దేశభక్తిగీతం.
కల్యాణీ రాగం
*****
తల్లి భారతి తరలివచ్చెను
కావ్య మంజరి కవితలా..
మేలు మువ్వల సడుల ,సరిగమ
సప్త స్వర జతి , పదములా.. '' తల్లి ''
సస్యశ్యామల వర్ణమది ఆ
మేని గిరులా ఒంపులూ...
పైరు,పచ్చని చీరకట్టెను ,
ప్రకృతి పడతీ సొంపులూ...
నీలి మబ్బుల కురుల నిండెను
మిణుకుతారల మాలలూ..
సూర్య, చంద్రుల కాంతి కన్నుల
కరుణ నిండిన చూపులూ.. '' తల్లి ''
త్యాగరాయ శ్రీ రామదాసు ,
వాగ్గేయకారుల కీరితీ...
పుణ్యచరితపు మేటి -
రత్నాలాయె ఆమెకు సంతతీ...
గాంధి, నెహృ వంటి నేతలు
నిలుప శాంతీ, సౌఖ్యమూ ..
వీర గతినే పొందు సుతులకు
మాత ఒడి తరుకల్పమూ... '' తల్లి ''
శ్రీనాధుల, క్షేత్రయ్యల పదము-
బంగరు మకుటమూ...
విజయనగరా..కాకతీయుల
ఖ్యాతి రత్నపు పీఠమూ...
వీర పురుషుల రుధిర ధారలు
భరతమాత సుచరితమూ ..
పుడమి తల్లికి నుదుటి బొట్టై
వెలిగె ధర్మపు చక్రమూ... '' తల్లి ''
మూడురంగుల మూలమైనది
శాంతి ,ధర్మ ,సుసత్యమూ..
ఎగిరె నదిగో రాజసమ్ముగ
ఒరగనీయకు నిరతమూ....'' తల్లి ''
*****
ఎంత అందమైనది స్వాతంత్ర్యబాలా..
రంగుపూల చీరచుట్టె నీవేళా..
భరతమాత సిగనిండుగ ముద్దబంతులూ
మెడనిండుగ మెరయు చామంతి దండలూ '' ఎంత ''
సూర్యకాంతి పూల పసిమిచాయతో,
ముద్దమందారాలా నుదుటి బోట్టుతో ,
విరిసిన కలువల రేకుల కాంతి కనులతో,
లేలేత గులాబీల అధర సుధలతో '' ఎంత ''
మల్లెలు, మరువము నిండిన నీలవేణిగా..
జాజీ , కనకాంబరాలె మేని సొగసుగా..
పచ్చనీ చేలనడుమ పరిమళాల వీచిగా
పాడి,పంట సొగసుల సంక్రాంతి లక్ష్మిగా.. '' ఎంత ''
జాతి-భేదమెరుగని మన తల్లికిదే స్వాగతం ,
సమత ,మమత నిండిన సుమ-వల్లికిదే స్వాగతం ,
శాంతి - సౌఖ్యాల కల్పవల్లికి సుస్వాగతం ,
క్షమయా-ధరిత్రి భరతమాత కిదే స్వాగతం '' మూడు సార్లు ''
*****
హంకొ మనుకి శక్తిదేన వరస
*****
విశ్వశాంతి నిలుపు శక్తి మదిని పెంచుకో ..
సమత ,మమత వెల్లి విరియు బాట నెంచుకో ''..విశ్వ ''
భేదభావ మెరిగినట్టి స్నేహమెందుకూ...
బాధలోని తోడుకాని బంధమెందుకూ ..
వేదసారమంత ఎరుగ వేడుకెందుకూ..
సాటివారి తూలనాడు చదువులెందుకూ... '' విశ్వ ''
కలసి ,మెలసి శాంతి నిలుపు మంచి మనసుతో ,
చేయి ,చేయి కలిపి నడువు ధర్మనిరతితో..
మన ఝండా కీర్తి నిలుపు , మదిని భక్తితో ..
భరతమాత ఖ్యాతి పెంచు భవ్యచరితలో... '' విశ్వ ''
*****
No comments:
Post a Comment