Tuesday, March 8, 2022

అంశం : యుద్ధం లో ప్రథమబహుమతి పొందిన కవిత.

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక
కవితల పోటీకై
 అంశం : యుద్ధం
శీర్షిక : యుద్ధ భాష 
**************************
రచన : అన్నం శివకృష్ణ ప్రసాద్
చరవాణి :9490325112
**************************
నీ ప్రమేయం లేకుండానే 
జీవితం ఒక అనివార్యమైన
పరిస్థితిలోకి నెట్టబడుతుంది
మేఘాలు సమరగీతం పాడుతాయి..!

తరగతి గదులన్నీ
సెలవులు ప్రకటించుకుంటాయి
నిత్యావసరాలన్నీ
ధరలరెక్కలు తొడుక్కుంటాయి..!

ఎవరు మోగించిన యుద్ధభేరీనో
నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుంది
నీవు కోరని నిర్భందాన్నెవరో 
నీపైన విధిస్తారు..!

ఆకలీ.. దోపిడీ..
నడివీధుల్లో జట్టుకట్టి ఆడుతాయి
 కురుస్తున్న నిప్పులవాన సాక్షిగా
నీ జాతీయ జెండా రోదిస్తుంటుంది 

ఇక్కడ వేరెవరి కలల పతాకాలో 
మారణహోమాన్నెగరేస్తుంటాయి 
నీ తోటలోని గులాబీలపై
ఇంకెవడో హక్కుల పత్రం రాసుకుంటాడు

నిశ్శబ్దంగా దృశ్యమార్పిడి జరిగిపోతుంది
నీ కలలసంతకం వాడు చేస్తాడు
నీ మాటకు తాను భాష్యం చెబుతాడు
నీ నేలపైనే నిన్ను శరణార్థిని జేస్తాడు
పిడికిలెత్తి ప్రశ్నిస్తే
నీ హక్కుల హననమే తన లక్ష్యమని
యుద్ధభాష లో ప్రకటిస్తాడు..!
********************************
ఆర్యా నమస్కారం..!
పై రచన నా సొంతమని హామీ ఇస్తున్నాను
*********************************

No comments:

Post a Comment