Tuesday, June 1, 2021

తెలంగాణా భష కవిత

గా యాది తొట్లెల పండుకొని ఊగినట్టే అనిపిత్తది
                 -అల్లాడి శ్రీనివాస్

అక్కల పిల్లగాండ్లకు మా అవ్వ తానం బోపియ్యంగ సూత్తే
గా బుడ్డ పిల్లగాండ్లకు తానం బోసుడు కళనే అనుడే...
కాళ్లు సాపుకొని నడ్మిట్ల బోర్ల, ఎల్లెల్కల పండవెట్డి లాల పోసుడే...
సబ్బులు గిబ్బులు ఏం పూసుడు లేదు...
శెనిగె పండి, బియ్యప్పిండి, పెసరు పిండిల
తులిసాకులు, యాపాకులు, పసుపులను కలిపి
ఇంట్ల తయారు జేసిన సున్నిపిండినే
గప్పటి గమ్మతైన సబ్బు...
గా పిండితోటి తానంజేపిత్తే
పెయంత నిగనిగయితుండే...
సెవుల్ల ముక్కుల్ల ఉఫ్ మని ఊది
పొడి పాత సీర పేగుల సుట్టుకొనచ్చి
నుల్క మంచంలేసి
గూన పెంకల నిప్కల మీద
ఊదేసి
మంచం కింద పొగ వెట్టుడే...

కండ్లకు కాటుక, బుగ్గ మీద సుక్క
నొసలు మీద శారాణ బిల్లంత 
నల్ల బొట్టు...
గ్రైపువాటరు తాపిచ్చి తొట్లెలేసి ఊపుతే...
బిడ్డ మాంచి నిద్రలకు జారుతుండే..

పిల్ల పుట్టిందని తెలంగనే
మాలేస కుల్లలు కుట్టిచ్చుడే...
సేతులకు జిట్డి పూసలు కట్టుడే..‌.

మునుపు
ఇరువై ఒక్క దినం తొట్లెల ఏసిన్నాడే
బిడ్డకు కొత్త బట్డలు తొడుగుడు....
గా దినమే దగ్గరున్న చేదబాయి కాడికోయి 
బాలెంత తోటి బొక్కెనేపిచ్చి
నీళ్లు చేదిపిచ్చి
ఇంటి దాంక మోపిచ్చుడే...

తొట్లెలున్న బిడ్డ మీద 
ఒక్కొక్కల్లు అంగి
సెవుల పేరు రొండు సార్ల జెప్పి 
కూ అనుడే...
గట్ల అంగినంక గాల్ల ఈపు మీద 
వరుసైనోల్లు గపాగపా గుద్దుడే...
గానాడు అందరితోటి
బాలెంతకు సుతం పత్తెమిడిసిపెట్టిచ్చి
కల్లు గుడాలు కాయికూర పెట్టుడే...

గానాడి గీ పనివరుసంతా మంచిదే...ఎట్లంటే

సున్ని పిండి తోలుకు ఓ ఆయుర్వేదం మందు తీర్గనే...
ఊదు పొగ పిల్లగాని సుట్టుపక్కల పురుగూ బూసి లేకుంటనే...
పిల్లకు కుల్ల కట్టుడు సల్లగాలి సెవులల్ల సొర్రకుంటనే...
బాలెంతతోటి నీళ్లు చేదిపిచ్చుడు..ఇగ పనిపాటలల్ల
పడచ్చని సెప్పుడే...
కల్లు గుడాలు కాయికూర తినుడంటే
పాలిచ్చే తల్లులకు బలపు తిండి కావాలనే...‌

No comments:

Post a Comment