Friday, May 21, 2021

పుష్ప విలాపం

పుష్ప విలాపం
అందాల పుాబాల వికసించె  పరువాల ,
కలువ కన్నులతోడ చుాచె నాడా ఈడ ।
వింత లోకపు తీరు నెరుగనట్టిది బాల ,
ఎంతగానో మురిసె మనుగడెరుగని బేల ॥

అతోటలో పుాలు రంగు వలువల చెలులు,
వలపు వింజామరల పంచె సౌరభములు ।
మొగ్గ తొడిగిన సాటి పుాల బాలల తోడి ,
కవ్వింత తుళ్ళింత  లాడి పాడెను కలసి ॥

అంత నరుదెంచెనా  తోట  వనమాలీ,
పుాల బాలల  తెంపె వాడు దయమాలి।
విరిసి విరియని పుాల చేర్చె నంగడిలోన,
వెలగట్టి తెగనమ్మె కఱకు సందడితోన॥

చిదిమె కొందరు వాని  నలిపె భోగులు మేని,
కొన్ని చేరెను గుడికి..ఎన్నొ నలిగెను చితకి।
కన్నీట మున్నీట వాడి రాలెను నేల,
ఏల పుాచితి  ననుచు  వగచె  నలిగిన బేల ॥
-----------------------------------------------------------

                                           రచయిత్రి
                             పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
                                              కల్యాణ్.

అంశం : పుష్ప విలాపం., ప్రక్రియ  ఇష్టపది 

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర 

ప్రక్రియ : ఇష్టపది.

రంగు రంగుల పుాలు రమణీయమౌ పుాలు
పరిమళించునుండె  పరువాల వని లోన ॥

ఆరోజె వికసించె నందాల పుా బాల
కలువ రేకుల వంటి కనులిప్పినది బేల॥

వింత లోకపుతీరు  వినలేదు కనలేదు
చెంత విరిసిన చెలుల చేరి మురిసెను బాల ॥

రంగు వలువల చెలుల రమణీయ గంధముల
ఆటలా పాటలా  ఆడి మురిసెను చాల ॥

అంతలోనరుదెంచె నా తోట వనమాలి
పుాబాల లను తెంపె పుాని కోసెను అన్ని

తల్లి చెట్టును వీడి  తరలొపోగను దలచి
కన్నీరు మున్నీరుగా నేడ్చె పుాలన్ని॥

విరిసి విరియని పుాల విక్రయించగ నెంచి
వెలగట్టి తెగనమ్మె  వెరవకను దయమాలి ॥

అందాల పుా బాల అరచి ఏడ్చెను గాని
ఆమె మాటను వినరు  ఆబాధ కనరెవరు ॥

చిదిమెకొందరు వాని  చిల్లు చేసిరి మేని
కొన్ని చేరెను గుడికి కొన్ని భోగుల దరికి ॥

నలిగె నడుగుల కొన్ని  వెలిగె జడలో కొన్ని
పలు చోట్లకంపబడ  పగిలె రెేకలు కొన్ని॥

అన్ని చుాచిన బాల అదిరి పెట్టెను గోల
ఏల పుాచితిననుచు  ఏడ్చి అలసెను బేల ॥

పాడు లోకము తల్లి బతుకు భారము చెల్లి
ఈ తీరు మారదని ఈశ్వరిల రోదించె ॥





 








No comments:

Post a Comment