Sunday, January 3, 2021

సావిత్రీబాయి ఫులే

ఆధునిక భారతదేశ తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా

శీర్షిక: తొలి పంతులమ్మ
ప్రక్రియ: పద్యం (ఆటవెలది)

****************

బడుగు జనుల వెతలు బాపగా నిలిచిన
ధీరురాలు గొప్ప వీరవనిత
భర్తయడుగు జాడ వదలక నడిచెను
భరత భువిని మొదటి పంతులమ్మ!

అంటరానివారి నాదరించఁగదిలి
బడులు తెరిచి వారి బాగుజూసె
నగ్రవర్ణ పెద్దలందరి నెదిరించి
కులము అడ్డుగోడ కూల్చివేసె!

జోగినిలుగ మార్చు చోద్యమ్ము నిరసించి
చిన్న వయసు పెళ్లి ఛీదరించి
పెద్దరికముజూపి బాలవితంతుల
పెళ్లి చేసి బతుకు వెలుగు నింపె!

విద్య నేర్చి జనులు విజ్ఞానులుగమారి
మూఢనమ్మకాల జాడ చెరిపి
సాంప్రదాయమనుచు సాగెడు దుర్మార్గ
పద్ధతులను మార్చ ప్రతినబూనె!

బాల బాలికలకు బాధ్యతనెరిగించి
విధిని ధిక్కరించి యెదుగుమనుచు
సమత కొరకు పోరు సల్పెను ఘనముగా
మహిళ జాతిరత్నమనగ ఫూలె!

చదువు సంధ్యలందు సావిత్రిబాయమ్మ
చేసినట్టి కృషికి  చిహ్నముగను 
బడుగు జనుల బ్రోచు బాంధవియనుచును 
ఉల్లమందు నిలిపె తల్లి మిమ్ము!

సూటిపోటి మాట సూదులై గుచ్చినా
పట్టువీడనట్టి వనిత రత్న
అబలవృద్ధి కొరకు ఆరాట పడినట్టి
పంతులమ్మ కిదియె పద్యమాల!

రాచమళ్ళ మల్లికార్జున్

No comments:

Post a Comment