మిత్రులకు నమస్తే !
గజల్ రాయాలని ఇష్టం, పట్టుదల ఉన్నందున తప్పక చక్కగ రాయగలరు..
గజల్ వ్రాయడమెలా ?
*******************
మొదట
గురులఘువులు గుర్తించడం తెలియాలి.
గురువులు:
దీర్ఘాక్షరాలు,
రా రీ రూ రే రై రో ( ఐ ఔ చేరిన అక్షరాలు )
కం గం నిం - సున్న చేరినవి
విసర్గ తేరిన అక్షరాలు దుః
సంయుక్తాక్షరానికీ ద్విత్వానికి ముందున్న అక్షరాలు గురువులు
సుత్తి - సు గురువు
లక్క - లగురువు
పత్తి - ప గురువు
సత్య- స గురువు
-పద్మ ప గురువు
విస్సు - వి గురువు
మరి ఇక...లఘువు
క కె. రు. గు. కి. డి జు వంటివి అన్నీ లఘువు
గజల్ లో గణాలు ఉండవు . మాత్రలు తెలియాలి
గురువు -2 మాత్రలు
లఘువు - 1 మాత్ర
3 మాత్రల పదాలైతే త్రిస్రగతి
4 మాత్రల పదాలై తే చతురస్ర గతి
5 మాత్రల పదాలు వాడితే ఖండగతి
రెండు రకాల గతులు కలిపితే మిశ్రగతి, సంకీర్ణ గతి
ఇలా ఉంటాయి.
3 మాత్రలు- కవిత
4 మాత్రలు - కవితలు, కవితా
5 మాత్రలు- కవిత ఇది, కవితలే
ఇలాంటి కూర్పు తీసుకొని వ్రాయాలి.
రెండు షేర్ పాదాలలో విషయం ఒకటే అయిఉండాలి.
ఉదాహరణ ---
నీ కంటి పాపలో నీలమై పోతాను
నీ మేని ఛాయలో రాగమై పోతాను
ఇక్కడ మై చివరి అక్షరం అయింది. దాని ముందు ల, గ లో అచ్చు అ గానే ఉంది. గజల్ మొత్తం ఇలాగా రావాలి. పెద్ద కాఫియా లైతే
మురిసిపోతోంది, కురిసిపోతోంది, అలిగిపోతోంది, కుమిలిపోతోంది ఇలాంటి పదాలు వస్తే సరిపోతుంది.
కాఫియా ఎంపికలో జాగ్రత్త ఉండాలి.అచ్చు ఒక్కటై ఉండేలా వ్రాయాలి. అప్పుడు అందమైన గజల్. లయ, నియమం కుదురుతుంది.
గజల్ కు శీర్షిక ఉండదు వచన కవిత లాగా.
మత్లా = గజల్ లో మొదటి ద్విపద ( రెండు పాదాలు) చివరి పదాలు ఖాఫియా, రదీఫ్ అంటారు
షేర్ = గజలలోని మిగిలిన ద్విపదలు..షేర్ లంటారు.
ఇందులో మొదటి పాదం కేవలం మాత్రలు పాటిస్తూ
సాగుతుంది. దీనిలో కాపీయా, రదీఫ్ అవసరం లేదు.
రెండవ పాదం మత్లాలోని విధంగా కాఫియా, రదీఫ్
ఇలా మత్లా, షేర్లు కలిపి, 5, 7, 9....ద్విపద లుగా రాస్తారు.
చివరి ద్విపదలో కవి పేరు ( తఖల్లూస్)ఉంచుకో వచ్చు క్లుప్తంగా..
ఇక
నా పూర్తి గజల్ ఇక్కడ కింద పోస్ట్ చేస్తున్నాను ఉదాహరణ కోసమే..
ఇందులో
రదీఫ్ : అనుకున్నా
కాఫియా: దాగాలని, పాడాలని వగైరా లు
కాఫియా పదంలో "డాలని " "పదంముందున్న అక్షరo లో అచ్చు అన్నిటికి ఒకేలా సరళంగా ఉండాలి.
"పాడాలని " అ కారమే వస్తుంది అన్ని కాఫియా లు.
గతి: 6-6-6-6
గజల్ ప్రాథమిక లక్షణాలు మాత్రమే ఇచ్చాను
గజల్ లో కొంత స్వేచ్ఛ ( మరీ ఎక్కువగా కాదు) తీసుకో వచ్చు. ఉదాహరణకు నిజమెంతొ "" అని రాయవచ్చు "నిజమెంతో ' కి మాత్రతగ్గింపు కోసం. బదులుగా ...వచన కవితలో ఐతే ఇలా రాయకూడదు.
అలాగే లయ అందుకోగలిగి ఉంటే 6 మాత్రలు కట్ చేసినట్టు ఉండనక్కర లేదు. నాలుగు మాత్రలు పదాలు మూడు కలిపి పన్నెండు గా లెక్కింపు చేయొచ్చు. కొందరు సీనియర్ కవులు లయ తో వ్రాస్తారు. అందమైన గజళ్ళు.
గజల్ లో "తఖల్లూస్ నామ ముద్ర "ఉండకపోయినా పరవాలేదు. ఐచ్ఛికమే.
గజల్కి ఒక ఆత్మ ఉంటుంది.
సహజత్వం తో చమత్కారం ఇమిడి పోవాలి అప్పుడే అది సంపూర్ణ గజల్. ఒట్టి నియమాలతో మాత్రలు సరిపోతుంది అనుకో రాదు. మన గజల్ పాఠకులు మెచ్చాలి.
మీరు వ్రాస్తున్న అద్భుతమైన వచన కవిత ల్లో లాగే ఉపమానాలు ఉండొచ్చు కానీ అవి సహజం గా ఇమిడి పోవాలి. హృదయం కదిలేలా విషాద గజల్...
పెదవిమీద చిరునవ్వు విరిసేలా ప్రేమ గజల్ ఉండి, లోకం తీరు గజల్ ఔరా నిజమే అనిపించాలి.
మొత్తానికి వహ్వా అనిపిస్తుంది అప్పుడు గజల్ !
ఉదాహరణ కి...
సేవ గజల్ వారోత్సవాలలో నేను వ్రాసిన గజల్ V V V. శర్మ సార్ పాడారు జూమ్ లో. జడ్జిల ప్రశంసలు పొందిన గజల్ !
తాజా గజల్
చెలిమోమున నునుసిగ్గులు చూడాలని అనుకున్నా
మల్లియనై పూలజడను మురవాలని అనుకున్నా
గుండెలలో దాచుకున్న బండలాంటి కఠినతలే
వెన్నపూస లాగ మారి కరగాలని అనుకున్నా
మొహమాటం నవ్వులన్ని మోజుమరీ పెంచినవే
హాసమణులు గుప్పిటలో దాచాలని అనుకున్నా
ఎవరికివారే లోకం ఏటికి ఎదురీదు బతుకు
తోడునీడ సఖికొంగున నిలవాలని అనుకున్నా
నిశ్శబ్దపు నిశీధిలో అమావాస్య జతకూడెను
మిణుగురులై చెలిచూపులు మెరవాలని అనుకున్నా
కత్తులు విసిరే కాలం చిత్తుగ నను ఓడించే
అనునయాల అమృతఝురులె కురవాలని అనుకున్నా
ప్రేమతపసు వరమైనది భామమనసు అందె ఉమా
సురకిన్నెర వీణియతో పాడాలని అనుకున్నా !!
మీతో ఈ ముచ్చట్లు పంచుకునే అవకాశం ఇచ్చినo దుకు అడ్మిన్ గారికి ధన్యవాదములు. నేను ఇంకా నేర్చుకోవాలి. గజల్ సముద్రం లాంటిది. ముత్యాలు, పగడాలు అమూల్యమైన ఓషధులు ఉంటాయి. ధన్యవాదములు. 🙏🙏🙏🙏
ధన్యవాదాలు మిత్రులకు
ఎం. వి. ఉమాదేవి
No comments:
Post a Comment