Monday, June 8, 2020

బ్రతుకు భయం (.జీవితపు సంకెళ్లు).

ఎప్పటికైనా చావు తప్పదని తెలుసు.
తెలీని పాశం ,  ఏదో రుాపంలో వచ్చి
తెలియ కుండానే , ఏదో లోకాల్లోకి
తీసుకుపోతుందనీ తెలుసు.

కానీ ! మృత్యువే " కనిపించని కణమై"
"నేడో , రేపో ,  నీవు కుాడా సుమా" -
అంటుా "సవాలు" చేస్తుా ఉంటే , 
అల్లుకున్న "భయం" , హృదయాన్ని
నొక్కిపెడుతుా, ఊపిరాడనివ్వని 
వికట్టహాసం చేస్తోంది.

తీరని కోర్కెలు , కలలో కలవర పెడుతుా,
"మా సంగతేంటీ" అని నిలదీస్తుా ఉంటే-
అంతరంగపు ఆవేదన , కన్నీటి రుాపంలో
"కళల " కోర్కెలకు, వీడ్కోలు చెపుతోంది.

వయసు "లెక్కలు" చుాపుతుాన్నా  
ఆకాశానికి నిచ్చెన లేస్తున్న
మనసు "రెక్కల్ని "అదుపులోకి తేలేకా,
మనసు పడే వ్యధకు ,మధించిపోతున్న
 భావాలు , అల్లకల్లోలమై అంతరంగంలో
 అలజడిరేపుతున్నాయి.
 
 నేడో , రేపో , తెలియని జీవితం ,
 "భయం జైలు" లో మగ్గుతుా-
 కనపడని మృత్యువుకు 
 తాను మాత్రం  కనపడకుాడదనీ..
 తన ఆనవాళ్ళను , తానే
 దాచే ప్రయత్నం చేస్తుా,
 ముక్కు, ముాతులను "మాస్క్" 
 చాటున దాచిపెడుతుా...
 మృత్యువును మభ్యపెడుతోంది.
 
 తనను తాను ,దాచుకునే
 ప్రయత్నంగా, తన "ఉనికిని "తానే-
 నాలుగు గోడల మధ్య బందీ చేసి,
 బిక్కు బిక్కు మంటుాన్న-
 బతుకు పోరాటంలో--
"గెలవడానికి " తనకు తానే 
"గృహ నిర్బంధ సంకెళ్ళు " 
వేసుకుంటుా , రోజులు 
      వెళ్ళదీస్తున్నాది.
ఇదే నా జీవితం....?
-----------------------------------------
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .( మహరాష్ట్ర ).
-------------------------------

 
 






No comments:

Post a Comment