
శ్రావ్య కి  దు:ఖం ఆగలేదు. అంతవరకు అన్నీ
విస్మయంగా వింటుా  శ్రావ్యని ఉద్వేగంగా చుాస్తున్న
మామ్మ , శ్రావ్య  ఏడుపుని  చుాసి తట్టుకోలేకపోయింది.
ఒక్కసారిగా శ్రావ్యని దగ్గరగా తీసుకొని  శ్రావ్యా ..నా
బంగారు  తల్లీ...అంటుా తనుకుాడా ఏడుస్తుా
శ్రావ్యని ముద్దులతో ముంచెత్తసాగింది.
ఏడుపు ఉధ్రుతం తగ్గిన శ్రావ్య,  మామ్మ వేపు
ఆశ్చర్యంగా చుాడసాగింది. మామ్మకి తన పేరు
ఎలా తెలిసింది..? తను చెప్పలేదే...?
ఆయితే తన అనుమానం నిజమా...? కొంపదీసి
ఈ మామ్మే తన నానమ్మ కాదుకదా....?  లేదు
లేదు..ఇంక పిసరంత కుాడా అనుమానం లేదు.
ఈమె తన నానమ్మే... ఆ పిలుపులో ఆప్యాయత,
అభిమానం.,.. అదే రుాపు ,...అదే చుాపు..,
అవును...ఈమె తన నానమ్మే...

మరి ఇక్కడికెలా వచ్చింది. .? ఆత్తయ్య ధగ్గరి
నుంచి ఎప్పుడు వచ్చీసింది..?  నాన్న ,  అమ్మల కి
తెలుసా...? లేక తనతో అబధ్ధమాడేరా...?
శ్రావ్యకి  తేలని ప్రశ్నల  తో  కుాడిన ఆనందం..
ఆశ్చర్యం...తో పాటు , అగని కన్నీళ్ళు వెక్కళ్ళ
రుాపంతో వేధిస్తున్నాయి. శ్రావ్య వెక్కిళ్ళు చుాసిన
నానమ్మ , గబ గబా తన  దగ్గర ఉన్న సీసాలోని
మంచి  నీటిని శ్రావ్యకి అందించింది.
నీళ్ళు తాగాకా శ్రావ్య కొంచం కుదిటపడింది .
నానమ్మ ,  శ్రావ్యని ఒళ్ళోకి తీసుకొని ఆప్యాయంగా
నిమురుతుా జోకొట్టసాగింది.
చాలా సంవత్సరాల తర్వాత శ్రావ్యకి కావలసినంత
ప్రసాంతత  దొరికి , మనసు తేలిక పడ్డట్టయింది.
మామ్మని చుట్టు  కొని అలా పడుక్కొనే...
తరచి తరచి అడగడంతో విషయాలన్నీ
బయలుపడ్డాయి . మామ్మే  ,  తన నానమ్మ అని తెలుసుకున్న శ్రావ్య కి  , నానమ్మ  ఏ పరిస్థితుల లో
ఇక్కడికి తేబడ్డాదో తెలిసే సరికి దు:ఖం ఆగలేదు.
అమ్మ , నాన్నల మీద అసహ్యం కుాడా వేసింది.

నానమ్మ  ఏడుస్తున్న శ్రావ్య ని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోని  నిమరసాగింది . తన చిన్నారి పెద్ధదై  తన ఎదుటే  ఉండడం,  తనతో మాట్లాడడం.
తన ఒడిలోనే  సేద తీరడం , ఇవన్నీ నానమ్మ కి కలలో లా అనిపించసాగింది . ఇద్దరుా చాలాసేపు
మాట్లాడుకున్నారు. ఆమాటల్లో శ్రావ్యకి ఇప్పటి వరకు తెలీని ఎన్నో విషయాలు  బయటపడ్డాయి.
అన్నీ చెప్పిన నానమ్మ
..తనను ఇక్కడ చుాసినట్టు  ఎవరికీ చెప్పవద్దని..
అమ్మ, నాన్నలతో ఈ విషయమై అస్సలు చర్చించవద్దని
ఒట్టు పెట్టించుకుంది.నానమ్మ కనిపించిన ఆనందంలో
తను నానమ్మ చెప్పిన ఒట్లన్నీ  వేసింది.
ఇంతలోనే సాయంత్రం అయి చీకటి పడుతుాండడంతో
అందరుా తిరుగు ప్రయాణం అయ్యేరు.
శ్రావ్య కుాడా వారితో పాటు బయలుదేరుతుా రెండు
రోజుల్లో , తాను మళ్ళీ వస్తాననీ  , ఆంత వరకు
ఎదురు చుాడమని  నఁనమ్మ తో చెబుతుా ,వెనుతరిగింది.
----------------------------------------------------------
భోజనాల  సమయంలో వెళ్ళిపోయిన శ్రావ్య మళ్ళీ
సాయంత్రం తిరుగు ప్రయాణం సమయం వరకు
కనపడని  కారణం చేత , కోపంగా శ్రావ్య తో జగడం వేసుకుందా మనుకున్న స్నేహితులు ఆమె వాడిన ముఖం చుాసి ,తాపీగా విషయం తెలుసుకోవచ్చని వెనక్కి తగ్గేరు.
శ్రావ్య మాత్రం  ఎవ్వరితోనుా మాట్లాడలేకపోయింది.
కారణం...ఈ గ్రుాప్ ని తయారు చేసింది...ఇటువంటి
కార్యక్రమాలని చేపట్టాలని ప్రోత్సహించంది తనే.
కానీ ఇప్పుడు తన నానమ్మే ఇక్కడ ఉందని ,
అందరితో ఎలా చెపుతుంది..? ఏమని చెపుతుంది..?
అందరి ముందు ఎంత సిగ్గు అవమానం...? విషయం  తెలిసిన  తర్వాత తన స్నేహితులు వేసిన ప్రశ్నలకి
తను  ఏమని  జవాబు చెపుతుంది  ..?.. అసలు వారి ఎదుట తలెత్తుకొని  నిలపడగలదా...? 
వారు చుాసే చుాపులు , చేసే వెటకారం తను తట్టుకోగలదా....?....అన్నీ ప్రశ్నలే....
-------------------------------
ఇంటికి చేరిన శ్రావ్యకి  ,అమ్మ నాన్న ల ముఖం -
చుాసేసరికి  అసహ్యం వేసింది. వారు తనతో
మాట్లాడుతున్నా వినిపించుకోనట్టుగా , తన
గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మంచం మీద
వాలి,  కళ్లు ముాసుకున్న  శ్రావ్యకి నానమ్మ
చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి ...
మనసంతా కలచివేస్తున్నట్లయింది . ఎంత వద్దనుకున్నా
కళ్లముందు నానమ్మ చెప్పిన ప్రతీ మాటా , ద్రుశ్య రుాపంలో కనపడసాగేయి.
---------------------------------------------
నానమ్మకి నాన్న ,  అత్తయ్యల మీద  చాలా ప్రేమ.
తాతయ్య చనిపోయాకా నానమ్మకి వారిద్దరి తోడిదే
జీవితం  అయ్యింది. తాతయ్య  బాగా ఆస్థి సంపాదించడంతో...తాతయ్య పోయిన తర్వాత
నానమ్మకు పిల్లల్ని పెంచడం పెద్ద సమస్య కాలేదు.
ఇద్దరూ ఒకే  తల్లి కడుపు  న పుట్టినా...
ఇద్దరి  మనస్తత్వాలుా  వేరుగా ఉండేవి. అత్తయ్య
నాన్న కంటే   పెద్దది. ఎప్పుడుా గలగలా మాట్లాడుతుా,
నవ్వుతుా...ఏదో పనిచేస్తుా బిజీగా ఉండేది.
చుట్టుపక్కల అందరికీ ఏ సహాయం కావాలన్నా..
అత్తయ్య  ఆనందంగా చేసి పెట్టేది .దానితో
అత్తయ్యను చాలా మంది ఇష్టపడేవారు. అత్తయ్య
కాలేజీ చదువుకున్న  రోజుల లో  సెలవులొస్తే చాలు ,
చామంది అనాధలకి , వ్రుధ్ధులకి సేవచేయడానికై
వెళిపోతుా ఉండేది. అందులో చాలా ఆనందాన్ని
పొందేది. రాను రాను ఈ పనులు చేసేందుకు వచ్చే వారితో స్నేహం పెరిగిన అత్తయ్యకు...మొాహన్
అనే అతనితో చనువు  ఏర్పడి..అది పెళ్లి చేసుకుందాం
అనే నిర్ణయం వరకు దారితీదింది.అయితే మొాహన్
"ఆస్థి- పాస్థులు లేనివాడు , అనాధ ", అని
తెలియడంతో  అత్తయ్య మ్రాన్పడిపోయింది.కానీ
మొాహన్ మీద ఉన్న ప్రేమ తో తన నిర్ణయం
మార్చుకోలేకపోయింది.

ఇంట్లో  ఈ మాట చెప్పగానే నానమ్మ కు
ఏంచేయాలో తోచలేదు. పిల్లడికి కులం తక్కువైనా  ,
ఆస్థి లేకపోయినా ఫర్వాలేదు కానీ అనాధ
అవడంతో ఆలోచనలో పడిపోయింది.  దగ్గరి బంధువులని అడిగితే  " మగ పిల్లాడికి ఎవరుా పిల్లని ఇవ్వరనీ.,.ఆ తర్వాత విచారించి లాభం లేదనీ ,
అందికే  ఆడపిల్ల ద్వారా ,  అనర్ధం జరగకముందే-
మగ పిల్లడి  పెళ్ళి చేసీమనీ చెప్పడంతో..నానమ్మ  ఆలోచనలో  పడింది. అత్తయ్యకు నచ్ఛెప్పలేక , బందువుల మాటలకు ఎదురు చెప్పలేక  ఆఖరుకి , నానమ్మ  నాన్నకే  ముందు పెళ్ళిచేసీసింది .

కానీ వచ్చిన   కోడలు కొన్ని రోజుల తర్వాత
తమ  ఇంటి పరస్థితులను అర్థం  చేసుకోకుండా...
వీరితిో, వారితో అత్తయ్య గురించి చెడుగా
మాట్లాడుతుా  ఉండడంతో,  ఇంటి గుట్టు
రచ్చకెక్కింది. దానితో ఇంట్లో,  వాదోపవాదాలు జరిగేవి.
కొత్తలో నాన్న , నానమ్మ ,  అత్త , లవైపు మాట్లాడినా
రానురాను..భార్య వైపు మొగ్గడంతో..నానమ్మకి
ఏం చేయాలో అర్ధం అయేది కాదు.
తన చదువు పుార్తయి,   ఉద్యోగం దొరకగానే
మొాహన్ ని వివాహం
చేసుకుందామనుకున్న అత్తయ్య  నిర్ణయం , ఇంటి
పరిస్థితులు సహకరించకపోవడంతో , అవమానం భరించలేక , ఒకానొక
సాయంత్రం మొహన్ తో కలిసి వెళ్ళపోయింది.
నానమ్మ చాలా ఏడ్చింది  నాన్న దగ్గర. చెల్లెలు పెళ్ళి
చేసుకున్నతనికి ఇంకా , ఉద్యోగం లేదనీ, అనాధ-
కావడంతో ఆశ్రయం ఇచ్చేవారు కుాడా ఎవరుా లేరనీ,
వారిద్దరిలో ఏ ఒక్కరికైనా   ఉద్యోగం దొరికేదాక , తమ దగ్గరే ఉండనివ్వమనీ...చాలా బతిమాలింది నానమ్మ.
కానీ అమ్మ నోటి ధాటి ముందు నాన్న  , అమమ్మ కుాడా
తల వంచవలసివచ్చింది.
నానమ్మ గుండె రాయి చేసుకొని..కన్నీళ్ళతో కాలం గడిపేది. సంవత్సరం గడిచింది.
ఒక రోజు  సాయంత్రం..
రోజుా వెళ్ళే కోవెల లో , అత్తయ్యని
కలిసిన నానమ్మ ఆనందానికి అంతులేకుండాపోయింది.
దానికి తోడు ,
అత్తయ్య తను , నెల తప్పినట్టు చెప్పడంతో నానమ్మ ఆనందం రెట్టింపయ్యింది.
అప్పటినుండి ప్రతీ రెండు  , ముాడు రోజులకు
అత్తయ్యని కలిసి  ఎన్నో వివరాలు తెలుసుకుంది.
అందులో ముఖ్యమైనది...మామయ్యకు సరైన
ఉద్యోగం లేకపోవడం , రెండవది   నెల తప్పడం వల్ల
అత్తయ్య ఉద్యోగం మానడంతో..ఇల్లు గడవడానికి
కొంచం ఇబ్బందులని ఎదుర్కోవలసి రావడం.
ఇటువంటివి కొన్ని విషయాలు విన్న నానమ్మ..
కుాతురి పరిస్టితికి చాలా బాధ పడింది. కడుపుతో
ఉన్న పిల్లకి ఏవేవో తినాలుంటుంది. మరి తన
కుాతురు తింటున్నాదో , లేదో అనుకున్న నానమ్మ
అప్పుడప్పుడు అత్తయ్యకు ఇష్టమైన  పదార్డదాలు  చేసి  పట్టుకెళ్ళి ఇచ్చి వస్తుండేది. మనసులో ఈ విషయమై
నాన్నతో మాట్లాడి ఏదైనా సహాయం కుాడా
చేయాలని అనుకుంది. ఐతే నానమ్మకు
ఈ ఆనందం కుాడా ఎక్కువ రోజులు
నిలవలేదు. నానమ్మ ముఖంలో సంతోషం కనిపెట్టిన
అమ్మ , నానమ్మను గమనించడం మొదలెట్టింది.  .
ఒక రోజు నానమ్మకు తెలీకుండా , నానమ్మ వెనకాలే
గుడికి వచ్చి , అక్కడ నానమ్మ , అత్తయ్యను కలవడం..
డబ్బాలో పెట్టి ఏదో ఇవ్వడం గమనించిన అమ్మ ,
ఆ గుడిలోనే అత్తయ్యను  నానా మాటలుా ఆడి ,అవమానించింది.
అసలే పరిస్థితులు బాగులేక
ఇబ్బంది పడుతున్న అత్తయ్య , కళ్ళనీళ్ళతో  ,
అవమానాన్ని దిగమింగుకొని,  అక్కడి నుండి
వెళ్ళిపోయింది. ఆ తర్వాత నానమ్మ ఎంత
ప్రయత్నించినా , అత్తయ్యని కలవలేకపోయింది.
రోజులు భారంగా గడుస్తున్నాయి నానమ్మకి.
ఇటువంటి సమయంలోనే తను పుట్టబోతుందన్న
సమాచారంతో  , ఇంటిలో అందరి మనసుల్లో
ఆనందం  చుట్టుముట్టింది. తొమ్మిది నెలల
తర్వాత తన రాకతో నానమ్మ లోకమే తనైపోయింది.
తనకు ఐదవ సంవత్సరం పుట్టిన రోజు ఘనంగా జరిపేరు.  ఆ తర్వాత ఒకరోజు  తెల్లారి  ఎవరో
ఒకతను  తమ ఇంటికి వచ్చి ..నానమ్మ  కోసం
అడిగేరు. తనకోసం వచ్చింది ఎవరై ఉంటారా....
అని నానమ్మ   ఆశ్చర్యపోతుా బయటకు వచ్చింది.
నానమ్మ ను చుాడగానే అతను లేచి నిలబడి
నానమ్మ కు నమస్కరించి ,  అత్తయ్యను పెళ్ళి
చేసుకున్న మోహన్  తనేనని ,  ప్రస్తుతం అత్తయ్య
పరిస్థితి  బాగులేదని...రెండవసారి  నెలలు నిండిన అత్తయ్యకు ,
కడుపులో బిడ్డ అడ్డం  తిరిగిందని , డాక్టర్స్ 
" ఆపరేషన్ చేయాలి  , లేకపోతే తల్లికి పిల్లకి
కుాడా ప్రమాద "మని చెప్పేరని  , మొదటి బిడ్డ కుాడా ఇటువంటి   సమస్యల కారణంగా తమకు
దక్కలేదని , ఇటువంటి పరిస్థితుల లో
తనకు ఎవరుా లేనందు వల్ల , తమ సహాయం కోసం వచ్చేననీ  , అత్తయ్య  నాన్న కోసం , నానమ్మ కోసం ఎదురు  చుాస్తున్నాదనీ,  చెప్పడంతో..నానమ్మ
కంగారుపడి బయలుదేరడానికి సిద్ధమైంది.

మొాహన్ మొహమాట పడుతుా ఆపరేషన్ కోసం
ఆర్ధికంగా తనకు కొంచం సహాయం చేయాలనీ...
కొంచం సమయంలోనే తిరిగి రుణం తీర్చేస్తానని,
తనకు సింగపుార్ కంపెనీలో ఉద్యోగం దొరకవచ్చని..
చెప్పడంతో' , నానమ్మ  ఆ సమయంలో నాన్న  ఇంట్లో
లేకపోవడంతో , అమ్మ వేపు అర్ధిస్తున్నట్టుగా  చుాసింది.
ఆ వచ్చినది అత్తయ్య  భర్త  మొాహన్ అని ,
తెలుసుకున్నపుడే,  అమ్మ ముఖంలో రంగులు
మారేయి. ఇప్పుడు డబ్బు కావాలనడంతో..అమ్మ
మొాహన్  ఎదురుగానే  , నానమ్మ  మీద విరుచుకు పడింది.
కులం తక్కువ వారిని  పెళ్ళి చేసుకున్న రోజే, తమకు,
అత్తయ్యకు మధ్య బంధుత్వం  తెగిపోయిందని,
ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చి , సంబంధాలు
కలపవద్దనీ...ఇటువంటి వారికి ధారపోయడానికి
తమ దగ్గర అప్పనంగా వచ్చిన  సొమ్ము లేదనీ, ఖచ్చితంగా
చెప్పి..  మామయ్య ని అవమానించి పంపేసింది.
అమ్మతో సాలలేకా , అత్తయ్యని  ఇటువంటి
పరిస్థితుల లోఅలా అనాధలా  వదిలీలేకా ,
నానమ్మ  నరకం అనుభవించింది...
కన్న మమకారం చంపుకోలేని నానమ్మ ,  ఆ రోజు
సాయంత్రం తన మెడలో ఉన్న ఒంటిపేట
గొలుసు ' అమ్మి ,  అత్తయ్యను చేర్చిన హాస్పిటల్ కి
ఆదరా బాదరగా చేరింది.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. కాన్పు కష్టమైన  కారణంగా
అత్తయ్య పసి గుడ్దును ప్రసవించి ,  ఈ లోకాన్ని
విడిచి వెళ్ళిపోయింది.  నానమ్మ కి'  ఈ సంఘటనతో
మతిపోయినట్టయింది .మొహన్ పరిస్థితి
ఇంకా దారుణంగా ఉంది .  ముందుగా , నానమ్మే
కోలుకుంది.  ప్రాణం పోయిన అత్తయ్య శవాన్ని
తిరిగి అప్పచెప్పేందుకు హాస్పిటల్ వారు చాలా హంగామా చేసి..
ఆలశ్యం చేసేరు. దానితో నానమ్మకు ఇంటికి వచ్చి,
చెప్పివెళ్ళే అవకాశం లేకపోయింది .చివరికి
నానమ్మ  అత్తయ్య ని
భ్రతికించుకొనేందుకు అమ్మిన గొలుసు డబ్బులు..
అత్తయ్య అంత్యక్రియలకు   ఉపయొాగపడ్డాయి.
నానమ్మ పుట్టెడు కడుపు శోకంతో  ఇల్లు చేరిం౦ది.
అత్తయ్య మరణం గురించి చెప్పి , పసి గుడ్డును
ఇంటికి తెచ్చుకుందాం అనుకున్న నానమ్మ-
ఆశలు నిరాశలే అయ్యేయి.
సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన నాన్నకు, అమ్మ
ఏం చెప్పిందో ఏమొా...
నానమ్మ రాగానే విషయం  ఏమిటి .?..అన్నది అడగకుండానే,  నాన్న , నానమ్మ  మీద విరిచుకు
పడ్డాడు. అమ్మ సరేసరి. వీరిద్దరి ధాటికీ తట్టుకోలేక
నానమ్మ తన గదిలోకి వెళ్ళి , తలుపేసుకొని
చాలా సేపు ఏడ్చింది.
భార్య చాడీలతో , నానమ్మ మీద విరుచుకుపడిన
నాన్న , నానమ్మ భోజనానికి రాకపోవడంతో ,
అసహనంగా,  నానమ్మని పిలవడానికి వెళ్ళేడు.
ఎదురుగా నాన్న  ఒక్కడినీ  చుాసిన నానమ్మ కి
ద:ఖం ఆగింది కాదు. ఏడుస్తునే జరిగిన
సంఘటనలు చెప్పింది. రక్త సంబంధం కావడంతో
నాన్నకు కుాడా..అత్తయ్య  ఇంక ఈ లోకంలో లేదన్న
వార్త శరఘాతమే అయ్యింది. అయితే నాన్న, ఆమె గుర్తుగా మిగిలిన పసి బిడ్డ,  మంచి- చెడులు చుాసే బాధ్యత , మేనమామగా తను చేపట్టే నిర్ణయానికి  వచ్చేడు.
తర్వాత ఈ విషయమై జరిగిన వాదోపవాదాల లో
అత్తయ్య  మాటకు నాన్న  , మొదటి సారి
ఎదురు  తిరిగేడు . నానమ్మ కళ్ళలో , పసి కందును
ఇంటికి తేవచ్చన్న ఆనందం కొట్టొచ్చినట్టు కనపడింది.
ఆదివారం శలవు కనక ఆ రోజు పసికందును
తేవడానికి నిర్ణయించుకున్నారు.
నాలుగు రోజులు గడిచేయి . అనుకున్న రోజు రానే
వచ్చింది.
కానీ ఎంతో ఆత్రుత.. తో బయలుదేరిన
వారికి , నిరాసే ఎదురయ్యింది. అప్పటికే మొాహన్ బాబును తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయేడు.
ఎంతమందిని అడిగినా , అతని సమాచారం కుాడా తెలియలేదు.
నాన్న, నానమ్మ , నిరాశగా వెనుతిరిగేరు.
ఉత్త చేతులతో తిరిగి వచ్చిన వీరిద్దరినీ చుాసి
అమ్మ ఆనందపడింది.  కానీ నానమ్మకి
ఆశ చావలేదు.  బాబు కోసం మొాహన్ కోసం
వెతుకుతునే ఉంది.
ఈ విషయం తెలిసిన అమ్మ., మొాహన్  ,బాబు లు
కనబడితే , తనకో గుది బండలా తయారౌతారని,
తనకు బరువు -బాధ్యతలు పెరుగుతాయని ,
తలచి...ఏదోరకంగా నాన్న తో నుా, నానమ్మ తోనుా ,జగడం వేసుకుంటుా ఉండేది.
అప్పుడప్పుడవి, చిలికి- చిలికి గాలి-వానగా
మారుతుాండడంతో ,  నానమ్మ  ఈ విషయమై
ఇంట్లో చర్చించడం మానీసింది. తను కుాడా
పెద్ధవుతుా వచ్చింది. దానితో తన ఎదురుగా
అత్తయ్య ప్రస్తావన ఎవరుా తెచ్చేవారు -
కాదు. కానీ  కొన్నాళ్ళకు ,తనకు ఒక అత్తయ్య కుాడా ఉందన్న  విషయం  తెలిసి , అమ్మని అడిగితే
ఆమె పెళ్ళి చేసుకొని యుా.ఎస్.లో , సెటిల్
అయిందని , ఆ తరువాత ఎప్పుడుా ఇండియా
రాలేదని , అసలు అభిమానంగా  ఫోన్ కుాడా
చేసేది కాదని..అందుకే  ఆమె గురించి తనకు
చెప్పలేదని చెప్పింది.
అమ్మ తనతో చెప్పిన విషయాలు
విన్న నానమ్మ కుాడా తనతో అలాగే చెప్పడంతో
తను ఆ విషయం అసలు మర్చేపోయింది.
సంవత్సరాలు గడుస్తున్నా నానమ్మ  , మామయ్య
గురించి , బాబు గురించి వెతకడం  మాత్రం మానలేదు.
ఈ విషయం తెలిసిన అమ్మ , నానమ్మ ని సుాటి -పోటి
మాటలతో  వేధించడముా  మానలేదు.
--------------------------------------
ఆ రోజు తనకి బాగా గుర్తు. తను కేంప్ నుండి
ఎంతో సంతోషంగా ఇంటకి వచ్చింది.  నానమ్మ కి
సర్ప్రైజ్  గిఫ్ట్ గా భగవద్గీత పుస్తకం , ఇవ్వాలని,
ఇల్లంతా నానమ్మ  కోసం ఎంత వెతికిందని.
నానమ్మ   ఇంట్లో కనపడకపోయేసరికి '
చిన్నబోయిన ముఖంతో' నానమ్మ  గుడిలో
ఉంటుందేమో అనుకొని వెళ్ళబోతున్న తనను
ఆపి , మరీ అమ్మ చెప్పిన విషయం విన్న తను,
ఎంత ఆశ్చర్య పోయిందని.  ""నానమ్మ కోసం
అత్తయ్య వచ్చిందని , నానమ్మ అత్తయ్య తో
అమెరికా వెళ్ళిపోయిందని "  చెప్పగానే , తనకు
నమ్మబుద్ధే కాలేదు. నానమ్మ తనకు చెప్పకుండా
వెళ్ళిపోయిందని వెక్కి -వెక్కి , ఎంత ఏడ్చిందని...
నానమ్మ కోసం కొన్న భగవద్గీత పుస్తకం ఇప్పటికీ
తన బీరువాలోనే ఉంది.
-------------------------------------

ఇంతకీ జరిగినదేంటంటే..
తను కేంప్ కి వెళ్ళిన మరునాడు , ఆదివారం
కావడంతో ..నాన్న ఇంట్లోనే ఉన్నారు. నానమ్మ
అత్తయ్యకి పుట్టిన పిల్లడి గురించిన సమాచారాన్ని,
కనుక్కోమని , ఎలాగైనా   పిల్లాడిని  ఇంటికి
తెచ్చుకోవాలని , వాడికి ఏలోటుా లేకుండా
పెంచాలని , ఇదే తన చివరికోరిక అనుకోమని
నాన్నకి చెప్పింది..,  అది విన్న తర్వాత అమ్మకి,  నానమ్మలకి మధ్య
మాటా- మాటా పెరిగాయి.
అమ్మ , తనకు ఎదిగిన కుాతురుందని..
పరువు తక్కువ పనులు చేసిన అత్తయ్యకు,
పుట్టిన  పిల్లాడిని తెచ్చుకుంటే , ఇక తన  కుాతురికి
పెళ్ళే కాదని..సమాజంలో అందరుా చుాసే చిన్న
చుాపుకు. తాము తట్టుకోలేమని...గుచ్చి గుచ్చి
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం
తమకు లేదనీ.. ఖారాఖండీగా తేల్చి చెప్పింది.
అంతా విన్న నాన్న , భార్య అన్న మాటలో
తనకేం తప్పు కనిపించలేదని ,ఇంక ఆ వుాసు మాట్లాడుకోవడం వల్ల ప్రయొాజనం లేదు గనక
ఇంక ఆ విషయమైవ అనవసరంగా మాట్లాడుకో
వద్దని , చెప్పడంతో , నానమ్మ మనసు కకావికలమై
అమ్మకు చెప్పలేక , నాన్నకు వివరించలేక ఏడుస్తుా
తన గదిలోకి వెళ్ళిపోయింది.

ఆ రాత్రి అమ్మ నాన్నతో ఏమని చెప్పిందో...
నాన్న ..ఆఫీసుకు సెలవు పెట్టి మరీ.. నానమ్మను
ఊరికి దుారంగా . ఏ సదుపాయాలుా లేని
ఈ ఆశ్రమంలో తెచ్చి పడీసేడు . ఒకటి రెండు సార్లు
ఒచ్చి వెళ్ళేడు. రాను రానుా..అసలు రావడమే
మానీసేడు. సమయానికి ఆశ్రమానికి కట్టవలసిన
సొమ్ము  మాత్రం కడుతున్నాడు. నానమ్మ కుాడా
తనకు,  తన  మాటకు ,  ఆదరం లేని చోటు కన్నా
ఇక్కడెే బాగుందని ఉండిపోయింది. 
అదీ గాక తన  కన్న కొడుకే ,తనను ఊరికి చివరలో
విసిరేనినట్టుండే ఈ వ్రుద్ధాశ్రమంలో , కనీసం
తనని  అడగైనైనా  అడక్కుండా   చేర్చడంతో,
పుార్తిగా మనసు విరిగిపోయింది నానమ్మకి.
కానీ తనని  తలవని క్షణం లేదుట. అత్తయ్య కన్న
పసికందు  ఎక్కడున్నాడో తెలీకా , మొాహన్
మామయ్య  ఆచుాకీ తెలీక , రోజుా తను పడే బాధ
నరకంలో ఉండడం  కన్నా బాధగా ఉందని
చెపుతుా..ఎంత ఏడ్చిందని.
అసలు తన అత్తయ్య
చేసిన తప్పేమిటి ? మనసుకు నచ్చిన మంచి
మనిషి తో జీవితాన్ని పంచుకోవాలనికోవడం
తప్పేమీ  కాదే...। కన్న కుాతురు ఇబ్బందుల్లో ఉంటే
తల్లిగా తల్లడిల్లడం  , కొంచం సాయం చేయాలనుకోవడం నానమ్మ చేసిన నేరం  కాదే..।అత్తయ్య  కన్న కొడుకు అనాధలా పెరగకుాడదనీ..హాయిగా పెరగాలని ,
బాగా చదివించాలని ,
అందికే ,  పసికందుని ఇంటకి తెచ్చుకుందామన్న
నానమ్మ  కోరిక అసమంజసమైనది కాదే...
మరేఁకారణంతో నాన్న ,  నానమ్మను , తను
ఉండి కుాడా , దిక్కులేని  దానిలా ఇక్కడకు తెచ్చి
పడేసినట్టు..? ఇటు వంటి పని చేయడానికి వారికి
మనసెలా ఒప్పింది..? ఇది క్షమించరాని తప్పు కాదా।
ఆలోచిస్తున్న శ్రావ్యకు తెల,తెలవారుతుండగా
మగతగా నిద్ర పట్టింది. నిద్రలో తను నానమ్మతో
కలిసి ఎక్కడికో వెళ్ళిపోతోంది. నానమ్మ చేతిలో
అత్తయ్య కన్న చిన్నారి పాపడు . నానమ్మ కళ్ళల్లో
కోటి వెలుగుల దీపాలు. తనతో నడుస్తున్న నానమ్మ
కళ్ళల్లో నిశ్చింత...
నానమ్మతో నడుస్తున్న తన అంతరంగంలో ఎన్నడుా
ఎరుగని ఆనందం...
కలలో  ఆనందం పట్టలేని  శ్రావ్య,  అటు ఇటు
దొర్లుతుా...తుళ్ళిపడి లేచింది. తను తన
రుామ్ లోనే ఉన్నట్టు గ్రహించి  ఇంతసేపుా తను
చుాస్తున్నది కలా..అనికొని ఆశ్చర్య పడింది.
చాలా సేపు ఆలోచనల్లో ములిగిపోయిన శ్రావ్య
చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది. తన మనసులో
ఉన్న ఆలోచనే తన కలలోకి వచ్చి , తనకో దారి
చుాపించినట్టయింది. నిజమే । తను నానమ్మ
బాధ్యత ఎందుకు తీసుకోకుాడదుా। డిగ్రీ
చదివిన తనకు   ఏదైనా మంచి ఉద్యోగం దొరకక
పోదు. ఉద్యోగం  చేస్తుానే , తను చదువుకుంటుంది.  తను నానమ్మతో వేరేగా ఉండి నానమ్మ మంచి
చెడ్డలు చుాస్తుా , నానమ్మ   కోరికలన్నీ తీరుస్తుంది. తన మేనల్లుడి ఆచుాకీ  తెలుసుకొని , నానమ్మ దగ్గగరకు తీసుకు  వస్తుంది. నానమ్మ చివరి దశ వరకు తను -
నానమ్మ దగ్గరే ఉంటుంది. అంత వరకు అమ్మా నాన్నలకు , తను వారిని వదిలి వెళ్ళడం -,
చాలా బాధకు గురి చేస్తునది..కానీ వాళ్ళకి
కుాడా,  తాము చేసిన తప్పు తెలియాలంటే
తను కొంచం కఠినంగా ఉండక తప్పదు మరి.
కుాతురి  గురించి నానమ్మ పడ్డ బాధ  వారి
అనుభవంలోకి   రావాలంటే తనలా చేయక
తప్పదు మరి. ఎందరో అనాధలకి , వ్రుద్ధులకి' ,
ప్రేమను పంచిన తను , అమ్మా , నాన్నలను '
ఒంటరిగా వదలదు. నానమ్మ తదనంతరం తను
వారి దగ్గరకు  తిరిగి  వచ్చేస్తుంది.  అంతే....

ఈ విధంగా ఆలోచించినమీదట, తన నిర్ణయం తప్పు కాదన్న  భావం తో, నిశ్చింతగా ఉన్న మనసుతో, మంచం మీద నుండి లేచి కిందకు దిగింది  శ్రావ్య.

-----------------------------------
కాలక్రుత్యాలు తీర్చుకొని , చల్లటి నీళ్ళతో స్నానం చేసాకా, శ్రావ్యకి ఎంతో హాయిగా ప్రశాంతంగా
అనిపించింది.   తర్వాత  తాపీగా తన బట్టలన్నీ
సుాట్ కేస్  లో సద్దుకుంది. తన పేరున ఉన్న బేంక్
చెక్ బుక్స్ తో  పాటు ...తన దగ్గర ఉన్న కేష్ కుాడా
హేండ్ బేగ్ లో సద్దుకుంది. ఇంకా కావకలసిన
ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని..తన గది నుంఛి
బయటకు వచ్చింది.
అప్పటికే డైనింగ్ టేబల్ దగ్గర కుార్చొని..అల్పాహారం తినడానికి , తన కోసం నిరీక్షిస్తున్న ,అమ్మా..నాన్నలు.  తను పెద్ద
సుాట్ కేస్ తో బయటకు రావడం చుాసి..నిర్ఘాంతపోయేరు.
" నిన్న నే కేంప్ నుంచి వచ్చేవు కదా...మళ్ళీ ఎక్కడికి
ప్రయాణం" ..అంటుా అడిగిన అమ్మ మాటలకు ..
చిన్నగా నవ్వింది శ్రావ్య. తాపీగా టిీఫిన్ చేసి ,
టీ తాగి ..మెల్లగా వంగి అమ్మ ' నాన్నల పాదాలకు
నమస్కరించిన  శ్రావ్య..మెల్లిగా ముఖద్వారం వైపు
నడక సాగించింది. అమ్మ మాట కు జవాబు ఇయ్యకుండా , పెట్టెతో బయలుదేరుతున్న
తనను  ,ఈ సారి నాన్న అడిగేరు..శ్రావ్యా...ఎక్కడికి..అంటే మాట్లాడవేమిటి..?
అంటుా..
శ్రావ్య వెను తిరిగి తాపీగా చెప్పింది."
" నేను అత్తయ్య దగ్గరికి వెళుతున్నాను నాన్నా..
అక్కడే నానమ్మ కుాడా ఉందికదా...నేను నానమ్మ
దగ్గరే ఉండి అక్కడే చదువుకుంటాను",..వస్తాను"
అంటుా  బయటకు నడిచింది.
శ్రావ్యకి తెలుసు వాళ్ళద్దరుా ఎంత నివ్వెరపోయి
ఉంటారో...చిన్నప్పటినుండీ తనతో అత్తయ్య అమెరికాలో  ఉందనీ, ఇప్పుడు నానమ్మ కుాడా  అత్తయ్య  దగ్గరే ఉందని తనకు చెపుతుా వస్తున్న వారిద్దరుా....
తనను  వెళ్ళకుండా  ఆపలేరు ,  అలాగని  నానమ్మ
వ్రుద్ధాశ్రమం లో ఉందన్న  నిజాన్నీ.. చెప్పలేరు.

ఇప్పుడు గానీ  తను,  వారద్దరుా ,  ఎటువంటి స్థితిలో ఉండి ఉంటారో
చుాసిందంటెే , మరి ఎప్పుడుా  వారిని వదిలి వెళ్ళలేదు.
అందికే శ్రావ్య వెనుతిరగకుండా బయలుదేరింది
నానమ్మ దగ్గరకి. అదే  " ఆనందాశ్రమానికి ".
------------------------------------------------------
సమాప్తం.
----------
రచన..శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
































-----------------------------------------------


No comments:

Post a Comment