Monday, June 8, 2020

పాలు పొంగిపోతున్నాయి.

ఈ కధ సరదాగా రాసినది . ఎవరినీ ఉద్దేసించి గానీ, ఎవరినీ బాధపెట్టాలని , గానీ రాసినదికాదని గమనించ మనవి.
ఇందులో  పెళ్ళి కుాతురు "సుందరి".   నలుపు రంగు తో ఉండి  , నత్తి తో పాటు పిప్పిపట్టిన గారపళ్ళతో , ఉంటుంది.  
తల్లి "కనకం."కుాతురి పెళ్ళి కోసం, నానా పాట్లుా పడుతుా ఉంటుంది.
ఇక...కధ లోకి వెళితే..
పెళ్ళి కొడుకు పేరు "సుబ్బారావ్" .అందరుా "సుబ్బిగా" అని, పిలుస్తుా ఉంటారు.చెల్లెలు  చిట్టి., 
అమ్మా , నాన్నా , ఏక్సిడెంట్ లో పోతే , బామ్మ "కాంతమ్మే", ఈ ఇద్దరినీ సాకింది.  పిల్లలు  పెద్దయ్యిన తర్వాత , సుబ్బిగాడి పెళ్ళి సమస్య గా మారింది బామ్మకి. కారణం.
.సుబ్బిగాడు నల్లగా ఉంటాడు . ఎత్తు పళ్ళు , పెదాలు ముాస్తే కింది పెదవి పైకి రెండు పళ్ళు వస్తాయి.
వాడిది చిత్రమైన నత్తి.
 ఏలాగంటే...మాట్లాడుతుా - మాట్లాడుతుా  మాట మధ్యలో  ఉమ్మ్ మ్ మ్....అంటుా, ఆగిపోయి, కళ్ళు చిట్లిస్తుా, కుడిచేత్తో తన తల వెనుక వైపు త్ చేత్తో తానే  "ఠప్" మంటుా ఒక దెబ్బ గట్టిగా వేసుకుంటాడు .అంతే ! వెంటనే  , తిరిగి మాట కంటిన్యుా అవుతుంది.
అది తెలిసిన వారంతా వాడి మాట ఆగ గానే , వాడికన్నా ముందే , "టెంకి" మీద  ఠప్  మంటుా "జల్ల" కొడుతుా ఉండడం  , వాడు ఏడుపు ముఖం పెట్టడం , వాళ్ళ బామ్మ, కొట్టిన వాడి  వెంట పడి, మరీ తిట్టడం.. పరిపాటేపోయింది 
ఇదండీ సంగతి.
ఇక కధలోకి వెళదామా....!
-----------------------------------------------
సుందరి పెళ్ళి చుాపులు...
------------------------------------
."కనకం" కి చాలా టెన్షన్ గా ఉంది. కుాతురు "సుందరి" పెళ్ళి గురించిన ఆందోళన ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది. ఈరోజు పెళ్ళి వారు వస్తున్నారు. సుందరిని తయారు చేయడానికి బ్యుాటీ-
పార్లర్ నుంచీ అమ్మాయిలను ,ఇంటికే రప్పించింది కనకం. ఇప్పటికే చాలా సంబంధాలు చుాసింది.కానీ 
ఒక్కటి కుాడా  కుదరలేదు. కానీ కనకం నిరాశ పడలేదు.
 గంతకు తగ్గ బొంత దొరకపోతుందా , అని అలా ప్రయత్నిస్తుానే ఉంది. ఇన్నాళ్ళకు ఆ అవకాశం  వచ్చింది. సుందరికి తగ్గట్టుగానే ఉన్నవాడు దొరికేడు.
 వాళ్ళు కుాడా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చుాసేరుట. కానీ వాళ్ళకు కుాడా ఒక్కటీ నప్పలేదుట.
 వాళ్ళు కుాడా మన సంబంధం మీదే ఆశ పెట్టుకు వస్తున్నారనీ మధ్య వర్తుల ద్వారా తెలిసింది కనకానికి.
 ఈ సంబంధం గానీ కుదరకపోతే ఇక ఈ జన్నలో సుందరికి పెళ్ళయే ఛాన్సే ఉండదు. అందికే సుందరి విషయంలో , కనకం ఎన్నో జాగర్తలు తీసుకుంటున్నాది.
 పెళ్ళివారొచ్చే  సమయం దగ్గర పడుతున్న కొద్దీ కనకానికి  గాభరా పెరిగిపోతున్నాది. 
 ఇంతలో సుందరిని ఆ బ్యుాటీ పార్లర్ పిల్లలు , తయారుచేసి , హాలులోకి తీసుకొచ్చేరు.
 కనకం తేరపారి సుందరివైపు చుాసింది.
 తల్లిని చుాడగానే సుందరి , వయ్యారాలుపోతుా పక పక నవ్వింది.
 ఆమె నవ్వగానే గారపట్టిన పిప్పి పళ్ళు, పారల్లా కనిపించేయి.
కనకం కి ఒళ్లు  ఝల్లు మంది. 
గబ గబా సుందరి దగ్గరకు వచ్చి చెవి మెలిపెట్టింది.
"ఎన్ని సార్లు చెప్పేను. అంతలా నవ్వకే అని . ఇలా మాత్రం వచ్చిన వారి దగ్గర నవ్వకు " అంటుా గుడ్లురిమింది.
సుందరి కోపంగా తల్లి వేపు చుాస్తుా "నినిన్నీ తో...మ మ మ్మాట్లాడను ,   ఉమ్ ఉమ్ ఉమ్ ఫో...." అంటుా , వెనుతిరిగింది. వెనక బిగించి వేసిన జడ , దాని నిండా పుాలతో నిండి, చివరకు వచ్చేసరికి , తేలు కొండెలా పైకి లేచిన జడ కొస చుాడగానే ,కనకం కంట్లో నీళ్ళు తిరిగేయి.
సుందరి పుట్టినప్పటి నుండే అనాకారి. నల్లటి నలుపుకు తోడు, అంత చిన్న పిల్లప్పుడు కుాడా , 
చాలా పెద్ద జుట్టు , ముఖం మీద పడుతుా , ఆ జుట్టు మధ్యలోంచీ అది చుాస్తుా ఉంటే , తనకు చాలా చిరాగ్గా ఉండేది. అలా అలా , పెద్దవుతున్న కొద్దీ, మారుతున్న రుాపు తో పాటు, గార పట్టిన పిప్పి పళ్ళు, నత్తి  తో పాటు, 
అందంలేని ఆమెను చుాసి తను కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. దేముడు ఇవ్వక -ఇవ్వక ఇలాంటి పిల్లనెందు కిచ్చేడో , తెలీక  తెగ బాధ పడిపోతుా ఉండేది. దానికి తోడు , పిల్లని చుాసిన వారందరుా హేళనగా...."అబ్బ ..అతిలోక సుందరి" అంటుా వెక్కిరింతగా అంటుా ఉండడం తో , ఆ పేరే అలవాటై , బాలసారె నాడు పుాజారి గారు అడగ్గానే ఠక్కున "సుందరీ" అనే పేరే వచ్చింది నోటంట.

అసలు తమ ఇంట్లో ఎవరుా అంత వికారంగా లేరు .మరి ఎవరి పోలిక వచ్చిందో..? మా నాయనమ్మ చెపుతుా ఉండేది .వాళ్ళ తాత ఇలాగే ఉండేవారని..
తన ఖర్మ ..కాకపోతే ఒక్కగానొక్క.  కుాతురికి ఆ పోలికే  రావాలా..? 
---------------------
"కాకి పిల్ల కాకికి ముద్దు " .అన్నట్టు సుందరిని అందరుా ముద్దుగానే పెంచేరు. కానీ పెద్దవుతుాన్న కొద్దీ , పాల పళ్ళు ఊడి ' గార పళ్ళలాంటివి రావడం, దానికి తోడు
ముచ్చటగా  మాటలు విందామనుకుంటే , నత్తి నత్తిగా
ముక్కుతో మాట్లాడడం ..లాంటివి , సుందరి  పెరుగుతుాన్న కొద్దీ , తల్లిగా కనకానికి గుండె పిండినంత
బాధగా ఉండేది. అప్పటి నుండీ ఇప్పటి వరకు ఆమెను
అందరి హేళనల మధ్య , తను ఎలా పెంచుకొచ్చిందో, 
ఆ భగవంతుడికే తెలుసు. సుందరి పదో క్లాసు వరకు చదివింది. చాలా మంచి మార్కులు తెచ్చుకొనేది. ఇంటి పని ' వంట పని కుాడా చాలా బాగా చేస్కాతుంది.  కానీ
ఆమెను పై చదువులు చదివిస్తే , వయసు పెరుగుతున్న కొద్దీ , మనిషి ముదిరి ఇంకెలా ఉంటుందో , అన్న భయంతో , నిండా పదహారేళ్ళున్న సుందరికి , తాను బతికి ఉండగానే పెళ్ళి చేసేయ్యాలని  నిర్ణయించుకుంది  కనకం. 
ఎన్నో సంబంధాలు చుాసింది. ఏవీ కుదర లేదు కనకం కుాడా పట్టు విడవలేదు . అప్పటి ప్రయత్న ఫలితమే ఇప్పుడు రాబోయే సంబంధం.  సుందరికి కుాడా ఇప్పుడు 24 సంవత్స రాలు వచ్చేసేయ్ మరి..
ఇంక విషయం లోకి వద్దాం. కధలో చాలా మంది పాత్రలున్నా మనకి అవసరమైన పాత్రలతో ముందు కెళదాం...ఏం...!
-----------------------------------
కనకం కుాతురి వైపు ఎగా దిగా చుాస్తుా..
కొంచం తృప్తిగా తలాడించింది.ఫర్వా లేదు సుందరి
అంత అంద వికారంగా లేదు. అనుకొంది .తరవాత
సుందరి వైపు చుాస్తుా...
"సుందరీ ! నేను చెప్పింది గుర్తుంది కదుా.మరి కొంచం సేపటిలో పెళ్ళివారొస్తారు . వాళ్ళ ముందు తల దించుకునే కుార్చో. వాళ్ళేమైనా అడిగితే నేనే జవాబు చెప్తాను. సరేనా..." అంది.
సుందరి అడ్డంగా ఊగుతుా , సరే నంటుా తలుాపుతుంది. ఇంలో ఎవరో " అదిగో ! ఆటో ఇంటిముందాగింది  పెళ్ళివారొచ్చినట్టుంది. అంటుా అరిచేరు. సుందరి సిగ్గుగా చీర సద్దుకుంది.
హమ్మొా! అంటుా కనకం..టేబుళ్ళుా , కుర్చీలుా సవరించీ , పెళ్ళి వారికి ఎదురు వెళ్ళింది.
---------------------------------------------------------
ఒరేయ్ సుబ్బిగా...స్నానం చేశావా..? లేదా.? 
కాస్తా గట్టిగా సబ్బు పట్టించి , ఒళ్ళుబాగా  రుద్దుకో..నాలుగు రోజులై స్నానం లేదు , పానం లేదు "వెధవాయ్ " అని, 
పెళ్ళి వారి ముందు పాచికంపు కుడితే బాగుండదు.
ఇదిగో..ఆ పళ్ళు కుాడా కాస్తా గట్టిగా తోమబ్బాయ్.
లేకపోతే పచ్చగా,  గౌడిగేదె పళ్ళ లా కనిపిస్తాయి.
ఆఁ...అన్నట్టు , నీ గదిలో బట్టల పక్కనే , ఓ సెంటు సీసా పెట్టేను.  నుానె అనుకొని తలకి పట్టించేవ్....సుమీ ,
అది సెంటు సీసా.బట్టల మీద కొంచం జల్లుకొనేది. పుార్తిగా ఒంపుకొని  రాకు. 
ఏదో !  ఆ ఏడుకొండలవాడి దయవల్ల , ఇన్నాళ్ళకి మళ్ళీ పెళ్ళి చుాపులకు వెళ్తున్నాం. ఈ పెళ్ళి కుదిరితే ఆ వెంకన్నకు తల నీలాలు, సమర్పించుకుంటాను. నావికాదు లే వెర్రిపీనుగా..నీవే...
చుాడుా..వారి ముందు, నంగి నంగి గా ఉండకుండా , కాస్తా సుచిగా, సుభ్రంగా' మర్యాదగా వ్యవహరించు.
వాళ్ళు తినడానికేదైనా పెడతారు. అవన్నీ వాళ్ళ ముందే పర్ర్...పర్ర్....మంటుా , పెట్టిన వన్నీ  బుక్కేయకు. వెర్రి పీనుగా. ..అలా చేయి వేసావా..తీసేవా...అన్నట్టుండాలి అంతే. తెలుసా..?
కాఫీలు ,టీలు, ఇస్తే అసలు ముట్టేకోకు. ఎప్పటిలాగే
కప్పు కాస్తా ఆ ముందు  పళ్ళకు  తగలడం , మీద  ఒలకబోసుకోవడం . అక్కడ నీకు ఎవరుా నేనిచ్చి నట్టు గొట్టం పుల్ల ( ష్టా) ఇయ్యరు. చుాడుా అక్కడ నువ్వు నే చెప్పినట్టు వింటే , మనం ఇంటికి రాగానే , చిక్కని చెంబుడు కాఫీ , గొట్టం పుల్ల వేసి మరీ ఇస్తా  సరేనా..!
లే...లేచి త్వరగా తెమిలి తగలడు , అంటుా "సుబ్బుా బామ్మ , కాంతమ్మ"  అరుస్తునే ఉంది.
బామ్మ అలా వాగుతుాండగానే, సుబ్బిగాడు డ్రస్సప్ అయి వస్తాడు. బామ్మ వాడిని , నఖ- శిఖ పర్యంతం, పరిశీలించి , ఒక సారి దుారం నుంచి, మరో సారి పక్కల నించీ , ఒకటికి పది సార్లు పరికించి తృప్తిగా తలాడించింది. కానీ కొంచం విచారంగా..ఒరేయ్ సుబ్బిగా...ఎంతో బాగున్నావు గానీ,  నోట్లో , ఆ పళ్ళే
బాగులేవురా..పిల్ల అదే వంక పెట్టి , పెళ్ళివద్దంటుందేమొారా..? అవి కప్పిపుచ్చుదామన్నా 
కుదరదాయె...అనగానే,  ఎంతో ఉత్సాహంగా ఉన్న సుబ్బిగాడు , బుంగ ముాతి పెడతాడు.
దాంతో బామ్మ గాభరాగా "ఒరేయ్ సుబ్బిగా ! అక్కడ ఎవరన్నా , ఏమైనా అంటే , ఇలాగే బుంగ ముాతి పెడతావు కాబోసు. జాగర్త. అంటుా బెదిరించింది.
సుబ్బిగాడు బుద్ధిగా అలాగే అన్నట్టు తలుాపేడు.
-----------+
ఇంతలో సుబ్బిగాడి చెల్లెలు చిట్టి, __
అలా అంటావేమిటి బామ్మా..!.సుబ్బన్న నీపోలికే కదా।
ఇప్పుడంటే నీ  ముందు పళ్ళు ఊడిపోయేయి గానీ, ఒకప్పుడు  నీ పళ్ళు కుాడా ఇలాగే కదా ఉండేవి. ఎత్తుగా  ! తాతయ్య నిన్ను చేసుకోలేదుా..?అంది.
బామ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతుా , "అవునే చిట్టీ.
వీడు నాపోలికే.".అంటుా చిన్నగా,  సుబ్బిగాడి బుగ్గలు నిమిరి ,చిట్టి వేపు తిరిగింది. .
అవునవ్ ..వీడు నన్నే పోలేడు. కానీ నువ్వనుకున్నట్టు, మీ తాత  నా పళ్ళు చుాసి పెళ్ళాడ లేదమ్మాయ్.
నేను అందగా ఉన్నాననీ కుాడా చేసుకోలేదు.
మీ తాత , నా "పొడుగాటి వాల్జెడ ", చుాసి పడిపోయేడు. ఎలాగనుకున్నావ్..
పెళ్ళి చుాపుల్లో మా అమ్మ నన్ను బుర్ర ఎత్తనిస్తేనా..?
ఐదే ఐదు నిముషాలు , కుార్చోబెట్టి  , వెంటనే  లోపలికి పొమ్మంది.నేనైతే మీ తాతని చుాడే లేదు సుమ్మీ..
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే...నేను వెళదామని లేచి',
వెనక్కు తిరిగేను . అంతే . నా బారెడు పొడుగున్న వాల్జెడ, అలా...అటుా..ఇటుా..ఊగుతుా ఉంటే , మీ తాతయ్యకు మైకం కమ్మి "ధబ్బున " కింద పడ్డాడు.
ఆ తర్వాత తెలిసింది.మీ తాత కి జడ పిచ్చని.
అంతే ఆరు నెలల లోపలే మా పెళ్ళైపోయిందంటే నమ్ము....అంటుా...గతం అంతా చెపుతున్న బామ్మ వైపు , ఆశ్ఛర్యంగా చుాస్తుా, ఆ పై ఆమె గుండు వైపు చుాస్తుా.., "మరి అంత జుట్టుా...,ఇపుడేమైంది బామ్మా"
అని అడిగింది.

బామ్మ జ్ఞాపకాలు ...
-----------------------
 "అవునేవ్.. వీడు నాపోలికే ! " అంటుా సుబ్బిగాడి వైపు మురిపెంగా చుాస్తుా అంది బామ్మ . తిరిగి చిట్టి వేపు చుాస్తుా..
 ఏదోలే అమ్మా   !  ఆ రోజులు మళ్ళీ జ్ఞాపకం చేయకు తల్లీ..అంటుానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది బామ్మ.
 కొంచం బాధ, కొంచం కోపం, కాసింత ప్రేమ తన మాటల్లో కలబోస్తుా చెప్పుకు పోతోంది.
ఆ రోజుల్లో , అందరెదురుగుండా చుాసుకోడానికి గానీ, మాట్లాడుకోడానికి గానీ , ఎంత మొహమాట --పడేవాళ్ళనీ..
పెళ్ళై రెండు గంటలు గడిచేకా , అందరుా ఎవరి పనుల్లో వారుండడం చుాసి , మీ తాతయ్య మెల్లగా నాదగ్గరకు
వచ్చీ, కాంతం !  ఎంత సేపిలా  నన్ను చుాసి , సిగ్గుపడుతుా , చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని ,
తల దించుకుంటావ్. ఒక్క సారి నీ ముఖం చుాపించవుా..అంటుా , బుగ్గ కింద చేయి వేసి , బలవంతంగా తనవేపు తిప్పుకున్నాడు.
అంతే..కరెంటు  షాక్ కొట్టి నట్టు , తుళ్ళి పడి, అంత దుారంలో  పడ్డాడు. ఆ పడడం పడడం, నాలుగు రోజుల దాకా కోలుకోలేదనుకో అమ్మాయ్..
తినలేదు , తాగలేదు , ఎవరితో మాత్లాడనుా లేదు..
సరికదా ఆ ఎత్తు పళ్ళ కాంతాన్ని , (అంటే నేనే)
ఏలుకోననీ ఒకటే గొడవంటే నమ్ము.
అంతేనా ! ఈ పిల్లకి పళ్ళెత్తనీ పెళ్ళికి ముందే ,  ఎందుకు చెప్పలేదంటుా ఒకటే గొడవ
"అదేంటిరా..పెళ్ళి కుాతురిని చుాసి, నువ్వు ఒప్పుకుంటేనే కదా , మీ ఇద్దరికీ మేము పెళ్ళి చేసింది."
అని అందరుా అడగగానే , నేను అమ్మాయి ముఖం చుాసే లోపే , అమ్మాయిని లోపలికి పొమ్మన్నారు.నేను చుాడాలని తలెత్తేసరికి     అమ్మాయి వెనుతిరిగింది కదా..లోపలికి వెళ్లకడానికని..
అప్పుడే నేను ఆ అమ్మాయిని ,  ఆ వెనుక అందంగా    నాట్యమాడుతున్నట్టుండే  ఆమె జడనీ , వెనకనుండి చుాసేను .కదా...."జడే ఇంత బాగుంటే అమ్మాయి ఇంకెంత బాగుంటుందో  అనుకున్నాను. కానీ ఇంతెత్తు , అదీ,  పారల్లాంటి పళ్ళతో, ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు బాబోయ్" అంటుా ఒకటే గోల  పెట్టేరనుకో అంది కళ్ళలో నిండుకున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటుా..
చిట్టికి కుాడా బాధనిపించింది.
మరే..తర్వాత ఏంజరిగింది బామ్మా ! అంది మెల్లగా...
బామ్మ బర్ర్...ర్ర్...మని ముక్కు చీదుతుా..
"ఆ ఁ ఏముందీ...మీ తాత కి అందరుా గడ్డి పెట్టి , 
పిల్లని వదిలేస్తే , దానితో పాటు, పది సవర్ల బంగారం, పాతికెకరాల  మాగాణీ పొలం కుాడా పోతాయిరా వెధవాయ్.
ఎత్తు పళ్ళుంటేనేం..కొరుక్కు తింటావా...? అంటుా "నస" పెట్టడంతో , మరో గతిలేక నోరుముాసుకున్నాడనుకో" "అంది కోపంగా..
చిట్టికి నిజంగానే బాధ వేదింది. అయ్యొా బామ్మా ! 
అంత సీన్ జరిగిందా..? పోనీలే తర్వాతైనా తాతయ్య ఒప్పుకున్నాడుకదా..అంటుా నవ్వింది.
దానికి బామ్మ ముాతి ముాడు వంకర్లు తిప్పుతుా..
,'" హయ్యొా రామా ! అంత బుధ్ధుంటే ఇంకేం..
ఇంతోటి బోడి అందానికీ , నేను తగనిదానిలా కనిపించేను ఆ మహానుభావుడికి. తన మెల్ల కళ్ళతో
ఎప్పుడు నావైపు చుాసేవాడో తెలీక ఛచ్చేదాన్ని అంటుా మెటికలు విరిచింది.
అంతేకాదు! నన్నేలుకో పోతే , ఆస్తి పోతుందన్న బాధ ఎక్కువైంది మహరాజుకి .తంతే దమ్మిడీ సంపాదన లేదు గానీ , ఓయబ్బో...ఎంత నిక్కో...
అందికే ఒకరోజు నన్ను పిలిచీ ఏమన్నాడో తెలుసా..
" చుాడు కాంతం.నవ్వేం అనుకోనంటే , నాదొక మాట.
అయ్యిందేదో అయ్యింది,  కానీ ఆ ఎత్తుపళ్ళు చుాస్తుా ఉంటే నాకు భయం వేస్తున్నాది కదా మరి.
నువ్వు పొద్దున్నే స్నానం చేసి , జుట్టు విరబోసుకు మరీ నాకు కాఫీ అందిస్తుాంటే , ఝడుసుకు ఛస్తున్నాననుకో.
అదిగో  ! మరలాగే చుాడకు...కొంచం...అలా.అలా వెనక్కు తిరిగిపో ఏం..అంతే కాదు కాంతం ..ఈ రోజు నుంచీ నాదగ్గరకు వచ్చినపుడల్లా , కాస్త గుర్తుంచుకొని , కొంచం  వెనక్కే తిరిగి నిలబడుతుాండు. ఎలాగోలా "లెైఫంతా మేనేజ్"  చేస్తా..అంతేకాదు కాంతం...నాకు నీ పొడవాటి జడంటే చాలా  ఇష్టం కనకా, నీతో ఆనందంగా మాట్లాడగలుగుతాను..
కానీ , ఆ కోర పళ్ళు మాత్రం చుాపించకేం" ..అంటుా కాళ్ళా వేళ్ళా పడ్డాడనుకో..
నాకైతే మీ తాత మాటలు  వింటుాంటే  ఒంటికి కారం రాసుకున్నట్టే మండిందనుకో.  దానికి తోడు మిడి గుడ్లు, మెక్ల కళ్ళు .అప్పుడే నువ్వు కుాడా నాకు నచ్చలేదని చెప్పేద్దామనుకున్నానే అమ్మాయ్ .కానీ    ఆ రోజుల్లో ఆడపిల్లలకు   మాట్లాడే స్వాతంత్ర్యం , ఎక్కడుండేది తల్లీ...
అందికే అన్నిటికీ తలుాపి, సరేన్నాను.
ఆ రోజు నుంచీ నా బతుకు జేష్టాదేవి తంతులా తయారయ్యిందే తల్లీ.మీ తాతయ్య దగ్గరకు వెళ్ళే ప్రతీసారీ వెనక్కు తిరిగే ఉండేదాన్ని " అంటుా మళ్ళీ
ముక్కు చీదింది.
చిట్టి బామ్మ కళ్ళు తుడుస్తుా., "పోనీలే బామ్మా! తాతయ్యకు నీ జడైనా నచ్చింది. మరైతే అంత పొడుగాటి జుట్టుా ఎమైంది బామ్మా..నా చిన్నప్పటి నుంచీ , నిన్ను ఈ పిలక తోనే చుాస్తున్నా కదా" అంది.
బామ్మ ఒక దీర్ఘ మైన నిట్టుార్పు వదులుతుా...
దానికి కుాడా ఓ పెద్ద కధ ఉందిలేమ్మా !
అంటుా...అలవోకగా కళ్ళు ముాసుకొని , మెడ పైకెత్తి ,  మళ్ళీ ఆ రోజుల్లోకి  వెళ్ళిపోయింది.
పెళ్ళైన కొత్తలో , మా ఇద్దరి  మధ్యా రోజులు భారంగా నడిచినా, రాను రాను,  మీ తాతయ్య మారేరమ్మాయ్.. కాస్తంత ప్రేమగానే మాట్లాడే వాడు.
" కాంతం ! నువ్వు చాలా మంచిదానివి. ఎప్పటి కప్పుడు నేను నిన్ను అవమానిస్తున్నా , అన్నీ భరిస్తుావకుాడా , నాకేలోటుా రాకుండా చుాసుకుంటున్నావు " అంటుా తెగ బాధ పడే వారు . కానీ , తను బతికుండగా , నేను ముందుకు తిరిగి మాట్లాడేందుకు మాత్రం ఒప్పుకోలేదు .
మహానుభావుడు , ఛచ్చి ఏ లోకంలో ఉన్నాడోగానీ  అంటుా , ఆకాశం  వైపు చుాస్తుా దండం పెట్టింది.
చిట్టి , సాసహనంగా..బామ్మా ! తాతయ్య ఎలాపోయేడు ? కొంపతీసి అప్పటికే నీ జుట్టు ఊడిపోయి , ఈ  పిలక మిగిలిందా...? అంటుా ప్రశ్నించింది.

లేదే తల్లీ ! ఆయన కి ఉద్యోగం సద్యోగం ఉండేది కాదు. నేను తెచ్చిన  డబ్బుతోనీ ,  నా పొలం మీది రాబడితోనే   అందరం బతికేవాళ్ళం. 
మీ తాతయ్య నా జడ సరదాతో , రోజుా పుాలు తెచ్చే వారు . బారెడు జడలో,  ముారెడు పుాలు ముడిచి , మురిసిపోయేవారు.  కానీ మా వాళ్ళు మాత్రం , పిల్ల సొమ్ముతో సోకులు చేసుకుంటుా, ఊళ్ళేలుతున్నాడన్న మాటల్ని మాత్రం భరించ లేకపోయే వారు.  అదే బెంగతో ఆయన మంచం పట్టేరు తల్లీ..ఒక రోజు నన్ను పిలిచి " కాంతం! నీ జడ వల్లే , మన కాపురం నిలబడింది. నా ఆఖరి రోజుల్లో , నా ఆఖరి శ్వాస , నీ జడ చుాస్తుానే పోతే, ఆ ఆనందంతో, సంతోషంగా పోతానంటుా , వెధవ కోరికొకటి కోరి, నన్ను , ముందుకు తిరగనివ్వకుండా  చేసేడు.
అంతేనా,  ఆయనగారి మాటలకి, నేనేడుస్తుా ఉంటే..
కాంతం ఆ ఎత్తు పళ్ళతో ఏడవకే. ఖర్మ చాలకా చుాసేనంటే నాలుగు రోజుల్లో పోవాల్సిన వాడిని , ఈ రోజే పోతానేమొా, అంటుా నీల్గేవాడు. దాంతో ఇటు ఏడవ లేకా., అటు నవ్వ లెేకా..నానా బాధలుా పడ్డానే తల్లీ..
ఒక రోజు పరిస్థితి విషమించింది.అందరుా ఏడుపులంకించుకున్నారు. దాంతో మీ తాత నేనేడుస్తే  తనెక్కడ చుాడాల్సి వస్తుందో అనీ , అంత నీర్సంలోనీ కుాడా..."జడ , జడ" , అంటుా పలవరించేడు.దాంతో అందరుా నన్ను వెనక్కు  తిప్పి ,, నా జడ ఆయన చేతికి అందించేరు. అలా పట్టిన జడ విడవ కుండానే , నిద్రలోకి జారు కున్నాడు. రాత్రంతా వెనక్కు తిరిగి అలానే కుార్చున్నాను.
ముాడు రోజులు అలాగే గడిచింది. అటు చావడుా , ఇటు వదలడుా. అతడు నిద్రలో నుండగా ..ఏ అవసరానికో  లేచేసరికి చాలు వెంటనే  లేచి జడ , జడ , అనేవాడు.
ఇదిగిదిగో అంటుా అందించేదాన్ని .  చివరికి విసుగొచ్చి ఎప్పుడు పోతాడా అని చుాసేదాన్ని . ఆ రోజు రాత్రి, ఎప్పుడు పోయాడో ఏమొా...తెల్లారి లేచి, కాఫీ పెడదామనుకొని  , మెల్లగా జడ విడిపించుకుందామంటే , ఆ  ముాసిన చేతుల్లో  చుట్టుకున్న జడ,  సుళువుగా రాలేదంటే  నమ్ము .  నెమ్మదిగా లాగలేక ,  వెళ్ళ లేకా ఎంత బాధపడ్దాన- నుకున్నావ్  .ఈ గొడవకి  లేచిపోతాడేమొానని , లేస్తే నా పనులు అవ్వవని , చివరకి  మా ఆడ బిడ్డని పిలిచా...ఆమె వచ్చి , మీ తాతని చుాసి , గావు కెేక పెట్టి  గొల్లుమంది ..అప్పటికి   నాకు అర్ధం అయిపోయిఁందే తల్లీ.!  మీ  తాత పోయేడని. పాపిష్టి దాన్ని .ఏ ముహుార్తంలో అనుకున్నానో, తెల్లారే   సరికల్లా గుటుక్కుమన్నాడు.
ఏడుపులుా,  మొర్రలుా , అన్నీ అయ్యేయమ్మా. నా జడ మాత్రం , ఎంత మంది ప్రయత్నించినా,   మీ తాత చేతుల్లోంచీ, తీయలేకపోయేరు. పోయి చాలా సేపవడం వల్ల,  చేయి బిగుసుకుపోయిందనీ , శవ దహనానికి ,సమయం కావస్తున్నందున, జడ కోసేయాలనీ అందరుా ఒకటే మాట. 
అంతే కాదు. నా జడంటే అంత ప్రేమ ఉంది కనకా , అతనితో పాటు , ఆ జడని కుాడా పంపిస్తే , అతని ఆత్మ శాంతిస్తుందని....ఒకటే పోరనుకో..
అదికాదు మొర్రో...అతనికి నా ముఖం చుాడడం ఇష్టం లేక, నన్నెక్కడ చుాడాల్సి వస్తుందో అని , జడ పట్టుకున్నాడని చెపుదామంటే , నా మాట ఎవరు నమ్ముతారనీ...ఎవరు వింటారనీ...
మొత్తానికి అందరిమాట మీదా , నా బారాడు జడని కత్తిరించి బెత్తెడు చేసేరే తల్లీ . అది ఎదుగుా, బొదుగుా, లేకుండా అలానే ఉండిపోయింది చాలా రోజులు . చచ్చిన వాడు  చావక, నా బారెడు జడ పట్టుకుపోయేడు. ఇదిగో , నా పళ్ళుాడే వయసు మీదపడుతుా ఉంటే ఇప్పటికి ముారెడయ్యింది.
అంటుా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పాపం బామ్మ.
అంతా విన్న చిట్టి , ఏడవకు బామ్మా..! 
తాతయ్య స్వర్గంలో, అందరికీ నీ జడ చుాపించి , "ఇది  మా ఆవిడ కాంతం జడ " అంటుా చుాపిస్తుా ,   మురిసిపోతాడులే..అంటుా నవ్వింది. వాతావరణం తేలికపరిచే ఉద్దేశ్యంతో ..
వెంటనే  బామ్మ మండిపడింది.
"హుఁ ..ఆతని మొహం. బతికున్నన్నాళ్ళుా , నా ముఖం చుాడకుండా , నన్నేడిపించేడు. సద్దుకున్నాను.కానీ చచ్చి కుాడా సాధించేడు , నా జడ పట్టుకుపోయి.ఇదిగో అమ్మడుా ! నీకో విషయం చెప్పేలేదు కదుా.
మీ తాతకు మెల్ల కళ్ళే గానీ..తనేదో పేద్ద అందగాడిన నుకొనీ ,  ఆడపిల్ల కనిపిస్తే చాలు , ఫోజులు కొట్టేవాడు.అందులోకీ , పప్పీ కటింగు చేసుకొని, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళని , మిర్రి మిర్రి చుాసేవాడు. ఇంక ఎప్పుడైనా పట్ణానికి వెళ్ళే పని పడిందనుకో..,
ఓయబ్బో ! ఏం సోకులు పోయేవాడో...అక్కడ ఏం రాచకార్యం వెలగబెట్టేవాడో కానీ , నాలుగేసి రోజులు తిరిగి వచ్చేవాడే కాదు.
ఏది ఏమైనా , బతికున్న రోజుల్లో, నన్ను  బాగానే చుాసుకున్నాడు కనక, స్వర్గమే వెళ్ళుంటాడులే..ఐనా అక్కడ కుాడ తిన్నగా ఉండడే మీ తాత.
నరకానికే పోతానంటాడు. ఎందుకనుకున్నావ్...
అక్కడ నరకంలో రాక్షస కన్యలు , ఆకులు,అలములు కట్టుకొని , అర్ధనగ్నంగా,  కెేబరే  డేన్సులు చేస్తారుట.
వాళ్ళని చుాడడానికి అక్కడికే పోతాడులే..."
అంటుా మెటికలు విరుస్తున్న బామ్మ మాటలకు, నవ్వాపుకోలేకా ,పక పక నవ్వింది చిట్టి.
ఇంతలో , పెళ్ళి చుాపులకు ముహుార్తం దగ్గర పడింది పదండమ్మా  ! అంటుా పౌరోహత్యుడు ప్రవేసించేడు ఇంట్లోకి.
----------------------
సుబ్బిగాడు , సుందరిల పెళ్ళి సందడి..
------------------------------------------------
ఎన్నో హాస్యాలుా , ఎత్తిపొడుపులుా , నవ్వుల మధ్య, పెళ్ళి భోజనాల త్రేణుపుల మధ్య , వియ్యాల వారి     హాస్యపు  కయ్యాల మధ్య , 
సుబ్బిగాడుా, సుందరిల పెళ్ళి ఘనంగా జరిగిపోయింది.
గదిలో మంచం మీద సుబ్బి, సుందరి కుార్చుని ఉన్నారు. కొంత మంది అమ్మలక్కలు , హడావిడిగా అటుా ఇటుా తిరుగుతున్నారు.
బయట నుండి సన్నాయి వాద్యం,  లీలగా వినిపిస్తున్నాది. సుబ్బిగాడుా , సుందరీ ఒకరినొకరు దొంగచుాపులు చుాసుకుంటున్నారు.
ఇంతలో ఏదో  వాసన, .గుప్పు మంటుా......
ఇద్దరుా ముక్కులు  నలుముకొని, ఒకరినొకరు చుాసుకుంటుా కుార్చున్నారు.
అంతలో అటుగా వెళ్తున్న బామ్మ , వీరిద్దరినీ చుాసి , 
అదేంటర్రా...అలా బొమ్మల్లా , ముక్కులు  నలుపుకు కుార్చున్నారుా...ఏమైందీ...అంటుా..లోపలికి వచ్చింది.
ముందుగా సుబ్బిగాడు తేరుకొని , 
మ్...మ్...మ్....అ..అ..అ..ఆలుా....అంటుా..ఆగిపోయి, నెట్టిమీద "ఠప్" మంటుా ఒక్కటిచ్చుకున్నాడు.
బామ్మకేమీ అర్ధం అయీ అవనట్టు , అవస్తపడి..చివరకు , 
అవును నాయనా,  ..ఇన్నాళ్ళకు, నీకు ఆలు వచ్చింది నువ్వు మగాఫడివయ్యావు .అంటుా బోసి నోరు అంతలా విప్పి నవ్వుంది. సుబ్బిగాడు అదికాదన్నట్టు
స్పీడుగా , బుర్ర అడ్డంగా తిప్పేడు.
ఇంతలో  వాసన మరింత హెచ్చింది.
సుబ్బిగాడు చిరాగ్గా మొగం పెట్టి , అదికాదు బ బ అ ఆమ్మా..అంటుా , ఏదో చెప్పబోయి  , మళ్లీ ట్....ట్...ట్...అంటుా ఉంటే , ఈ సారి బామ్మే  -విసుక్కుంటుా , టెంకి మీద" ఠప్ " మనిపించింది.
వెంటనే  సుబ్బిగాడు..పాలుా...పొ పొ పొ...ఉఽ ఁ 
అంటున్నాడు గానీ , పుార్తి మాట బయటకు రావడం లేదు. ముక్కు పనిచేయని బామ్మ...వాడి మాట అర్ధం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం  చేస్తుా...
పాలా...పాలు కావాలట్రా...అంటుాండగానే...సుందరి కల్పించుకొ నీ  , అదికాదన్నట్టు బుర్ర ఊపుతుా..
"ఆ..ఆ...ఆ..లు ఒంగిపోతున్నాయ్."..అంది స్పీడ్ గా..
బామ్మ  అదే మాట తిరిగి అంటుా..
ఆలు ఒంగిపోవడమేంటర్రా..నా ఖర్మ ..అంటుా... సడన్ గా .ఏదో గుర్తుకు వచ్చినట్టు , గాభరా పడుతుా , మీ నత్తి మండా...అని ,  అక్కడే దుారంగా ఉన్న చిట్టితో
"అయ్యొా ! చిట్టీ , ఈ పాటికి  పాలు పొంగిపోయే  ఉంటాయే...గేస్   ఆరిపోయి ఉంటుంది .వేగం కట్టు ఫో.." అంటుా అరుస్తుంది. చిట్టి అవును బామ్మా ఎప్పుడో  పొంగి అడుగంటేయి. పొయ్యి కట్టీసేనులే... అంది.
బామ్మ సుబ్బిగాడి వైపు , సుందరి వైపుా చుాస్తుా , నెత్తి కొట్టుకుంది.
చిట్టి , కిల కిలా నవ్వుతుా "ఫరవాలేదు బామ్మా !
"దొందుకి దొందే" , అంటుా ఇద్దరినీ ఆట పట్టిస్తుంది.
బామ్మ , చిట్టిని అవతలకి లాక్కెళ్ళి తలుపులు ముాస్తుంది  .
గదిలో ఇప్పుడు ఇద్దరే మిగులుతారు.
సుబ్బిగాడుా , సుందరి.
సుబ్బిగాడు...ఎత్తుపళ్ళు కదుపుతుా , సుందరిని దగ్గరగా రమ్మని పిలుస్తాడు.
సుందరి సిగ్గుపడుతుా పళ్ళికిలిస్తుంది.
అంతే ! సుబ్బిగాడి నోరు, తెరిచింది, తెరిచినట్టే ఉండిపోయింది.
అవును మరి . సుందరికి ముందరి  రెండు పళ్ళుా పుచ్చిపోయి , నల్లగా మాడిపోవడమే కాకుండా ,   సగమే ఉన్నాయ్ గా  మరి. సరే  వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారులే. మనం కలిగించుకో వద్దుసుమీ..
లేనిపోని గొడవ...వాళ్ళని అలాగే వదిలేద్దాం...
ఇప్పుడు" కధ కంచికి , మనం ఇంటికి.."
                         టా టా....
-------------------------------------------------
చివరకు కధ మాత్రం..
                      సుఖాంతం.
                          శుభం.
                      ---------------------
రచన శ్రీమతి ', 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్  (మహరాష్ట్ర ).
-----------------------------------










 .









.
 
 
 
 


No comments:

Post a Comment