Monday, November 6, 2023

పూర్తి ప్రదాతలు.

21 /06 /2023.
తపస్వీ  మనోహరం పత్రిక కొరకు ,
 అంశం : స్ఫూర్తి ప్రదాత. 

రచన :  శ్రీమతి :  పులాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్  : మహారాష్ట్ర .

మనం పుట్టిన దగ్గరనుంచి ఎవరో ఒకరి స్ఫూర్తితోనే మన
ఎదుగుదల ప్రారంభం అవుతుంది .
మాట్లాడడానికి స్ఫూర్తి అమ్మ  అయితే ,  ప్రపంచంలో ముందడుగు వేయడానికి స్ఫూర్తి నాన్న ,
అక్షర  జ్ఞానానికి స్ఫూర్తి గురువైతే , మన ఆదర్శాలకు స్ఫూర్తి నాటి సభ్యత , సంస్కారాలు.

ఐతే పెరుగుతున్న మనలో అంతర్లీనంగా దాగి ఉన్న కొన్ని కళలకు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం ,గీతం, ఆటలు ఇలాంటి కళలకు మాత్రం , కొంతమంది  మాత్రమే మనకు స్ఫూర్తిదాయకులౌతారు.

ఇక ,నా విషయానికొస్తే,నాకు పాటలు  అంటే మహా పిచ్చి .
40 ఏళ్ల క్రితం రేడియో తప్ప ,పాటలు వినడానికి మరో   సాధన సదుపాయం ఉండేది కాదు.
నేను 24 గంటలు రేడియోలో పాటలు వింటూ అవే పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆనందపడుతూ ఉండేదాన్ని.

అయితే మా ఇంట్లో ఎప్పుడూ  పొద్దున్న సాయంత్రం కూడా సంగీత సాధన జరుగుతుండేది కారణం , మా అమ్మమ్మ గారు, మా అమ్మ
గారు, మా పిన్నమ్మ గారు ,మా పెద్దమ్మ గారు, వీళ్ళందరూ కూడా సంగీతంలో డిప్లమోలు చేసి,  టీచర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పిల్లలకి  , తెల్లారి నాలుగు  గంటల నుంచి ఆరు గంటల వరకు, సాయంత్రం కూడా అదే సమయంలోనే ట్యూషన్లు చెప్తూ ,ఉండేవారు  .  చాలా మంది పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటుటూ , సంగీత సాధన చేస్తూ ఉండేవారు .
ఆ సమయంలో నాకు, పడుకోవడానికి గానీ, రేడియో వేసుకోవడానికి గానీ వీలుండేది కాదు.
 
మా అమ్మగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు వాళ్లతో పాటు కూర్చొని సంగీతం నేర్చుకో అమ్మా . ఇది చక్కగా అందరూ ఆదరించే విద్య అని .
 వినేదాన్ని కాదు. సరి కదా సినిమా పాటలు మీదే నా ధ్యాస ఉంటుండేది


రాను రాను మరో దారి లేక,  ఆ పిల్లలతో పాటు కూర్చుని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని  . మా అమ్మగారు, పిల్లలకి సంగీతంలో మెళకువలు అన్నీ నేర్పుతూ ,   వాటితో పాటు, శృతి, లయ, రాగలాపన ,స్వర కల్పన, లాంటి వెన్నో మెళకువలు చెప్తూ ఉండేవారు  
కొన్నాళ్లు పోయేసరికి,  చిత్రంగా నాకు సంగీత మీద ఆశక్తి పెరిగి సినిమా పాటలు మీద ఆశక్తి తగ్గింది.
సంగీతంలో నేర్పుతూన్న మెళకువలన్నీ ప్రశ్నల రూపంలో మా అమ్మగారు అడిగేసరికి , "ఆ పిల్లలకన్నా ముందుగా నేనే జవాబు చెప్పాలి" అన్న పట్టుదల ఎక్కువ అయ్యేది.
ఆ విధంగా సంగీతం నేర్చుకున్నాను  . దానికి స్ఫూర్తినిచ్చిన వారు మా అమ్మగారు, ఆ పిల్లలే కదా..!

ఇక సాహిత్య విషయానికొస్తే, ఆ కాలంలో టెన్త్ పాస్ అయ్యేసరికి పెళ్లిళ్లు చేసేసేవారు. నాకూ అదే జరిగింది అయితే మెట్టినింఇంటికి వచ్చిన తర్వాత ,మా అత్తయ్య గారికి నాకన్నా ఎక్కువ పాటలు  , భజనలు ,సంగీతమే కాక సాహిత్య పరంగా కూడా చాలా అభిరుచి ,ఆశక్తి ,ఉండేది.
అంతేకాక ఆవిడ 500 వరకు హరికథలు చెప్పి, "హరికథా శిరోమణిగా " పేరు తెచ్చుకున్నారు. పురాణ ప్రవచనాలు చెప్పడం ,భజనలు చేయడం , స్వయంగా రాసిన భజన పాటలను ,ఆవిడకు వచ్చిన రాగాల్లో పెట్టి పాడుతూ, అందరి చేత పాడించడం చేస్తూ ఉండేవారు,.
దాంతో నేను కూడా ,నాకు వచ్చిన  రాగాల్లో, చిన్న చిన్న  భజన పాటలు రాస్తూ, రాగాల్లో పెడుతూ పాడడం మొదలెట్టేను.
దాంతో నాకు సాహిత్యంలో కాస్త పట్టు దొరికింది . పాటలు రాయడం రాగాల్లో పెట్టడం ,    స్వర కల్పన చేయడం కూడా నేర్చుకున్నాను.
ఈ విధంగా మా అత్తయ్య గారే నాకు సాహిత్య స్ఫూర్తి.
అయితే నేను రాస్తున్న పాటలను, స్వరకల్పనను మొట్టమొదటిగా గమనించింది ,   స్వర్గస్తులైన గౌరవనీయులు "శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్" గారు.
వారు నాచే ,నేను రచించిన లలిత సంగీతం పాటలను నలుగురులో ప్రదర్శింప జేసి , నన్ను పాటల రచయితగా స్వరకర్తగా ప్రోత్సహించారు .
.
 తదుపరి గురువుగారు గౌరవనీయులు ఐన " శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు "
వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో  పాటలు రాసి , 
స్వరపరచేను  . గురువుగారైన "షణ్ముఖ శర్మ "గారు రాసిన శివ పదం లో 16 కీర్తనలను , నాచే కంపోజ్ చేయించి  వాటిని  రెండు సి.డి.లుగా విభజించి , ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించడం కూడా జరిగింది.   ఈ విధంగా
 వీరిరువురురూ ,నా స్వర రచనకు స్ఫూర్తి. కారకులయ్యారు .

ఇక నేను రాస్తున్న కథలకు, కవనాలకు, నన్ను ప్రోత్సహపరిచి ,  నన్ను ముందుకు నడిపించినది 
గౌరవనీయులు "శ్రీ సంగివేని రవి "గారు.

కొత్త కొత్త ప్రక్రియలకు , గౌరవనీయులు" శ్రీ అడిగొప్పుల సదయ్య "గారి ద్వారా ప్రేరణను పొందాను.

ఈ విధంగా మనల్ని  ప్రోత్సహించేందుకు, వారు మనకి ఇచ్చే ప్రశంసా పత్రాలకై ,వారు పడుతున్న శ్రమ అత్యధికం.

ఇలా చెప్పుకుంటూ పోతే ,చాలా మంది మన వెనుక నిలబడి, మనకు సహాయ ,సహకార, ప్రోత్సాహాలు అందించడం వలన- మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు మనం కవులుగా , రచయితలుగా  , గాయకులుగా  గుర్తించబడుతున్నాము అంటే ,వీరందరూ  మనకిచ్చిన చేయూత, ప్రోత్సాహమే  కారణమని నమ్ముతున్నాను.

ఇలా గౌరవనీయులైన వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన""తపస్వీ మనోహరం" సంస్థ_- సభ్యులకు ,  నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

రచయిత్రి : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

🙏🙏🙏🙏🙏
,--------------------------------
,

No comments:

Post a Comment