Friday, June 16, 2023

శీర్షిక శ్రీ అగస్త్యేశ్వర , చెన్నకేశవ ఆలయం

మనోహరి పత్రిక కొరకు రచన
 తేదీ 16 6 23
 విభాగం వ్యాసం
 అంశం ఐఛ్ఛికం

పేరు అద్దంకి లక్ష్మి
 ఊరు ముంబై 

శీర్షిక   శ్రీ అగస్త్యేశ్వర , చెన్నకేశవ  ఆలయం 

కడప జిల్లా చెప్పలి

 కడప జిల్లా కమలాపురం సమీపంలోని 'చెప్పలి' గ్రామంలో  అగస్త్యేశ్వర స్వామి , చెన్నకేశవ ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 
అగస్త్యేశ్వర  స్వామి ఆలయం గర్భగుడి గజపృష్ట  ఆకారంలో విలక్షణంగా ఉండటం విశేషం . ఇక్కడి శివలింగం కూడా ఆధ్యాత్మిక ఆకర్షణతో భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తూ ఉండటం విశేషమే !

 చెప్పలి క్రీ.శ. 575 కాలంలో  రేనాటి చోళుల రాజధానిగా విలసిల్లింది. తెలుగుభాషలో మొదటి రెండు శాసనాలను ఈ రేనాటి చోళులే కలమల్లలో, ఎర్రగుడిపాడులో వేశారు.

 ఈ గ్రామంలో 1.13 ఎకరాల స్థలంలో, ఒకే ప్రాంగణంలో శివకేశవుల ఆలయాలు ఉన్నాయి. శివాలయంలో అగస్త్యమహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించగా, 6వ శతాబ్దంలో రేనాటి చోళులు ఆలయాన్ని పునరుద్ధరించారు.

 శివకేశవుల ఆలయాలకు ఎదురుగా బలమైన 2 రాజగోపురాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. 48 అడుగుల ఎత్తయిన ఈ రెండు గోపురాలూ ఇప్పుడు కూలిపోయి ఉన్నాయి. శివాలయం ఎదుట ఉన్న గోపురం 1994లో కూలిపోగా, చెన్నకేశవస్వామి ఆలయం ఎదుట ఉన్న గోపురం, 2011, జూలై 28న కూలిపోయింది. 

 ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని  పాలించాడనటానికి
అగస్త్యేశ్వరాల స్తంభాలకు చెక్కబడిన తెలుగు
శాసనాలే నిదర్శనం.

 ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. 
 
 నంది వాహనంపై శివపార్వతులు గల అరుదైన విగ్రహం ఉండటం ఇక్కడి విశేషం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద శివాలయాలలో ఎక్కడా ఇలాంటి విగ్రహాలు లేవు.

 వీటి పక్కనే ఉన్న శ్రీలక్ష్మీసమేత చెన్నకేశవ ఆలయాన్ని 1323లో విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
విశాలమైన ఆవరణం, రెండు పెద్ద గాలి గోపురాలు, శుభకార్యాలకు పెద్ద వంటశాల, పెండ్లి మంటపాలు ఉన్నాయి.

 ఏటా కార్తీకమాసంలో కల్యాణం చేస్తున్నారు. రోజూ ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటుగా ప్రతి సోమవారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలిగోపురాన్ని పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.

 యెల్లమ్మ ఆలయం

 గ్రామంలోని చెప్పలి యెల్లమ్మ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరు గాంచింది. 
యెల్లమ్మ తల్లి గ్రామంలోని ఒక గ్రామాధికారి ఇంట్లో ఉద్భవించినట్లుగా స్థలపురాణం వల తెలుస్తోంది. 
చైత్రమాసం బహుళ ఏకాదశి దినాన్ని పురష్కరించుకుని గ్రామంలో ఏడు రోజుల పాటు జాతర జరిపే ఆచారం ఉంది. 
యెల్లమ్మ గుడికి పూజారిగా ఆత్రేయస గోత్రానికి చెందిన భట్రాజు వంశస్తులు వ్యవహరించడం పురాతన ఆచారం.

రోడ్డు మార్గంలో : కడప కి 30 కి.మీ

హామీ ఈ వ్యాసం నా స్వంతం దేనికీ అనువాదం అనుకరణ కాదు ఏ వెబ్సైట్ పత్రికలకూ పంప బడలేదు

No comments:

Post a Comment