పోటీలచిచ్చులో అమ్మానాన్నల్నేయకు
..................
కన్నవాళ్ళనే
విడిగా చూస్తూ
అమ్మానాన్నల్ని
విడదీస్తూ
అమ్మ గొప్పా?
నాన్నగొప్పా ?
ఎవరుగొప్పంటూ
లెక్కలుకడుతూ
ఓ అమ్మ కొడుకైననాన్నేఎందుకో
తడబడుతూ వెనకబడ్డాడు
అంగట్లో షరాబులా కనబడ్డాడు
కనబడకున్నా కడుపు
నిలబడిందనగానే
బిడ్డనుకాచుకోవటానకి
నోరుకట్టేసుకున్న అమ్మ
నాన్నకన్నాముందే రుచులు మరచింది మనకోసం!
చూలువార్త తో ఇంటాబయటా నాన్నకు ప్రశంసలు
అమ్మకు అన్నింటా ఆంక్షలు
తొమ్మిదినెలలు అమ్మకడుపే
నా ఉయ్యాల
దెబ్బలుతిట్లుఅగచాట్లుంటే
అమ్మకే తెలియాల!!
నాన్న పడ్డాడా అమ్మవెనకాల?
ఆడో? మగో? అమ్మకు బిడ్డే కావాల!
ఆ వివరాలు మాత్రం ఇతరులకు కావాల!
వెనకబడ్డాడేమో నాన్న ప్రశ్నల వెనకాల?
కడుపులోఉన్న నా కోసం
ఆస్పత్రి క్యూలో కష్టాల్లో..
ఎన్నిసార్లున్నాడో వెనుక కనబడ్డాడో నాన్ననే అడగాల?
టీకాళ్ళూ సూదులు ఎన్నేసుకుందో అమ్మ నాకోసం
కనీసం వెనుకనిలబడ్డాడేమో నాన్ననే అడగాల!
నిండుతున్న నెలలతో
బరువులూనొప్పులు పెరుగుతూంటే
పండుతున్నాయి కలలంటూ
మురిసిపోతూన్న అమ్మ
వెనకాల ఎన్నిగంటలు నిలబడ్డాడో నాన్ననే అడగాల!
కాన్పునొప్పులు యమగండాలై
అమ్మఊపిరిని చుట్టేసినప్పుడు
సానుభూతితో వెనకనిలబడ్డాడో?
వారసుడిరాకకై ఆరాటపడ్డాడో?
సత్యసాక్షిగా నాన్న ఆత్మనడగాల!
మలమోమూత్రమో
మరేదైనా కుడిఎడమలుచూసుకోకుండా
చేతులుచాచి నన్ను శుభ్రంగా ఉంచేస్తున్నప్రతిసారీ
వెనకాలనిలబడ్డాడేమో ?నాన్ననే అడగాల!
నా కంటికి తానే రెప్పై
నా ప్రాణమే తనకు ప్రాణమై
నా వెంటే తోడైనీడై
నన్ను నడిపించుకున్న అమ్మకుతోడై.....
ఏమాత్రం వెనుకనిలబడ్డాడో నాన్ననే అడగాల!
ఉదయం మాకోసం డబ్బుకై బయటపడి
సాయంత్రం అలసటతో ఇంట్లో అడుగిడి కష్టపడే నాన్న గొప్పా?
పగలూరాత్రీ నాపై ప్రేమతో అలసటనువిసుగును ఆనందంగా మార్చుకుంటూ ముద్దుమనసుతోనన్నుమోసేఅమ్మ గొప్పా?
అంటూ అనుమానాలా?
అమ్మముందు! నాన్న వెనకాల!
అంటూ ప్రశ్న లెందుకు పుట్టాల?
అమ్నైనా నాన్నైనా
అమ్మకే పుట్టాల!
అమ్మకు పుట్టిన ఏ బిడ్డయినా
అమ్మనే ముందుచూడాల!
అమ్మకు నాన్నకు మధ్యపోటీలా?
నాన్నను గెలిపించేదీ అమ్మే ఎల్లవేళలా!!
గాదిరాజు మధుసూదన రాజు
No comments:
Post a Comment