ఉగాది నవలల పోటీ – 2023
6 లక్షల రూపాయలు విలువచేసే బహుమతులు
ఆన్వీక్షికి ప్రచురణలు – చదువు ఈబుక్ యాప్ సంయుక్త నిర్వహణ
తెలుగు సాహితీ ప్రపంచంలో ఆన్వీక్షికి ప్రచురణలు, చదువు యాప్ ద్వారా మేము చేస్తున్న కృషి సాహితీ ఆభిమానులందరికీ తెలిసిందే. నాలుగేళ్లలో వందకి పైగా పుస్తకాలను ప్రచురించి, యాభైకి పైగా యువ రచయితలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన ప్రచురణ సంస్థఆన్వీక్షికి. క్రమంగా కనుమరుగైపోతున్న తెలుగు పాఠకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారకి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనూ మొదలైన యాప్ – చదువు. ఇప్పటికే పదిహేను వేల మంది సాహిత్యాభిమానులు చదువు యాప్ వినియోగిస్తున్నారు. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మరుగునపడిపోతున్న నవల అనే ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో చదువు-అన్వీక్షికి సంయుక్తంగా ఉగాది నవలల పోటీ నిర్వహిస్తున్నాం. లిటరరీ ఫిక్షన్, జాన్రా ఫిక్షన్, యంగ్ అడల్ట్ ఫిక్షన్ అనే మూడు విభాగాల్లో ఈ నవలల పోటీ జరుగుతుంది.
లిటరరీ ఫిక్షన్ : కథ, కథనం కంటే పాత్రలు,వారి అలోచనల ప్రధానంగా సాగే నవలలను లిటరరీ ఫిక్షన్ అనవొచ్చు. తెలుగులో ’చివరికి మిగిలేది’, ’అసమర్థుని జీవయాత్ర’ లాంటి నవలలను లిటరరీ ఫిక్షన్ గా పిలవొచ్చు. వీటినీ కొంతమంది సీరియస్ సాహిత్యం అని కూడా అంటుంటారు.
జాన్రా ఫిక్షన్ : Genre అంటే ఒక కోవకు చెందిన సాహిత్యం అని అర్థం. క్రైమ్ ఫిక్షన్. హారర్ ఫిక్షన్, రొమాంటిక్ ఫిక్షన్, ఫ్యాంటసీ – ఇలా ఎన్నో genres సాహిత్యంలో ఉన్నాయి, తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది లాంటి వాళ్ళు ఇటువంటి రచనలు చేసి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు.
యంగ్ అడల్ట్ ఫిక్షన్ : టీనేజ్‌లో ఉన్న యువతను ఆకట్టుకునే నవలలను యంగ్ అడల్ట్ ఫిక్షన్ అంటారు. హ్యారీ పాటర్ నవలలు, ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ లాంటి నవలలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి నవలలకు విపరీతమైన ఆదరణ ఉంది.
బహుమతులు:
1) ఈ మూడు విభాగాల్లో వచ్చిన మూడు ఉత్తమ నవలలకు, ఒక్కో నవలకు 100000 రూపాయల చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయల బహుమతులు.
2) ప్రతి విభాగంలో రెండవ బహుమతికి అర్హమైన నవలకు 50000 రూపాయల చొప్పున మొత్తం లక్షన్నర రూపాయల బహుమతులు.
3) ఒక్కో విభాగంలో ఎంపిక చేయబడిన మూడు నవలలకు, ఒక్కో నవలకు 10000 రూపాయల చొప్పున మొత్తం 90000 రూపాయల బహుమతులు.
4) జ్యూరీచే ఎంపిక చేయబడిన కొన్ని ప్రత్యేక నవలలకు 60000 రూపాయల వరకూ ప్రోత్సాహక బహుమతులు.
నియమ నిబంధనలు
1) ప్రపంచంలో ఎక్కడున్న వారైనా, ఏ వయసు వారైనా ఈ నవలల పోటీలో పాల్గొనవచ్చు.
2) ఈ నవల తమ స్వంతమని, ఏ ఇతర నవలలకు అనుసరణ కానీ, అనువాదం కానీ కాదని, హామీ పత్రం విడిగా జతచేయాలి.
3) రచయితలు తమ నవలలు తెలుగు యూనికోడ్ లో, అచ్చు తప్పులు లేకుండా టైప్ చేసి పంపించాలి. ఈ నియమం పాటించని నవలలను పరిశీలించబడవు.
4) మీ నవల వర్డ్ డాక్యుమెంట్‌లో, A4 సైజ్ పేపర్లో, మండలి ఫాంట్, సైజ్ 14 లో 100 పేజీలకు మించి, 200 పేజీల లోపు ఉండాలి.
5) మీ నవలలు ugadinovels@chaduvu.app కి మెయిల్ చేయాలి.
6) నవలకు సంబంధించిన వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడా రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ లాంటి విషయాలు ప్రస్తావించకూడదు.
7) మీరు పంపుతున్న మెయిల్‌లోనే మీ పూర్తి పేరు, ఫోన్ నెం, మీరు ఏ విభాగంలో మీ నవలను సబ్మిట్ చేస్తున్నారనే విషయాలను స్పష్టంగా తెలియచేయాలి.
8) బహుమతికి ఎంపికైన నవలలు చదువు యాప్‌లో ఈబుక్ & ఆడియో బుక్స్‌గా ప్రచురించే హక్కులు చదువు యాప్ నిర్వాహకులకు ఉంటాయి. అలాగే మొదటి రెండు ముద్రణలు ప్రింట్‌లో ప్రచురించే హక్కులు ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ కలిగిఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
1) నవలలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ – సెప్టెంబర్ 22, 2023
2) పోటీ ఫలితాల ప్రకటన – డిశెంబర్, 22, 2023
3) బహుమతుల ప్రధానోత్సవం – ఉగాది 2024
అందరికీ ఉగాది శుభాకాంక్షలు
No comments:
Post a Comment