Monday, November 6, 2023

శీర్షిక ఆరోగ్యం ఆహారం.

23/06/2023.

తపస్వీ మనోహరం  పత్రికల కొరకు ,
అంశం: ఆరోగ్యం :ఆహారం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది పెద్దలు చెప్పిన మాట.
ప్రస్తుత కాలంలో మనమందరం, కాలం మారింది ,కాలం మారింది ,అంటూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం.

ఒకప్పుడు పిల్లా, పెద్ధా ,అందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచేవారు. 

పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేవారు తర్వాతముంగిట్లో ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గులు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి , మడి బట్ట కట్టుకొని, దేవుని దగ్గర నిత్య పూజలు చేసేవారు. సూర్యోదయంతో పాటుగా ఇంట్లో , దేవుని మండపం దగ్గర కళకళ మంటూ దీపాలు వెలుగుతూ ఉండేవి .ధూప దీప నైవేద్యాలతో మధురమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉండేది. 

పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి, తదుపరి చద్దన్నం తినడం, తర్వాత స్కూలుకు వెళ్లి రావడం, హోంవర్కులు చేసుకోవడం ,సాయంత్రం పూట ఆడుకోవడం, 7-7:30 కల్లా పడుకోవడం దినచర్యంగా ఉండేది.

అల్పాహారానికి గాని, భోజనానికి కానీ, ఒక నిర్దిష్టమైన సమయపాలన జరుగుతూ ఉండేది .
సాయంత్రం 6 గంటలకి  పిల్లలు సూచిగా బట్టలు మార్చుకొని
దైవ ప్రార్థన చేసుకుంటుంటే పెద్దలు
 తిరిగి దేవుని దగ్గర దీపారాధన చేసేవారు .
 తదుపరి రాత్రి భోజన కార్యక్రమాలు అయిపోగానే 7:30 కి నిద్రకు ఉపక్రమించేవారు.
 పగటిపూట ఎవరూ కూడా నిద్రపోయేవారుకాదు .
 కట్టుబొట్టు, మాట తీరుతో, ఆడవారు చాలా సంస్కారంగా ఉండేవారు.
 ఆ కాలంలో ఇంటి భోజనం తప్ప బయట ఎక్కడా
  ఇలాగ బయట కొనుక్కుని తినడాలు కూడా ఎవరికి తెలియదు. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవారు ఆడవాళ్లు.

కానీ రాను రాను ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యే పూర్తిగా మారిపోయింది .  గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వంటి సదుపాయాలు రావడంతో ఆడవారికి పని తగ్గి ,బద్ధకం ఎక్కువైంది .టీవీలు , మొబైల్స్ . 
వాడకం ఎక్కువయ్యి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడంతో ఇంట్లో వంట చేయడం  కూడా తగ్గిపోయింది.
పానీ పూరీలు, పిజ్జా ,బర్గర్లు, ఐస్ క్రీములు, వంటి వాటికి పిల్లలు పెద్దలు కూడా అలవాటు పడ్డారు
వీటి కారణంగా ఇంట్లో వంటలు వండడం తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడంతో బయట ఫుడ్స్ తెప్పించుకోవడం , ఆన్లైన్ ఆర్డర్స్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం  ఆన్లైన్ నుండి  కూడా ఆర్డర్ చేసుకుని తినడం మొదలవ్వడంతో ,ప్రతి ఒక్కరికి పని తగ్గిపోవడం , ఒంట్లో కొవ్వు ,అజీర్తి, పెరిగి చికాకులు ఎక్కువయ్యాయి . టీవీ పెట్టుకుని 24 గంటలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం చేస్తూ, రాత్రి  12, ఒంటిగంట వరకు మేలుకోవటంతో ,పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయింది.
ఇప్పటి కాలంలో ఎవరూ సూర్యోదయం చూసిన దాఖలాలే లేవు.
ఈ రకమైన జీవితానికి అలవాటు పడి, మన శరీరం మన ఆధీనంలో లేనందు వల్ల,  ఎన్నో రోగాలకు  మన శరీరం ఆశ్రయమయ్యింది.

పిల్లలు రెండు మూడేళ్ళు రాకుండానే  రోగగ్రస్తులవుతున్నారు. 15 ఏళ్ల దగ్గరుండి ఊబకాయం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులతో అందరూ రోగగ్రస్తులై ,ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ రకమైన  అనారోగ్య ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, ప్రస్తుతం యూట్యూబ్లో వస్తున్న ప్రతీ  చిట్కాల్ని నమ్ముతూ , అన్నిటినీ ఆచరిస్తూ,   అటుకి, ఇటుకి కాకుండా   నానా ఇబ్బందులు పడుతున్నారు.
మన అలవాట్లు మార్చుకోనంతవరకు, మనం ఎన్ని మందులు వాడినా ,ఏ చిట్కాలు వాడినా వాటి ప్రయోజనం ఉండదు. మనం అన్ని వాడతాం, కానీ ఒక పద్ధతిలో మన దిన చర్య ఉండదు .భోజనానికి, టిఫిన్లకి ,నిద్రకి ,సమయపాలన ఉండదు.
మనని చూసి మన పిల్లలు కూడా అదే  విధంగా ప్రవర్తించడంతో ఇంటిల్లపాది రోగగ్రస్తులై, మానసింగా  శారీరకంగా కూడా  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు .
ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన చిట్కాలు అన్నీ మన పూర్వీకుల ఆచరించినవే . అవన్నీ మధ్యలో  "  పాత చింతకాయ పచ్చడి "అంటూ మనం వదిలేసి ,తిరిగి అవే చిట్కాలను యూట్యూబ్లో చూసుకుని అమలు చేస్తున్నాం .

ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి .మన అలవాట్లు మార్చుకుంటే ,మన ఆనందం ,మన ఆరోగ్యం- మనతోనే ఉంటాయి అన్నది నా ఉద్దేశం .

మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన మాటలు-
సమయపాలన పాటించండి .ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఈ చిన్ని వ్యాసం నా స్వీయ రచన.

                               -    శుభం -
                               -    ******

No comments:

Post a Comment