🍁రుబాయీలు గురించి కొన్ని నియమాలు🍁
రుబాయీ నాలుగు పంక్తులు గల కవిత. ఇది మాత్రా ఛందస్సుతో కూడిన ప్రక్రియ. ఇందులో ప్రతి పాదం ఒక సంపూర్ణ వాక్యం. 1,2,4 పాదాల చివరి పదాన్ని "రదీఫ్" అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని "కాఫీయా" అంటారు. రధీఫ్ అంటే అదే పదం అని అర్థం చేసుకోవాలి. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా రావాలి. కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. కానీ తెలుగులో లాగా పూర్తి అంత్యప్రాస మాత్రం కాదు. మొదటి పాదంలోని కాఫీయా ఆకారాంతమయితే రెండవ నాల్గవ పాదాలలోని కాఫీయా ఆకారాంతమే కావాలి. ఇకారాంతమయితే తర్వాతి పాదాలలో ఇకారాంతమే కావాలి. ఉకారాంతమైతే ఉకారాంతమే కావాలి. హల్లుల ప్రాధాన్యత కాదు.
మూడవ పాదానికి రదీఫ్ కాఫియాలు ఉండనవసరం లేదు. అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలి. ఏదో ఒక గతి(లయ)లో కొనసాగడం అభిలశనీయం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఉంటూ నాలుగు పాదాలకు కలిపి ఒక అస్తిత్వం ఉండాలి. మూడవ పాదంలో ఒక శ్వాస తీసుకొని నాల్గవ పాదంలో మెరుపును సాధించడం అభిలశనీయం.
"రుబాయీలు" పుట్టు పూర్వోత్తరాలు లేకుండా కేవలం నియమాలను మాత్రం తెలియజేశాను.
ఈ రుబాయీలు అనే ఈ ప్రక్రియ "పర్షియన్" సాహిత్య ప్రక్రియ, "రుబాయీ" అనేది అరబిక్ పదం.
- సేకరణ ......"శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి" గారి "తెలంగాణ రుబాయీలు" నుండి.
ఇప్పుడు మీకు కొందరు కవులు వ్రాసిన రుబాయీలను ఉదాహరణకు ఇస్తున్నాను.
⚜️⚜️
చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!
- డా.తిరుమల శ్రీనివాసాచార్యులు
⚜️⚜️
వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!
- శ్రీ ఎండ్లూరి సుధాకర్
⚜️⚜️
కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!
- శ్రీ పెన్నా శివరామ కృష్ణ
ఇందులో "తెలిసేది" రధీఫ్. తడమకనే , తలగడకే, పడమరకే ఇవన్నీ కాఫియాలు.
⚜️⚜️
గాయపడిన గుండెలేగ చిత్రంగా పగులుతాయి
మది గదిలో నిప్పు కుండ మోస్తూనే రగులుతాయి
ఎదన రగులు మంటలతో వెలుగు పూలు పూయిస్తూ
నలుగురికీ నవ్వు పంచి ఒంటరిగా మిగులుతాయి
-తమశ్వి
పైన ఉన్న "రుబాయీలు" లో అందరూ ఒకే ఛందస్సు పాటించినా...ఒక్కో రచయిత కు ఒక్కో శైలి కనిపిస్తుంది.....
(మాత్రలు :
ఒక క్షణంలో పలికే అక్షరం ఒక మాత్ర
రెండు క్షణాలలో పలికే అక్షరాలు రెండు మాత్రలు
లఘువు - ఒక మాత్ర
గురువు - రెండు మాత్రలు
గురువులు :- దీర్ఘమైన అచ్చులు , దీర్ఘమైన హల్లులు
ఉదా: ఆ , ఈ.....
కా , గా......
సంయుక్తాక్షరాలకు, ద్విత్వానికీ , సున్నాకి ,విసర్గకు, నకారానికి ముందున్న అక్షరాలు....ఇవన్నీ గురువులు
లఘువులు : దీర్ఘము లేని అచ్చులు , దీర్ఘము లేని హల్లులు
ఉదా: అ , ఇ......
క , గ......
ఇంకా అర్ధంకాకుంటే వ్యాకరణం పుస్తకం చూడండి. లేదా గూగుల్ లో వెతకండి.)
No comments:
Post a Comment