కైలాసవాసుని !కంటిమంటయు సోకి
కూలిపోయినవాని!కొడుకు పత్ని
ముత్తాత తండ్రిని ముదముతో గన్నట్టి!
వానితండ్రికి తండ్రి యైనవాని
పదమున బుట్టిన పడతి కుమారుని ధరణిపై గూల్చిన ధైర్యవంతు!
ముద్దుల తనయుని పెద్దనాన్న జనకు!
డైనవాని సఖుని !యతివయందు
నవతరించిన యట్టి యమిత బలాడ్యుని
యాలించి లాలించి నట్టిమాత!
యామెసోదరునికి నాశ్రయ మిచ్చిన
బలవంతు దాటిన బాహుబలుని
యట్టివాని వలన యంతమొందినవాని
తండ్రిని బరిమార్చు ధరణి పతికి
విద్యలు నేర్పియు విలుకాని జేసిన
వానితపస్సును భంగపరచి
నట్టి కాంతకు బుట్టిన యతివ యొక్క
పుత్రుడేలిన భూమిలో బుట్టినట్టి
సకల జనులకు ప్రణమిల్లి ప్రకటితముగ
వందనము జేయు చుంటిని వాసిగాను!!
భావము:- కైలాసవాసుడు శంకరుడు శంకరుని కంటిమంటచే కూలిపోయినవాడు మన్మధుడు(ప్రద్యుమ్నుడు)మన్మధుని కుమారుడు అనిరుద్దుడు అతనిభార్య ఉష !ఉష ముత్తాత ప్రహ్లాదుడు ,తండ్రి హిరణ్యకశిపుడు అతని తండ్రి కశ్యపబ్రహ్మ!కశ్యపుని తండ్రి బ్రహ్మ ,బ్రహ్మతండ్రి విష్ణువు, విష్ణుమూర్తి పాదమున జన్మించింది గంగ, గంగ కుమారుడు భీష్ముడు, భీష్ముని పడగొట్టినవాడు అర్జునుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ,అభిమన్యుడి పెద్దనాన్న భీముడు ,భీముడి తండ్రి వాయుదేవుడు, వాయు వు ,మిత్రుడు
అగ్నిదేవుడు అగ్ని భార్య స్వాహాదేవి
ఆమెద్వారా జన్మించినవాడు కుమారస్వామి కుమారస్వామి తల్లిపార్వతి పార్వతి సోదరుడు మైనాకుడు అతనికాశ్రయమిచ్చినవాడు సముద్రుడు సముద్రుని దాటినవాడు హనుమంతుడు హనుమంతుని చేతిలో చచ్చినవాడు అక్షయుడు అక్షయుని తండ్రి రావణుడు రావణుని చంపినవాడు శ్రీ రాముడు
రామునికి విద్యలు నేర్పినవాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని తపస్సు భంగం పరచినది మేనక
మేనక కుమార్తె శకుంతల శకుం తల కుమారుడు భరతుడు భరతుడు పాలించిన భూమి భారతదేశం ఈ దేశంలో జన్మించిన వారందరికీ శిర స్సువంచి నమస్కరిస్తు న్నాను
శుభం
No comments:
Post a Comment