"కరోనా రెండో ముఖం"
(స్పెయిన్కు చెందిన వివియన్ ఆంగ్ల కవిత కు తెలుగు)
అనువాదం: ఆకుల మల్లేశ్వరరావు
భూమాత గొణిగింది ,నీవు వినిపించుకోలేదు/ ధరిత్రి నోరు విప్పి చెప్పింది, నీలో ఉలుకూ పలుకూ లేదు /నేల పెద్ద గొంతుతో అరిచింది, పెడచెవిని పెట్టావు/ అందువల్లే నేను పుట్టాను/
నేను శిక్షించడానికే పుట్టలేదు/
నేను మేలుకొల్పడానికే వచ్చాను/
అవని తల్లి సహాయం కోసం ఎలుగెత్తింది/
జల ప్రళయం అయినా ,నీవు సరకుచేయలేదు/ కార్చిచ్చులు పెచ్చరిల్లాయి/ నీవు పెడమొహం చూపావు/ పెను తుఫాను గాలులు. నీవు పెదవి విప్పలేదు/ భయంకర సుడిగాలులు,అయినా నీలో చలనం లేదు/ ఇప్పటికీ నీవు బధిరుడు గానే ఉన్నావు/
భూ ఖండాలలో జలచరాలు/ కాలుష్య కోరల్లో చిక్కి మృత్యువు పాలయ్యాయి/ హిమ నదాలు కరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి/ భయంకర కరువు రక్కసి కోరలు చాచింది /అయినా నీవు స్థాణువే అయ్యావు /
పుడమి తల్లి ఎంత చేదు విషాన్ని మింగుతోందో,తెలిసీ నీవు స్పందించలేదు /నీ ఆగని యుద్ధాలు, అంతులేని వ్యామోహం/నీ పోకడ,పంథాను మార్చుకో లేదు /
భరింపలేని విద్వేషాలు ఒకప్రక్క/ ప్రతిరోజు లెక్కకు మించిన చావులు చంపుకోవడాలు/
నీకు ఐఫోన్ ఎలా సంపాదించాలన్న రంధి తప్ప/ నేలమ్మ ఏం చెప్పాలనుకుంటుందో, పట్టింపు లేదు /
అందుకే ఇప్పటి నా రాక.
ఈ ప్రపంచంలోని అన్ని దారులను అటకాయించాను. అంతిమంగా నీకు వినక తప్పలేదు/ నీ ఇంటిలోనే నిన్ను శరణార్ధుని చేశాను /భౌతిక విషయ వాంఛల వెంపర్లాటను అడ్డుకున్నాను./
ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలమటిస్తున్న నేలమ్మ లాంటిదే/ ఇప్పుడు నీలో ఊపిరిని దక్కించుకోవడం ఎలా? అన్న తపన /
ఎలా ఉందీ అనుభవం ?/
నీ ఒంట్లో జ్వరం,దావానలంలా మండుతోందా ?/నీ శ్వాస కోశ ఇబ్బందులు- మరి నేల తల్లి/ ఊపిరి తిత్తుల్లో ఎంత విషవాయువులు,గుప్పించావోతెలుసొచ్చిందా ?/నీ వంట్లో రోజురోజుకీ నిస్సత్తువ./ భూసారం కోల్పోతున్న భూమాత నీరసించి పోవడం కనిపించిందా?/
నేను నీ సౌఖ్యాలను లాక్కున్నాను /నీ బలాదూర్లకు అడ్డుకట్ట పెట్టాను/ పుడమి తల్లి పడుతున్న పురిటినొప్పులు/ నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను /
భూగోళాన్ని స్థంభీభూతం చేశాను /
మరి ఇప్పుడో...
చైనాలో వాయు ప్రమాణాలు మెరుగు పడ్డాయి /నీలాకాశం మళ్లీ స్వచ్చంగా కనిపిస్తోంది/ ఫ్యాక్టరీ గొట్టాలు విషం చిమ్మడం ఆపు చేశాయి /వెనిస్ లో నీటి రహదారులను కాలుష్యం చేస్తున్న/గండోలా పడవలు తిరగడం ఆగింది/
ఇప్పుడు నీవు చేస్తున్న తప్పులు తెలుసొచ్చాయా?/ స్థిమితంగా కూర్చుని పరిశీలన చేసుకుంటున్నావా ?/
మళ్లీ చెబుతున్నా, నేను /నిన్ను శిక్షించడానికి రాలేదు /నిన్ను మేల్కొలపడానికీ, నీ పెనునిద్దుర వదిలించడానికే/ వచ్చాను .వచ్చిన పని పూర్తి కాగానే నిష్క్రమిస్తాను/
ఈ గుణపాఠాన్ని మాత్రం మర్చిపోకు/
నేలతల్లి ఘోష విను /
నీ అంతరాత్మ చెప్పేది విను/
భూగోళాన్ని కాలుష్యం చేయడాన్ని ఆపు /మీలో మీరు కొట్లాడుకోవడం నిలుపండి/ భౌతిక సుఖాల గురించే, ఆలోచించడాన్ని వదులుకోండి/ నీ పొరుగువారిని ప్రేమించడం మొదలు పెట్టు/ నీ జన్మ భూమిని, సకల జీవ జాలాన్ని/ ప్రేమించడం, గౌరవించడం,బ్రతకనివ్వడం/ నేర్చుకో. ప్రకృతిలో సృష్టి లో/ విశ్వాత్మలో నమ్మకం పెట్టు/
మాట తప్పావో, ఈసారి/ పరిణామం ఇంకా భయంకరం/
కరోనా చేవ్రాలు
79818 72655.
No comments:
Post a Comment