రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
పల్లవి:
మురళీ గానము వినపడినంతనే
మనసున మల్లెలు విరబుాసే ।
అను పల్లవి :
మరలీ మరలీ విని తరియింపగ
మదిలో కోర్కెల మధుబాలా
అల్లరి చేసెను ఈ వేళా..॥
చరణం:
మనసే మల్లెల పుాబాలై
మరలిపోయెనే బృందావనికీ
యమునా తటిపై అలల సవ్వడినై
వీచే గాలిలో వలపు గందమై
ఆమాధవుని అందెల రవళై
అల్లుకు పోతిని లతనై గతినై ॥ మురళీ ॥
చరణం:
మురళీ ధరునీ రవళిని పలికే
స్వర సంగమమై మధుర నాదమై...
ఆఁ ఁ ఆ.......ఆఁ ......
అధర సుధారస మధురాంకితనై
రసమయ కేళీ రాగ రంజనై
పలికితి నేనే మురళీ రవమై
పరవశి నైతిని వలపుల చెలినై ॥
************************
No comments:
Post a Comment