#బ్లాక్_క్వారంటైన్
_______________ ✍Shajahana Begam
బుర్ఖా ఒకటే కాదు...
మనం మాట్లాడాల్సిన
జీవితాంశాలు
చాలా ఉన్నాయి భాయియో..
నా ఇష్టాలపై ఎప్పుడో
నఖాబ్ తొడిగేశారుగా
ఇంక
పరదా దాటి నా మాట
నీకు వినపడుతుందా..?
నానమ్మి
నీలాంటి ఎంతమందికి జన్మ నిచ్చి
గర్భసంచి కిందికి జారి
మనిషి కూర్చోలేక నిలబడలేక
తల్లడిల్లి నిద్రలోకి ఊరడిల్లింది
ఆడవాళ్ళ గర్భసంచీ అంటే
నీ చేతి సంచీ కాదు
ఇష్టం వచ్చినట్టు గాయం చేయడానికి
ఎన్నిసార్లు చచ్చి బతికి ఉంటుంది
లేతమనసు వయసు
నీకు తెలుసా
చేతులకు కాళ్లకు నడుముకు
ఆభరణాలున్నట్లే
జారిపోకుండా
గర్భసంచికి కూడా
మెటల్ ఆభరణాలు తొడుగుతారని...
భరించలేని నొప్పి
24/7 వెంటాడుతుందని
చిరునవ్వు వెలిగే దీపాలు కాదు
నొప్పి పంటికింద దాచే
చీకటి నీడలు అమ్మలు
నువు తొమ్మిది నెలలు
నివాసముండి
ప్రాణం పోసుకున్న
గర్భసంచి కలిగిన
నీ కన్న తల్లికి
నువు రూల్స్ పెడతావు...
కొడకా... ఎంత కృతజ్ఞత!?
నువ్వుగాని.. నీ తండ్రి, నీ తాత గాని
నఖాబ్ తొలగించి
అడిగిన దాఖలానే లేదు
నొప్పి గురించిన పరామర్శ లేదు
ఎప్పుడూ చింత
ముసుగు మీదనే !
కూతుర్లు తల్లులు మనవరాళ్లు...
వయసేదైనా
అంతా దాయబడిన
చీకటి గాయాల
మూగ జీవ వ్యధ
దగాపడిన జీవుల
ప్రతిక్షణ రోదనా వేదనా
నా జీవితాన్ని అంతం లేని
సుదీర్ఘ చీకటి రాత్రి చేశారు
ఈ రాత్రిలో
నా మొఖాన్ని వెతుక్కుంటూ..
ముఖమే కనిపించనప్పుడు
నా అస్తిత్వం ఎక్కడ..?
బాధల సిల్ సిలాకు
కొనసాగింపే కానీ
ఎక్కడా ముగింపే లేదు
నిజమే హిజాబ్ గురించి
చెప్పారు కానీ
నెలనెలా అయ్యే
గాయపు నొప్పికి
మందును చెప్పలేదు
సానిటరీ నాప్కిన్స్ గురించి
మతగ్రంధాలలో ఏముంటుంది!
మరిప్పుడు ఏం చేయాలి
ప్రవాహాన్నలా వదిలేయమంటారా..
ఇంకా పాత బట్టల ఇన్ఫెక్షన్ లలో
పడి కొట్టుకు చావమంటరా..
స్త్రీ జనోద్ధారకులారా...
ఎప్పుడైనా ఈ విషయం
మీకు జీవితంలో ఒక్కసారైనా
అనిపించిందా మాట్లాడాలని
మేము రాసే అక్షరాలకు
సంజాయిషీ అడుగుతారా..?
మా లోంచి వచ్చిన
కొనసాగింపులు...
ప్రతినెలా మేం పారబోసే
నెలరక్తం మీ విలువ...
నేర్చుకో కొత్త విషయాలు
చూడు కొత్త ప్రపంచాలు
అప్పుడు మీకు జన్మనిచ్చామని
హోదా ఇస్తాం...
మమ్మల్ని అవమానిస్తే
మా జాలి విలువ మీరు
వెయ్యిమందికి జన్మనిస్తూ
వందకు పైగా అమ్మలు
మరణిస్తున్నారు
ఏనాడైనా మాట్లాడావా...
నీకేమైనా
చీమ కుట్టిందా.. లేదే...
నీ దేహం కాదుగా
చీల్చబడేది..
నీదేం పోయింది
గ్రంథాల పేర
దేవుడి పేర
ఎన్నైనా రూల్స్ మాట్లాడగలవ్
నీక్కావాల్సింది
నీ మాట వినే గొఱ్ఱెలమంద
దేహ గాయాల
సంగతి అటుంచితే..
మనస్సు గాయాల
నొప్పులు లెఖ్ఖలోనే లేవు
నిన్ను కనమనడం
సృష్టి విరుద్ధమే గాని
గాలి ఆడకుండా నన్ను
బంధించాలని చూసే
నీ అమానవీయ బుద్ధి
కూడా సృష్టి విరుద్ధమే
నువ్వెందుకు తొడగవు
నల్లని ముసుగులు
బంగారం రంగులోనే ఉన్నవు కదా
ఎవరికైనా జాగ్రత్త ఒకటేగా
నువ్వు ఇంకా మనిషివని అనుకుంటున్న
నువ్వెలా ఉంటావో
నేను అలానే ఉండాలనుకుంటున్న
నొప్పుల మీద బాధల మీద
శరీరంపై డాక్టర్లు
పెట్టిన గాట్ల మీద
కన్నీళ్ల మీద మనసు మీద
ముసుగు వేసి నడిపిస్తూ
నీ భుజాలు నువ్వు
చరచుకుంటున్నావు..
యహా సబ్ ఠీఖ్ నహీ హై!
ముఖాలకే కాక
ఇప్పుడు అక్షరాలకు
కూడా ముసుగులేయాలని
చూసే మగ మూర్ఖత్వం
నీలో నువ్వు
మతాల కింద
తరాలనాడు పాతరేసిన
మనిషిని బయటికి తీయి
మకిలిని దులిపి
వెలుతురు ఆలోచనలు చేయి
కొంచెం మెదడుకు
కప్పుకున్న ముసుగుని
తొలగించి బయటకు రా
ప్రపంచం నిన్నొదిలి
ఎంత ముందుందో
నీకు తెలుస్తుంది
#BlackQuarantine #MuslimWomen #Oppression #Samanvitha #AIDWA
No comments:
Post a Comment