Wednesday, September 27, 2023

అంశం : అమ్మా , నాన్నా , ఓ వృద్ధాశ్రమం .

25/09/2023.


శ్రీ శ్రీ కళావేదికారి కవితా పోటీల కొరకు ,

అంశం : అమ్మా , నాన్నా , ఓ వృద్ధాశ్రమం .

శీర్షిక  : ఊపిరాడని గుడారాలు.

ప్రక్రియ : వచన కవిత.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ : మహారాష్ట్ర .


నాటి నుండి, నేటి వరకు, 

 అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలంటుా,

 మాటల్లో అందలానికెక్కిస్తూ, 

చేతలతో చిత్తు చేస్తునే ఉన్నారు .॥


అవనిలో ఆడది, అమ్మగా మరో బ్రహ్మై ,

 తొమ్మిది నెలల భారాన్ని మోస్తూ.  

సృష్టికి-ప్రతి సృష్టి  చేసేందుకు ,తన

 రక్తం మాంసాలను పంచుతూనే ఉంది.॥


ఆ సృష్టికి కారకుడైన తండ్రి, 

తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ,

బాధ్యతల బరువును మోస్తూ, జీవితాంతం, 

తన కుటుంబం కోసం ,తన. జీవితాన్ని

పణంగా పెడుతుానే ఉన్నాడు.॥


పాశ్చాత్య  సంస్కృతి  మొాజుతో ,

 మన సంస్కృతి , సాంప్రదాయాలు 

 ఏనాడో మట్టి కలిసిపోయాయి.

నేను, నా , అనే స్వార్ధం , 

వావి వరుసలకు "చెక్" పెట్టింది .॥


ఆడ దాని అస్తిత్వం ,

 అంగట్లో ఆట బొమ్మై పోయింది.

అలసిపోయిన అమ్మ తనం , 

అడ్డుగోడై నిలిచింది.

జవసత్వాలుడిగిన నాన్న ఉనికి ,

 జారిపోతున్న విలువల, విచ్చలవిడి తనానికి , ప్రతిబంధకమైంది.॥


అంతే మట్టిలో కలసిన మానవత్వం , మరో

దారిని కనుక్కొంది.

తీరిన అవసర జీవితాల చివరి  క్షణాలకై , 

ఊరవతల ఊపిరాడని జీవ సమాధులు కట్టి, 

ఆధునుకతను తలపించే .అందమైన పేరు పెట్టింది.॥


అవే, నేటి బ్రతుకు బడుగు జీవితాలకు ఆశ్రయాలు.

అంతరించిపోతున్న ఆప్యాతలకు నిలువుటద్దాలు. 

వృద్ధులైన తలిదండృలకు ఊపిరాడని గుడారాలు .

అడుగు కొకటిగా అలరారుతున్న" వృద్ధాశ్రమాలు ".


హామీ : 

ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని 

నా స్వీయ రచన .


No comments:

Post a Comment