Monday, November 6, 2023

శీర్షిక : నేను చెప్తే ,నువ్వు వినాలి..

22/07/2023.
మనోహరీ మహిళా పత్రిక కొరకు,
అంశం బాలసాహిత్యం .
శీర్షిక :  నేను చెప్తే ,నువ్వు వినాలి.
రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
 కళ్యాణ్ : మహారాష్ట్ర.

ఆరు సంవత్సరాల నిండిన చిన్ని,  స్కూల్ కి వెళ్లడానికి ,చాలా అల్లరి పెడుతోంది .
ఎప్పుడు  తీసుకుందో వాళ్ల నాన్న మొబైల్ దాని చేతిలో ఉంది . పొద్దున లేచింది మొదలు, మొబైల్ చూడడమే దాని పని .హోంవర్క్ చెయ్యదు, టైంకి లేవదు,
 స్నానం చేయదు, కనీసం,  బ్రష్ చేసుకోదు. చిన్ని, చిన్నపిల్లప్పుడు,  చిన్ని వాళ్ళ నాన్నకి  బాక్సు చేసేందుకు  అసలు టైం దొరికేది కాదు.. తను లేవగానే ,చిన్ని కూడా తనతో పాటు లేచిపోయి, తనని వదలకుండా,
 ఎత్తుకోమని, చాలా అల్లరి పెట్టేది.
 ఆ సమయంలోసమయంలో, చిన్ని అల్లరి మానేందుకు,
  , ముందు తనే, మొబైల్ ఇచ్చి పెట్టేది . ఇప్పుడు అదే ,ఒక సమస్యగా మారింది.  
  కమల కూతురుతో నానా హైరానా పడిపోతున్నాది .
  
"చిన్నీ , మాట విను, లే . లేచీ ,  రెడీ అవ్వు..స్కూల్ టైం అయిపోతుంది" అని ప్రతిరోజు చెప్తూ ఉండడమే. 
   అంతలా తను అరుస్తున్నా , మాట వినదు సరి కదా , "నేను నీ మాట కాదు ,నువ్వే నా మాట వినాలి "అంటుంది.
  ఈరోజు అలాగే జవాబు చెప్పింది .దాంతో ,
కమల కోపం తట్టుకోలేక ,వెళ్లి చిన్ని చేతిలో ఉన్న మొబైల్ లాక్కొంది .  అంతే , చిన్ని తనని ఎవరో , నానా బాధలు పెట్టేస్తున్నట్టు ,దబ్బున కింద పడిపోయి, గట్టి గట్టిగా ఏడవడం మొదలెట్టింది .దాంతో కమలకు చెర్రెత్తుకొచ్చి, చిన్నిని బరబరా లాక్కెళ్ళి,    బ్రష్ చేయించి,  స్నానం చేయించి , స్కూల్ డ్రెస్ వేసి ,స్కూల్ బ్యాగ్ చేతికిచ్ఛి,
 పాల గ్లాసు చేతికి అందించింది.
  చిన్ని కోపంతో పాల గ్లాసు తోసేసింది .  పాలన్నీ, నేలపాలయ్యాయి. దాంతో. కమల కోపంతో, రెండు దెబ్బలు వేసింది. అంతే, చిన్ని ఆరున్నొక్క రాగంలో, ఏడవడం మొదలెట్టింది.
  
 కమల" ఓరి దేవుడా" అనుకుంటూ, చిన్నిని దగ్గరకు తీసుకుని ,మంచి-మంచి మాటలాడుతూ, మెల్లగా చిన్నీని స్కూలుకు పంపించే సరికి తల ప్రాణం తోక్కి వచ్చింది,  
 చిన్ని స్కూల్ కి వెళ్ళగానే, హమ్మయ్య అంటూ తేలిగ్గా , ఊపిరి పీల్చుకుంది.
 
***********************
ఆరోజు ఆదివారం , అందరూ ఇంట్లో ఉన్నారు.
 పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు .ఆయనకి ఆఫీసు లేదు.
  దాంతో కమల ఏడు గంటలకు  తాపీగా లేచి, చిక్కగా కాఫీ పెట్టుకుని ,కుర్చీలో కూర్చుని   కాఫీ తాగుతూ, ఎదురుగా ఉన్న టీవీలో ఏదో సినిమా పెట్టి , మొబైల్ చూస్తూ కూర్చుంది .ఇంకా ఆయన,చిన్నీ , పడుకునే ఉన్నారు. ఎందుకంటే రాత్రి ఒంటిగంట ,రెండు దాకా టీ.వీ.లో సినిమాలు పెట్టుకుని చూసేరు . దాంతో, పడుకునేసరికి లేట్ అయింది  .    తను, " చాలారాత్రి అయిపోయింది పడుకోండి" అని అంటే ,". రేపు ఆదివారమే  కదా ! ఈ ఒక్కరోజైనా, కావాల్సినట్టు ఉండకపోతే ఎలా?" అన్నారు.
  ఏమీ  అర్థం కాకపోయినా, చిన్ని కూడా, మాతో పాటు కూర్చుని , పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని. రాత్రంతా మాతో పాటు టీ.వీ .చూస్తూనే  ఉంటుంది  .
  దాంతో తెల్లారి గట్ల పడుకొని,  పొద్దున్న. లేచేసరికి, సమయం, ఏడు, ఎనిమిది ,అయిపోతుంది
  
************

  కమల, మొబైల్ చూడడంలో ఎంత  మగ్నం అయిపోయిందంటే, చిన్ని లేచి , దగ్గరికి వచ్చి నిలబడి "అమ్మా" అని పిలవడం కూడా, వినపడలేదు.
   దాంతో చిన్నికి బలే కోపం వచ్చింది ." అమ్మా ! నాకు పాలు కావాలి. నాకు  ఆకలేస్తోందమ్మా " అంటూ  కుదుపుతూ ,పిలిచింది.
   కమల, తుళ్లిపడి ,  చిన్నిని చూసి ,"అరే లేచిపోయావా?  ,బ్రష్ చేసుకున్నావా...?, అంటూ, తిరిగి మొబైల్లో పడిపోయింది.
   చిన్నికి భలే కోపం వచ్చింది." నన్ను ఎప్పుడు చూసినా, మొబైల్ చూస్తుంటే ,వద్దు వద్దు అంటూ , నా చేతిలో మొబైల్ లాగేసుకుంటావు.  "స్కూల్ కి వెళ్ళాలి అది నీ పని" అంటావు. ,
"నాకు ఇష్టం లేకపోయినా, స్కూల్ కి పంపించేస్తావ్.
మరి ఈరోజు , నువ్వు పని చేయకుండా ,ఎందుకు మొబైల్ చూస్తూ కూర్చున్నావు.  మా అందరికీ ఆకలేస్తుంది.కదా?
తినడానికి  ఏదీ చేయవా ? అది నీ పని కదా ! 
అలా మొబైల్ చూస్తూనే కూర్చుంటావా" అంటూ పెద్ద ఆరిందాలా ప్రశ్నించింది.
    దాంతో  కమల ఒక్క క్షణం బిత్తర పోయింది.
  వెంటనే సర్దుకుని ." నువ్వు లేచినట్టు, నాకు తెలీదు కదా చిన్నీ ! అందుకే మొబైల్ చూస్తూ కూర్చున్నాను .ఎవరైనా లేస్తే కదా, అన్ని పనులు చేసి  పెడతాను"  అంటూ చిన్నీని, దగ్గరకు తీసుకుంది . చిన్ని అంది. "నువ్వు స్నానం చేయలేదు. మాకు టిఫిన్స్ చేయలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు .నేను పిలిస్తే వినిపించుకోలేదు. 
   నేను నీతో మాట్లాడను.."
 "  నిన్న మా టీచర్ చెప్పింది. "మొబైల్, ఎవరూ ఎక్కువగా చూడకూడదు.  "అనిఅలా కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తే కళ్ళు పాడైపోతాయని చెప్పింది " నువ్వు మొబైలు అలా కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూస్తావ్ .నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా  నువ్వు నా మాట వినడం లేదు .
   మళ్లీ నాకే చెప్తున్నావ్ , "చిన్నీ..మొబైల్  చూడకు, చిన్నీ మొబైల్  చూడకు అని .
  " నువ్వు నా మాట  అస్సలు వినడం లేదని ,  రేపు నీ పని టీచర్తో చెప్తాను" అంటూ ఏడవడం మొదలు పెట్టింది.
    చిన్ని మాటలు విన్న  కమల, ఒక్క నిమిషం ,ఆలోచనలో పడిపోయింది . మరి తను అలా, పొద్దున్న లేచింది మొదలు, మొబైల్ చూస్తూ కూర్చున్నప్పుడు, చిన్ని కూడా మొబైల్ చూడడంలో తప్పేముంది ?  అసలు చిన్నికి ,ముందు మొబైల్ అలవాటు చేసింది తనే కదా!  "
    ఏమైనా సరే తను చేసేది తప్పే !  పిల్లల ఎదురుగుండా పెద్దల ప్రవర్తన, సవ్యంగా లేకపోతే, పెద్దలు ఏది చేస్తే ,పిల్లలు అదే చేస్తారు అన్నది నిజమే .తను చిన్నికి , గడిగడీకీ,  "మొబైల్ చూడకు మొబైల్ చూడకు " అంటూ, చెప్తూనే ఉంటుంది
    కానీ తనే, ఎప్పుడూ, మొబైల్ చూస్తూ కూర్చుంటూ ఉంటుంది. చిన్నీ ఎదురు గుండా,  మంచి పనులు చేయడం తనే మొదలెట్టాలి . ముందుగా చిన్ని ఎదురుగుండా, తను మొబైల్ చూడడం మానేయాలి."
  "  చిన్నపిల్ల ,చెప్పడం రాకపోయినా,  తన మనసులో ఏముందో, చెప్పకనే చెప్పింది "అనుకుంటూ ,
  కమల ,మెల్లిగా చిన్నీ ని దగ్గరికి తీసుకుని, కళ్ళు తుడిచి ,
   " అయితే , నేను, నీ మాట వినాలా"  అంటూ అడిగింది.
    చిన్నీ గొప్పగా తల ఎగరేస్తూ, " అవును, నువ్వే నా మాట వినాలి. నువ్వే మొబైల్ కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తావు.,
 నేను, స్కూల్ కెళ్ళి, మా టీచర్ చెప్పిన మాట వింటాను.
  ఇంట్లో నువ్వు నా మాట వినాలి !అంతే!" అంటూ బుంగమూతి పెట్టింది. ముద్దుగా  మాట్లాడుతున్న  చిన్నీని చూస్తూ ,మురిసిపోతూ ,కమల చిన్నీ బుగ్గ మీద ముద్దు పెట్టింది " సరే "నంటూ..

కమల మరోసారి మనసులో అనుకుంది." నిజమే!  పిల్లలకి బుద్ధులు చెప్పినప్పుడు ,తాము ముందుగా , వారి ముందు బుద్ధిగా ఉండాలి కదా ! "  అనుకుంటూ పంటింటి వైపు నడిచింది  చిన్నీకి పాలు కలిపి ఇవ్వడానికి.



హామీ:  ఈ కథ నా స్వీయ రచన

No comments:

Post a Comment