అభినందనలు
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు సమకాలీన కవయిత్రులలో పేరుపొందిన కవిశిఖామణి.సంగీతజ్ఞులు.వీరు మా మహతీ సాహితీ కుటుంబ సభ్యులైనందుకు మాకు గర్వకారణం.వీరు నాకు మాతృసమానులు.వీరి పుస్తకానికి పిన్నవాడినైన నేను అభిప్రాయం రాయడం నా పురాకృతపుణ్యంగా భావిస్తాను.మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం యొక్క "వంద కవితల పండుగ"లో పాల్గొని "శతకము"ను పూర్తి చేసిన సందర్భంగా జగదీశ్వరీమూర్తి గారికి శుభాకాంక్షలు.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు గతంలో మహతీ సాహితీలో తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ క్రమం తప్పకుండా క్రమశిక్షణగా ఎన్నో రచనలు చేసారు.వీరు మహతీ సాహితీ ద్వారా ఎన్నో ప్రశంసాపత్రాలు,సన్మానాలు,బిరుదులు పొందారు.వీరు నా ఇష్టపది ప్రక్రియకు వన్నెతెచ్చారు.వీరు ఇష్టపది ప్రక్రియలో "భగవద్గీత" మరియు "రామాయణం" రాయడం జరిగింది.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకం ఒక సంగీత కళాఖండం.నాకు సంగీతంపై పరిజ్ఞానం లేకపోయినా కానీ వారి పాటలలోని మాధుర్యాన్ని, ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని ఆస్వాదించాను.ఇందులో శ్రీ కృష్ణ గానామృతం ఒక మధురాతిమధురమైన పాటలసంపుటి,జయదేవుని అష్టపదుల వలె నిజంగా గానామృతంలో ఓలలాడిస్తుంది.ఇంకా పెళ్ళిపాటలు,వియ్యాలవారి కయ్యాలు,దేశభక్తి గీతాలతో ఈ పుస్తకం విభిన్నతను సంతరించుకున్నది.గోదాదేవి తిరుప్పావై పాశురాలు అద్భుతంగా జగదీశ్వరీమూర్తి అమ్మవారి పాటల్లో కుదురుకొని ఆ పాశురాల భావాలు తెలుగు పాఠకులకు అవగతమయ్యాయి.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకరాజం తన కవిత్వం మరియు సంగీతం ద్విగుణాలతో పాఠకలోకాన్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను.వీరు తమ కవితాప్రతిభను ప్రదర్శిస్తూ మరిన్ని కవితాసంపుటులు వెలయించాలని ఆకాక్షిస్తూ...
మీ సాహితీ పిపాసి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125
No comments:
Post a Comment