Sunday, October 4, 2020

అబ్బా...బాధ కవిత.నవ తెలుగు తేజం కు పంపినది.

యుా.పీ లో హథ్ రస్ అనే గ్రామంలో జరిగిన అన్యాయ ఘటనకు స్పందించి...

3/10/2020
శీర్షిక .
అబ్బా.....బాధ.

కసి -కసి -కసి -కోపం- కోపం- కోపం,
చేతకాని తనపు కన్నీటి ఆక్రోశం-
దొర్లి- దొర్లి, పొర్లి- పొర్లి,..బాధ- బాధ 
అంతం కాని కన్నీటి కథనాల వ్యధ ॥

ఎందుకిలా...? స్త్రీలు చేసిన పాప మేమిటి?
అలనాడొక నిర్భయ, ఓ నాడొక  ప్రియా..
 ఒకనాడో  దిశా , ఈ నాడో మనీషా..
పైశాచిక మానభంగాలతో అంగాంగ కోతల బలి॥

లెక్క  లేని అకృత్యాలు , తీర్పులేని తిరునాళ్ళు
అతి క్రుారంగా సాముాహిక అత్యాచారాలు
 కన్నీటి  కడవల తో, కరకు మత్తు విందులు.
ఐనా ఆకలి తీరని రాబందులు. ॥

కోరిక తీరని తాపం,గంట గంటకుా మధనం
సొమ్మసిల్లిన సొగసు  సజీవ దహన కథనం.
మింటి కెగసిన మంటల్లో కాలిపోతున్న మానవత్వం.
తీర్పు నోచని కాయానికి, తిల తర్పణాలిడే కాలం ॥

వాద వివాదాల వార్తా ప్రలాపాల నాటక రంగం పై
కాలయాపనలతో కనుమరుగౌతున్న న్యాయం.
కుళ్ళిన వ్యవస్థ లో కొట్టు మిట్టాడు కుల వివాదపు- 
 పాచిక లాటల మంతనాలకు ,అడిగిన వాడు అతం॥,

కరోనా సోకిన  "న్యాయం" "కోమా"లోకి వెళ్లింది.
వెంటిలేటర్ పై ఆగీ ఆగని గుండె అదురుతోంది.
కళ్ళతో చుాస్తుంది, కదల లేనంటోంది.
గుండె కొట్టుకుంటున్నా  గోడుకు స్పందించదది ॥

ముాసుకుపోతున్న మానవత్వపు దారుల్లో
మొలచిన ముళ్ళను కుాడా నరకలేని , మొండి-
" కత్తి లాంటి కలం" రాసుకుపోతున్న కవితలు-
ముక్కిన  కాగిత పుటల్లో కన్నీటి సంతాపాలు తెలుపుకుంటున్నాయి ॥
--------------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
-----------------------

.

No comments:

Post a Comment