ఆగని కన్నీరు ఏరులై పొంగుతోంది.
ఐన వారి జ్ఞాపకాలు అంతరంగాన్ని
కలవరం పెడుతున్నాయి.
చాలీ చాలని బ్రతుకు బాటలో
తనతో పాటు మరో నాలుగు
ప్రాణాలు నలిగిపోతున్నాయి.
రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం.
మట్టి బతుకుల గతుకుల బాటలో.
ముసలి తలిదండ్రుల బరువు-బాధ్యత -
భార్య, ముగ్గురు పిల్లల బంధంతో బరువెక్కింది.
పుాట గడిచే దారి కానరాని,
బతుకు బండి ప్రయాణం -
పల్లె దాటి పట్టణం దారి పట్టింది .
రోజు కుాలీ రాట్నం లో ఒరుసుకుపోతోంది.
రెక్కలు ముక్కలుగా చేసి కుాడబెట్టిన డబ్బు
భార్య పిల్లలు , కన్నవారి కడుపులకు
గుప్పెడు మెతుకుల వరమైంది.,
నిశ్చింత తో నిండిన సంత్రుప్తి..
తన కాయ కష్టపు అలసటని
చమట రుాపంతో చల్లపరుస్తోంది.
ఇంతలోనే ఊహించని దుమారం.
కోరలు లేని కరోనా కణం.....
ఊరుార్ల ఉసురు పోసుకుంటుా
ప్రపంచమంతా అల్లుకుపోతోంది.
లాక్ డౌన్ కట్టడి ,కష్ట జీవుల బతుకుల్లో
గాడాంధకారాన్ని నింపుతోంది.
చేతిలో పని లేక, ఇంటికి పంపేందుకు రుాకల్లేక ,
చచ్చేందుకు దారిలేక , ప్రాణఁం కొట్టుకుపోతోంది.
రోజులు వారాలయ్యేయి. వారాలు నెల లయ్యేయి.
పరుగులు పెట్టే జనం ఇళ్ళ ల్లో బందీలయ్యేరు.
జన సంచారం లేని నిర్మానుష్యపు రోడ్లు..
ముాత పడిన షాపులు..స్కుాళ్ళు..ఆఫీసులు
పుార్తి వ్యవసాయం స్థంభించిపోయింది.
దుార దర్సన్ లో వార్తలు సమ్మెట పోట్లయ్యేయి.
కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యేరు.
అన్నమొా రామచంద్రా అంటుా అలమటించే వారు,
రోజు కుాలీల ఆక్రోశాలతో , అవని అట్టుడికిపోతోంది.
మొబైల్ సందేశం తో తన వెన్నెముక కుాలింది.
ఊరిలో ముసలి తలిదండ్రులని
క్వారంటైన్ లో పెట్టారట.
పొరుగుారి నాయుడుగారింట్లో
పాచి పనికి పోతున్న రంగి ,
నలుగురు కామాంధుల క్రౌర్యానికి
బలిపశువై బతుకు చాలించిందట.
నన్ను పిలుచుకు వస్తాన ని
కాలి నడకన బయలుదేరిన
పెద్ద కుాతురు కనకం , నడవలేక
నడి మధ్యలో , చతికిల పడిందట.
ప్రాణం ఉందో..పోయిందో..తెలీదంట.
పట్టెడన్నం కోసం పెద్దోడు
చంటాడి నొదిలి రోడ్లంట పడ్దాడంట.
ఏడకి పోయాడో...ఎక్కడున్నాడో..?
పాలకోసం ఏడ్చి..ఏడ్చి...
చంటాడు సొమ్మసిల్లి పోయేడట.?
కుటుంబం మొత్తం ఛిన్నా- భిన్నమైన విషయం
తన మనసు పొరల్లో దావానలమై రాజుకుంటోంది.
ఎవరి మీదో తెలీని కోపం..కసి
కాలసర్పమై తననే కాటువేసేందుకు
పడగ విప్పి నాట్యం చేస్తోంది.
కనికరం లేని కరోనా కంటకంగా తయారైంది.
కనబడని , వినబడని విధ్వంశమై
విలయ తాండవం చేస్తోంది..
వేల కొలదీ ప్రాణాలను బలితీసుకుంటున్నాది.
గొప్ప -బీద తేడా లేదు.
ముసలీ -ముతకా జాలి లేదు.
పిల్లా -పాపా...ముద్దుా లేదు.
పట్నం- పల్లె...హద్దు లేదు.
ప్రతీ చోటా మ్రుత్యువు కోత..
ఇంటింటా కరోనా భయం తో జీవితం రోత...
ఈ కన్నీటి ఆక్రోశాలకి అంతం లేదా..
ఈ మహమ్మారి కి మందులేదా...
ఈ కట్టడికి, విడుపు లేదా..
ఓ..భగవంతుడా..నీ ఉనికెక్కడ..?
-----------------
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్..( మహరాష్ట్ర ).
---------------
No comments:
Post a Comment