Tuesday, July 18, 2023

శీర్షిక: సరిలేరు, నీకెవ్వరూ.....కథ.

తపస్వి మనోహరం E-book  కొరకు,
18-07-2023.
కథ అంశం: "మనిషి, ఒకే ఒక్క రోజు, "దేవుడు అయితే..".
శీర్షిక:  సరిలేరు, నీకెవ్వరూ.....
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :మహారాష్ట్ర.

------------------------------------------

అఖిలకు, చాలా చిరాగ్గా ఉంది.  తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ఎక్కడకు తిరగడానికి వెళ్లలేకపోయింది , తను,  పదో క్లాసు పాసవ్వగానే ,
తనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. .
కానీ ,అప్పటికే కాబోయే అత్తగారు, పక్షవాతంతో మంచం మీద ఉన్నారు. మా మగారికి ,డయాబెటిస్ కారణంగా , చెవుల వినికిడి, తగ్గిపోయింది. ఆ కారణంగా  వాళ్లు,
వాళ్ళ అబ్బాయికి, తొందరగా పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుని, వాళ్ల అబ్బాయికి, పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. " కట్న కానుకలు అక్కర్లేదని, అమ్మాయి , తమతో కలిసి ఉంటే చాలని* వాళ్ళు కోరుతున్నారని ,  తెలియడంతో  ,అమ్మ, నాన్నలు, నా పెళ్లి వాళ్ళ అబ్బాయితో జరిపించేస్తారు

  పెళ్ళయ్యాక భర్తతో హాయిగా, ఎన్నో దేశాలు తిరుగుదామని అనుకుంది.  కానీ ఉమ్మడి కుటుంబం ఐన  ఆ ఇంట్లో, ఏనాడు తామిద్దరికీ ,  కనీసం మాట్లాడుకుందికి కూడా ,సమయం దొరికేది కాదు  . పెళ్లయిన సంవత్సరంలోపలే, తనకు పెద్దవాడు పుట్టేసాడు .ఆపై వరుసగా మరో ఇద్దరు .
దాంతో తన బ్రతుకు, పనిమనిషి కన్నా హీనం అయిపోయింది  పొద్దున్నే లేవగానే,   అత్తగారి  సేవలతో
మొదలైన పని,  భర్తను ఆఫీసుక పంపించడం, పిల్లల్ని స్కూల్కి తయారు చేయడం , వాళ్ళని మళ్లీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం, ఈ మధ్యలో  కడుపులో ఇంత వేయడం కోసం  ఆరుగురు మనుషుల కోసం. వంట వండడం,  గట్టిగా మాట్లాడితే గానీ వినపడని మామ గారితో సతమతమవడం , తిరిగి పిల్లలు వస్తే వాళ్ల కోసం స్నాక్స్ రెడీగా ఉంచడం ."
"అబ్బబ్బ. జీవితం అంటే విసుగు వచ్చేస్తోంది.
"పోనీ.. సాయంత్రం పూట అలా చల్లగా, మార్కెట్కి వెళ్లి నాలుగు కూరలు కొని  వద్దామా అంటే ,
అసలు కూరలు కొనే పరిస్థితిలో ఉన్నామా  ?
ఎంతెంత ఖరీదులో... ..! "
"నాలుగు రోజులు కూరలు కొనుక్కుంటే ,ఇల్లే అమ్మేవలసి వస్తుంది.
సణుక్కుంటూనే, మాధవి, స్నానం చేసి బట్టలు మార్చుకుని , జడల్లుకుంది .
అత్తగారికి, మామ గారికి ,  ఫ్లాస్క్ నిండా కాఫీ పోసి,
స్కూల్ కి వెళ్ళొస్తానని చెప్పి ,బయలుదేరింది.
"స్కూల్ కి వెళ్లి , పిల్లల్ని తీసుకురడానికి, ఇంకో అరగంట దాకా టైం ఉంది .ఈ మధ్యలో కాస్త , దగ్గరలో ఉన్న "వెంకటేశ్వర స్వామి " మందిరానికి వెళ్లి, దర్శనం చేసుకుని వస్తే సరి... కాస్త మనసు ప్రశాంతంగానే ఉంటుంది .  అప్పటికి. పిల్లల స్కూలు కూడా విడిచి పెట్టేస్తారు ." "అనుకుంటూ , స్వామివారి మందిరంలోకి అడుగు పెట్టింది.

********************
చాలా రోజుల తర్వాత, మందిరం లోకి అడుగు పెట్టిన మాధవి కి,  ఎదురుగుండా  దివ్య మంగళస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూసేసరికి,  భక్తి పారవస్యంతో    కళ్ళల్లో , నీళ్ళు నిండుకున్నాయి.
వెంటనే భక్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించింది.
"స్వామీ ! పెళ్లి కాకముందు, అమ్మతో కలిసి, మీ కోవెలకి, ప్రతిరోజు వస్తూ ఉండేదాన్ని . నా బాల్యమంతా నీ సన్నిధిలోనే గడిచినంత తృప్తి నాకు ఉండేది . కానీ, పెళ్లయ్యాక ఏంటి స్వామీ...? ఒక్కరోజు కూడా నీ దర్శనానికి రాలేకపోతున్నాను .
నాకు ఈ బంధనాలన్నీ ఏమిటి స్వామి ..?   క్షణం సేపు కూడా, నీ నామస్మరణ చేయడానికి సమయం దొరకడం లేదే. ?"
అయినా నిన్నని, ఏం లాభం..? నా కర్మ  ఇలా కాలిపోయింది.
నీకేం? నువ్వు మహారాజులా, భక్తులు పెట్టిన. నైవేద్యాలన్నీ తింటూ,  లక్ష్మీదేవి, నీ పాదాలు. పడుతూ ఉంటే  , హాయిగా కళ్ళు మూసుకుని ఆనందం అనుభవిస్తున్నావు . ఇంక నీకు ,మా కష్టాలు ఎందుకు కనిపిస్తాయి ?,మా గురించి ఎందుకు పట్టించుకుంటావు?

అసలు నిన్ను ఆపద్బాంధవుడవని  ఎవరన్నారయ్యా? !
అదే నిజమైతే , మధ్యతరగతి వాళ్ళమైన మాలాంటి వారి పై , బీద, బిక్కిలపై , దయచూపవేమి స్వామీ! ?
అతి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని స్థితికి, మమ్మల్ని ఎందుకు దిగజారుస్తావు స్వామీ..?
వింటున్నావా స్వా మీ.! " అంటూ తన మనసులోని బాధనంత వెబోళ్లసుకుంటున్న అఖిలకు , ఒక్కసారిగా ఉక్రోషం ముంచుకొచ్చింది.. వెంటనే కోపంగా,
"అసలు ఇదంతా ఎందుకు ,?
ఈ సుఖాలన్నీ వదిలిపెట్టి ఒక్కరోజు నువ్వు నా జాగా లోకి వచ్చి చూడు .  ఆ ఇంట్లో నేను ఎంత కష్టపడుతున్నానో, నీకు తెలుస్తుంది .అంతేకాదు , నన్ను  ఒక్కరోజు ,నీ స్థానంలో  . ఉండనీయ్యి .నాలాంటి ఎంతోమందికి ,నేను ఎంత సుఖాన్ని ఇస్తానో... ఎంతమంది బాధలు వింటానో.. ఎంతమంది కోర్కెలు తీరుస్తానో..!.  ఈ దేశంలో సామాన్యులకు జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని , అన్నింటిననీ రూపు మాపేస్తాను .
ప్రపంచం అంతటా ఆనందాన్ని నింపేస్తాను .
ఈ దొంగలు, దెబ్బలాటలు, రాజకీయాలు , అరాచకాలు ,ఏమి లేకుండా శాంతియుతమైన జీవితాన్ని అందరికి ప్రసాదిస్తాను. వింటున్నావా.. స్వామీ .. ?
"ఒక్కరోజు దేవునిగా ఉండే అవకాశం నాకు ఇస్తావా  "?
అంటూ సవాలు చేసింది.
అంతలోనే తుళ్లి పడి ,సమయం చూసింది ". అరే పిల్లలకు, స్కూలు వదిలేసినట్టున్నారు . ఎంతసేపయిపయిందో....
అనుకుంటూ,  వస్తాను స్వామీ. !
ఏదో భరించలేని బాధలో ఏదోదో అనేసాను .నువ్వు  అపార్థం చేసుకోకేం ,  అంటూ ,కళ్ళు తుడుచుకుని, పిల్లల్ని తేవడానికి. స్కూలుకు బయలుదేరింది.

********************
పగలంతా కష్టపడిందేమో, . రాత్రి అఖిలకు  ఎంతొందరగానే నిద్ర వచ్ఛేస్తోంది . అన్ని పనులు గబగబా ముగించుకొని పక్క మీద వాలింది.
అఖిలకు అప్పుడే " మగతగా" నిద్ర పట్టింది.

************
తలుపు కొడుతున్న చప్పుడికి తెలివి వచ్చింది అఖిలకు.
సమయం చూస్తే, తెల్లవారి నాలుగు గంటలు అవుతోంది . " ఈ సమయంలో ఎవరబ్బా వచ్చింది " అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగుండా స్వామి వారిని  చూసి , అఖిల నోరేళ్లబెట్టింది. అంతలోనే స్వామివారు ,"అఖిలా! నువ్వు కోరుకున్నట్టుగానే, నేను మీ ఇంటికి వచ్చాను .పొద్దున లేచిన దగ్గర నుండి,  ఈ రోజంతా నువ్వు నా స్థానంలో ఉంటావు .నేను నీ స్థానంలో ఉండి ఇల్లు, వ్యవహారం, అంతా చూసుకుంటానులే  .
నువ్వు  , తొందరగా.గుడికి వెళ్ళు .తెల్లవారిపోతే ,మళ్ళీ భక్తులందరూ  ,తమ గోడు వెళ్ళబోసుకోవడానికి, గుడికి వచ్చేస్తారు ."అనగానే అఖిల తెల్లబోయింది.
  తర్వాత ఆశ్చర్యపోయింది .తర్వాత సంతోషంగా
   స్వామి వారికి ,తను తెల్లారి లేచి, చేయబోయే పనులన్నీ అప్పచెప్పి .గుమ్మం దాటి గుడి దారి పట్టింది.
అఖిలకు, ఆకాశంలో తేలిపోతున్నట్టుంది . "ఈ ఒక్కరోజు, తను  దేవుడి స్థానంలో  ఉండబోతోంది . తను ఏమన్నా చేయగలిగే శక్తిని , ఈ ఒక్క రోజు మాత్రం, దేవుడు తనకు ప్రసాదించాడు ."
"ఈరోజు తను ఎన్నో అద్భుతాలు చేయాలి. సమయం తక్కువగా ఉంది .దేవుడుకి నా సత్తా ఏంటో చూపించగలగాలి ."అనుకుంటూ ఆనందంగా గబగబా గుడి వైపు గా,  అడుగులు వేయసాగింది అఖిల.

***************
తను వెళ్లేసరికి ,అప్పటికే చాలా బాగా తెల్లారిపోయింది .గుడిలో నుంచి సుప్రభాతం వినిపించడం
ఆగిపోయింది . తను గుడి లోపలికి వెళ్ళబోయేంతలోనే , అక్కడ ఏదో దొమ్మి జరుగుతున్నట్లనిపించీ , అటువైపుగా నడిచింది
తను ఇప్పుడు అఖిల గా కాక ,స్వామివారి రూపంలో, అంటే మగ వేషంలో ఉంది .అందుకే వారి మధ్యకు వెళ్లి, తగువేమిటో  కనుక్కొని ,"తగువు  తీర్చడానికి ప్రయత్నిద్దాం" అనుకొని దగ్గరకు వెళ్ళింది .
అక్కడ రెండు పక్షాలుగా , మనుషులు  విడివడి కొట్టుకుంటున్నారు అందులో మొదటి పక్షం "విగ్రహాన్ని మీరే దొంగిలించారు "అంటూ ఎదుటివారిపై నిందలు వేస్తున్నారు. మరొక పక్షం "మీరే దొంగలు" ఎప్పటినుంచి మీరు సత్తాలోకీ వచ్చారో , అప్పటినుంచి ,ఎక్కడపడితే అక్కడ, దొమ్మిలు, దొంగతనాలు అరాచకాలే..జరుగుతున్నాయి"  అంటూ , మొదటి వారిపై విరుచుకుపడుతున్నారు
అఖిలకు, చాలా సేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు . పక్కనున్న పూజారి గారిని అడిగింది  .అతను గుడిలో విగ్రహం మాయమైపోయింది నాయనా .. పొద్దున్న సుప్రభాతం సమయంలో ఈ భక్తులంతా వచ్చారు. ఇదిగో ఇప్పుడు ఈ విధంగా దెబ్బలాడుకుంటున్నారు"
ఎవరూ "స్వామివారి విగ్రహం ఏమైందో" అన్న మాట గురించి, ఆలోచించడమే లేదు "అంటూ బాధగా అన్నారు.
దాంతో అఖిలకు విషయం పూర్తిగా అర్థమైంది .కానీ, " తనే ఈరోజుకు  దేవుడు " అని  చెప్తే ,ఈ జనం నమ్ముతారా? "అనుకుంది. అయితే "తను ఇప్పుడు దేవుడు కదా!   ఈ సమస్యకు పరిష్కారం చెప్పి చూద్దాం " అనుకుంటూ మధ్యలోకి వెళ్ళింది. ఇరుపక్షాల వారిని ఆగమంటూ" విగ్రహం పోయిందని కదా వాళ్ళడుగుతున్నది . దానికి పరిష్కారం ఆలోచించాలి గానీ, ఇలా కొట్టుకోవడం, నిందలు వేసుకోవడం ఎందుకు ? " అంటూ ఏదో అనబోయింది." 
ఇంతలో, మొదటి పక్షం నుంచి ఒక మనిషి వచ్చి ," ఇతడు ఎవడో గానీ దేశద్రోహి లా ఉన్నాడు వీడు మన పార్టీ నే ప్రశ్నిస్తున్నాడు వెంటనే, వీడిని  కారాగారంలో వెయ్యాలి . లేకపోతే ,మనకే నీతులు చెబుతాడా" అంటూ అరవ సాగేడు.
అంతే..! ఐదు నిమిషాలలో, అక్కడ పరిస్థితి మారిపోయింది .ఎవరో ఎవరికో ఫోన్ చేశారు .పోలీసులు వచ్చారు. తన చేతికి బేడీలు వేశారు  .అంతే మరో పది  నిమిషాల్లో తను కారా గృహంలో ఉంది.
మగ రూపంలో ఉన్న అఖిలకు ఏం చేయాలో తోచలేదు. తనకి రాజకీయాల గురించి ఏమీ తెలీదు .అనవసరంగా వీళ్ళ మధ్యలో దూరానేమో ! అనుకుంటూ  మధన పడసాగింది. ఇప్పుడు తను బయటకు వెళ్లేది ఎలా..?
ఆలోచిస్తూ ఉండగానే ,ఎవరో వచ్చి తనను "బెయిల్" మీద, విడిపించి బయటకు పట్టుకెళ్లారు.
తనను విడిపించేరు గనక, వచ్చే ఎలక్షన్ లో , తన ఓటు వారిదేనని , వారి పార్టీలోనే తను చేరాలని, వారికై, ప్రచారం చేయాలని నొక్కి చెప్పసాగాడు

మగ రూపంలో ఉన్న అఖిల్ కు, చాలా భయం వేసింది " అయ్యా బాబోయ్ !  ఇక్కడి నుంచి, ఎలా తప్పించుకోవడం
రా దేవుడా !" అని ఆలోచిస్తూ ఉండగానే ,దేవుడిలాగా వాళ్ళిద్దరి మధ్య నుండి ఒక కారు దూసుకెళ్లింది .ఆ క్షణంలోనే, అఖిల తనకు తెలియకుండానే ఓ పక్కకు తప్పుకుంది  .  అఖిల్ కు ఏం అర్థం కాలేదు కానీ ,వెంటనే, తను దేవుడు కదా.. అన్నది జ్ఞాపకానికి వచ్చి,  తన రూపాన్ని మరో పురుషుడిలా మార్చుకుని , .
"బ్రతికానురా దేవుడా "అనుకుంటూ బయటపడింది.
ఇలా కొంచెం దూరం వెళ్ళిందో లేదో, వెనకనుంచి తనను నలుగురు దుండగులు పట్టుకొని , చితక బాదడం మొదలెట్టారు.
అఖిలకు ,వాళ్లు తనను , ఎందుకు కొడుతున్నారో... చాలాసేపటి వరకు ,అర్థం కాలేదు ఒళ్లంతా చితకబారిన తర్వాత తెలిసింది ఏంటంటే, తనలాగే ఉన్న ఒకతను, వారి వద్ద , వేలకు వేలు-
అప్పులు చేసి పారిపోయాడట .  అచ్చు అతనిలాగే రూపం మార్చుకున్న తను, కనబడే సరికి ,వాళ్ళు  తమ దగ్గర అప్పు చేసి , పారిపోయిన వాడే  వచ్చాడనుకొని  , తనను చితక్కొట్టినట్టు ,తెలుసు కొంది..
ఇంకా వాళ్ళు తనని ఏమి చేసి ఉందురో.. కానీ ఇంతలో ఒక ముసలావిడ
"వాడిని ఏమి చేయకండి  వాడు నా కొడుకే...నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీకు చెల్లిస్తా"  అంటూ వాళ్లకి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడికక్కడే వాళ్ళకి చెల్లించేసింది.
ఇంతవరకే అఖిల చూడగలిగింది .తర్వాత , వాళ్లు కొట్టిన దెబ్బలకి ,మెల్లగా తెలివి తప్పింది.

*******
కళ్ళు తెరిచి చూసిన  అఖిలకు ,చుట్టూ ,చుట్ట  కాలుస్తున్న కొందరు నాటు సారా తాగుతూ ,తూగుతూ, మాట్లాడుకోవడం కనబడింది .
మగరూపం లోనున్న  అఖిల ,అక్కడి నుంచి వస్తున్న ఆ చుట్ట వాసన భరించలేక లేచి నిలబడింది.
అఖిల, నిలబడడం చూస్తున్నా ఒక అతను" "అదిగోరా !.  లేచాడు . అతడినే అడుగుదాం  అతన్ని, చితక బాదిన వాడెవడో    ?    బాస్ చెప్పగానే,  అ కొట్టిన వాడిని , పొడిచి చంపేద్దాం "రండిరా, రండి- అంటూ , కత్తి పట్టుకొని, అతని దగ్గరికి వచ్చాడు.
అఖిలకు కాళ్లు చేతులు  వణక సాగాయి.
ఇంతలోకి వాళ్లు ,  "బాస్. ! మిమ్మల్ని ఎవరు కొట్టారో చెప్పండి బాస్!  ఈరోజు వాళ్ళ అంతు చూస్తాం " అంటూ, రెచ్చిపోసాగారు.
ఓహో! తను ఇప్పుడు వీరికి "బాస్"  అన్నమాట అనుకుంటూ పిచ్చిగా నవ్వుకుంది.
ఇంతలో ఒకతను వచ్చి , "బాస్ ! ఇదిగో ! ఈ రోజు నాకు ఈ అబ్బాయి ,అమ్మాయి, దొరికారు. చెప్పండి .వీళ్ళని ముష్టి వాళ్ళను చేద్దామా..? లేకపోతే  పై దేశానికి  ఎగుమతి చెయిద్దామా "అంటూ అడగసాగాడు.
అఖిల నోరెళ్ళబెట్టి ,ఆ ఇద్దరు పిల్లల వైపు చూసింది. వెంటనే అఖిల  రోమాలు నిక్కబొడుచుకున్నాయి .
ఆ పిల్లలిద్దరూ ,మరెవరో కాదు .తన పిల్లలే.
తను ఇప్పుడు, ఈ దుండగుల నుండి  తన పిల్లల్ని ,రక్షించుకోవాలి. ఎలా? ఎలా ? 
అఖిల  ఆలోచిస్తూనే  పిల్లల్ని దగ్గరికి తీసుకుంది.
"ఏంటి బాస్ ..పిల్లల్ని అలా దగ్గరికి తీసుకున్నారు.  మీరు ఊ... అనండి. వాళ్ళని  వికలాంగులను చేసి , కట్లు కట్టి ,ఈరోజు నుంచే వాళ్ళని పనిలోకి పంపిస్తాం ."
అన్నాడొకడు కర్కోటకంగా.
అఖిల క్షణంలో తేరుకొని, "ఈరోజు ,నాకు మనసు బాగోలేదు. వీరిని ఇక్కడే ఉంచి, మీరు వెళ్ళండి. వీళ్ళని ఏం చేయాలో, తర్వాత నేను చెప్తాను "అంటూ వాళ్ళను పంపించేసింది.
భయంతో వణుకుతూ  , ఏడుస్తూ ,దూరంగా నిలబడ్డ పిల్లలని చూసేసరికి ,అఖిలకు కడుపులో దేవినట్లయింది.
ఎలాగైనా, వార్ని రక్షించాలని అనుకుని ,వెనకదారి నుంచి వారిని బయటకు పంపేయడానికి ప్రయత్నించసాగింది.
ఇంతలో దుండగుల్లో ఒకడు వీరిని చూసి , గట్టి గట్టిగా అరవసాగాడు
" రేయ్ ! మన బాస్ చూడండిరా ,మనకు వాటా ఇవ్వకుండా ఉండాలని , తాను తప్పించుకుని ,  పిల్లల్ని పట్టుకెళ్ళి   తనొక్కడే అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు ."
అంటూ  అరవసాగాడు
దాంతో, మిగిలిన వాళ్లంతా, గోల గోలగా వచ్చి, కర్రలతో తనను  బాద సాగారు." అసలు వాళ్లేం చేస్తున్నారో"  ,అన్నది వాళ్లకే తెలియని మత్తులో ఉన్న వాళ్ళని, ఏం చేయాలో..?..
ఎలా ఆపాలో...?.. " అన్నది, అఖిలకు అర్థం కాలేదు.
వాళ్లు కొడుతున్న దెబ్బలు, పిల్లలకి ఎక్కడ తగులుతాయో? అని వాళ్ళను గుండెల్లో దాచుకుంటూ, ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుంది. తను అంత సులభంగా అక్కడినుంచి ఎలా తప్పించుకుందో ,అఖిలకు అసలు అర్థం కాలేదు.
కానీ తప్పించుకున్నందుకు సంతోషపడుతూ, ఇంటిదాకా  పిల్లల్ని దిగబెట్టి ,  వాళ్లని ఇంట్లోకి వెళ్లిపోమంది.
అప్పటికి , అఖిల చాలా అలసిపోయింది  సమయం కూడా రాత్రి. ఏడు గంటలు కావస్తోంది.
నీరసంగా ఉన్న అఖిల మరో ఆలోచన లేకుండా, " తెల్లారి నాలుగు దాకా తను దేవుడిగా ఉండాలి కదా" అనుకుంటూ గుడి వైపు అడుగు లేచింది,
కడుపులో ఆకలి నకనకలాడుతోంది  . గుడిలో భక్తులు చాలా తినమండాలు, నైవేద్యంగా పెట్టి ఉంటారు.   హాయిగా వంట బాధ లేకుండా అవి తినొచ్చులే "   అనుకుంటూ  నడుస్తూ  ఆలోచిస్తున్నాది అఖిల.
"అనుకోకుండా అస్తవ్యస్తంగా, ఈ రోజంతా గడిచిపోయింది తను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం, ఒక్క పని కూడా చేయలేకపోయింది . అయినా ఏంటీ ప్రపంచం ?  ఎంత అన్యాయం   జరుగుతోంది ? ఎవరు ఎవరిని కొడుతున్నారు..?. ఎవరు ఎవరిని తిడుతున్నారు?  తెలియనంతగా ఈ మనుషులు ఎందుకు ఇలా   వ్యవహరిస్తున్నరు ."
అందుకేనేమో ! భగవంతుడు ,ఉలకకుండా ,పలకకుండా, ఏమి పట్టించుకోకుండా, అలా చిద్విలాసంగా నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడూ.."..
ఆలోచనల్లో ఉండగానే
"వీడేరా,మనని, ఎదుటి పార్టీ వాళ్ల దగ్గర, అవమానించి- సవాలు చేసింది. ఈరోజు వీడి భరతం పడదాం రండి" అన్న మాటలు వినిపించాయి.
అఖిల ఒక్కసారి  గిర్రు న వెనకకు తిరిగింది.
పొద్దున్న గుడి దగ్గర జరిగిన దుమ్ములో,  తను చూసిన ఒక పార్టీ మనుషుల్లో  ,కొందరు వాళ్ళు,.
వాళ్ళని చూసినా అఖిల ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది.
ఇదేంటి  ? వీళ్ళనే కదా ! తన పొద్దున్న,  తను సపోర్ట్ చేసినది  .ఇంతలోనే వాళ్ళని అవమానించానంటున్నారేంటీ...?.
" అంటే !  కొందరప్పుడే , పార్టీ మార్చేసి,  ఎదుటి
పార్టీకి మారిపోయారా..?.  ఇంత తొందరగానా...? "
ఆలోచిస్తున్న అఖిల ,  ఒక్కసారిగా వాళ్లంతా ,మీదకు వస్తూ ఉండడం గమనించి, పరుగులంకించుకుంది.
ఆ పరుగుతో ,తను ఎప్పుడు గుడికి చేరుతుందో ?..ఎప్పుడు దేవుని స్థానంలో నిలిచిందో...? గమనించలేదు.
తన వెనకాతలే వాళ్లు కూడా, గోల గోలగా ,గుడి లోపలికి చేరారు.
అఖిల ,"వాళ్లు తనను గుర్తుపడితేనో..." అనుకుంటూ భయంగా.. తనను తాను చూసుకుంది.
ఆశ్చర్యం, తను అచ్ఛంగా , వెంకటరమణమూర్తి లాగే, పూర్తి శిలారూపంలో ఉంది. .
ఆ వచ్చిన దుండగులు , తనకోసం ,ఇటూ -అటూ ,పరిశీలించి , తాను అక్కడ  కనబడకపోవడంతో నిష్క్రమించారు,
అఖిల *బ్రతుకు దేవుడా! " అనుకుంటూ, ఒక నిట్టూర్పు విడిచింది"

రాతి విగ్రహ రూపంలో  అఖిల ,  తాను మాత్రం  , లోలోపల ,అఖిల లాగే. "ఫీల్ "అవుతోంది.
అంటే, తాను ఇంతవరకు "తను దేవుడిని" అనే భావనలోనే ఉందన్నమాట   నిజంగా దేవుడు  కాలేదన్నమాట.
అందుకే, తాను ఎన్ని చోట్లో , తన ప్రేమేయం లేకుండా చిక్కుకున్నా , తన అంతట తానుగా బయటపడలేకపోయింది. ఎందుకంటే ఆ సమయంలో తను, "దేవుడిని " అన్నమాటే మర్చిపోయింది కదూ. తను అక్కడ ఏ విధమైన మహిమను, చూపించలేకపోయింది కదూ.
  ఏదో ఒక అదృశ్య శక్తి వచ్చి తను బయటపడేలా  చేసేది కదూ.
  ఈ విషయం తను అప్పుడు గుర్తించే లేకపోయింది.
అమ్మో ! దేవుడు, తనను ఎంత మభ్య పెట్టాడు.
అందుకే అతనికి " లీలా నాటక సూత్రధారి " అని, " నటన సూత్రధారి "అని పేర్లు వచ్చేమో...?
కానీ ,తనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ,తన పక్కనే ఉంటూ, తనను ఆ చిక్కుల వలయం నుండి,చాలా  సార్లు రక్షించాడు కూడా ,  కదా.
అసలు దేవుడు , ఈ భూమి మీద ,అవతరించినదే,
" దుష్ట శిక్షణ",  "శిష్ట రక్షణ " కోసమే కదా !
అన్ని మహిమలు ఉండబట్టే ,అతను దేవుడయ్యాడు.
లేకపోతే కుళ్ళు ,కుతంత్రం, స్వార్థం ,క్రూరత్వం, చఫలత్వం, అహంకారం ,అధికార దాహం, అమాయకత్వం ఇలా ఎన్నో మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల్ని, వాళ్ల చర్యల్ల్నీ, భరిస్తూ, అందరికీ న్యాయం చేయడం ఎంత కష్టం.
తను తెలివి తక్కువగా " తన దేవుడి నైతే  , ఒక్కరోజులో అన్నీ మార్చేస్తాననుకుంది . అది తన వల్ల అయ్యే పనేనా...?.
అందుకే దేవుడు అమాయకంగా తనడిగిన వరాన్ని , అలాగే ఇస్తున్నట్టు మభ్యపెట్టి,  "దేవుడనే " అన్న భావాన్ని కలిగించి, ఊరుకున్నాడు లేకపోతే తొందరపాటులో, తనెన్ని పొరపాట్లు చేసేదో....
అఖిల ఆలోచిస్తూ,  "గోడగడియారం వైపు" చూసింది
ఇంకా తెల్లారడానికి గంట సమయమే ఉంది.
  ఆకలి దంచేస్తున్నాది . నిద్ర ముంచుకొస్తున్నది.
రోజంతా పరుగులు పెట్టడంతో ,కాళ్లు చేతులు లాగేస్తున్నాయి  .
ఎదురుగుండా అన్ని నైవేద్యాలు ఉన్నా ,శిలా రూపంలో ఉన్న అఖిలకు  వాటిలో ఏ ఒక్కటీ కూడా ,తీసుకుని ,తినడానికి వీలు కాలేదు.
పూజారులు ,పవళింపు సేవకై  వేసే ,బంగారు మంచం అక్కడే ఉంది  . కానీ అఖిలకు ,ఒక్క క్షణం కూడా దాని మీద ,నడుము బాల్చడానికి కుదరలేదు.
శిలా రూపంలో ఉన్న తను ,ఒక గంటకే, నిల్చో లేక , కాళ్లు పట్టిసినట్టై నీరసపడిపోయింది.
అటువంటిది" కొన్ని యుగాలై ,అలాగే నిలిచిన స్వామి వారు, ఎంత నీరసపడిపోయి ఉంటారు...? " అన్నది తను ఆలోచించే లేదు

ఆలోచిస్తున్న అఖిల ,మానసికంగా క్రుంగిపోతూ,  కళ్ళు మూసుకుని, వెంకటేశుని పాదాలను తాకుతున్నట్టుగా  భావిస్తూ ,
"తండ్రి నన్ను క్షమించు స్వామీ !  నువ్వు హాయిగా ఉన్నావని , హాయిగా లక్ష్మీ దేవితో, కాళ్లు పట్టించుకుని, భక్తులు పెట్టినదంతా తింటూ, ఆనందం అనుభవిస్తున్నావని నిన్ను నిందించీ , అనరాని మాటలన్నాను.. మే మేదో బాధలు పడుతున్నామని , నువ్వు ఛిద్విలాసంగా చూస్తూ కూర్చున్నావని ,  తప్పుగా అనుకున్నాను. నన్ను మన్నించు .
నువ్వు చేస్తున్న పని ,   ఎంత కష్టతరమైనదో ,
మా గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎంత సరైనవో , తెలుసుకోలేకపోయాను,
ఒక చిన్న సంఘటనతోనే , ఇక్కడి రాజకీయాలు ,ఎంత భయంకరమైనవో తెలుసుకున్నాను.
ప్రజలు తమ స్వార్థం కోసం , ఎదుటివారి మాన, ధనాలను ఎలా దోచుకుంటున్నారో చూశాను.
నేను ఆపదలో ఉన్నప్పుడు ,సునాయసంగా, నన్ను తప్పించింది "నువ్వేనని" తెలుసుకున్నాను.  దానిని బట్టి
"మంచి ఆలోచనలు చేస్తూ, అందరికీ మంచి చేద్దాం" అని తలచిన వారిని, నువ్వు  పక్కనే ఉండి ,రక్షిస్తావని అర్థమైంది.
రాజకీయాలు ,దెబ్బలాటలలో దూరకుండా ,
మనుషులని వారి  కర్మకు వారిని, ఎందుకు విడిచిపెడుతున్నావో  కూడా ,అర్థం చేసుకున్నాను.
చేసిన తప్పులకైనా పొరపాట్ల కైనా, ఈ జన్మలోనే ,అప్పటికప్పుడే ,శిక్షలు వేస్తావని కూడా తెలుసుకున్నాను,
"ఏదో ప్రపంచాన్ని ఉద్దరిద్ధామని , నేను వరం కోరితే, నాకు "ప్రపంచం " అంటే ఏంటో తెలియజేసిన నీకు ,నేను చాలా రుణపడి ఉన్నాను.
ఒక తల్లిగా,  ఒక కోడలి,గా ఒక భార్యగా ,ఒక చిన్న కుటుంబానికి సేవ చేయడానికి ,నేను కటకట లాడిపోతూ ఉంటే ,ఇంత పెద్ద ప్రపంచ భారాన్ని  మోస్తున్న నువ్వు.,
ఎన్ని కష్టాలు పడుతున్నావో, అర్థం చేసుకున్నాను.
చాలు తండ్రీ , ఇక నేను మీ రూపంలో, ఒక్క క్షణం కూడా ఉండలేను .  ఈ శిలారూపాన్ని అస్సలు భరించలేను .
మా ఇంటికి నన్ను పంపించి, నీ ఇంటికి నువ్వు వచ్చేయ్ సామీ...."
అంటూ పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా, ఆ జగన్నాటక సూత్రధారిని , వేడుకుంది అఖిల.

********************************
అఖిల కళ్ళు తెరిచేసరికి ,తన మంచం మీద ఉంది.
పిల్లలు గోలగోలగా దీని కోసమో ,దెబ్బలాడుకుంటున్నారు,
భర్త ,అఖిలా ఏంటి ,ఇంతసేపు పడుకున్నావ్ .నాకు ఆఫీస్ కి టైం అవుతోంది . నీకు ఒంట్లో బాలేనట్టుంది
  అందుకే , ఈరోజు నాకు "డబ్బా " ఈయక్కర్లేదులే..
కానీ , తొందరగా కాఫీ  మాత్రం ఇవ్వు , ఇప్పటికే తల బద్దలై పోతున్నాది"  .అంటున్నారు.
మావయ్య గారు దగ్గరకు వచ్చి , అమ్మా !  మీ అత్తయ్య లేచి చాలా సేపు అయింది. .ఏంటి కావాలో..? ఏంటో..?
ఒకసారి కనుక్కోమ్మా. "అంటున్నారు.
లేచి లేవగానే , వీళ్లందరి మాటలు విన్న  అఖిలకు, ఈరోజు అస్సలు కోపం గాని, విసుగు గాని, రాలేదు . సరి కదా, చిన్న చిరునవ్వుతో లేచి, తన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ, మెల్లగా మంచం దిగి ,  ప్రశాంతమైన మనసుతో, వంటింటి వైపు నడిచింది దేవుడు ,ఆహా ! కాదు- కాదు అఖిల.

                           "   సమాప్తం +
********
హామీ..

ఈ కథ ,నా స్వీయ రచన.


No comments:

Post a Comment