Thursday, September 21, 2023

తొలకరి వలపు జల్లులు

శ్రావణ మేఘాలు


శీర్షిక : తొలకరి వలపు జల్లులు.


ఆనంద్ చిరాగ్గా ఆ ఊళ్ళో కాలు పెట్టాడు.

అసలు పల్లెటూరు రావడం అంటేనే చిరాకుగా ఉన్న తనకు, ఈ వర్షాకాలం మరింత చిరాకు పెడుతోంది.

ఈ ఊరిలో కాలు పెట్టిన దగ్గర నుండి మొదలైన చిరు చినుకులు, ఇప్పుడు కొంచెం పెద్దగా మారాయి.

 తనతో పాటుగా వచ్చిన తన ఫ్రెండ్స్, తనవైపు చిరాగ్గా మొహం పెట్టి విసుగ్గా చూస్తూండడంతో,  ఏం చెప్పాలో తెలియక ఆనంద్ చాలా ఇబ్బంది పడ్డాడు.

వర్షం  తమపై పడకుండా ఉండేందుకు తలపై  చేతులు అడ్డుపెట్టుకొని పరుగు పరుగున నడక సాగించారందరూ..


ఎక్కడ చూసినా పల్లెటూరి వాతావరణం. ఆవులు, గేదెలు, మనుషులు .అబ్బబ్బ ఈ పల్లెటూర్లు  అంటే చాలామంది పెద్దవాళ్ళకి ఎందుకింత ఇష్టమో .?

ఇక్కడ ఏముందని ? 

హాయిగా పట్టణంలో చదువుకుని,  యుఎస్ ,యుకేల్లో  పీ.హెచ్.డీలు చేసి , మంచి ఉద్యోగం, అందమైన  ఇల్లు సంపాదించుకున్న తనను, అమ్మ, నాన్నలు, ఈ పల్లెటూరి సంబంధం ఒక్కసారి చూసి రమ్మని, పంపించడంలో అర్థం ఏమిటో.?

తనకసలు" ఈ పల్లెటూర్లు నచ్చవు ,పల్లెటూరి పిల్లలు నచ్చరు," అన్న సంగతి వాళ్లకి తెలియదా.? తన చదువంతా  పై దేశం లోనే సాగింది. తనకు అక్కడి వాతావరణం , అక్కడి కల్చర్ బాగా అలవాటైపోయింది . వారి మాట కాదనలేక తను వచ్చాడు గాని ,తను చచ్చినా ఈ సంబంధం ఒప్పుకునేదే లేదు,


మంచి నాగరికంగా ఉన్న పిల్లని పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశ పడ్డాడు. కానీ ఈ అమ్మా, నాన్నలుంటారే , పిల్లల మనసు అర్థం చేసుకోరు సరి  కదా, ఎప్పుడు చూసినా" మంచి సంస్కారం ,సభ్యత ఉన్న అమ్మాయి అయితేనే మన ఇంటి కోడలుగా బాగుంటుందిరా , "ఒక్కసారి చూసి రా" అంటూ, తన మాట పడనివ్వకుండా

 బలవంతంగా ఈ ఊరికి పంపించారు.

 ఊరు పేరు కూడా "అమలాపురం".

 అట.

తను  ఇండియా బయలుదేరుతూ, తనతో కూడా ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ని తనతో పాటుగా తీసుకోవచ్చాడు .వాళ్లు కూడా ఇంట్రెస్ట్ గా ,ఇండియాలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి గనుక తాము కూడా బయలుదేరి వస్తామని ఎంతో సరదాగా అన్నారు.

మాటల మధ్యలో తన పెళ్లి సంబంధం గురించి కూడా చెప్పాడు ఆనంద్ వాళ్లతో..  దాంతో వాళ్ళు ,తనను ఆట పట్టిస్తూ

 "పిల్లను మేము కూడా చూస్తాం రా. అసలు పల్లెటూరి పిల్ల ఎలా ఉంటుందో , సంస్కారం సభ్యత అన్నవి ఎలా ఉంటాయో.. మేం కూడా చూస్తాం " అంటూ, కూడా బయలుదేరారు . 

వాళ్లంతా బయలుదేరిన దగ్గరనుంచి ఒకటే నస ."ఇదేంటి రా! ఈ బండి ప్రయాణం, ఈ బస్సులు ఎక్కి దిగడం ,., ఈ మట్టి. నిండిన రోడ్లు ,ఇలాంటి ఊరి పిల్లని చేసుకుంటే , నీ బతుకంతా ఈ పల్లెటూరి రాక,పోకలకే సరిపోతుంది. 

అక్కడ పట్నంలో హాయిగా జీన్స్ వేసుకుని, బాబ్ కట్  జుట్టు తో లిప్ స్టిక్ నిండిన పెదాలతో ,  ఎంత అందంగా , సెక్సీగా ఉంటారురా ఆడ పిల్లలు .

మనతో పాటుగా చదువుకున్నవారు,  ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. మనతో క్లబ్బులకి, పబ్బులకూ, కూడా వస్తారు కాదా ,   వారైతే మనకి బాగుంటుంది కానీ ఈ పల్లెటూరు సంబంధం నీకేం ఖర్మరా" అంటూ,

 తనను "గేలి "చేయడం మొదలెట్టేరు.

తనకూ, నిజమే అనిపించింది.


తమ కాలేజీ రోజుల్లో అయితే, ఎంతమంది ఆడపిల్లల్ని తాము ఏడిపించేవారో... ఏ ఒక్క అమ్మాయి అయినా కంటికి అందంగా కనిపిస్తే చాలు , అబ్బా!  ఈ అమ్మాయి చాలా బాగుందిరా "అని ఒకడంటే ,ఆ వెనకాతలే స్నేహితులు , నీకే కాదురా మాకు నచ్చింది. చెప్పరా  భారీ , నువ్వు వదిలేస్తే మేము" ట్రై" చేసుకుంటాం "  అంటూ వెంటపడి. ఆటపట్టించే వారు. అసలు ఆ రోజులే వేరు.


"నిజమే! అక్కడ ఆడపిల్లలు ఎంత ఓపెన్ గా ఉంటారని, అందరితోనూ కలివిడిగా మాట్లాడతారు."

" తమతో పాటుగా డ్రింక్ చేస్తారు .సిగరెట్ తాగుతారు. పాటలు పాడుతారు

మోడరన్ డ్రన్సులు  వేస్తారు.  డాన్సులు చేస్తారు. ఎంత సరదాగా ఉంటుందో   అక్కడి లైఫ్."

ఇక్కడ పిల్లలు ,అసలు అక్కడ "అడ్జస్ట్" అవ్వగలరా."

"అబ్బే! అవ్వలేరు."



యూకేలో తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు అమ్మ నాన్నల్ని చూడడానికి  రావాలంటే , సంవత్సరానికి ఒక్కసారే కుదురుతుంది.  అలా వచ్చినప్పుడల్లా,

" పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో ,"అంటూ ప్రాణం తోడేస్తూ ఉంటారు తనకేమో యూఎస్ లోనే ఉన్న అమ్మాయిని చేసుకుని ,సెటిల్ అయిపోవాలని ఉంది.

ఆ మాట అమ్మతో  ఎన్నోసార్లు చెప్పాడు కూడా. అయితే అమ్మ," నీకు కావలసిన పిల్లని , నీకు నచ్చిన పిల్లనే చేసుకోరా. కానీ ఒక సాంప్రదాయం ఉన్న అమ్మాయిని చేసుకుంటే చాలా బాగుంటుంది .

ఇప్పుడు శ్రావణమాసం నడుస్తోంది .ఈ శ్రావణ మాసంలోనే నువ్వు పిల్లను నచ్చుకుంటే ,ఏకంగా పెళ్లి  చేసుకునే ,

ఆ దేశానికి వెళ్ళిపోదువు గాని . మాకు నీ గురించి బెంగ ఉండదు. నీకు మా "పోరు" ఉండదు .

పల్లెటూరి అమ్మాయి అయితే , ఎప్పటికి నీ మాటకు ఎదురు చెప్పదు. సరి కదా మంచి సభ్యత, సంస్కారాలతో, నలుగురిలో గౌరవంగా ఉంటూ, మంచి పేరు తెచ్చుకుంటుంది. అది నీకు నీ పుట్టబోయే పిల్లలకే  కాక ,మన వంశ పేరు ప్రతిష్టలు కూడా 

నిలబడడానికి తోడ్పడతాయి . అలాగని అక్కడి పిల్లలు  "మంచివారు కాదని" కాదు సుమీ ."..

పోనీ..నాకోసం ఈ పిల్లను చూసి రా "

అంటూ , ఈ పెళ్లి చూపులకి ఏర్పాటు చేసేసింది.

వారి బాధపడలేక ఈసారి ఎలాగైనా పల్లెటూరు వెళ్లి ఆ పల్లెటూరు వాతావరణం చూసి వద్దామని తెగించి బయలుదేరాడు .ఇదిగో వచ్చినందుకు శిక్షగా, ఊరికి బస్సులో ప్రయాణం, బస్సు దిగగానే ఆవులు ,పేడలు ,అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు . అసలు ఏదీ బాగు లేదు .

కానీ పచ్చటి చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

"ఎవరు బాబు మీరు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎక్కడికి పోవాలి ?  చినుకుల్లో తడిసిపోతున్నారే ! ఏమైనా సాయం కావాలా ?" అనే ఆప్యాయత నిండిన మాటలు,

 మనసుకు హత్తుకుంటున్నాయి.

 ఇళ్లు కూడా చాలా, సదాసీదాగా కట్టి ఉన్నాయి.  ముంగిట్లో ముగ్గులు చాలా బాగున్నాయి.

ప్రతి ఇంటి గుమ్మానికి, పసుపు బొట్లు పెట్టి రంగవల్లు తీర్చిదిద్ది, తోరణాలు కట్టి ,చాలా అందంగా అలంకరణ చేసుకున్నారు. ఏ

యింటి దగ్గర చూసినా, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నట్టుగా అనిపించి మనసుకు హాయిగా అనిపించింది .

తను కోరుకున్న ప్రశాంతత అక్కడ దొరుకుతున్నట్టుగా అనిపించింది .

ఆనంద్ , అతని స్నేహితులు వర్షానికి తడిసిపోకుండా తమ చేతులను తలకు అడ్డుపెట్టుకుని, ఒక చెట్టు కిందకు చేరారు.


తాము  చెట్టు కింద చేరడం చూసి, అక్కడ ఉన్న ఒకరిద్దరు గబగబా తమ దగ్గరకు వచ్చి,   "బాబు ఎక్కడికి వెళ్లాలి? రండి మిమ్మల్ని అక్కడికి చేరుస్తాం .ఇంకా కాసేపట్లో వాన కూడా పెద్దది అవుతుందిలాఉంది " అంటూ, తమని అడిగారు .

వాళ్ళ సంస్కారానికి చాలా ఆనందం అనిపించింది .ఇదే  యుఎస్ లో అయితే ఎవరూ  పట్టించుకోరు కదా "  అనుకుంటూ ,దొరికిన అవకాశాన్ని  జారవిడిచిపోకుండా, వాళ్ళ గొడుగుల్లోకి దూరారు

"సార్ ఎటు వెళ్ళాలి సార్ "అనడిగాడు అందులో ఒక అతను " "రాఘవయ్య గార"ని, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తే , వాళ్ళింటికి వెళ్ళాలి" అంటూ చెప్పాడు తను .

" ఓ రాఘవయ్య మాస్టారా . మాకు తెలీక ఏంటి బాబు! అయినా ఈ ఊరు అందరికీ మాస్టారు అంటే చాలా గౌరవం .చాలా మంచి ఫ్యామిలీ "అంటూ మాట్లాడుతునే వాళ్ళ ఇంటి దగ్గర దింపారు . అప్పటికీ ,వర్షం చిరుజల్లులా పడుతూనే ఉంది .తను గబగబా  గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు కాలింగ్ బెల్  నొక్కగానే , ఒక పెద్ద ఆవిడ తలుపు తీసింది చూడగానే దేవీకళ ఉట్టిపడుతున్నట్టుగా, ఏదో అమ్మవారిని చూస్తున్నట్టుగా అనిపించింది .పసుపు రాసుకున్న ముఖం మీద రూపాయి బిళ్ళంత కుంకం బొట్టుతో ,పట్టు చీరతో,  అందమైన చిరునవ్వుతో, పెద్దరికం ఉట్టిపడుతున్నట్టున్న ఆవిడని చూడగానే అప్రయత్నంగా ,ఆనంద్ తో పాటు , అతని స్నేహితులందరూ   ఒక్కసారిగా. నమస్కరించారు "

ఆవిడ "రండి  బాబుౠ!  రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నాం .

అమ్మా ,నాన్నగారు ఫోన్ చేశారు .మీరు వస్తున్నారని .

రండి వచ్చి కూర్చోండి .అని ఆప్యాయంగా పలకరించి , 

లోపలికి ఆహ్వానించారు .

ఈ లోపల, లోపల గదిలో ఉన్న రాఘవయ్య గారు కూడా, మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చారు . నిండుగా ఉన్న పంచ కట్టుతో ,    భుజాల మీద ఉత్తరీయంతో, ముఖాన విభూది నిండిన కుంకుమ బొట్టుతో, గంభీరంగా ఉన్న రాఘవయ్య గారిని కూడా చూడగానే,    సగౌరవంగా అందరూ లేచి నిలబడి, నమస్కరించారు.

ఆయన రాగానే ఆత్మీయంగా అందరినీ పలకరించి ,

"రా బాబు ! నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇలా కూర్చో అంటూ ఆప్యాయంగా సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని, అతని స్నేహితులకి చోటు చూపించారు.

ఆనంద్ కి చాలా ఆశ్చర్యం అనిపించింది .ఎప్పుడూ అందర్నీ ఏదో ఒక రకంగా వెక్కిరిస్తూ , ఏడిపిస్తూ ,నవ్వుతూ ఉన్న స్నేహితులు ,ఇక్కడ ఈ దంపతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సరికదా, ఎంతో వినయంగా కూర్చుని  ఉండిపోయారు.

ఇంతలో జానకమ్మ గారు ఒక ట్రే లో, మంచినీళ్ల తో పాటు, కాఫీ గ్లాసులు పెట్టుకుని తీసుకువచ్చి , దాహం తీసుకోండి  బాౠ. అమ్మాయి వాయనాలు పంచడానికి వెళ్ళింది. శ్రావణ మంగళవారం  నోము పట్టింది కదా.  

మరో ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేస్తుంది. 

ఈ లోపల మీరు కాఫీలు తాగి "ఫ్రెష్ "అయి కూర్చోండి .అని ఆప్యాయంగా చెప్పి లోపలికి వెళ్లిపోయారు.

రాఘవయ్య గారు మర్యాదగా "ట్రే" ని తమ ముందుకు జరిపారు.

ఆనంద్ ,ఫ్రెండ్స్ కూడా మంత్రముగ్ధుల్లా వారు చెప్పిందల్లా తూ.చా తప్పకుండా చేశారు.

ఇంతలో చిన్న చిరుమువ్వల సవ్వడి వినిపించి అందరూ ఒక్కసారిగా తలెత్తారు.

మంచి ఒడ్డు , పొడుగుతో  , చామన ఛాయలో  ఉన్న, అమ్మాయి పట్టు పరికిణి పాదాలపై నుంచి కొంచెం పైకెత్తుకుని లోపలికి వస్తూ కనిపించింది.

 పసుపు రాసుకున్న పాదాలపై పెట్టుకున్న , సన్నపాటి పట్టీల నుండే వచ్చే చిరునవ్వుల సవ్వడి , ఒక్కసారిగా ఆగిపోయింది

ఆ అమ్మాయి వీరిని చూసి సందిగ్ధంగా ఆగిపోయినట్టు తెలుస్తోంది.

ఆనందు, స్నేహితులు ఆమెను నఖసిక పర్యంతరం, వీక్షించడం మొదలుపెట్టారు.

చామన ఛాయగా ఉన్న ఆ ముఖంలో, ఏదో ఆకర్షణ.

కలువ రేకుల లాంటి కళ్ళకి ,నల్లని కాటుక చాలా అందాన్ని ఇస్తోంది. కోటేరు లాంటి ముక్కు ,తాంబూలం నమిలినందున ఎరుపెక్కిన  పెదాలు,  పసుపు రాసుకున్న. ముఖంలో,

కోలగా దిద్దిన తిలకం బొట్టు కింద, గుండ్రపటి కుంకుమ బొట్టు , ఆమెకు ,రెట్టింపు అందాన్ని  ఇస్తున్నాయి. 

ఆమె ఎడమ భుజం పక్క నుంచి ముందుకు జారిన-

  బారెడు జడకు , వేసుకున్న జడగంటలు  ,ఆమె సన్నని నడుము పక్కన నాట్యం చేస్తున్నాయి. 

పొడవాటి జడలో ,ఆమె తురుముకున్న సన్నజాజి, చామంతుల దండల నుండి వచ్చే, పరిమళం 

చిరుజల్లులో తడిసిన ఆమె మేని పైనుంచి వస్తున్న అద్భుతమైన గంధంగా మారి ,ఆ గదంతావ్యాపించింది.

చినుకు తడి లో తడిసిన ఆనంద్ మేను, ఆ పూల పరిమళ జల్లులకు ఒక్కసారిగా పులకరించింది.

చామన ఛాయలో ఉన్న ఆ మ్మాయిలో, ఏదో ఆకర్షణ తనను అయస్కాంతంలా లాక్కొని వెళ్లి, ఆమెను అల్లుకుపోతోంది.

ఆనంద్ ఒక్కసారిగా స్నేహితుల వైపు చూశాడు.

ఏ ఆడపిల్ల కనిపించినా , ఆమె అంగాంగ వర్ణనలు చేస్తూ,

వెకిలి కూతలు కూసే తన స్నేహితులు, 

"కాబోయే వదినమ్మ, చాలా బాగుంది రా ఆనంద్.

ఎందుకో ఈ అమ్మాయి నీకు భార్యగా వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తున్నాది.

మారు మాట్లాడకుండా ఈ అమ్మాయి ఓకే అని అమ్మా,నాన్నలతో చెప్పేయ్." అంటూ చెప్పడంతో ఆనంద్  

నోరెళ్లబెట్టాడు . 

అతని మదిలో వేయి వేణువులు ఒక్కసారిగా, మోగినట్టు 

అనిపించింది.

అతను చెవులకు పదేపదేగా, " ఒక్కసారి అమ్మాయిని చూసి రారా ! నీకు చాలా నచ్చుతుంది . మంచి సంస్కారం ,సభ్యతల గల అమ్మాయి అయితే , మన కుటుంబ మాన మర్యాదలు నిలబెడుతుంది " అన్న అమ్మ మాటలే రింగుమంటున్నాయి.

అవన్నీ తలచుకుంటున్న ఆనంద్,  ఒక్కసారిగా స్నేహితులన్నమాటకు సిగ్గుగా తలవంచుకొని "అలాగే"నంటూ తల ఊపాడు.

బయట పడుతున్న వర్షపు జల్లులు ,

తొలి తొలకరి  వలపు జల్లులై ,  ఆనంద్ మదిలో, 

సన్నాయి గీతాలాలపిస్తున్నాయి.


********************************




No comments:

Post a Comment